AADIVAVRAM - Others

కుట్ర కోణంలేని మొదటి ప్రయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాషకు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నప్పటికీ భారతీయ ప్రాచీన భాషల జాబితాలో ఇటీవలే చోటు లభించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేసిన న్యాయ పోరాటం ఫలితంగా దక్కిన గుర్తింపు ఇది. కేవలం తెలుగుకు ప్రాచీన హోదా దక్కడం విషయంలోనే కాదు, ఇంకా అనేక రాజకీయ, నైసర్గిక కారణాల వల్ల రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన తెలుగు భాషకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. జాతీయ, ప్రాచీన భాషల గుర్తింపు స్వాతంత్య్రం వచ్చిన తర్వాతే అధికారికంగా జరిగింది. తెలుగు మాట్లాడే ప్రజలు కోట్లాది సంఖ్యలో ఉండడంతో తెలుగు భాష సహజంగానే జాతీయ భాషగా గుర్తింపు పొందింది. కానీ ప్రాచీన భాషగా గుర్తింపు పొందడం మాత్రం తేలిగ్గా సాధ్యం కాలేదు. తెలుగు మాట్లాడే ప్రాంతాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు చాలా కాలం అటు మద్రాసు రాష్ట్రంలో, ఇటు హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేవి. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉండే పక్షాలు తమిళ, ఉర్దూ భాషలకే ప్రాధాన్యం ఇచ్చాయి. అప్పుడెలాగూ తెలుగు భాషకు కావాల్సిన గుర్తింపు, గౌరవం, ప్రోత్సాహం లభించలేదు. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రం అనే నెపంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి బీజాలు పడాల్సి ఉండేది. కానీ అప్పటి పాలకులు తెలుగు భాషపై అవసరమైనంత దృష్టి సారించలేదు. తెలుగు భాష వెలుగుకు పాటుపడాల్సిన పాలకులు రాజకీయావసరాల కోసం తెలుగును వాడుకున్న సందర్భాలున్నాయి. ప్రాంతీయ వివక్షపై ఉద్యమాలు వచ్చిన సందర్భంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో ప్రయత్నాలు జరిగాయి తప్ప, భాషాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి జరగలేదు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ భాషపై సమావేశాలు జరిగినా, దానికి రాజకీయ కోణం ఉండదు. కేవలం ఆ భాష గొప్పతనం, ఔన్నత్యం, ప్రాశస్త్యం, ఆ భాషలో ఉన్న ప్రక్రియలు, సాహితీ సృజన, సాహిత్యం ద్వారా వెలుగులోకి వచ్చే చరిత్ర తదితర అంశాలపై కూలంకషమైన చర్చ, అధ్యయనం జరుగుతుంది. దీని ద్వారా వెలుగులోకి వచ్చే అంశాలు భాషాభివృద్ధికి, భావితరాలకు దోహదపడతాయి. ఇందుకోసమే తెలుగు మహాసభలు నిర్వహిస్తారు. కానీ ఇప్పటివరకు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన తీరు అందుకు విరుద్ధంగా కేవలం రాజకీయ కుట్ర కోణంతోనే జరిగాయి.
మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు 1975లో హైదరాబాద్‌లో జరిగాయి. అంటే భాష పేరుతో ఏర్పడిన రాష్ట్రంలో రాష్ట్రావతరణ జరిగిన 19 ఏళ్లకు తెలుగు మహాసభలు నిర్వహించారు. అది కూడా తెలుగుపై మమకారంతో కాదు. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. 1971లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చింది. ఈ రెండు ఉద్యమాలతో తెలుగు మాట్లాడే ప్రజలు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతవాసులుగా చీలిపోయారు. ఎప్పటికైనా విడిపోవడమే తప్ప కలిసుండలేమనే భావన రెండు ప్రాంతాల్లో బాగా వ్యాపించింది. అప్పుడు రెండు ప్రాంతాల ప్రజలను కలిపి ఉంచి, తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలన్న పాలకుల కుట్ర నుంచే ప్రపంచ తెలుగు మహాసభల ఆలోచన పుట్టింది. అప్పటిదాకా తెలంగాణ ప్రజలు తమ భూమాతను తెలంగాణ తల్లిగా, ఆంధ్ర ప్రజలు తమ భూమాతను ఆంధ్రమాతగా పిలుచుకున్నారు. కొలుచుకున్నారు. కానీ ఈ రెండు ఉద్యమాల తర్వాత పాలకులు ఈ రెండు భావనలను సమాధి చేయడానికి తెలుగు తల్లి అనే కొత్త భావన పుట్టించారు. నిజానికి భాషకు తల్లి రూపం ఎక్కడా ఇవ్వరు. కేవలం మాతృభూమికి మాత్రమే అలాంటి పిలుపు వర్తిస్తుంది. అయినా అప్పటి పాలకులు తెలుగుతల్లి అనే భావనను పుట్టించి, వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు. ఫలితంగా తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకటే అనే అభిప్రాయం కలగడానికి ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే తెలుగు తల్లి విగ్రహం ఉద్భవించింది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట పుట్టుకొచ్చింది. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి.
కౌలాలంపూర్‌లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు, మారిషస్‌లో జరిగిన రెండో ప్రపంచ తెలుగు మహాసభలు ఆయా ప్రాంతాల్లోని తెలుగు వారిలో ఐక్యతను పెంపొందించే పరిమిత లక్ష్యంతో నిర్వహించారు. ఇక నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు 2012లో తిరుపతిలో జరిగాయి. అప్పుడు కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ప్రజలు మానసికంగా విడిపోయిన నేపథ్యంలో మనమంతా ఒకే తల్లి బిడ్డలం అనే భావన పెంపొందించడం కోసం ఏర్పాటు చేసిన సభలే కావడం గమనార్హం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తెలంగాణ సాహితీవేత్తలు ఆ సభల నిర్వహణ పట్ల నిరసన వ్యక్తం చేయడంతోపాటు బహిష్కరించారు. అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భాషాభివృద్ధి కోసం తెలంగాణలోనే సభలు నిర్వహించుకుంటామని కూడా ప్రకటించారు.
ఇప్పుడు మొత్తంగా ఐదోసారి, తెలంగాణలో మొదటిసారి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడానికి రంగం సిద్ధమయింది. చారిత్రక నగరం హైదరాబాద్ వేదికయింది. ఈసారి సభల్లో ఎక్కడా రాజకీయ వాసనలుండవు. తెలుగు సాహితీవేత్తలు ఎక్కడున్నా వారందరినీ పిలిచి, వారి సమక్షంలోనే సభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తెలుగు భాషాభివృద్ధి కోసం కృషి చేసిన వారు ఎక్కడున్నా, వారు ఆంధ్ర వారైనా సరే అందరినీ పిలిచి గౌరవించుకునే అద్భుతమైన సందర్భం ఆవిష్కృతం కాబోతున్నది.
తెలంగాణలోనే తెలుగు పుట్టి పెరిగింది అని చెప్పడానికి ఇప్పటికే అనేక ఆధారాలున్నాయి. వాటి గురించి ఇప్పటికే కావాల్సినంత చర్చ జరిగింది. అనేక రూపాల్లో రెండు వేల ఏళ్ల నుంచి తెలుగు వెలుగొందుతున్నదనే చారిత్రక వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే లక్ష్యంతో తెలంగాణలో తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. రాజకీయ కారణాలతో కాకుండా, కుట్ర కోణం లేకుండా తెలుగు భాషాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో జరుగుతున్న కృషి ఇది.
*

-గటిక విజయ్‌కుమార్ 9553955355