AADIVAVRAM - Others

రుద్రుని సన్నిధిలో కరుణించే రాహు కేతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివః కరోతు నిత్యకల్యాణం కరుణా వరుణాలయః’’
అంటూ పురాణాల్లో ప్రసిద్ధి చెందిన పరమేశ్వరుడు వెలసిన స్వయంభూ క్షేత్రం శ్రీకాళహస్తి.
మానవ శరీరాన్ని పంచభూతాలతో పోలుస్తారు. పంచభూతాలు లేకుంటే జీవులు పుట్టడం అసంభవం. అందుకే పంచ భూతాలు ప్రధానమైనవి. పంచభూతాలకు ప్రతీకలుగా వెలసిన 4 క్షేత్రాలు తమిళనాడులో ఉండగా వాయుక్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉంది. తమిళనాడులోని అరుణాచలంలో ఆగ్నిలింగం, కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, చిదంబరంలో ఆత్మలింగం వెలిశాయి. శ్రీ కాళహస్తిలో వాయురూపంలో శివుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. వాయుక్షేత్రం రాహు- కేతు పూజలకు ప్రసిద్ధిగా ఉంది. శివానందైక నిలయం అనే పేరుకూడా ఉంది. పూర్వం బ్రహ్మ సృష్టిని చేయడంలో తడబడుతుండగా దక్షిణ కైలాసంలో తపస్సుచేస్తే సృష్టిని సక్రమంగా నిర్వహిస్తావని శివుడు సూచించగా బ్రహ్మ కైలాసంలోని కొంత భాగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి శివలింగాన్ని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆయన పూజించిన పంచముఖేశ్వర లింగం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. అందువలన ఈ క్షేత్రాన్ని శివానందైక నిలయం అని కూడా అంటారు. కృతయుగం నుంచి శ్రీకాళహస్తీశ్వరుడు పూజలందుకుంటూ ఎంతో మంది దేవతలను, మునులను, ఋషులను తరింపచేసినట్లు పురాణాల్లో పేర్కొనబడింది.
శ్రీ-కాళ-హస్తి
శ్రీకాళహస్తీశ్వరస్వామి అనే పేరు సార్థక నామధేయంగా ఉంది. స్థల పురాణాన్ని బట్టి సాలిపురుగు, ఏనుగు, పాము పరమశివుడ్ని పూజించి ముక్తి పొందడం వలన ఈ క్షేత్రానికి శ్రీ కాళహస్తి అనే పేరువచ్చింది. శ్రీ అంటే సాలిపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. సాలిపురుగు పూర్వజన్మలో విశ్వకర్మ కుమారుడైన ఊర్ణనాభుడు బ్రహ్మచేసే సృష్టికి ప్రతిసృష్టి చేస్తుండేవాడు. దీనివలన అనేక ఇబ్బందులు తలెత్తుతుండటంతో బ్రహ్మకోరిక మేరకు భూలోకంలో సాలిపురుగుగా జన్మించాలని శివుడు శాపమిచ్చాడు. ఆ శాప ప్రభావం వలన ఊర్ణనాభుడు సాలిపురుగు అవతారంలో దక్షిణ కైలాసానికి వచ్చి శివలింగానికి పూజలుచేసేది. సాలిపురుగు భక్తిని పరీక్షించడానికి శివుడు అగ్నిని పుట్టించగా దానిని మింగడానికి వెళ్లి సాలిపురుగు శివసాయుజ్యం పొందింది. పరమశివుడిని బ్రహ్మ మూహూర్తంలో ప్రతిరోజూ దేవతులు, ఋషులు, రాజులు దర్శించుకొని తమ విధులకు వెళ్లేవారు. కాళంబ అనే రాజు శివదర్శనానికి వెళ్లేవాడు కాదు. శివదర్శనానికి వెళ్లేవారిని దూషించేవాడు. దీంతో ఆగ్రహించిన పరమేశ్వరుడు అతడ్ని పాముగా భూలోకంలో అవతరించాలని శపించాడు. శాపప్రభావంతో కాళంబ పాముగా భూలోకంలో జన్మించి దక్షిణ కైలాసంలోని శివలింగాన్ని విలువైన వజ్రాలతో, రాళ్లతో పూజించేది. ఈక్రమంలోనే కైలాసంలో ప్రమదగణాల్లో ఒకడైన హస్తి అనే సేవకుడు శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో దర్శించడానికి వెళ్లాడు. అయితే ప్రమదగణాలు అడ్డుచెప్పాయి. వారిని అడ్డుతొలగించుకొని హస్తి శివపార్వతుల ఏకాంత మందిరానికి వెళ్లాడు. దీంతో పార్వతీ కోపించి భూలోకంలో ఏనుగుగా జన్మించాలని శపించింది. ఆ శాప ప్రభావంతో హస్తి అనే సేవకుడు ఏనుగుగా అవతరించి శివలింగాన్ని స్వర్ణముఖి నది నీళ్లతో, తామరపూలతో అలంకరించేది. పాము, ఏనుగు పోటీపడి శివలింగానికి పూజలు చేస్తుండేవి. పాము చేసిన అలంకారాన్ని ఏనుగు తొలగిస్తుండగా ఏనుగు పెట్టిన పూలను పాము తొలగించి వజ్రాభరణాలు అలంకరించేది. దీంతో ఒకదానిపై ఒకదానికి విరోధం పెరిగింది. ఏనుగు పెట్టిన తామరపూలలో పాము దాక్కుంది. ఏనుగు శివలింగానికి పూలను అలంకరిస్తుండగా పాము ఏనుగును కాటువేసింది. బాధాకు తాళలేక ఏనుగు తొండాన్ని కొండకు ఢీకొంది. దీంతో అటు ఏనుగు, ఇటు పాము రెండూ మృతిచెందాయి. సాలిపురుగుతో పాటు పాము, ఏనుగులకు కూడా పార్వతీపరమేశ్వరులు ముక్తిని ప్రసాదించారు. వాటిపేరుతోనే ప్రసిద్ధి అవుతాయని వరమిచ్చారు. అప్పటినుంచి వాయులింగాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామిగా పిలుస్తున్నారు

కన్నప్పగా మారిన తిన్నడు
శ్రీ కాళహస్తి స్థల పురాణంలో సాలిపురుగు, ఏనుగు, పాములకు ఎంత ప్రాధాన్యత ఉందో కన్నప్పకు కూడా అంతకుమించిన ప్రాముఖ్యత ఉంది. కన్నప్ప మూడభక్తికి మెచ్చిన శివుడు ఆయనకు మొదటి పూజను వరంగా ప్రసాదించాడు. కన్నప్పను తమిళులు నయనార్‌గా కొలుస్తారు. కురుక్షేత్రంలో కౌరవులతో యుద్ధం చేయడానికి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని శివుడి నుంచి వరంగా పొందడానికి తపస్సు చేశాడు. అర్జునుడు తపస్సు చేస్తుండగా శివుడు ఆయనను పరీక్షించడానికి బోయవాడి వేషంలో వరాహాన్ని (పంది) వేటాడుతూ వచ్చారు. తపస్సు చేసుకుంటున్న అర్జునుడు, శివుడు కూడా అదే వరాహాన్ని వేటాడారు. ఇద్దరూ వేసిన బాణాలకు వరాహం మరణించింది. తాను వేసిన బాణానికి వరాహం చనిపోయిందని, అందువలన అది తనదేనని ఇద్దరూ వారించుకున్నారు. అర్జునుడు బాణాలను వేశాడు. బాణాలన్నీ గురి తప్పుతుండటంతో అర్జునుడికి ఆశ్చర్యం, భయం వేసింది. అయినా యుద్ధం ఆపలేదు. చివరకు ముష్టి యుద్ధం దిగిన బోయవాడ్ని అర్జునుడు ఓడించలేకపోయాడు. చివరకు శివుడు నిజరూపం ధరించగా అర్జునుడు క్షమాపణలు కోరుకున్నాడు. కురుక్షేత్రం తరువాత బోయవాడిగా జన్మించి తనను సేవిస్తావని వరమిచ్చాడు. దీని ప్రభావంతో అర్జునుడు బోయవాడిగా జన్మించాడు. శ్రీకాళహస్తి సమీపంలోని ఉడుమూరు అనే బోయగూడెంలో నాదనాథుడు, తందె అనే దంపతులకు జన్మించిన తిన్నడు జంతువులను వేటాడేవాడు. ఈ వేటలో తిన్నడు ఒక రోజు అలిసిపోయి వేటాడటానికి జంతువులు లభించ కపోవడంతో, ఒక పొదలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లగా పూజా పునస్కారాలు లేక ఉండిన శివలింగాన్ని చూశాడు. శివలింగాన్ని చూసిన తరువాత పూర్వజన్మ వాసన వలన ఆయనకు భక్తి కలిగింది. ఇంటికి వెళ్లకుండా రాత్రిపగలు శివలింగం వద్దే ఉండి పూజలు చేస్తూ గడిపేవాడు. తల్లిదండ్రులు ఆయనను వెతుక్కుంటూ వచ్చి ఇంటికి రమ్మని వేడుకున్నా వెళ్లలేదు.
జంతువులను వేటాడి శివలింగానికి నైవేద్యంగా పెట్టేవాడు. ఎక్కువగా అడవి పందులను వేటాడి మాంసాన్ని కాల్చి నైవేద్యం పెట్టేవాడు. ఆ నైవేద్యాన్ని తినాలని శివుడ్ని బలవంతం చేసేవాడు. ఆ విధంగా పెట్టిన నైవేద్యాన్ని శివుడు ఆరగించినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. కన్నప్పను పరీక్షించడానికి పరమేశ్వరుడు కంటి నుంచి నీరు కారేవిధంగా చేశాడు. శివలింగం నుంచి నీరు కారుతుండటంతో ఆందోళన చెందిన తిన్నడు ఆకుపసరలు వేశాడు. నీటిధార తగ్గకపోగా రక్తం కారడంతో మరింత ఆందోళన చెందాడు. ఆకుపసరలను వేసినా ప్రయోజనం లేకపోవడంతో కంటికి కనే్న మందని బాణంతో కంటిని పెకిలించి శివలింగానికి పెట్టాడు. దీంతో కంటి నుంచి రక్తం కారడం ఆగిపోయింది. రెండో కంటి నుంచి కూడా రక్తం వస్తుండటంతో తిన్నడు తట్టుకోలేక రెండో కంటిని కూడా పెకలించడానికి ప్రయత్నిస్తుండగా శివపార్వతులు ప్రత్యక్షమై తిన్నడుకి కన్నప్ప అనే పేరును పెట్టారు. అతడికి కంటిని తిరిగి ప్రసాదించారు. దీనికితోడు మొదటి పూజ కన్నప్పకు జరుగుతుందని వరమిచ్చారు. అప్పటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటగా కన్నప్పకు ధ్వజారోహణం జరుగుతుంది. మరుసటిరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామికి ధ్వజారోహణం జరుగుతుంది. భక్తుడికి అగ్రపూజ ఇచ్చిన క్షేత్రంగా శ్రీ కాళహస్తి ప్రసిద్ధి చెందింది.
శిల్పకళాశోభితం...
శ్రీ కాళహస్తీశ్వరాలయం నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైందన్న విషయమై సరైన వివరాలు లేవు. అయితే 4వ శతాబ్ధంలో ప్రారంభమై 14వ శతాబ్ధం వరకు జరిగినట్లుగా తెలుస్తోంది. చోళులు, పల్లవులు, యాదవరాజులు ఆలయాన్ని దశలవారీగా నిర్వహించారు. 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మించిన రాతికోట లాగా ఆలయం ఉంటుంది. కొండ రాళ్లను మలచి ఆలయాన్ని నిర్మించారు. ఆలయం లోపల వివిధ రకాలైన శిల్పకళా సంపద ఉంది. ఇక్కడ స్వామి, అమ్మవార్లతో పాటు వివిధ రకాల పరివార దేవతలు కొలువై ఉన్నారు.
మహిమాన్వితుడు...
శివలింగాన్ని భక్తులు తాకడం, అభిషేకించడం చాలా చోట్ల జరుగుతోంది. అయితే శ్రీకాళహస్తిలో స్వామిని ఎవ్వరూ తాకరు. ప్రత్యేక మైన పీఠంపై నుంచి అభిషేకిస్తారు. పచ్చకర్పూరం తీర్థాన్ని మాత్రమే అభిషేకిస్తారు. శివలింగంపైన పాము ఆకారంలో, మధ్యన ఏనుగుదంతాలు, కింద సాలిపురుగు ఆకారంలో ఉంటుంది. ఈ విధమైన ఆకారంలో శివలింగం మరెక్కడాలేదు. నవగ్రహాలు, 27 నక్షత్రాలతో కూడిన బంగారు కవచాన్ని స్వామికి అలంకరిస్తారు. దీనినే నవగ్రహ కవచం అంటారు. అందువలన సూర్య,చంద్ర గ్రహణాల సమయాల్లో ఈ ఆలయాన్ని మూసివేయరు. ఇన్ని విధాలైన ప్రత్యేకతలుండటంతో స్వామిని మహిమాన్వితుడిగా ఇప్పటికే కొలుస్తారు.

-ముత్యాల వెంకటరమణ