AADIVAVRAM - Others

విభిన్న రూపాల తెలుగు యుగంలో శతాబ్ది దర్శన ‘కారా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక శతాబ్దపు పూర్తి వృత్తాన్ని చూసిన వ్యక్తి అదృష్టవంతుడు. ఆ వ్యక్తి రచయిత కూడా అయితే, దాని నిండుదనం వేరు. ఆ మనిషి నిండుకుండ వంటి నింపాది స్వభావి అయితే, ఆ సందర్భం ఉత్కృష్ట శీలమైనది అవుతుంది. తన రచనలేవో, తను చూసుకోకుండా, వాటి ప్రచురణలకే పరిమితం కాకుండా, తనకు బాగా తెలిసిన పనిలో తన మేలు మాత్రమే కాకుండా, పరుల మేలు కూడా ఉండాలని, లోక హితం కోసం ఒక సంస్థ నిర్మాణం చేసే పట్టుదల గలవారు ఇన్‌స్టిట్యూషన్ బిల్డర్స్ (సంస్థా నిర్మాతలు) అవుతారు. తన రచనా జీవితాన్ని పారదర్శకంగా వదిలి పెట్టినవారు ఎందరు సమాజానికి ప్రయోజనకారులుగా పరిణమిస్తూ జీవించగలిగారు అంటే ఇటువంటి వారిని మనం కొద్ది మందినే చూస్తాము. వారే కారా మాస్టారు. వారి కథలు సాహిత్య పాఠశాల విద్యార్థి లోకానికి పాఠ్యాంశాలు. తాను రాయలేక పోయిన విషయాలే ఎక్కువ, తనది పరిమితమైన జ్ఞానం అంటూనే, ఒక శతాబ్దపు ప్రజా స్వభావ దర్శనంలో, మంది పక్షాన నిలబడిన రచయిత కారా మాస్టారు. నేను, జగద్ధాత్రి, సాయంత్ర తేనీటి వేళ కలిశాం కారాగారిని. ఇంటి ముందర కొండ తంగేడు పూలు బిగిసిన పసుపుపచ్చ పిడికిళ్లలా స్వాగతాలు పలుకుతున్నాయి. నవంబర్ యానగాలి వీస్తూ పలకరిస్తున్నది.
తొమ్మిది పదులు దాటి మరో నాలుగేళ్లు.. అయినా, ఇప్పటికీ రోజూ ఆరేడు గంటలపాటు చదవడం, చిన్న బల్లపై తాజాగా వచ్చి చేరిన పుస్తకాలు, చేతికందే దూరంలో, ఫొటోఫ్రేమ్‌లో తన సాహిత్య గురువులు కొడవటిగంటి కుటుంబరావు, రావిశాస్ర్తీ, మెత్తని కారా కిల్లీలు. వంద అడుగుల దూరంలో తాను, ఇరవై ఏళ్ల ముందర మిత్ర బృందంతో, కలిసి ఏర్పాటు చేసిన కథానిలయం. శ్రీకాకుళాన్ని ‘శ్రీకథాకుళమ్’గా మార్చిన కథా యజ్ఞపు సాంకేతిక సౌలభ్య సృష్టి స్ఫూర్తి, హేతువు, కార్యకర్త, ప్రపంచ సాహిత్య పటంలో ‘కథలూరు’గా శ్రీకాకుళాన్ని నిలబెట్టిన దీక్షాపరుడు మా ఎదురుగా కూర్చున్న, మన తొంభై నాలుగేళ్ల కాళీపట్నం రామారావు మాస్టారు.
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా, నేటి భిన్న రూపాల తెలుగు విషయమే ముందుకు ప్రస్తావించాము. తెలుగు చదవడం, రాయడం అనే పద్ధతులకు క్రమేపీ దూరం అవుతున్న తరాల సమాజం మన కనుల ముందర కనిపిస్తున్నదనీ, వీరికి తెలుగు శ్రవ్య రూపంగా మాత్రం అందుబాటులో ఉన్నది అని, ప్రస్తుతం, ఎలా తెలుగు ఆడియో ఫార్మాట్‌లో ఇతర దేశాలలోని తెలుగు వారికి ఒక అనుకూల మాధ్యమంగా ఉన్నదో చెప్తూ, చదివే పద్ధతి నుంచి వినే పద్ధతికి తెలుగు రచనలు రూపాంతరం చెందడం స్వాగతించదగ్గ పరిణామమేనా అని అడగ్గా, కారా మాస్టారు, కాల మహాప్రవాహంలో వచ్చే మార్పులు వరద వంటివి, మనం స్వాగతించడం, లేదా స్వాగతించక పోవడంతో సంబంధం లేకుండా ఇవి జరుగుతూ ఉంటాయి. వీటికి ఎన్నో సామాజిక కారణాలు దశాబ్దాలుగా ఏర్పడ్డవి నేపథ్యంలో ఉండగా, తెలుగు ఆడియో వినడం అనేది ఏ కారణాల వల్ల పెరిగినా, మనకు చెబుతున్నది ఇదే. ప్రస్తుతం, మనం విభిన్న రూపాల తెలుగు యుగంలో ఉన్నాము. చదవడం, వినడం, చూస్తూ వినడం, ఇవన్నీ పరిణామం చెందే భాషా వినియోగం. భావాలను పంచుకోవడంలో వచ్చి చేరే అనివార్యమైన మార్పులు తప్ప ఏ మార్పు కూడా పునాదులు లేకుండా ఏర్పడదు. ఆ పునాదుల స్వభావం, వాటి స్థితిగతులు గమనించగలగడం, మంచి పరిశీలకుల పని అని చెప్పారు.
నలభై పైచిలుకు కథలు రాశారు. సుదీర్ఘ విరామాలతో కూడిన సృజనాత్మక రచన మీ స్వభావ విశేషం. అలాంటి మీ రచనల్లో వెంటనే అడగ్గానే, మీకు జ్ఞాపకం వచ్చేది ఏది? అని అడిగి ఒక ఉపప్రశ్న కూడా జోడించాము. కొడవటిగంటి, రావిశాస్ర్తీ, నగర పేదలు, దిగువ మధ్యతరగతి, జీవితాలు చిత్రణ చెప్పారు. మీరూ మొదట అలా రాసినవారే. కానీ-
కారా మాస్టారు వెంటనే నిశితమైన కళ్లతో, చురుకైన స్పందన ఇస్తూ, నా గురువులైన కొడవటిగంటి, రావి శాస్ర్తీ, మధ్యతరగతి, నగర పేదల, బడుగు బతుకుల కథలు చెప్తున్నారు. మరి నేనేం చెప్పాలి అన్న ప్రశ్న నాకు ఉండేది. ఆ వెతుకులాట ఫలితమే. గ్రామీణ జీవిత కథలు, ఇప్పుడు నాకు నా బాల్యం అంతా బాగా జ్ఞాపకం ఉన్నది. అప్పటి మిత్రులు, స్కూళ్లు, తోటలు, అల్లర్లు, తొలి రచనలు, అప్పటి శబ్దాలు, అన్నీ వారి ముఖాలతో సైతం. చిన్నప్పుడు నన్ను హరిజనులు స్కూల్‌కి తీసుకువెళ్లడం, తీసుకురావడం చేస్తూ ఉండేవారు. అలా కూడా వారి వాడల్లో తిరిగిన, వారి జీవిత పరిసరాల గురించిన కొన్ని జ్ఞాపకాలు నాకు బలంగా ఉన్నాయి. ఈ కారణాల వలన వాళ్లందరూ కాలంలో కలిసిపోయినా, వారి ముఖాలు, మాటలు, నా బాల్య మిత్రుల చేష్టలలు, అన్నీ ఇప్పుడు నాకు ఈ 94 ఏళ్ల వయసులో బలమైన జ్ఞాపకాలుగా ఉన్నాయి. ఆ మాటకొస్తే కొంత వయసు వచ్చినప్పటి సంగతులు కొన్ని మర్చిపోయాను. ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రావు. అలా వెంటనే నాకే విపులంగా జ్ఞాపకం వచ్చే కథ ‘చావు.’ ఇందులో హరిజనుల జీవన కష్టాలు రాయడానికి ప్రయత్నం చేశాను. ఆర్తి కథలో కూడా గ్రామీణ పేదల జీవితం రాశాను.
మరి మీ కథల్లో విలక్షణంగా కనిపించే కథ ఏమైనా మీకు తోస్తుందా - నా కథల్లో ‘నో రూమ్’ అనే కథ ఉంది. సాహిత్య అకాడెమీ ప్రాంతీయ భారతీయ భాషల నుంచి కె.ఎం.జార్జ్ సంపాదకత్వంలో ఏర్చి కూర్చిన సంకలనంలో కూడా ‘మాడర్న్ ఫిక్షన్ విభాగం’లో ప్రచురణ చాలా ఏళ్ల కిందట జరిగింది. ‘యజ్ఞం’తో తొమ్మిది సాహిత్య అకాడెమీ ప్రచురణగా ఆంగ్లంలో వెలువడింది. యజ్ఞం, చావు కథలు నాటకాలు వేసి ప్రదర్శన చేశారు కూడా.
మాస్టారూ - ఈ రెండు కథలు, ‘చావు’ కథలో మీరు తెలిపిన గ్రామీణ జీవితం, ఉర్దూలో రాసిన హిందీ సాహితీవేత్త (1880-1936) కథలను గుర్తు చేస్తుంది. తను కూడా గ్రామీణ భారతీయ జీవితాన్ని పలు కోణాల నుంచి రాసిన వారు. అలాగే ‘నో రూమ్’లో మీరు తెలిపిన ఇతివృత్తం కూడా - ఉర్దూ రచయిత సాదత్ హసన్ మాంటో (1912 - 1955) కథతో పోలి ఉన్నది. పేదరికం వల్ల అన్యోన్యతకు చాటులేని ఒక పేదల వాడలో తన భార్యతో కొత్త సంసారం అలా పబ్లిక్‌గా చేయలేక, చివరికి పిచ్చివాడయ్యే వ్యక్తి కథ (నంగి ఆవాజే - నేకెడ్ వాయిసెస్) మాంటో కలం నుంచి వెలువడ్డది.
ప్రేంచంద్, మాంటో వీరిని నేను చదవలేదు బాబూ - శరత్ సాహిత్యం అంతా చదివాను.
మీరు చదివారని కాదు మాస్టారూ, గ్రామీణ భారతదేశం, పేదల భారతదేశం ఎలా సమర్థులైన రచయితల చేతిలో చిత్రణ జరిగిందో, ఆ చిత్రణతో మీ కథలకు గల సారూప్యతల కోసం ఈ వివరణ. మీకు మాంటో కథల పుస్తకం ‘నేకేడ్ వాయిసెస్’ ఇస్తాను - రోజూ ఆరేడు గంటలు చదువుతున్నారు కనుక ఈ పుస్తకం చదువుతారా?
తప్పకుండా చదవుతాను బాబూ! ఇవ్వండి.
‘కుట్ర’ కథ ఇంకోలా రాయలేక అలా రాశానని మీరన్నా, తృతీయ ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా, ఏమి జరుగుతున్నదో, ఇరవయ్యో శతాబ్దంలో పాలకుల పద్ధతులు, వారు ప్రాతినిధ్యం వహించే ప్రాబల్య శక్తులు, ఎన్నో సిద్ధాంతాల ద్వారా కష్టపడి తెలుసుకోవచ్చు. కానీ అదే ఫలితం అంతర్జాతీయ స్వభావం గల ఒక్క కుట్ర కథ ద్వారా, ఈ తృతీయ ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సాధించవచ్చు. అంతే ఫలితం ఇస్తుంది అని నా భావన. మాస్టారూ - కుట్ర కథ గురించి చెప్తారా?’
(ఒక చిరునవ్వుతో) చాలామంది ఈ కథ గురించి బాగా రాసానని చెప్పిన వారున్నారు కానీ, ఇప్పుడు మీరొక్కరే కథను ఇలా అంచనా కట్టి కచ్చితంగా చెప్పారు. అసలు పాత్రలు లేకుండా కథ రాయాలన్నది నాకు ఒక ఆలోచన. ఆ ఆలోచనల రూపం ‘కుట్ర’ కథలో అలా వచ్చింది. కథ బాగోగుల విషయం, చదివిన వారు, కాలమూ చెప్పాలి. ‘కుట్ర’ కథ రచయితకు ఉండాల్సిన లోక జ్ఞానపు విస్తృతి, అవగాహన గురించిన రచన.
ప్రపంచ తెలుగు మహాసభల గురించి..
ఏ భాష రచనలైనా ఆ భాష అభివృద్ధికి గుర్తులు. ఏ కాలంలోనైనా వచ్చే మార్పులకు అనుగుణంగా, సంస్కృతికి జోడింపుగా వచ్చే సాంకేతిక సౌకర్యాలను ఉపయోగించుకోవడం, తద్వారా, ఇంకా విస్తృత ప్రజానీకానికి, విభిన్న రూపాల్లో చేరువ కావడం ప్రగతి సూచిక, కనుక ఇటువంటి ముఖ్యమైన సభల ద్వారా, ఒక జాతి, తమ భాష, సంస్కృతి, సాహిత్యం వీటికి సంబంధించిన తక్షణ లక్ష్యాల సాధన కోసం ఆచరణకు దిగడం, దీర్ఘకాలిక ప్రణాళికలు ఆలోచించడం, బేరీజు వేసుకోవడం జరుగుతాయి. స్థూలంగా అందరికీ సంబరాలుగా, సంతోషం, ఆనందం, ఒక భాష వారము అన్న సంతృప్తి, ఆత్మగౌరవం ఇనుమడించడం కోసం ఇటువంటి సభల ఆవశ్యకత ఉందని భావిస్తున్నాను. సభల విజయం కోరుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
*

చిత్రాలు..*కారా మాస్టారుతో కాసేపు...
*గురుదేవులతో కథల మాస్టారు

-రామతీర్థ 9849200385