AADIVAVRAM - Others

అతనో సేంద్రియ సైనికుడు (వ్యవసాయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యక్తులు రెండు రకాలు. చెప్పింది చేసేవారు మొదటి కోవకు చెందుతారు. తాము ఆచరించకుండా ఇతరులకు చెప్పి చేతులు దులుపుకునేవారు రెండో రకం. ఈయన మాత్రం మొదటి కోవకు చెందుతారు. హైదరాబాద్ మహానగరంలో ఆయనను దగ్గరగా గమనించిన వారు ఆయనలోని రెండో పార్శ్వాన్ని చూసి ఆశ్చర్యపోక తప్పదు. కారణం స్వతహాగా ఆయన రైతుబిడ్డ అయినా ప్రధాన వ్యాపకం ముద్రణ రంగంలో తలమునకలై ఉండటమే. దానికి తోడు తాను పుట్టి పెరిగిన పల్లె నేపథ్యం. ముద్రణ రంగంలో క్షణం తీరిక లేకపోయినా ఉన్న సమయాన్ని దానికే వెచ్చిస్తే మరిన్ని లాభాలు గడించే అవకాశం ఉంది. అయితే మట్టివాసన, రైతు కుటుంబ నేపథ్యాన్ని మరవకుండా సవాలక్ష సమస్యలతో సాగును భారంగా భావించి దాని నుంచి దూరమవుతున్న అన్నదాతలను మళ్లీ ఆ వైపు మళ్లించాలన్నది ఆయన లక్ష్యం. రైతుల సంక్షేమంతోపాటు తక్కువ పెట్టుబడితో సేంద్రియ, సంప్రదాయ వ్యవసాయాల్ని ఒక ఉద్యమంలా ప్రచారం కల్పిస్తూ సఫలీకృతమవుతున్నారు. ఆయనే యడ్లపల్లి వేంకటేశ్వరరావు.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు గ్రామానికి చెందిన వేంకటేశ్వరరావుది రైతు కుటుంబం. సారవంతమైన భూములు పచ్చటి పొలాలతో కళకళలాడే వాతావరణం మధ్య పెరిగిన ఆయనకు సాగులో రైతులు ఎదుర్కొనే సాధక బాధకాలు, కష్టనష్టాలు కరతలామలకం. వ్యవసాయంలోని ఒడిదుడుకులతో పాటు వాటికి పరిష్కార మార్గాలూ తెలిసిన వేంకటేశ్వరరావు తన ‘రైతు నేస్తం’ పత్రిక ద్వారా రైతులను చైతన్యవంతులను చేస్తూ వారు మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. దానికి ముందు తాను గుంటూరు సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా సేంద్రియ పద్ధతులు అమలు చేసి సాధించిన విజయాలతో ఇతర రైతన్నలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఔత్సాహిక రైతులకు మార్గదర్శిగా మారారు.
అయితే మూస పద్ధతులతో వ్యవసాయంలో పెట్టుబడులు పెరగడంతోపాటు చీడపీడల బెడదతో రైతులు చితికిపోవడాన్ని గుర్తించిన ఆయన దాని నుంచి బయటకు వచ్చి కొత్త మార్గంలో సాగును లాభసాటిగా మార్చుకునేలా కంకణం కట్టుకున్నారు. ఇందుకు సేంద్రియ సాగే పరిష్కారమని నమ్మి ఆచరిస్తున్నారు. దశాబ్దాలుగా అనుసరిస్తున్న పద్ధతుల నుంచి రైతులను సేంద్రియ సాగువైపు మళ్లించడం రాత్రికి రాత్రి సాధ్యమయ్యే పని కాదని ఆయనకు తెలుసు. ఇందుకు ముందు తాను నమ్మిన దాన్ని ఆచరించి ఫలితాలు సాధించడం ద్వారా నిరూపిస్తున్నారు. పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు సేంద్రియ పద్ధతులలో సాగు చేస్తూ ఎలాంటి ఎరువులు, పురుగు మందులూ వాడకుండా మంచి ఫలితాలు సాధించి సఫలమయ్యారు.
సకాలంలో రైతులకు సాగులో సూచనలు, సలహాలు అందిస్తూ పంట ఉత్పాదకతలు పెరిగేలా కృషి చేస్తున్నారు.
‘రైతు నేస్తం’ ‘పశు నేస్తం’ ‘ప్రకృతి నేస్తం’ పత్రికల సంపాదకుడిగా తాను నమ్మిన సిద్ధాంతం ఆచరణ సాధ్యమేనని నిరూపిస్తున్నారు. తన పత్రికల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది రైతులు తమ సాగులో కొత్త పద్ధతులు ఆచరణలో పెట్టేలా మార్పునకు వేదికగా మారారు.
దశాబ్దాల క్రితం పేరు పొందిన ఎరువులు, పురుగు మందుల కంపెనీలు సంచార వాహనాల ద్వారా తమ ఉత్పత్తులకు విస్తృత ప్రచారం కల్పించి రైతులను ఆకట్టుకునేవి. తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకొనేవి. మితిమీరిన ఎరువులు పురుగు మందుల వినియోగమే ప్రస్తుత వ్యవసాయ సంక్షోభానికి కొంతవరకు కారణమని గుర్తించిన వేంకటేశ్వరరావు పరిష్కార మార్గం ఆలోచించారు. విచక్షణా రహితంగా రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగంతో భూములు సారాన్ని కోల్పోవడంతోపాటు పెట్టుబడులు పెరిగి రైతులు నష్టపోతున్న తీరుపై ప్రతి ఒక్కరు ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సమస్యల పరిష్కారంలో మాత్రం ఎవరికి వారు వెనకడుగు వేస్తున్న సమయంలో వేంకటేశ్వరరావు ఏక వ్యక్తి సైన్యంగా మారి సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు నిధులతోపాటు మానవ వనరులూ ఎంతో అవసరం. ప్రభుత్వాలు తమ బాధ్యతగా గుర్తించి తలకు ఎత్తుకోవాల్సిన ఇలాంటి బృహత్కార్యాన్ని వ్యక్తిగా వేంకటేశ్వరరావు నిధులు అశమదమాదులకు వెరవక ఒంటిచేత్తో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సంకల్ప బలం ఉంటే అడ్డంకులు, కష్టనష్టాలు పెద్ద సమస్య కాదని నిరూపిస్తున్నారు.
ఇందులో భాగంగా సంచార వాహనం ద్వారా గుంటూరు జిల్లాలోని గ్రామాలలో ఆడియో, వీడియో ద్వారా సేంద్రియ వ్యవసాయంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. పల్లెసుద్దులు, పలు జానపద కళారూపాలతోపాటు నాటికల ద్వారా సేంద్రియ సాగుపై మెలకువలు, సూచనలు, సలహాలు సుమారు 60 వేల మంది రైతులకు చేర్చాయంటే అతిశయోక్తి కాదు.
రైతులు కూడా ‘రైతు నేస్తం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకుని సత్ఫలితాలు సాధిస్తుండటం గమనార్హం. సేంద్రియ సాగుపై ప్రత్యక్షంగా క్షేత్ర పర్యటనలు ఎంతో ప్రయోజనకారిగా మారాయని పెట్టుబడులు తగ్గి ఉత్పాదకత పెరిగి తాము లాభాలు గడిస్తున్నామని రైతులు పేర్కొంటుండటం ప్రస్తావనార్హం. ప్రధానంగా మార్చి 4 ఆదివారానికి 100 వారాలు పూర్తవుతుండటం విశేషం.
వ్యవసాయానికి సంబంధించి అందుబాటులోకి వచ్చిన 25 పుస్తకాలతోపాటు వ్యవసాయ, అనుబంధ రంగాలైన పాడి, కోళ్ల పరిశ్రమ, పశుపోషణ, చేపల పెంపకం తదితర ఏడు అంశాలపై ‘రైతు నేస్తం’ పబ్లికేషన్స్ పేరిట వేంకటేశ్వరరావు రైతుల ముంగిటకు తెచ్చిన సమాచారం వారికి ఎంతో ప్రయోజనకారిగా మారింది.
* * *
రైతు నేస్తం యాప్, వెబ్‌సైబ్, యూట్యూబ్ కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. పది లక్షల మంది ఔత్సాహికులకు ఈ సమాచారం చేరిందంటే ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందో ఊహించవచ్చు. విజయగాథలు, చర్చావేదికలు, సందేహాలు - సమాధానాలు ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రైతు నేస్తం యాప్ 10 వేలకు పైగా రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయ సమాచారాన్ని తెలుసుకుని అమలు చేసుకుని విజయాలు సాధించేందుకు ఉపయోగపడుతోంది. శాస్తవ్రేత్తలు, విషయ నిపుణులతో సందేహాల నివృత్తి ద్వారా ఔత్సాహిక రైతులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. దేశంలోనే సేంద్రియ సాగుకు సంబంధించి మొట్టమొదటి యాప్ ఇదే కావటం విశేషం.
అంతేకాక దళారులకు చోటు లేకుండా సేంద్రియ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశాన్ని రైతులకు ఈ యాప్ కల్పిస్తోంది. మూడు ‘వాట్సాప్’ గ్రూపులను విజయవంతంగా నిర్వహించడం ద్వారా వేంకటేశ్వరరావు రైతులు తమ సమస్యలు సత్వరం పరిష్కరించుకునేలా దోహదపడుతున్నారు.
‘రైతు నేస్తం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్‌ను 11 లక్షల మంది వీక్షించడం ద్వారా వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాలపై అవగాహన పెంచుకుంటున్నారు. ఔత్సాహిక రైతులకు పంటల సాగుకు సంబంధించిన సూచనలు, సలహాలు, మెళకువలను తమ దగ్గరున్న డేటాబేస్ ద్వారా సంక్షిప్త సందేశాలు పంపిస్తూంటారు. అంతేకాక ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందిస్తున్నారు.
వేంకటేశ్వరరావు రైతు నేస్తం పత్రిక ఆధ్వర్యంలో అన్నదాతల అభ్యున్నతికి కృషి చేస్తున్నందుకు గుర్తింపుగా దశాబ్దం క్రితం ప్రముఖ వ్యవసాయ శాస్తవ్రేత్త పద్మశ్రీ డా.ఐ.వి.సుబ్బారావు అవార్డును అందుకున్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఆయన గత ఏడేళ్లుగా డా.ఐవి.సుబ్బారావు పేరిట సాగులో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్న అభ్యుదయ రైతులు, శాస్తవ్రేత్తలు, వ్యవసాయ విలేకరులను గుర్తించి అవార్డులిచ్చి సత్కరిస్తూ వ్యవసాయ రంగానికి తన వంతు తోడ్పాటు నందిస్తున్నారు. గత ఏడేళ్లుగా వివిధ విభాగాల్లో 225 మంది వ్యవసాయ, ఉద్యాన శాస్తవ్రేత్తలు, విస్తరణ అధికారులు, విలేకరులతోపాటు అభ్యుదయ రైతులను గుర్తించి సత్కరించారు.
అలాగే పశు సంవర్థక రంగంలో పితామహుడుగా పేరుగాంచిన డా.సి.కె.రావు ఎండోమెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పశుపోషణలో అభ్యుదయ మహిళా రైతులను గుర్తించి వారికి నగదు పురస్కారాన్ని అందజేయడం విశేషం.
వ్యవసాయ రంగానికి వేంకటేశ్వరరావు సేవలకు గుర్తింపుగా ఆయా ప్రభుత్వ, ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థల నుంచి పలు పురస్కారాలు అందుకున్నారు. డా.పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు అగ్రి జర్నలిజం పురస్కారంతో ప్రారంభించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉగాది పురస్కారం, ఇందిరాగాంధీ శతజయంతి సేవా పురస్కారం, బాలగంగాధర్ తిలక్ అవార్డు తదితరులు ఆయన అందుకున్న పురస్కారాలలో మచ్చుకు కొన్ని.
అమెరికాలో ‘తానా’ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఫోరం, ‘నాటా’ల నుంచి ఆహ్వానాలు అందుకుని సేంద్రియ సాగుపై అతిథి ఉపన్యాసాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌లో వ్యవసాయ రంగం నుండి సలహా సంఘ సభ్యుడిగా నియమితులయ్యారు.
వ్యవసాయంపై ఉన్న మక్కువను అవిశ్రాంత శ్రామికుడిగా చాటుకుంటూ ఆ రంగం అభివృద్ధికి మరింత కృషి చేయాలన్నది వేంకటేశ్వరరావు అభిలాష. అందులో భాగంగా తాజాగా ఆయన ‘మిద్దెతోట’పై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. గత మూడు మాసాల్లోనే హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో పది సదస్సుల ద్వారా 5 వేల మందికి అవగాహన కల్పించడం గమనార్హం.

చిత్రాలు. రైతు నేస్తం పురస్కారం అందుకుంటూ.. *.పంట సంరక్షణే ప్రాణం..
*రైతులతో ముఖాముఖి *కొర్నెపాడులోని రైతు శిక్షణ కేంద్రం

-ఎన్. కొండయ్య సెల్: 98490 63206