AADIVAVRAM - Others

నిద్ర... నిజాలు (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: నేను సెక్యూరిటీగా పని చేస్తుంటాను. నిద్ర పోవటానికి సమయం చాలటంలేదు. నా వృత్తి ధర్మం అలాంటిది. ఈ మధ్య జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతోంది. దేని మీదా ఉత్సాహం ఉండట్లేదు. నిద్ర లేకపోవటం వల్లనే అంటున్నారు. నిజమేనా?
జ: నిద్రే మంచిది! నిద్రను మించిన మంచి లేదు! నిద్రపోవటం మనిషి హక్కు.
కమ్మగా నిద్రపోతే మెదడుతో సహా శరీరానికి తగిన విశ్రాంతి, చైతన్యం లభిస్తాయి. మేథాశక్తి పెరుగుతుంది. చెడ్డ జ్ఞాపకాల వలన కలిగే మనోవేదన తీరు, మనసు తేలిక పడుతుంది. నిద్ర రెండందాలా లాభాన్ని కలిగిస్తుంది.
గుడ్‌‘నైట్ అంటే శీఘ్రమేవ నిద్రా ప్రాప్తిరస్తు అని దీవించటమే! మెదడు లోపల నిక్షిప్తంగా ఉన్న జ్ఞాపకాల్ని నిద్ర స్థిరీకరిస్తుంది. కొత్త నిర్ణయాన్ని తీసుకోవటానికి పాత జ్ఞాపకాల అనుభవంతో అనుసంధానం కలిగించటానికి నిద్ర తోడ్పడుతుంది. మెదడులో వివిధ కేంద్రాల మధ్య సమాచార వ్యవస్థను నిద్ర పెంపు చేస్తుంది.
మహా మేథావుల్లో ఎక్కువమంది అల్జిమర్స్ లాంటి మతిమరుపు వ్యాధికి లోను కావటానికి వారికి 24 గంటల సమయం చాలక నిద్రను త్యాగం చేయటం ఒక కారణం కావచ్చు.
ఒక కొత్త నైపుణ్యాంశాన్ని లేదా పాఠాన్ని ఇచ్చి నిద్రా సమయంలో బాగా నిద్రపోయిన వ్యక్తి మెదడునీ, నిద్ర సరిగా పట్టని వ్యక్తి మెదడునీ పదేపదే స్కానింగులు చేసి పరిశీలించారు. అనేక పరిశీలనల తరువాత కమ్మని నిద్రలో నైపుణ్యాలూ, ఇతర జ్ఞాపకాలూ మెదడులో సురక్షిత కేంద్రాల్లోకి చేరటాన్ని (memories and skills are shifted to more efficient and permanent brain regions) గమనింఛారు. తద్వారా ఆ నైపుణ్యం మరింత మెరుగుపడటాన్ని కూడా గమనించారు.
పాతాళభైరవి సినిమాలో అంజిగాడు ‘నేను నిద్రపోయి రాకుమారి ఎక్కడుందో కలగని చెప్తా’నంటాడు. అలసటలో బుర్ర పని చెయ్యదనీ, నిద్రపోతే కొత్త ఆలోచనలొస్తాయనీ దీని భావం. ఇది నిజమేనని శాస్తవ్రేత్తలు నిరూపిస్తున్నారు. ఆలోచించి రేపు చెప్తాననటమే మంచి అలవాటన్నమాట.
పాఠం బాగా చదివి కమ్మగా నిద్రపోతే అది దీర్ఘకాలిక జ్ఞాపక కేంద్రంలో నిలబడుతుంది. ఆ నైపుణ్యం రేపటికి మరింతగా పెరగటానికే (higher proficiency) నేడు కమ్మని నిద్ర. నిద్రాహారాలు మాని చదివాడు అంటే చదివింది ఏదీ బుర్రలో నిలబడకుండా చదివాడనే అర్థం. ముక్కలుగా ఉన్న జ్ఞానం నిద్రలో అనుసంధానం అయి పరిపూర్ణ జ్ఞానం అవుతుందని ఈ నిరూపణల సారాంశం.
‘నిదుర పోరా తమ్ముడా... నిదురలోనా గతమునంతా నిముసమైనా మరచిపోరా!’ పాటలో కలతలన్నీ నిద్రలో మర్చిపోవాలంటుంది అక్కయ్య.
నిద్రలో జ్ఞాపకాలు కూడా నిద్రిస్తాయా? లేక ఎప్పటెప్పటి జ్ఞాపకాలో నిద్ర లేచాక గుర్తుకొస్తాయా? వస్తాయా? మెలకువగా ఉన్నప్పుడు ఎంతకీ తెగని సమస్యకు నిద్రలో పరిష్కారం దొరుకుతుందా..?
బాపూ, రమణల ‘బుడుగు’ కళ్లు మూసుకుని అద్దంలో చూస్తూ, నిద్రలో తను ఎలా ఉంటానో చూసుకుంటున్నానంటాడు. నిద్రలో ఉన్నప్పుడు మన మెదడులోపల, మన మనసు లోపల, మనం నిద్రలో ఉన్నా మెలకువగా ఉండే మన శరీరావయవాల లోపల ఏం జరుగుతోందో తెలీదు. గత శతాబ్ది కాలంగా స్వప్న రహస్యం మీద విశేష పరిశోధనలు జరుగుతున్నాయి.
మెదడు కణాలు పరిణత వయసు వచ్చేవరకే ఎదుగుతాయని, ఆ తరువాత వాటిలో మార్పు ఉండదని ((static) ఒకప్పుడు భావించారు. ఏ వయసులోనైనా మెదడులో గుణాత్మకమైన మార్పులు రావచ్చని ఇప్పుడు శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. దీన్ని న్యూరో ప్లాస్టిసిటీ అంటారు. సూక్ష్మస్థాయి నుండీ పెద్ద స్థాయి వరకూ ఈ మార్పులు ఉండవచ్చు. మనిషి ప్రవర్తన, పరివర్తన, ప్రతిస్పందించే తీరు, అధ్యయనం, నిర్ణయ శక్తి, చేదు జ్ఞాపకాల నుండి బయటపడటం లాంటి అనేక విషయాల్లో ఈ న్యూరో ప్లాస్టిసిటీ ప్రభావం కనిపిస్తుంది.
ఒక మెదడు కణం (న్యూరాన్) స్థాయిలో న్యూరోప్లాస్టిసిటీ వలన వివిధ న్యూరాన్లతో ఆ కణానికి సంబంధాలు మంచి నిద్ర పట్టినప్పుడు మెరుగుపడటాన్ని పరిశోధకులు గమనించారు. నిద్రలో వివిధ మెదడు కణాల మధ్య కొత్త సంబంధాలు, కొత్త దారులు ఏర్పడతాయి. మనం గాఢ నిద్రలో ఉన్నా మెదడు లోపల జరిగే ఏ పనీ ఆగదనీ అధ్యయనం అనే ప్రక్రియ మెదడులో కొనసాగుతూనే ఉంటుందనీ శాస్తవ్రేత్తలు దీనికి భాష్యం చెప్తున్నారు.
మన మెదడులో కొత్త మెళకువలు (న్యూ స్కిల్స్) గ్రహించే కేంద్రం ఒకటుంది. కలత నిద్ర(poor sleep) ఈ కేంద్రం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తున్నట్టు కూడా గ్రహించారు. కలత నిద్ర లేదా చాలీచాలని నిద్ర అల్జిమర్స్ అనే మతిమరుపు వ్యాధికి కారణం కావచ్చనేది దీనివలన గ్రహించిన ముఖ్య విషయం. అల్జిమర్స్ అనే వ్యాధిని తెచ్చేందుకు కారణమైన దుష్ట ప్రొటీన్లు చాలని నిద్ర వలన పెరుగుతున్నట్టు గమనించారు.
నిద్ర వలన మరపు కూడా సాధ్యమే! మీరు తప్పనిసరిగా మరిచిపోవాలనుకునే విషయాలను మరిచిపోవటానికి కూడా నిద్రే తగిన ఉపకరణం. ముంచుకొచ్చే దుఃఖం, కోపం, ద్వేషం, కామం లాంటివి నిద్రకు ముందున్నంత స్థాయిలో నిద్రపోయి లేచాక ఉండవు. ఇలాంటివి మన అనుభవంలోని విషయాలే!
‘నిదురలోనా గతమునంతా నిముసమైనా మరచిపోరా’ అనే పాట ability to unlearn నిద్ర వలన కలిగే మరపు శక్తిని చాటుతుంది. అవును! జ్ఞాపకశక్తి ఎంత ముఖ్యమో మరపు శక్తి కూడా అంతే ముఖ్యం. మనసుకు సంతోషం కాని చింతా శోక భయ దుఃఖాదులన్నీ ఎంత త్వరగా మరపులోకి వెడితే అంత వేగంగా మెదడు తన నైపుణ్యతను పెంపు చేసుకో గలుగుతుంది. మరపు శక్తే ముఖ్యమైంది ఇక్కడ! ఏది గుర్తుపెట్టుకోవాలి - దేన్ని మరిచిపోవాలి అనేదే ముఖ్యం.
వ్యక్తి పెట్టుకున్న లక్ష్యానికీ, దీక్షకు, పట్టుదలకు, అంకిత భావానికీ, ఆ వ్యక్తికిగల ఇష్టానికీ అనుగుణంగా మనసు జ్ఞాపకాన్ని మరుపునూ నిర్వహిస్తుంది. మరుపులూ జ్ఞాపకాలూ మన లక్ష్య నిర్దేశాన్నిబట్టి వాటికవే మెదడులో నిర్వహించబడ్తుంటాయి.
జ్ఞాపకశక్తి మెరుగుపడాలంటే బాగా చదవాలి. తగినంతగా నిద్రపోవాలి. నేర్చిన నైపుణ్యం పదిలం కావాలి. అది మరింత మెరుగుపడాలంటే బాగా నేర్చుకోవాలి, కమ్మగా నిద్రపోవాలి. మనసు గాయపడి భయదుఃఖాదులు కలిగినప్పుడు దానిలోంచి బయటపడాలంటే, కమ్మగా నిద్రపోవాలి.
జీవితంలో నిద్రకు ప్రత్యేకించి సమయం కేటాయించటం అవసరం. కమ్మటి నిద్ర వలన మెదడు పనితీరు పెరుగుతుంది. నిద్ర పోవటాన్ని అలవాటు చేసుకోండి. నిద్ర మానేయటాన్ని జీవితంలో ఒక భాగం చేసుకోవాలని చూడకండి.
*
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్తు, బకింగ్‌హామ్‌పేట పోస్టాఫీసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ - 500 002

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com