AADIVAVRAM - Others

సాంస్కృతిక ‘కాలుష్యాల్లో’ మేడారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకవైపు ఆదివాసులు ‘మా అడివిని ద్వంసం జేస్తున్నరు. మా సమ్మక్క, సారక్క జాతర నుంచి మమ్మల్ని యెల్లగొట్టే కుట్రలు జరుగుతున్నయి. గీ పట్నము, హిందుత్వ లెక్కలన్నీ మామీద రుద్దొద్దు. మా జాతరను మా ఆదివాసీ నాగరికతగానే జరుపుకుంటము. మా రీతిరివాజులే సాగాలి. బైటోల్లొచ్చి మా మేడారాన్ని బరిబాతల జెయ్యొద్దు. మా అడివి మాదే. మా సమ్మక్క సారక్క జాతరని తెలంగాణ ‘కుంభమేళా’ అని ప్రచారము కొత్తగ మొదలుబెడ్తున్నరు. మేడారం జాతర ‘కుంభమేళా’ కాదు. ‘కుంభమేళా’తో మా సమ్మక్క సారక్కల ఆదివాసీల జాతరకు హిందుత్వంగా కల్తీ చెయ్యొద్ద’ని ఆదివాసులు నినదిస్తున్నారు.
నిజమే వారి ఆవేదన న్యాయమైందే. అడివిని అడివి నాగరికతను ఆగంజేసే రుూ కలుషితాలు అక్రమమైనవే. యిప్పుడు జరుగుతున్న జాతర ఒకప్పటి సమ్మక్క సారక్క జాతర గాదు. చాలా హిందుత్వము చొరబడింది. ఆదివాసీ నమ్మకాలకు సంబంధము లేని హిందూ సంస్కృతి సమ్మక్క జాతరలోకి వచ్చింది. దాంతోపాటు విపరీతమైన వ్యాపార సంస్కృతి రుూ పదేండ్లల్ల విపరీతంగా పెరిగిపోయింది. అట్లా పెరిగిపోయిన ఆ కకావికలత్వాన్ని చూస్తుంటే.. మా నాగరికతలు మా కండ్ల ముందే ధ్వంసమవుతున్న బాధ మెలిబెడ్తుంటది.
మాది మేడారం జాతరకు 15 కి.మీ. దగ్గరగా వున్న గ్రామము. నా చిన్నప్పుడు (40 సం.ల కింద) మేడారం జాతరని ‘మేడారం తీర్తం’ సమ్మక్క తీర్తమని గూడ అనేటోల్లు. 20 సం.ల కింద గూడ అడివి ఆకుకు ఆకు సందులేకుండా చిక్కటి పచ్చటి పచ్చదనంతో జంపన్న వాగు జలాలతో, అనేక అడివి జంతుజాలంతో, పక్షుల కూతలతో, అడివి పండ్లతో, ఆదివాసుల ఔన్నత్యమైన ప్రకృతితో కలకల్లాడుతుండేది. రెండేండ్లకోసారి వచ్చే పౌర్ణమిని ‘మేడారం పున్నమి’ అని తెలంగాణ జిల్లాల్లోని పల్లెలన్నిటికి తాళాలు బడేయి, సమ్మక్క సారక్క జాతరకు. కొంతమంది బండ్లు కట్టుకొని వూల్లు, కుటుంబాలు కుటుంబాలుగా బైల్దేరేవి. కొంతమంది కాలినడకన గూడాజాతరకు బొయేవాల్లు గుంపులు గుంపులుగా. చెట్ల కిందనే బండ్లు యిడుసుకొని కలిసి వచ్చిన సుట్టాలతో పక్కాలతో అడివంతా అలరారుతుండేది. చెడిపోయిన కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలన్ని జాతరలో ఒక్కటయ్యేవి. నెగల్లేసుకొని పురుగు పుట్ర రాకుంట రాత్రంత బందువులతో కడుపులున్నయన్ని ఒకరికి ఒకరు కడిగి పోసుకునేవాల్లు.
శబరిమలై అయ్యప్ప కాడికి బోవాలంటే.. అనేక నియమాలు, నిష్టలు నిషేధాలున్నయి. కాని సమ్మక్క సారక్క జాతరకు యివేమి వుండవు. అంటరాని కులాల్నించి ఆధిపత్య కులాల దాకా ఎవరైనా పోవచ్చు. అంటులేదు. ముట్టులేదు. ఆడలేదు మగ లేదు. ముసలి ముతక, పిల్లలు, బీద గొప్ప భేదాల్లేవు. దివ్యాంగులు, హిజ్రాలు తేడా లేదు. సర్వ మానవ సమూహాలు సమ్మక్క సారక్క జాతరకు పోవచ్చు. ఎలాంటి నిషేధాలు లేని పచ్చటి ఆకాశమంత విశాలమైన అడివి పర్యావరణం.. మేడారం జాతర విశిష్టత. యిది గొప్ప ప్రాపంచిక మానవ సామాజిక చైతన్యంగా సమ్మక్క జాతర కనిపిస్తుంటది. ఒక మానవ విశాల కూడలిగా సమ్మక్క సారక్క జాతరను చూడాలి. యిట్లాంటి విశాలతలు భవిష్యత్‌లో ఎలాంటి మార్పులకు లోనవుతయో అని కూడా భయముంది.
ఎందుకంటే ప్రతిసారి జాతరలో అనూహ్య మార్పులు అలివికాని, ఆదివాసీ సంస్కృతికి విరుద్ధమైన, ప్రకృతిని ధ్వంసం చేసే హిందుత్వ, వ్యాపార సంస్కృతి విరివిగా జొరబడ్తుంది.
నాకు తెల్సిన మేడారం ఎర్రటి దుబ్బబాటలు, ఎరుపు పసుపు కలిపిన సమ్మక్క సారక్కల ‘బండారి’వోలె వుండేది. ఆ దుబ్బల పిల్లలమంత ఆడుకొని జంపన్న వాగుల ఈతగొట్టిన యాదులు, యిప్పటి జంపన్న వాగు యెండిపోయినట్లు యెండిపోక పచ్చిగానే, పచ్చగానే వున్నయి. యిప్పుడు జంపన్న వాగు నేలమట్టంగానే వుంది. పాతోల్లు చెప్తేగాని తెలువది యిది జంపన్న వాగని. ఆ వాగు పక్క పోంటన్ని నీల్ల పైపులేసిండ్రు. వాగు ఆనవాల్లే కనబడయి. జాతర జోరున సాగే రెండు మూడు రోజుల్లో యిప్పుడు లక్డారం చెరువు నుంచి నీల్లొదులుతున్నరు. అదే జంపన్న వాగని సంబురపడాలె. నేంజూసిన జంపన్న వాగు నిండు నీల్లతో సంపన్న వాగోలె వుండె.
దుబ్బ తొవ్వలు, బండ్లబాటలు బొయి కంకర రోడ్లొచ్చినయి. లక్షల వాహనాలతో మేడారమంత మెసలకుంటయింది. జాతర నిండ సినిమా పాటల హోరుతో ప్రశాంతతంతా కొట్కపోయింది. హోటల్లు, వైన్‌షాపుల విస్తృతి పెరిగింది. యిదివరకు ఒక్క హోటలు, ఒక్క వైన్, బ్రాందిషాపు వుండేదిగాదు. రికార్డు వినబడేదే గాదు.
యిదివరకు మేడారం జాతరంటే.. చల్లచల్లగా, పచ్చపచ్చగా.. ఆదివాసుల ప్రకృతి నాగరికత నీడలో మానసికంగా, శారీరకంగా మనుషులు నిమ్మలంగా వుండేది. యిప్పుడు ఒక్క చెట్టు లేదు. చెట్టు నీడలేదు.
ఇక సమ్మక్క సారక్కలంటే.. మేడారంలోని ఒక చెట్టు పక్కన రెండు గద్దెలే తల్లిబిడ్డలైన సమ్మక్క సారక్కల ఆనవాల్లుగా వుండేది. భక్తులు ఆ గద్దెల మీనే్న ముడుపులు మొక్కులు, బంగారం (బెల్లం) పంచిపెడ్తుంటరు. విగ్రహాలు ఫొటోలుండకపోయేది. నిజానికి ఆదివాసులకు, తెలంగాణ వాల్లకు ‘గుడి’ సంస్కృతి లేదు. యితర రాష్ట్రాల్లో లాగ కులానికో గుడి, వూరికో గుడి వున్నట్లుగా తెలంగాణలో లేవు. ఓ చెట్టు, ఓ పుట్ట, ఓ కట్ట, రాయి, మట్టి గద్దెలే యిక్కడి దేవతల ఆనవాల్లుగా కొలిచే ఆధ్యాత్మిక సంస్కృతి. ఎప్పుడోకప్పుడు కష్టము, నష్టము కలిగినప్పుడు ‘తల్లీ దయుంచు. మా పిల్లాజెల్ల, గొడ్డూగోద పంట ఫలము సల్లగుంచు’ అని కొబ్బరికాయ గొట్టి, కోడిపిల్లను, యాట పిల్లను మొక్కుకుంటరు. జాతర్లకు బోతరు గానీ గుడులు మడులు తెలంగాణ నాగరికతగా కనిపించదు. కాని యిప్పుడు గుడి సంస్కృతి పెంచే క్రమము పెరుగుతుంది.
కంకెరరోడ్డు నాగరికత గబ్ము గొడ్తంది. తీగెలతో, చెట్లు, పూలు, కాయగడ్డ పండ్లతో, వాగులతో నిండి పచ్చగా పారిన అడివి యాదులు నాకు బాగా గుర్తు. ఆ అడివిని ద్వంసం జేసినా నా జ్ఞాపకాలు ధ్వంసం గాలే యింకా పచ్చిగా పార్తనే వున్నయి. అడివిని, పల్లెల్ని, మేడారం చుట్టూత వున్న గ్రామాలు యెడారోలె యెండిపోయేట్టు జేసిండ్రు. దాదాపు 20 కిలోమీటర్ల మేర చెట్టు చేమ లేకుంట జేసిండ్రు. దారెంట అన్ని వైన్‌షాపులెందుకంటే.. సమ్మక్క సారక్కలకు మొక్కేదానికంటుండ్రు. సమ్మక్క సారక్కలకు బెల్లం నీల్లు సాకబెడ్తరు మొక్కేదానికి. లేదా యిప్పపువ్వుతో చేసిన సారను సారబెడ్తరు గానీ వైన్ సాక బెట్టుడేంది? రుూ నాశనమేంది?
మేడారం జాతరంటె అడివిల దొరికే తునికి పండ్లు, పరికి పండ్లు, రేగుపండ్లు, గంగరేగు పండ్లు, ఎల్క పండ్లు, పాలపండ్లు యింకా యిపుడు గుర్తుకు రాని పండ్లు బోలెడు బొచ్చెడు రాసుల బడబోసి అమ్మేది ఆదివాసులు, యితరులు. కొంతమంది కొంచెం అడవి లోపలికి బొయి తెంపుకొచ్చుకునేటోల్లు కొనుక్కోలేనోల్లు. కాని యిప్పుడా పండ్లే కనబడ్తలేవు. ఏమైనయో, ఎట్లా మాయమైనయో గానీ అడివికి సంబంధంలేని ఆపిల్ పండ్లు, అరటి, ద్రాక్ష, దానిమ్మ లాంటి పండ్లు అమ్ముతున్న వ్యాపారం కనిపిస్తుందిప్పుడు.
జాతర్ల మొక్కుకున్న కోడి, మేక, గొర్రె మాంసాలే వండుకొని తినేటోల్లు కాని యిప్పుడు మాంసం దుకాణాలు వెలిసినయి. మొక్కుకు సంబంధం లేని విడి మాంసాన్ని తినకపోదురు. సమ్మక్క సారక్క గద్దెలకాడ మొక్కుగా మొక్కిన మాంసానే్న వాల్లవాల్ల అడ్డాల కాడికి తెచ్చుకొని బందువులు బలగమంతా సామూహికంగా సంబురంగా వండుకొని తిందురు. యిప్పుడు ఆ నమ్మకలతో సంబంధం లేకుండా, పరిమితి లేకుండా మాంసం వ్యాపార విస్తృతి పెరిగింది కొట్లు కొట్లుగా.
సమ్మక్క సారక్కలంటే చెట్టు కింద రెండు గద్దెలే. ఆ రెండు గద్దెలకు జనం ఎటుపక్క నుంచయినా బొయి గద్దె కాడ నిలుచొని బెల్లమ్ముద్దలు మొక్కుకోవచ్చు. తెచ్చుకోవచ్చు. ఎట్లాంటి అడ్డుగోడల్లేకుంటావుండె.. యిప్పుడు గద్దెల చుట్టూత ఎత్తయిన కంచెలు మోపుజేసిండ్రు. ముడుపులు, జోకిన బంగారాన్ని (బెల్లం) యిప్పుడు కంచెలెక్కి వేయాల్సిన పరిస్థితి. గద్దెల చుట్టూ ఫెన్సింగే కాదు, గుడిగంటలు గూడ పెట్టిండ్రు. పచ్చటి సముద్రాన్ని అభివృద్ధి పేరుతో ఎంత లూటీ యెంత విద్వంసము. మేడారం పల్లె, దాని చుట్టుపక్కల అడివి గ్రామాలేమైనయో? ఆ అడివి బిడ్డలెటు బోయిండ్రో. ఎక్కడికి యెల్లగొట్టిండ్రో... హిందుత్వ శక్తులు. యిప్పటి మేడారమ్‌ని చూస్తుంటె మనసంతా కలికలైతుంటది. మేడారం జాతరను అడివి అందాల్ని తనివితీర తకుబోస్కున్న యాదులు యెడారిగా మారిన మేడారాన్ని చూసి తట్టుకోలేని బాధ కలుగుతుంటది.
‘మతం మత్తుమందు’ అనే రాజకీయాలతో వున్నా నన్ను తీర్తం (జాతర)కు బోనియకుండా ఆపలే. ‘మతం’ అనే పర్యావరణములోకి స్థానిక నమ్మకాలు యిమడని వాతావరణము. కాని స్థానిక నమ్మకాల్ని హిందుత్వాలు కబ్జా చేస్తున్న కబలిస్తున్న కాలమిది.
కానీ జాతరంటే స్థానిక మానవ సమూహాలు, సామాజికాలు తమ తాత్విక ఆనందాలకు, అలజడి భయాలు పొగొట్టుకునే అవసరాలు తీర్చుకోనికే కాదు ఆ సమూహాల మానవ సంబంధాల్ని పెంచుకునే కూర్పుగా కూడా జాతరను చూడాల్సిన అవసరముంది. దాన్ని వ్యాపారం, హిందుత్వతో ధ్వంసం చేసే పరిణామాలు విరివిగా పెరుగుతున్నయి. యిది పర్యావరణ వినాశం గూడ. భక్తులు, మొక్కులు కాని వాల్లు గూడ అడివిని, జంపన్న వాగుల్ని, ఎర్రటి పచ్చటి దుబ్బ, తీరొక్క చెట్లు, తీగలు, పండ్లు, పక్షుల కూతలు, ఆడమగ శివసత్తుల పూనకాలు, వాల్లు పూనకంలో చెప్పే కమ్మటి తేటతెలుగు, అనేక మానవ సమూహాలు, సబ్బండ కులాలు, వారి కళలు, ఆదివాసీల ఆటపాటలు కలిసి గుమ్మెత్తించి అదొక పురా సంబురాల సందడిగా వుండేది. తెలంగాణ పల్లెలన్నీ యిప్పటికి మరీ ముఖ్యంగా మేడారం చుట్టూత వున్న మా పల్లెలు మేడారంలో జరుగుతున్న విద్వంసాల్ని కతలు కతలుగా చెప్పుకుంటుండ్రు. సెట్లు బొయినయి, సెల్ టవర్లొచ్చినయి, హోటల్లొచ్చినయి. వాగులు యెండిపోయి తానాల నల్లలొచ్చినయి. సమ్మక్క సారక్క గద్దెను అంటుకోనియ్యని ఫెన్సింగులొచ్చినయి. గుడిగంటలొచ్చినయి.జనం రద్ది యిసుకెస్తే రాలనట్లు పెరిగిపోయింది. సౌలతుల పేరు మీద సర్వ నాశనం చేస్తుండ్రు. బంగారం (బెల్లం) బొయి లడ్డూ ప్రసాదాలొచ్చినయి. సమ్మక్క సారక్కలకు ఎర్రటి నేత సీరేలు పెట్టేది.. యిప్పుడు పట్టుపితాంబరాలొచ్చినయి. గుడారాలు, కుటీరాలు వచ్చినయి. రేపు గుడులు గోపురాలు గట్టిస్తరేమోనని ఆందోళన పడ్తుండ్రు. ‘కుంభమేళాలేంది’ అని ఆశ్చర్యపోతుండ్రు.
గుడి సంస్కృతిలో, అర్చకత్వ దీప దూప నైవేద్యాల హిందూత్వాల ఆదిపత్యాలతో ఆదివాసిత్వానికి, అడివికి, సమ్మక్క సారక్కల ప్రకృతి అస్తిత్వత్వాన్ని విద్వంసం చేస్తున్న హిందూత్వాన్ని, వ్యాపార సంస్కృతిని ఎదుర్కోవాల్సిందే... నిలువరించాల్సిందే.
*
-జూపాక సుభద్ర
అదనపు కార్యదర్శి పంచాయతీరాజ్ శాఖ,
తెలంగాణ ప్రభుత్వం