Others

ఆ లోటు భర్తీ చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపం జనార్దన్‌రావు, ఉద్యోగంలో చేరినప్పటినుంచీ ఆ వూరు నుంచి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్లలేదు. ఉన్నది చిన్న ఊరు, చేసేది ప్రైవేటు కంపెనీలో స్టెనో ఉద్యోగం. ట్రాన్స్‌ఫర్లూ గట్రా వుండవు. ఉన్న ఒక్క తమ్ముడు, చెల్లీ, అమ్మా, తనలాగే ఆ వూళ్లోనే చదువుకుని అక్కడే పెళ్లిళ్లయి అక్కడే వుంటున్నారు. తండ్రి కూడా బడి పంతులుగా అక్కడే పదవీ విరమణ చేసి అక్కడే కాలం చేశాడు.
అందుకు జనార్దన్‌రావుకి ఆ ఊరు తప్ప మరో ఊళ్ళో ఎక్కడా ఉండవలసిన అవసరం రాలేదు. కానీ ఈమధ్యే తను ఉద్యోగం చేస్తున్న ఆ కంపెనీ ఏదో నష్టాల్లో కూరుకుపోయి, మూత పడింది.
దాంతో రోజూ ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో తెలుసుకోవడం ప్రతిచోటా నో వేకెన్సీ సమాధానం వినడం, పరిపాటైపోయి విసిగిపోయాడు జనార్దన్‌రావు. దానికితోడు ముగ్గురు పిల్లలు. గత్యంతరం లేక పొరుగూరిలో ఒక పేపరు సంచీలు తయారుచేసే కంపెనీలో స్టెనోగ్రాఫర్ కావాలన్న ప్రకటన చూసి అప్లై చేశాడు.
ఇంటర్వ్యూలో మొదటి రౌండ్‌లోనే సెలెక్ట్ అయ్యాడు. నాలుగు రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు. జనార్దన్‌రావు ముందుగా కొన్నాళ్లు ఒంటరిగానే ఒక గది తీసుకుని, స్వయంపాకం చేసుకుని, కొన్నాళ్లయ్యాక కుటుంబాన్ని తెచ్చుకోవచ్చు అనుకుని ఇళ్ల వేటకి బయలుదేరాడు.
ఒక్కడే వున్నా, ఎప్పుడైనా పొరుగూరే కదా అని భార్యాబిడ్డలు, ఏ సెలవు దినాల్లోనో మూడు నాలుగు రోజులు సెలవులు కలిసొస్తే, ఒక్క గది అద్దెకు తీసుకుంటే ఇబ్బందవుతుందని కనీసం, రెండు గదులూ, వంట యిల్లూ వుండే ఇంటికోసం తిరగడం మొదలెట్టాడు. అతనికక్కడ ఎవ్వరూ స్నేహితులు లేరు. రోడ్లు కూడా సరిగా తెలీదు.
అయినా ఏం వుందిలే.. అనుకుంటూ వెళుతూ వెళుతూ, తనకి ఎదురుపడ్డ ఒకాయనని ఆపాడు. ‘‘ఏమయ్యా... ఇక్కడ మంచి ఉద్యోగులు ఉండే చోటు ఎక్కడుంది? నాకు ఇల్లు కావాలి’ అన్నాడు. అతడు ఏదో వస్తువు కోసం ఆదరాబాదరాగా జేబులో చెయ్యి పెట్టుకుని, వెతుక్కుంటున్నాడు.
షర్టు జేబులో చెయ్యి పెట్టి కనబడలేదేమో, ఫాంటు జేబుల్లో చెయ్యి పెట్టి వెతుక్కుంటున్నాడు. మన జనార్దనారవు మాటలు అతడు సరిగ్గా వినలేదు. ‘‘ఏమన్నారూ’’ అని అడిగేలోపలే.. నీకూ చెవుడా? లేక సమాధానం చెప్పడం ఇష్టం లేదా? అంత నిర్లక్ష్యమేమిటి?’’ గట్టిగా దబాయించాడు. అతడు జనార్దన్‌రావుకేసి కోపంగా చూసి, మళ్లీ తను వెతుకులాటలో పడిపోయాడు.
జనార్దన్‌రావుకి కోపం ముంచుకొస్తోంది. ఇక్కడి మనుషులకి బుద్ధి లేదా? అనుకుంటూ నడక స్పీడ్ పెంచాడు. ఆ స్పీడ్‌లో ఎదురుగ్గా వస్తున్న పూలమ్ముకునే ఒక ముసలమ్మని ఢీకొట్టాడు. ఆమె చేతిలో వున్న పూలతట్టలోంచి కొన్ని పూలు కిందపడిపోయాయి.
ఆమె వంగి పూలేరుకుంటూ ఏదో అనబోయే లోపలే ‘‘నీకు కళ్లు లేవా? ఎదురుగ్గా వచ్చేవాళ్లు కనపడరా?’’ అంటూ పాట అందుకున్నాడు. ఆ ముసలమ్మ క్షణం నివ్వెరపోయి వెంటనే తేరుకుని,
‘‘ఆ మాట అనవలసింది నేను. చూస్తే ఏదో చదువుకున్నోడిలా వున్నావు. ఎదురుగ్గా వస్తున్న పెద్దమనిషిని తోసుకుంటూ ఎల్లిపోవడమే. నీవల్ల కింద పడ్డ పూలని నేనే ఏరుకున్నాను. కనీసం ఏరిపెట్టాలన్న బుద్ధి కూడా లేదా నీకు’’ పాఠం చెప్పింది పూలవ్వ! జనార్దన్‌రావుకి కోపం, విసుగూ కలిసి ఒళ్లు మండిపోతూ వుంది. అంతలో వేపచెట్టు నీడన బండరాయిమీద కూర్చుని చుట్ట కాల్చుకుంటూన్న పోచయ్య చటుక్కున లేచొచ్చి, జనార్దన్‌రావు కేసి ఎగాదిగా చూశాడు. తిక్క తిక్కగా వున్న జనార్దన్‌రావు, ‘‘ఏమయ్యా ఈ ఊరు మంచిదేనా?’’ అడిగాడు ఉరుముతూన్నట్టు. పోచయ్య నవ్వుతూ ‘‘బాబూ! నేనొక్క మాటడుగుతా చెప్తావా?’’ తిరుగుప్రశ్న వేశాడు.
‘ఏంటది? అడుగు.. బ్లడీ హెల్’ అని ఇంగ్లీషులో తిట్టుకుంటూ. వెంటనే పోచయ్య, ‘‘బాబూ, ముందిది చెప్పు, నీ నోరు మంచిదేనా?’’ అడిగాడు. ‘ఏమిటా పిచ్చి ప్రశ్న?’ మరింత చిరాగ్గా అన్నాడు సదరు జనార్దన్‌రావు. పోచయ్య నవ్వుతూ.. అర్థం కాలేదా బాబూ? నీ నోరు మంచిదయితే ఈ ఊరూ మంచిదే... అంటూ ముందుకు నడిచాడు చకచకా.
తెల్లబోయి చూస్తూ, నోట మాట రాక అలాగే వుండిపోయాడు జనార్దన్‌రావు, కాళ్లు పీక్కుపోతూ వుంటే.
‘కాలం మారింది’ అంటారు అన్నింటికీ అందరూ.. కాలం కాదు మారింది మనుషులు. అందరిలో ఏదో గర్వం, తెలియని అహంకారం, మంచిగా మాట్లాడడం, నీతిగా ప్రవర్తించడం, పెద్దమనుషులను గౌరవించడం మర్చిపోతున్నారు నేటి జనం. ఈ రోజున ఎవ్వరికీ డబ్బుకి లోటు లేదు.. ఎటొచ్చీ మంచి మాటకీ, మానవత్వానికే లోటు. ఆ లోటుని మనం తీర్చలేమా? కాస్త నిదానంగా ఆలోచిస్తే మనకే దొరుకుతుంది సమాధానం.

-శారదా అశోక్‌వర్థన్