Others

జీవిత పాఠాలు నేర్పుదాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలాకాలం క్రితం సినిమా పాటగా పల్లవించిన సూక్తి- ‘‘చదువురానివాడివని దిగులు చెందకు- మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు?’’- అక్షర లక్షల విలువ చేసే అమూల్యమైన ఆ పాట మాటల్లోని అంతరార్థాన్ని అవగాహన చేసుకుంటే నేటి విద్యార్థుల / విద్యార్థినుల వ్యక్తిత్వ వికాస ధోరణి ఎంతగా వెనుకబడివుందన్న వాస్తవం ముంజేతి కంకణంలా దర్శనమిస్తుంది. సంస్కారాన్ని నేర్పలేని చదువు ద్వారా సభ్య సమాజం ఏం నేర్చుకుంటుంది? మార్కులే పరమావధిగా- ర్యాంకులే విజయ సోపానంగా కొనసాగుతూన్న నేటి కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యార్థినీ విద్యార్థులకు నేర్పుతూన్న జీవిత పాఠం ఏమిటి? అర్థంలేని పోటీ ప్రపంచంలో అనారోగ్యకర పోటీని ఎదుర్కొంటూ స్వయంకృతమైన స్పర్థను, వత్తిడిని పెంచుకుంటూన్న నేటి విద్యార్థినీ విద్యార్థులకు ‘జీవితం’ విలువ ఎలా తెలుస్తుంది? ఎవరు చెపుతారు? ఇవి ఎప్పటికీ శేషప్రశ్నలుగా మిగిలిపోయి పిరికితనాన్ని నూరిపోస్తున్న నేటి చదువులు ఆత్మహత్యాసదృశ్యమై సామాజిక చిత్రాన్ని ఛిద్రం చేస్తున్నాయి. మనలో మన మాట- మనుగడ కన్నా మార్కులు ముఖ్యం కాదే! అనురాగ రంజితమైన ‘జీవితం’ కన్నా ర్యాంకులు ‘గమ్యం’ కాదే! ఎవరి జీవితానికి వారే బాధ్యులై బాధ్యతలు తెలుసుకోవాలంటే ఇప్పుడున్న ఈ చదువులు ప్రతి విద్యార్థినీ విద్యార్థులలోనూ ప్రగతిశీలక ప్రయోజనాలని ప్రబోధించాలి. మనోవికాస స్ఫూర్తిని పెంచాలి. విద్యలేనివాడు వింత పశువు- అని భర్తృహరి చెప్పిన ఒకనాటి మాటలకర్థం మారిపోయి ‘విద్యాధికుడై వుండి కూడా పశువులా ప్రవర్తించడం’. చదువులు సంస్కార శోభితమై మనో వ్యక్తిత్వ వికాసానికి నూటికి నూరు శాతం చేయూతనందిస్తే ఎవరికీ ఎవరూ ఏమీ చెప్పాల్సిన పని ఉండదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న చందాన యాంత్రికంగానైనా జీవితం విలువలు ప్రతి ఒక్కరికీ తెలిసి వస్తాయి. గురువుల్ని గౌరవించే స్థాయి ఏనాడో దిగజారిపోయిన మన విద్యా వ్యవస్థలో అభ్యుదయం అందని చందమామే! అభివృద్ధి అధఃపాతాళమే! గురు స్థానాన్ని అధిష్ఠించిన వారు కూడా అవసరార్థం జీవనోపాధిగా అధ్యాపక వృత్తిని స్వీకరించి తమ వంతు పాత్రను ‘శనగలు తిన్నాం చెయ్యి కడుక్కున్నాం’ అనే తీరులో నిర్వర్తిస్తుంటే విద్యార్థినీ విద్యార్థులకు మంచి చెడుల తారతమ్యాన్ని చెప్పేదెవరు? అధవా తల్లిదండ్రులు చెప్పటానికి సాహించినా వారి మాటల్ని విని ఆచరించేదెవరు? కన్నందుకు కడుపుకోత భరించక తప్పదన్నట్లు వారు కూడా గుండె రాయి చేసుకుని చోద్యం చూడ్డం తప్ప మరేమీ చేయలేకపోతున్నారు. ఇంతకీ మొక్కై వంగనిది మానై వంగునా అనే తీరులో జరుగుతూన్న నేటి పిల్లల పెంపకం వారు సంచరిస్తున్న సామాజిక వాతావరణం- వాళ్ళల్లో ధైర్యాన్ని బదులు భయాన్ని పెంపొందిస్తుంటే, ప్రణాళికాబద్ధం కాలేని భవిష్యత్తు అంధకార బంధురం కాక ఇంకేవౌతుంది? చేదు వాస్తవమే అయినా ఈ నిజాన్ని అంగీకరించక తప్పదు, అనుభవించక తప్పదు!
అందచందాలు భగవంతుడు ఒకే తీరుగా ఇవ్వనట్లుగానే తెలివితేటలు కూడా అందరికీ ఒకేలా ఇవ్వలేదన్న సంగతి ఎందరు గుర్తుంచుకొంటున్నారు? పోనీ ‘అభ్యాసం కూసు విద్య’ అన్నట్లు వాటిని సానపట్టి పెంపొందించుకుందామన్నా అవి కూడా తూతూ మంత్రాలే అవుతున్నాయి. అంతెందుకు ఒక్క పదేళ్ళ వెనుక కాలానికి వెళ్తే ఫస్టు క్లాసు (అంటే 60 శాతం) మార్కులు రావడమన్నదే ఓ గగన కుసుమం! మరి నేడు 99 శాతం రావడమనేది సర్వసాధారణం అయిపోయింది.
ఇవి నిజంగా తెలివితేటలకు కొలమానాలేనా? హాస్యాస్పదం!! విద్యా వ్యాపారంలో మధ్యతరగతి జీవులు తలకు మించిన భారాన్ని మోస్తూ పిల్లల ప్రాణం ఖరీదును తృణప్రాయం చేసుకుంటున్న ఈ విపత్కర తరుణంలో ఆత్మవిశ్వాసంతో కూడిన ఆలోచన ఒక్కటే తరుణోపాయం.

-మరువాడ భానుమూర్తి, హైదరాబాద్