AADIVAVRAM - Others

వానాకాలంలో ఏం తినాలి? (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
-శరభయ్య వారణాసి (వరంగల్)
జ: శిశిర, వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత ఋతువులు ఆరింటిలో మొదటి మూడు కాలాల్ని విసర్గ కాలాలంటారు. మనలోని శక్తిని, శీతల గుణాలను ఈ ఋతువులు గ్రహిస్తాయి. వాటిని అదాన కాలాలంటారు. ఇది ఉత్తరాయణంలో జరిగే అంశం. శిశిరంలో ఆకులు రాలేది అందుకే!
వర్ష, శరత్ హేమంత ఋతువులు మూడింటినీ ప్రదాన లేదా విసర్గ కాలాలంటారు. ఇవి శక్తిని ప్రదానం చేస్తాయి. దక్షిణాయనంలో ఈ ఋతువులు వస్తాయి. ఋతుపవనాల రాకతోనే ప్రదాన కాలం. శీతల వాతావరణం వచ్చేస్తాయి. వేసవిలో కోల్పోయిన బలాన్ని తిరిగి పుంజుకోవటానికి ఈ కాలంలో శరీరం ప్రయత్నిస్తుంది. అందుకు మనం కూడా శరీరానికి సహకరించాలి.
వానాకాలంలో వాయువు చాలా ప్రబలంగా ఉంటుంది. అల్పపీడనమో అధిక పీడనమో ఏర్పడి, తుపాన్లు వస్తే తప్ప మనకు సహజ వానలు ఎటు తిరిగీ తక్కువై పోయాయి. వాన కురిసిన రోజున వానాకాలం. లేని రోజులన్నీ ఎండాకాలంగానే ఉంటోంది.
ఎండ వస్తే, మరో వేసవి అన్నంతగా రావటం, వాన వస్తే చుట్టంచూపుగా వచ్చి, పోవటం ఇలా ఉన్నప్పుడు దాని దుష్ట ప్రభావం మన శరీరం మీద ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడో సత్తెకాలపు రోజుల్లో కురిసినట్టు ఇప్పుడు వానల్లేవు. ఎండ వలన శరీరం బాగా కాగి ఉంటుంది. ఒక్కసారి వాన కురవగానే కాలే ఇనుము మీద నీళ్లు పడితే చురచురలాడినట్టుగా ఉంటుంది శరీరం. తాపం లేదా తపన ఎక్కువగా ఉంటుంది. ఎండాకాలానికి రాబోయే చలికాలానికీ మధ్య సంధికాలం లాంటిది వానాకాలం. కొంత ఎండ కొంత చల్లదనం మిశ్రమంగా ఉంటుంది. తగ్గట్టుగా మనం జీవన విధానాన్ని మార్పు చేసుకోవాలి. వర్షాః శీతా విదాహిన్యో వహ్ని మాంద్యానిలప్రదాః’ అని సూత్రం.
వానాకాలంలో ఎండ లేకపోతే కొద్దిగా చల్లగా ఉంటుంది. కానీ, శరీరంలో ఆమ్ల గుణం (ఎసిడిటీ) పెరుగుతుంది. వేసవిలో కొట్టిన దెబ్బ తాలూకు గుణాలన్నీ వానాకాలంలో బయటపడటం మొదలెడతాయి.
వానాకాలంలో మొదట దెబ్బతినే జీర్ణశక్తి. జీర్ణశక్తి మందంగా ఉంటే శరీరంలో వాతం పెరుగుతుంది. అందువలన వాత వ్యాధులైన కీళ్లనొప్పులు, కాళ్ల నొప్పులు, నడుం నొప్పి, పక్షవాతం, ఎలర్జీ వ్యాధులు, ముఖ్యంగా జలుబు, ఉబ్బసం వగైరా ఇవన్నీ వానాకాలంలో బయటపడుతుంటాయి. ‘అనిలప్రదాః’ అంటే ఎక్కువగా వాతం చేసే కాలం ఇది.
ఈ కాలంలో జీర్ణశక్తిని కాపాడుకోవాలి. బయట ఆహార పదార్థాలను పూర్తిగా మానాలి. అంటువ్యాధులు తేలికగా ప్రబలే కాలం. గ్యాస్ ట్రబుల్ ఉన్నవారికి వర్షాకాలం హాని కలిగిస్తుంది. అన్ని రోగాలకు మూలం జఠరాగ్ని బలంగా లేకపోవటమే అనేది అందరికీ తెలిసిన విషయమే కదా. అగ్ని బలం తక్కువగా ఉండే కాలంలో అనేక వ్యాధులు మొదలయ్యే అవకాశం ఉన్నదనేది గుర్తించాల్సిన విషయం. వానాకాలంలో శరీరంలో ఆమ్లం (ఎసిడిటీ) పెరగటం, వాతం వికారం చెందటం అనే రెండు గుణాలు ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. మామూలు భాషలో చెప్పాలంటే వాతాన్ని వేడిని అదుపులో పెట్టే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని వాతాన్ని వేడిని పెంచే ఆహారాన్ని మానేయాలనీ దీని సారాంశం.
వర్షాకాలంలో నీటిని ఉడికించి చల్లార్చి తాగాలనేది జనరల్ ప్రికాషన్. అంటు రోగాలలు వ్యాపించకుండా ఉంటాయి. కానీ, ఇంతకు మించిన ప్రయోజనం ఉంది. నీళ్లను అన్నం ఉడికించినంతా బాగా తెర్లేలా కాచినందువలన ఆ నీటికి తేలిగ్గా అరిగే గుణం కూడా కలుగుతుంది. ‘ఆ ఊళ్లో నీళ్లు నాకు సరిపడలేదు’ ఇలా కొందరు చెప్తుంటారు. నీళ్లు పడలేదంటే ఆ నీళ్లు సక్రమంగా అరగలేదన్న మాట. వానాకాలంలో మన బావి నీళ్లే అయినా ఒక్కోసారి ఇలా జరగవచ్చు. ఉడికిస్తే ఆ నీళ్లకు తేలికగా అరిగే గుణం వస్తుంది. అలాగే ఆ నీటిని త్రాగినందువలన జఠరాగ్ని పెరుగుతుంది కూడా.
జీలకర్ర, వాము, ధనియాలు, దాల్చినచెక్క ఈ నాలుగింటినీ వేర్వేరుగా దంచి పౌడర్ చేసుకుని వేర్వేరు సీసాల్లో భద్రపరచుకోండి. వీటిలో ఏదో ఒక పొడిని కొద్దిగా నీళ్లలో వేసి ఉడికించిన నీళ్లను మామూలు నీళ్లకు బదులుగా తీసుకుంటే వానాకాలం ఇబ్బందులు ఆగుతాయి. మామూలు నీటికన్నా జీరా వాటర్, వాము వాటర్, ధనియా వాటర్, దాల్చిన వాటర్ ఇలాంటివి తాగుతుంటే మంచిది. ఈ నాలుగింటిలో మీకు ఏది బావుంటే ఆ నీటిని తాగండి.
పుదీనా, కొత్తిమీర, మిరియాలు, అల్లం, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మెంతులు ఇలాంటి ద్రవ్యాలు వానాకాలంలో ఔషధాలుగా పని చేస్తాయి. వాటి ప్రభావాన్ని చక్కగా ఉపయోగించుకో గలగాలి. పాత ధాన్యం, పాత బియ్యం, పాత గోధుమలు, బార్లీ, సగ్గుబియ్యం వానాకాలంలో మేలు చేస్తాయి. ఆకు కూరకన్నా కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలి. వానాకాలం పచ్చి కూరలు గానీ, మొలకెత్తిన గింజలు కానీ తినకుండా ఉడికించినవి, వండినవి మాత్రమే తినాలని సూచన.
చిలికిన మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. సాంబారు, పులుసు కూరలకన్నా పెసరపప్పు కట్టు ఎక్కువ మేలు చేస్తుంది. చింతపండు వెయ్యని పప్ప చారుని కట్టు అంటారు. మజ్జిగ పైన తేరుకున్న తేట ఈ కాలంలో ఎక్కువ చలవనిస్తుంది. కూరగాయలన్నీ తినవచ్చు. పులుపు బాగా తగ్గించి వండుకోవాలి. ఊరగాయలకు ప్రాధాన్యత తగ్గించాలి. పుల్లగా ఉన్నదైనప్పటికీ, ఉసిరికాయ నల్ల పచ్చడి వానాకాలంలో మేలు చేస్తుంది.
ఫ్రిజ్‌లో పెట్టిన అతి చల్లని పదార్థాలు వానాకాలంలో బాగా ఇబ్బంది కలిగిస్తాయి. పెరుగు లేదా మజ్జిగని చల్లదనం పోయే వరకూ ఫ్రిజ్ బయటే ఉంచి అప్పుడు వేసుకోవాలి. తేలికగా అరిగేవి మాత్రమే తినాలి. నూనె వాడకాన్ని బాగా తగ్గించాలి. కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. అల్లాని తగినంత సైంధవ లవణం (దొరక్కపోతే మామూలు ఉప్పు) కలిపి మెత్తగా నూరి, భోజనంలో మొదటి ముద్దగా తినటం అనేది వానాకాలంలో తప్పనిసరిగా చేయాలి.
కూరలు ఎక్కువ, అన్నం తక్కువగా తింటే కూరల్లోని డైటరీ ఫైబర్ (పీచు పదార్థాలు) పేగుల్ని కాపాడుతుంది. యాసిడ్ తగ్గుతుంది. విరేచనం ఫ్రీగా అవుతుంది. ప్రొద్దున్న పూట టిఫిన్లకన్నా పెరుగన్నం ఈ ఋతువులో మంచిది. బాగా ముసురుపట్టి విడవకుండా వాన కురుస్తూ ఉంటే అలాంటప్పుడు పులుపు, కారం వగైరా తేలికగా తీసుకోవచ్చు.
వానాకాలం పగలు పడుకుంటే రోజంతా దిమ్ముగా ఉంటుంది. వేసవికాలంలో ఉన్నట్టే, వానాకాలంలోనూ ఎండ అంత చురుకుగానూ ఉంటుంది. ఇలాంటప్పుడు మధ్యాహ్నం పూట ఎండలో తిరక్కండి.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com