AADIVAVRAM - Others

జనవ్యవహారిక భాషగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ఉపాధి కోసమే పరిమితం కారాదు. భాషాపరమైన ధ్యాస పెరగాలి, మాతృభాష ఉనికి కాపాడుతుంది. ప్రతి మాతృభాషకూ సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. వాటిని కాపాడుకున్నపుడు మాతృభాషను కాపాడుకోగలుగుతాం. అందుకే సంప్రదాయం, సాహిత్యం పరిరక్షించుకునే జిజ్ఞాస అందరిలో పెరగాలి. పర భాష నేర్చుకోవడం తప్పు లేదు, వ్యామోహం మాత్రం చాలా తప్పు. దీనికి తోడు పరభాషలపై వ్యామోహం పెరిగి తెలుగు వారిలో ఆత్మన్యూనతా భావం వచ్చేస్తోంది. దాని నుండి బయటపడాలి. ప్రపంచంలో ఏ ఇతర భాషనైనా నేర్చుకోవచ్చు, ఇంగ్లీషు నేర్చుకోవద్దని కూడా ఎవరూ అనడం లేదు, కాని తెలుగు మరిచిపోద్దనేది అందరి ఉద్దేశం. జనవ్యవహారిక భాషగా తెలుగు మరింత విస్తృతం చెందాలి. తెలుగు నేర్చుకోవడం అనేది ప్రతి ఇంటి నుండి మొదలు కావాలి. ఆ ఆలోచన తల్లిదండ్రులకు ఉండాలి, ఇంటింటిలో మార్పు రావాలి. ఇద్దరు తెలుగు వారు కలిసినపుడు ఆంగ్లంలో మాట్లాడుకునే మనస్తత్వం పోవాలి. సంకరభాషలు సరికాదు, మన పదాలను కాపాడుకోవాలి, భాషా శాస్త్రంలో ప్రతి పదాన్ని కాపాడుకోవాలి.
- మండలి బుద్ధప్రసాద్, డిప్యుటీ స్పీకర్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ

భాషను రక్షిస్తే.. అది మనల్ని రక్షిస్తుంది
వాడుక భాష కోసం జీవితాన్ని అంకితం చేసిన తొలి తెలుగు భాషా శాస్తవ్రేత్త గిడుగు వేంకట రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం, ఇది కేవలం వేడుక మాత్రమే కాదు, ప్రజలకు అర్ధమయ్యే సులభ, స్వచ్ఛమైన, సహజ సుందరమైన అమ్మ భాషలో సాహిత్య సృజన విద్యాబోధనను కొనసాగించడానికి, మనల్ని మనం పునరంకితం చేసుకోవడానికి స్ఫూర్తిని పొందే దీక్షాదినం. అమ్మను , అమ్మ భాషను నిర్లక్ష్యం చేసే జాతి ఎన్నడూ గొప్ప జాతి కానేరదు. అలాగే భాష అంటే కేవలం భావ వ్యక్తీకరణ సాధనం మాత్రమే కాదు, ఒక జాతి సంస్కృతి, సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు ఒక్క మాటలో చెప్పాలంటే భాష అంటే ఒక జాతి జీవన విధానం. దీనిని పరిరక్షించుకోవడానికి ప్రతిన పూనాల్సిన రోజు మాతృభాషా దినోత్సవం. భాషో రక్షతి రక్షిత: అనేది మన నిరంతర నినాదం కావాలి. తెలుగు భాషే పాలనా భాషగా కొనసాగే రోజు కోసం ఎదురుచూద్దాం, అంటే గ్రామస్థాయి నుండి సచివాలయం స్థాయి వరకూ ఉత్తర ప్రత్యుత్తరాలు , ఉత్తర్వులు, ఆదేశాలు , సమాధానాలు, స్పందనలు, అన్నీ తెలుగులోనే కొనసాగే శుభముహుర్తం ఎపుడు వస్తుందో అపుడే నిజమైన మాతృభాషాదినోత్సవం, లేని నాడు అనేక వేడుకల మాదిరే ఇది మామూలు వేడుక అవుతుంది.
-ఆచార్య ఎస్ వి సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం

విద్యావిధానంలో మార్పు రావాలి
మనిషి ఏ పని సాధించాలన్నా మాతృభాష ద్వారానే సాధ్యమవుతుంది, మనోవికాసానికి ప్రధానమైన సాధనం మాతృభాష. తల్లి తర్వాత తల్లిలాంటిది. మనిషికి రెండు జన్మలు, ఒకటి తల్లి ఇస్తుంది, రెండోది భాష ఇస్తుంది. మాతృభాషను అభ్యసించని వాడికి మనో వికాసం ప్రవర్ధమానం కాదు, జీవితం అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఎన్ని భాషలు నేర్చినా, ముందు మాతృభాష నేర్చుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది.
ధర్మమనుడు,/ తత్వమనుడు, /యోగమనుడు, / ప్రాణి సాధింపగల / సకల పరమార్ధములకు /తల్లి భాష / ప్రధాన సూత్రంబయగుట, / భాష కంటే / నవ్యులకు తపస్సు లేదు
అని రాయప్రోలు సుబ్బారావు చెప్పిన మాతృభాషా ప్రబోధం ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ఇంగ్లీషు చదువుల పేరుతో మాతృభాషను మరిచిపోవడం మానవ అభ్యుదయానికి తిలోదకమైందని గ్రహించాలి. ప్రభుత్వం మాతృభాష ప్రయోజనాన్ని ఆవశ్యకతను గుర్తించి విద్యావిధానాన్ని రూపొందించుకోవలసిన అవసరం చాలా ఉంది. తెలుగు అకాడమి, తెలుగు విశ్వవిద్యాలయం, అధికార భాషా సంఘం మాతృభాషా వికాసానికి చేయాల్సిన పని చేయడం లేదనిపిస్తోంది.
- ఆచార్య కె యాదగిరి, మాజీ సంచాలకులు, తెలుగు అకాడమి

పొంచి ఉన్న ముప్పు
గిడుగు రామ్మూర్తి పుట్టిన రోజు ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవంగా పాటిస్తున్నాం, తెలుగు భాషాభివృద్ధికి కొన్ని సంస్థలు ముందుకు వచ్చి ప్రయత్నాలు చేస్తున్నా, ప్రభుత్వం వైపు నుండి ఇంకా స్పందన రావల్సి ఉంది. ప్రపంచీకరణ వల్ల పిల్లలను ఇంగ్లీషు మాద్యమంలో చదివించడానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కేవలం 27 శాతం మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమంలో చదువుతున్నారు. ప్రత్యేకించి టెలివిజన్ మాధ్యమాల్లో పరభాషా పదాల వాడుక పెరిగిపోతోంది. ఇదే కొనసాగితే తెలుగు వాడుక తగ్గి రానున్న రోజుల్లో మృతభాషగా మారే ప్రమాదం లేకపోలేదు. ఐక్యరాజ్యసమితి విద్య సాంస్కృతిక సంస్థ 2002లో చేసిన తీర్మానంలో ప్రపంచంలో ఆరువేల భాషల్లో మూడు వేల భాషలు కాలగర్భంలో కలిసిపోగా, 2025 నాటికి భారతదేశంలో హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం మాత్రమే మిగులుతాయని నివేదికలో పేర్కొన్నారు.
-డాక్టర్ చుక్కా రామయ్య, విద్యావేత్త
*
అభిప్రాయ సేకరణ: బి.వి.ప్రసాద్