AADIVAVRAM - Others

రామాయణం.. 51 మీరే డిటెక్టివ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశే్లష తన తల్లి శారదాంబ, అమ్మమ్మ మీనమ్మలతో ఆ రోజు హరిదాసు చెప్పే రామాయణానికి హాజరయ్యారు. ఆయన ఆ రోజు కథని ఇలా చెప్పాడు.
‘తల్లి మంగళ ఆశీర్వాదాలు చేసాక రాజకుమారుడైన రాముడు ఆవిడకి నమస్కరించి ధర్మమార్గాన్ని అనుసరిస్తూ అడవికి ప్రయాణం అయ్యాడు. రాముడు జనాలతో నిండిన రాజమార్గంలోకి వెళ్లి దాన్ని తన కాంతితో ప్రకాశింపజేశాడు. తన సద్గుణాలతో ప్రజలు హృదయాలని ఆకర్షించి కలత పెట్టాడు.
అభిషేకం కోసం వ్రతం చేసే సీతకి ఈ విషయాలు ఏమీ తెలియవు. రాముడికి రాజ్యాభిషేకం జరగబోతోందనే ఆమె భావిస్తోంది. రాజధర్మాలు, చేయాల్సిన పనులు తెలిసిన సీత స్వయంగా దైవపూజని చేసి ఆనందంగా రాముడి కోసం ఎదురుచూస్తోంది. రాముడు సిగ్గుతో తలని కొంచెం వంచుకుని, ఆనందంగా ఉన్న జనాలతో నిండిన, చక్కగా అలంకరించిన తన ఇంట్లోకి లక్ష్మణుడితో ప్రవేశించాడు. దుఃఖంతో బాధపడుతూ విచారంగా ఉన్న తన భర్తని చూడగానే సీత వెంటనే వణికిపోతూ లేచింది. సీతని చూడగానే ధర్మాత్ముడైన రాముడు మనసులోని శోకాన్ని దాచుకోలేక పోయాడు. పాలిపోయిన మొహంతో, చెమటతో కోపంగా ఉన్న రాముడ్ని చూడగానే ఆమె విచారంగా చెప్పింది.
‘ఓ ప్రభూ! ఇప్పుడు ఇలా ఉన్నావేమిటి? శుభప్రదమైన బృహస్పతి దేవతగా గల పుణ్య నక్షత్రం ఇవాళ అభిషేకానికి తగినదని విద్వాంసులైన బ్రాహ్మణులు చెప్పారు కదా? మరి దేనికి నీ విచారం? అందమైన నీ మొహం నీటి నురుగు కన్నా తెల్లదైన నూరు ఊచలు గల గొడుగుతో కప్పబడి ప్రకాశించాలి కదా? అలా జరగలేదేమిటి? పద్మాలతో సమానమైన కళ్లు గల నీ మొహం చంద్రుడిలా, హంసలా ఉన్న శ్రేష్టమైన వింజామరలతో వీచబడటం లేదు ఎందుకు? మాటల్లో నేర్పు గల వందిమాగధులు సంతోషంగా మంగళ పాఠాలతో నిన్ను ఎందుకు స్తుతించడం లేదు? అభిషిక్తుడవైన నీ తల మీద వేద పారంగతులైన బ్రాహ్మణులు శాస్త్ర ప్రకారం తేనె, పెరుగు కలిపి ఎందుకు ఉంచలేదు? మంత్రులు, వర్తకులు లాంటి ముఖ్యులు, పౌరులు చక్కగా అలంకరించుకుని నీ వెంట ఎందుకు రాలేదు? నాలుగు చక్రాలు కట్టిన, మంచి వేగం గల, బంగారంతో అలంకరించబడ్డ ప్రధానమైన పుష్యరథం నీ ముందు ఎందుకు నడవడం లేదు? నీ ప్రయాణం ఆరంభంలో నల్లటి మేఘంలా, పర్వతంలా ఉన్న ఉత్తమ లక్షణాలు గల అందమైన ఏనుగు ఎందుకు కనపడటం లేదు? బంగారంతో అలంకరించబడ్డ నీ సింహాసనాన్ని ముందుంచుకుని నీ ఎదురుగా ఏనుగు నడవాలి కదా? అది కనపడటం లేదేమిటి? నీకు అభిషేకం చేయబోతూండగా నీ ముఖం వింతు రంగుతో ఉంది. నీలో సంతోషం కూడా ఎందుకు కనపడటం లేదు?’
ఇలా బాధగా ప్రశ్నించిన సీతకి రాముడు జవాబు చెప్పాడు.
‘సీతా! పూజ్యుడైన మా నాన్న నన్ను అడవికి పంపుతున్నాడు. నువ్వు ఉత్తమమైన కులంలో పుట్టావు. అన్ని ధర్మాలు తెలిసి వాటిని ఆచరిస్తావు. నాకీ వనవాసం ఎలా వచ్చిందో చెప్తాను విను. ఆడిన మాట తప్పని మా నాన్న దశరథ మహారాజు ఇదివరకు మా తల్లి ఐన కైకేయికి రెండు గొప్ప వరాలని ఇచ్చాడు. ఇప్పుడు మహారాజు నాకు అభిషేకం చేయదలచి, ఆ ఏర్పాట్లు చేస్తూండగా ఆమె ఆ వరాలని అడిగి, ధర్మాన్ని చూపించి నెగ్గింది. నేను పధ్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో నివసించాలి. మా నాన్న భరతుడికి రాజ్యాన్ని అప్పగించాడు. అందువల్ల నేను ఇప్పుడు నిర్మానుష్యమైన అరణ్యానికి బయలుదేరి నిన్ను చూడాలని వచ్చాను.
‘నువ్వు ఎప్పుడూ భరతుడి ఎదుట నా ప్రసక్తి తీసుకురాకు. ఎందుకంటే ఐశ్వర్యంలో ఉన్న వారు ఇతరులని పొగిడితే సహించరు. అందువల్ల భరతుడి ఎదుట నువ్వు నా గుణాల ప్రసక్తి తీసుకురాకు. నిన్ను ప్రత్యేకంగా పోషించాల్సిన బాధ్యత కూడా భరతుడికి లేదు. అతనికి అనుకూలంగా నడుచుకుంటేనే నువ్వు అతని దగ్గర ఉండగలవు. పురాతనమైన యవ రాజ్యం అతనికి ఇచ్చారు. అందుచేత నువ్వు అతని అభిమానాన్ని, ప్రత్యేకించి మహారాజు అనుగ్రహాన్ని సంపాదించేందుకు ప్రయత్నించు. నేను మా నాన్న ఆజ్ఞ ప్రకారం ఇప్పుడే అడవికి వెళ్తున్నాను. మంచి మనసుగల, మంగళప్రదురాలు, దోషాలు లేని ఓ సీతా! నువ్వు ధైర్యంగా ఉండు. నేను మునుల నివాసమైన అడవులకి వెళ్లిన తర్వాత నువ్వు వ్రతాలు, ఉపవాసాలు చేస్తూండాలి. నువ్వు తెల్లవారుఝామునే లేచి యధావిధిగా పూజ చేసి మా నాన్న దశరథ మహారాజుకి నమస్కరించాలి. దుఃఖంతో కృశించే వృద్ధురాలైన మా అమ్మ కౌసల్యని నువ్వు ధర్మానికే ప్రాధాన్యతని ఇస్తూ గౌరవించాలి. స్నేహం, ప్రేమ, పోషణ విషయాల్లో నాకు తల్లులంతా సమానమే. అందుచేత నా మిగిలిన తల్లుల్ని కూడా నువ్వు ఆదరించాలి. ప్రత్యేకించి నువ్వు నా ప్రాణాలతో సమానమైన లక్ష్మణ, భరత, శత్రుఘు్నలని నీ కొడుకుల్లా చూసుకోవాలి. భరతుడు రాజ్యానికి, కులానికీ కూడా రాజు. సర్వాధికారి. అందువల్ల అతనికి ఇష్టం లేని పనులు ఎన్నటికీ చేయకూడదు. రాజులని మంచి స్వభావంతో ఆనందింపజేస్తూ సేవించే ప్రయత్నం చేస్తే వారు ప్రసన్నులు అవుతారు. లేదా వాళ్లకి కోపం వస్తుంది. దాయాదులైన వారు కూడా ఇష్టం లేనివి చేస్తే వాళ్లని రాజులు వదిలేస్తారు. బయటి వాళ్లు సమర్థులైతే వాళ్లని దగ్గరకి తీస్తారు. శుభకరమైన ఓ సీతా! నువ్వు రాజైన భరతుడి విషయంలో అతనికి అనుకూలంగా ప్రవర్తిస్తూ, ధర్మాన్ని, సత్యవ్రతాన్ని అవలంబిస్తూ ఇక్కడే ఉండు. నేను మహారణ్యానికి వెళ్తాను. నువ్వు మాత్రం ఎవరి మనసుకీ కష్టం కలిగించకుండా ఇక్కడే ఉండు. నేను చెప్పినట్లు చేయి.’ (అయోధ్యకాండ సర్గ 26)
ఓ వైష్ణవుడు మంగళహారతి తర్వాత హరిదాసుతో చెప్పాడు.
‘దాసుగారు! మీ గాత్రం అద్భుతం. మీ మాట వినసొంపుగా ఉంది. అంతా చక్కగా చెప్పారు. కాని ఐదు చిన్న తప్పులని చెప్పారు’
ఆ తప్పులు ఏమిటో మీరు కనుక్కోగలరా?
*
మీకో ప్రశ్న
*
కాళిదాసు సంస్కృతంలో రాముడి మీద రాసిన పుస్తకం పేరేమిటి?
*
గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు:
*
ద్వాపర యుగంలో కర్ణుడికి విలువిద్య నేర్పించిన రాముడి కాలంనాటి మహాత్ముడు ఎవరు?
పరశురాముడు

*
క్రిందటి వారం ప్రశ్నలకు జవాబులు
*
1.మనిషి మాంసాన్ని తినే భయంకరమైన ఇతర జంతువులు కూడా నిన్ను హింసించకుండా ఇక్కడ వాటిని పూజిస్తాను అని కౌసల్య చెప్పింది. హరిదాసు చెప్పలేదు.
2.ఇంద్రుడితో యుద్ధం చేసింది వృత్రాసురుడు. కాని హరిదాసు శంబరాసురుడు అని తప్పు చెప్పాడు.
3.గరుత్మంతుడి తల్లి వినత. హరిదాసు తప్పుగా కద్రువ అని చెప్పాడు.
4.దేవేంద్రుడి తల్లి అదితి. హరిదాసు తప్పుగా దితి అని చెప్పాడు.
5.మూడు అడుగులు వేసి త్రిలోకాలని ఆక్రమించింది విష్ణువు. హరిదాసు తప్పుగా శివుడు అని చెప్పాడు.
6.కౌసల్య రాముడికి కట్టిన ఓషధ రక్ష పేరు విసల్యకరణి. హరిదాసు దీన్ని చెప్పలేదు.
7.రాముడు ‘సీత ఇంటికి వెళ్లాడు’ అని 25వ సర్గ ముగుస్తుంది. హరిదాసు రాముడు కౌసల్య ఇంటి నించి సీత ఇంటికి వెళ్లడం చెప్పలేదు.

-మల్లాది వెంకట కృష్ణమూర్తి