AADIVAVRAM - Others

అతి సర్వత్ర వర్జయేత్ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలకాపురి రాజు రాజవాహనుడు దసరా పండుగ ఉత్సవాలలో అద్భుతంగా పాటలు పాడిన సంగీత విద్వాంసురాలు విద్యావతి అందచందాలకు ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకున్నాడు. విద్యావతి సిరిపురం గ్రామవాసి. ఇప్పుడు అలకాపురి మహారాణి అయింది.
విద్యావతికి నాగదత్తుడు దూరపు బంధువు. వరుసగా తమ్ముడు అవుతాడు. వాడికి నగరంలో స్థిరపడాలనే కోరిక కలిగింది. అలకాపురి వెళ్లి విద్యావతిని కలుసుకున్నాడు.
‘అక్కా! బావగారికి చెప్పి నాకు మంచి ఉద్యోగం ఇప్పించు. ఇక్కడ స్థిరపడిపోతాను’ అని అడిగాడు.
‘సరే! నువ్వు అతిథి గృహంలో ఉండు. నేను నీకు ఏదైనా ఉద్యోగం ఇప్పించే ఏర్పాటు చేస్తాను’ అని అభయం ఇచ్చింది.
కొన్ని రోజుల తర్వాత విద్యావతి నాగదత్తుడిని రమ్మని కబురు చేస్తే వెళ్లాడు.
‘తమ్ముడూ! నువ్వు ఒక సంవత్సరంపాటు సైనిక శిబిరంలో శిక్షణ పొందు. ఖడ్గవిద్య, విలువిద్యలు అభ్యసించు. సైనికుడిగా నీకు ఉద్యోగం ఇస్తారు. ముందు ముందు సైనికాధికారి అయ్యే అవకాశం ఉంది. మంచి జీతభత్యాలు, ఉచిత వసతి కూడా ఉంటుంది’ అన్నది విద్యావతి.
నాగదత్తుడికి తను సైనికుడు కావడం ఇష్టం లేదు.
‘అక్కా! నేను సైనిక శిక్షణ తీసుకోలేను. అంత శ్రమపడేవాడినే అయితే మన ఊళ్లో వ్యవసాయం చేసుకునేవాడినే కదా? నీడపట్టున సుఖంగా ఉండే ఉద్యోగం చేయాలని ఉంది. వాణిజ్య శాఖలో ఉద్యోగం ఇప్పించు. నాకు గణితశాస్త్రం తెలుసు’ అన్నాడు.
‘ఆ శాఖ మహారాజుగారి స్వీయ పర్యవేక్షణలో ఉంటుంది. ధనంతో పని. కోశాధికారి దానికి అధిపతి. పన్ను వసూలు, ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడం, అంతఃపుర ఖర్చులు, లెక్కలు చూడడానికి గణకుల ఉద్యోగాలు ఉంటాయి. ఇప్పుడు అందులో ఖాళీలు లేవు. ఖాళీ వచ్చినప్పుడు కూడా మంత్రులు, అధికారులు తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకుంటారు. కాబట్టి నువ్వు రాజుగారితో విశ్రాంతి సమయంలో సన్నిహితంగా ఉండు. బావమరిదివి కనుక ఏదో ఒక రోజున నీకు వాణిజ్య శాఖలో ఉద్యోగం ఇవ్వగలరు’ అని సలహా ఇచ్చింది విద్యావతి.
అప్పటి నుంచి నాగదత్తుడు రాజవాహనుడిని అంటిపెట్టుకుని ఉంటున్నాడు. ఆయన్ని విశ్రాంతి సమయంలో వినోదపరచమని విద్యావతి చెప్పినట్లు కాకుండా ఉదయం నించి రాత్రి వరకు రక్షక భటులతో పాటుగా రాజుని అంటిపెట్టుకుని ఉంటున్నాడు. తనకు తెలిసిన పిట్టకథలు, చమత్కారాలు, హాస్య సంఘటనలు సమయానుకూలంగా చెప్తూ రాజుని ఆకట్టుకున్నాడు. రాజుగారికి బావమరిది కాబట్టి మంత్రులు, అధికారులు కూడా నాగదత్తుడిని గౌరవించసాగారు.
కొంతకాలం తర్వాత ఉప కోశాధికారి అకస్మాత్తుగా చనిపోయాడు. నాగదత్తుడు రాజుగారిని అడిగాడు తనకు ఉపకోశాధికారి ఉద్యోగం ఇవ్వమని.
‘నాగదత్తా! నువ్వు ఎల్లప్పుడూ నా పక్కనే ఉంటూ రకరకాలుగా సంభాషిస్తూ అలరిస్తున్నావు. ఎప్పటికప్పుడు పిట్టకథలు, చమత్కారాలు చెప్తూ నన్ను సంతోషపరుస్తున్నావు. నువ్వు నా పక్కన లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. నీకా ఉద్యోగం ఎందుకు? ఇప్పుడు బాగానే ఉందిగా! రాచమర్యాదలు జరుగుతున్నాయి. విందులు వినోదాలతో కాలక్షేపం చేస్తున్నావుగాదా?’ అంటూ అతనికి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించాడు.
నాగదత్తుడు లబలబలాడుతూ విద్యావతి దగ్గరకు వెళ్లి మొత్తుకున్నాడు.
‘నిన్ను ఆయనతో సన్నిహితంగా మెలగమన్నాను. విశ్రాంతి సమయంలో అలరించమన్నాను. అంతేగాని నిన్ను ఇరవై నాలుగు గంటలూ ఆయన్ని అతుక్కుని ఉండమన్నానా? నువ్వు అతిగా ప్రవర్తించావు. ఆహారం, నిద్ర లాగానే నీ సాహచర్యం ఆయనకు అలవాటై పోయింది. అదొక వ్యసనం అయింది. ఇప్పుడు నువ్వు పక్కన లేకపోతే భరించలేడు. నువ్వు రాజు కొలువులో వుండాలనుకుంటే ఆయన రక్షక భటులతోపాటు ఉండు. నీకు విసుగ్గా వుంటే మన ఊరు వెళ్లిపోయి వ్యవసాయం చేసుకో’ అన్నది విద్యావతి.
అతి సర్వత్రా వర్జయేట్ అనే విషయం నాగదత్తుడికి అనుభవంలోకి వచ్చింది.

-వాణిశ్రీ