AADIVAVRAM - Others

గర్వం తగదు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయపు పూట నీరెండలో అందంగా విరబూసిన తోటలో పువ్వు, పువ్వుకీ తిరుగుతూ హాయిగా విహరించసాగింది రంగురంగుల సీతాకోక చిలుక. అక్కడికి ఝుమ్మని శబ్దం చేసుకుంటూ రయ్యిన దూసుకొచ్చింది తేనెటీగ. ఆ రావటంలో సీతాకోక చిలుక రెక్కల్ని రాసుకుంటూ మరీ వచ్చింది.
వాళ్ల మధ్య స్నేహం లేదు సరిగదా వాళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. అలా అని ఎప్పుడూ పెద్దగా గొడవలు కూడా జరగలేదు. కానీ..
సీతాకోక చిలుక కంటే తను బలవంతురాలనని తేనెటీగకు అహంకారం. అందుకే.. ఒక్కోసారి సీతాకోక చిలుక వాలిన పువ్వు పక్కనున్న పువ్వు మీద వాలి వచ్చిన పని చూసుకోకుండా దీనివైపు చూస్తూ చెవులు గళ్లు పడేలా అరుస్తుంది. దీని గోల పడలేక సీతాకోక చిలుక అక్కడ్నించి లేచి వేరే పువ్వు మీదికి వెళ్లిపోతుంది. మరోసారి దాని చుట్టూ తిరుగుతూ అల్లరి అల్లరి చేస్తుంది. అయినా అదేం పట్టించుకోదు సీతాకోక చిలుక. దాంతో రానురాను తేనెటీగ ఆగడం ఎక్కువై పోయింది.
ఇంక ఊరుకోలేక ‘పిచ్చి వేషాలేస్తే తోటమాలితో చెప్తాను’ అంది ఒకనాడు సీతాకోక చిలుక తేనెటీగతో.
‘తోటమాలి ననే్నమీ అనడు. ఏదన్నా అన్నాడంటే అతనికి తేనె ఇచ్చే వాళ్లేరీ? నీకంటే నా వల్లే అతనికి మేలు ఎక్కువ. తెలుసా?’ ఎద్దేవా అంది తేనెటీగ.
‘ఇలా అందంగా కనపడటం మేలు కదా?’ అంది తన రంగుల్ని తానే చూసుకుంటూ.
‘ఓయబ్బో.. అందంగా ఉంటానని అంత గర్వమా? నీ అందం చూసిన ఆ కాసేపే. మరి నేనో? అందంగా లేకపోయినా మధురమైన తేనె ఇస్తాను వాళ్లకు. తింటూ హారుూ అనుభవిస్తారు వాళ్లు’ గర్వంగా అంది తేనెటీగ.
‘అబ్బో... ఇతనేదో పెద్ద చూసినట్టు. నిన్ను ముందు చంపేసిగదా వాళ్లు తేనె తీసుకునేది. అయినా.. నీకొకటి అర్థం కావట్లేదు. వాళ్లు అలా హాయిగా తేనెని అనుభవిస్తారని నువ్వు తినకుండా దాస్తూ జీవితమంతా తిరుగుతూనే ఉంటావ్. అందుకే నీకు అందం తక్కువ. మేము అలా దాచుకోం. అప్పటికప్పుడే తాగేస్తాం. అందుకే మాకు అందం ఎక్కువ.’
నిజమే కదా అనిపించింది తేనెటీగకు. అలా అనుకుంటూ ఒక్కసారి తనని తాను చూసుకుని చాలా అసహ్యంగా ఉన్నాననుకుంది. చాలా బాధ వేసింది దానికి.
‘నిజమే..! ఎప్పుడూ దాయటమే తప్ప తృప్తిగా తిన్నది లేదు. ఈలోపే ఇల్లు కూలగొట్టి, మంట పెట్టి మంటల్లో పడేస్తున్నారు. ఎప్పటి కోసమో ఇప్పట్నించీ దాయటం ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకోవటం ఎందుకు? ఎప్పటిదప్పుడు తాగేస్తే సరిపోతుంది’ అని మనసులో అనుకుని,
‘నేనూ అప్పటికప్పుడు తాగేస్తే అందంగా మారతానా నీకులాగా?’ భోరుమని ఏడుస్తూ అమాయకంగా అడిగింది తేనెటీగ.
‘మారవు. ఎంత పూతేనె తాగినా నువ్వు సీతాకోక చిలుకలా ఎప్పటికీ మారవు. అయినా నువ్వు తాగలేవు. ఎప్పుడో తాగుదామనుకునే నీ ముందు చూపే నీ త్యాగబుద్ధి. అది మనుష్యులకు ఆరోగ్యాన్నిస్తుంది. ఆమె ఆహ్లాదమైతే, నువ్వు ఆరోగ్యం. ఈ ప్రకృతిలో ఎవరి పాత్ర వారిదే..! ఎవరికి ఎవరూ పోటీ కాదు. ఆ మాటకొస్తే అందరం ఈ తోటలోని పూల మీదా, పండ్ల మీదా, ఈ ప్రకృతి మీద ఆధారపడి బ్రతికేవాళ్లమే..! దీనినిబట్టి తోటకి ఇంకెంత అహంకారం ఉండాలి? కాబట్టి గర్వం వీడి స్నేహంగా ఉంటూ హాయిగా బ్రతకండి’ అంది రోజూ వీళ్లని గమనిస్తున్న చెట్టు మీద రామచిలుక.
దాంతో హాయిగా నవ్వుకుని ఝంకారం చేసుకుంటూ తేనెటీగ ఎగిరిపోగా, అందమైన రెక్కల్ని సోయగాలు ఒలికేట్టుగా ఊగిస్తూ ఇంకో పువ్వుకేసి సాగిపోయింది సీతాకోక చిలుక.

-కనె్నగంటి అనసూయ