Others

సంతోషాలకు మేలైన బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్తి చారెడు వున్నవారు శ్రమించి బారెడు వీలైతే అంతకుమించి ఎదగాలని ఆశించే తీరుని అందుకు అనుసరించే సరైన విధానాలను సహృదయులు అభినందించడమే కాదు మరెందరికో అనుసరణీయమని సగర్వంగా చెబుతుంటారు. చారెడైనా లేని ఆస్తితో స్వర్గానికి నిచ్చెనలు వేయజూసే తీరు పలు అనర్థాలకే దారితీస్తుంది. బంధు మిత్రులతో, కనీస పరిచయం లేనివారిని సైతం పరిచయం చేసుకొని ఏదో ఒక అవసరం పేర అప్పులు చేస్తూ ఒకటి తీర్చకముందే అధిక వడ్డీ ఆశ చూపి స్థాయిని మించిన అప్పులు చేస్తూ తీరా ఇచ్చినవారు అడిగినపుడు తీర్చకపోగా తగవులకు తన్నులాటలకు సైతం సిద్ధమవుతుంటారు. అప్పు చేసినపుడు చూపిన అణుకువ కాని నటించిన మర్యాద గాని అదే అప్పుని సకాలంలో తీర్చమని అడిగినపుడు అణుకువ స్థానంలో ఆగ్రహం, మర్యాద స్థానంలో పరాభవించే ధోరణి దర్శనమిస్తుంటాయి.
అవసరానికి సహయపడినవారే దైవ సమానులని, ఆపదను గట్టెక్కించిన వారే ప్రత్యక్ష దైవాలన్న విషయాన్ని విస్మరించడమేగాకుండా చేసిన సాయాన్ని ఆదుకున్న తీరుని ద్వేషించే తీరు పెచ్చరిల్లుతున్న కాలికాలం! కృతజ్ఞత లేకపోయినా విశ్వాసఘాతుకం వుండరాదని, ప్రతిఫలం అందించకపోయినా అకారణంగా ప్రతీకార ధోరణులు అవాంఛనీయమని, పొందిన సాయాన్ని పదిమందికి చెప్పుకునే బదులు వున్నవి లేనివి కల్పించి దుష్ప్రచారానికి పూనుకోవటం అనాగరికమని, అనైతికమని ఆలోంచలేని వారు దైవభక్తిని గురించి మాట్లాడినా, దైవమహిమల గురించి వుటంకించినా, భక్తికి పర్యాయపదంగా చలమాణి కావాలనుకున్నా దయ్యాలు వేదాలు వల్లించే చందంగానే వుంటుంది.
మంచీ చెడులమధ్య ఘర్షణ అనివార్యం! ఒక వ్యక్తిని పూర్తి మంచివాడని చెప్పడమెంత కష్టమో చెడ్డవాడని చెప్పడం అంతే కష్టం. ఏ మంచి తనకూ తన కుటుంబానికి, తానున్న సమాజానికి మేలు చేసేదిగా వుంటుందో ఆ మంచిని ప్రతి ఒక్కరూ మనసులో, మాటలోనూ ప్రతిబింబించగలగాలి. ఏ చెడు తన మూలంగా కుటుంబానికి, సమాజానికి కీడు చేసే విధంగా వుంటుందో ప్రతి ఒక్కరూ ఆ చెడుని వీడగలగాలి. కళ్ళు మూసి తెరిచేలోపు అద్భుతాలు జరగవని శ్రమించకనే ఏ ఫలం తనకు తానుగా తన దరి చేరదని, ఏ దైవమలా చేర్చదని గుర్తించగలగాలి. జుట్టులేని కొప్పు పిండి లేని రొట్టె అసాధ్యమని అర్థం చేసుకోలేకపోవడమెంత అజ్ఞానం!
అజ్ఞానాన్ని జ్ఞానంగా, అవివేకాన్ని వివేకంగా, అధర్మాన్ని ధర్మంగా చెలామణి చేయజూసేవారు ఎవరికో గోతులు తీస్తున్నామని మురిసిపోయినా తాము తీసుకున్న గోతుల్లో తామే పడిపోక తప్పదు. తినే ముద్ద సాక్షిగా తెలియక చేసే చెడు సంగతెలా వున్నా తెలిసి చెడు చేయరాదన్న స్పృహ కరవైతే మనిషికీ మృగానికీ తేడా ఏముంటుంది? విచక్షణ కలిగినవారెవరైనా మంచిని ముసుగుగా కాక జీవన విధానంగా అనుసరిస్తుంటారు. ఎటువంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా నమ్మినవారే నట్టేట ముంచాలని చూసినా సహనాన్ని వీడరు. నిజాన్ని కాదని మరొకటి మాట్లాడరు. మాటలతో మభ్యపెట్టాలని ఎవరు ప్రయత్నిచినా అసత్యాన్ని ఆశ్రయించడమే కదా!
క్రమశిక్షణకు మారుపేరుగా, దైవచింతనకు మరోపేరుగా వుండేవారు నలుగురిలో మెచ్చుకోబడినా తెలియక తమవల్ల ఎన్ని పొరపాట్లు జరుగుతున్నాయేమోనని ఒకటి పదిమార్లు ఆత్మవిమర్శ చేసుకుంటారు. ఏ పొరపాటుకి ఆస్కారం లేనపుడు మరిన్ని మంచి పనులకు శ్రీకారం చుడుతుంటారు. లెక్కలేనితనంతో తాము చేసేదంతా బ్రహ్మాండమని భ్రమించేవారు ఆత్మవివర్శకు ఆమడ దూరంలోనే వుంటూ ఎవరెన్ని విధాలుగా ఎత్తిచూపినా చేసిన తప్పుల్నిగాని, తమవల్ల జరిగిన నేరాలనుగాని అంగీకరించరు.
ఏదో ఒక విధంగా వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం పరనిందకు పూనుకుంటారు. తమ లోపాలను దోషాలను ఎదుటివారిపై బలవంతంగా రుద్దేందుకుగాని, వారికి నష్టం తలపెట్టేందుకైనా సంసిద్ధులవుతారు. తప్పుకి ఒప్పుకి మధ్య తేడా గుర్తించక పాపపుణ్యాలను పట్టించుకోక తులసి వనంలో గంజాయి మొక్క వుండటమెంత నేరమో, గంజాయి వనంలో తులసి మొక్క వుండడం అంతకన్నా ఎక్కువ నేరమన్నట్లు చేస్తారే తప్ప మేలైన ఆచలోనలను కాని, దైవత్వానికి ప్రతీకగా కనిపించే ధర్మమార్గాన్ని పట్టించుకోరు. ఎవరైనా తమ శ్రేయస్సు కోరి హితబోధ చెయ్యబోయినా ఎంత మాత్రం వినిపించుకోక తాము మాట్లాడేవే నిజాలని, తాము చేస్తుందే మంచి అన్నట్లు విర్రవీగుతుంటారు. నిజమేమిటో ఎదుటివారు వినిపించే ప్రయత్నం చేసినా తమ వికారపు చూపులతో వికృత చేష్టలతో దుర్మార్గపు ఆలోచనలతో నిజాన్ని నిర్దాక్షిణ్యంగా కనుమరుగు చేసేందుకు కంకణబద్ధులవుతుంటారు. అంతమాత్రాన నిజానికి నిజం కనుమరుగయ్యేదైతే అసలది నిజమెలా అవుతుంది? రామనామంలా, పంచాక్షరిలా మహనీయుల మనసుల్లో చెరగని ముద్రై ఎందుకు నిలుస్తుంది?
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. జీవితంలో అది పెను ముప్పుకి కారణమయ్యేదే! చేసిన తప్పులకు సిగ్గుపడి మరోసారి వాటి జోలికి పోకుండా దిద్దుబాటు చర్యలుకు శ్రీకారం చుట్టనంతకాలం ఎవరి ప్రయాణంలో ఏ మెరుపులకోసం భ్రమించినా పాతాళానికి దిగజారడమే! గతంకన్నా వర్తమానం, వర్తమానం కన్నా భవిత మెరుగ్గా ఉండాలని ఆశించేవారికి జీవితంలో దిద్దుబాటు పెద్ద దిక్కుగా నిలుస్తుంది. ఎంతైనా కలియుగంలో వున్నాం కాబట్టి నలుగురు వెళ్ళేదే దారనుకోక ఆత్మవిమర్శ చేసుకోగలిగితే వేసే ప్రతి అడుగు సుఖ సంతోషాలకు మేలైన బాటను నిర్మిస్తుంది.

-డా. కొల్లు రంగారావు