Others

ఏదీ విలువల సౌశీల్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్ర రంగంలో తరచూ వినిపించే ప్రశ్న ఇది. మరీ ముఖ్యంగా -తెలుగు పరిశ్రమలో వినిపించి తీరాల్సిన ప్రశ్న కూడా. ఈమధ్య మధురగీతాల మహాసామ్రాజ్ఞి తెలుగు పాటల ఎలమావి పి సుశీల గిన్నిస్ రికార్డు అందుకున్నారు. అందరూ సంతోషించేదే. అలాంటి గొప్ప గాయనితో సంగీత దర్శకుడు కీరవాణి ఒక్క పాట కూడా పాడించలేదు. ఎందుకు? అన్నది వేయి వరహాల ప్రశ్న. స్వర మాంత్రికురాలు ఎస్ జానకితోనూ కీరవాణి ఒక్కపాటా పాడించలేదెందుకని?. పాడక పోవడానికి వారివైపు కారణాలుండొచ్చు. సమయం, ఆరోగ్యం, ఓపిక, పారితోషికంలాంటి సమస్యలూ ఉండొచ్చు. కానీ అడిగిన దాఖలా లేదు కనుక -‘ఆ తరాన్ని మనం గౌరవించే దాఖలాలు’ లేనట్టే కదా! ‘వివాహ భోజనంబు’ పాట వినగానే గుర్తుకొచ్చేది మాధవపెద్ది సత్యమే కదా. మైడియర్ మీనా అన్నా, కానరారా.. దేవా కావరారా అన్నా, భళాభళీ నాబండీ- పరుగులు తీసేనండీ అన్నా- ఇలా ఎన్నివేల హాస్య, భక్తి గీతాల్లోనో మాధవపెద్ది విలక్షణ స్వర విన్యాసమే వినిపిస్తుంది. అలాగే- ‘ఓహోహో పెళ్లీ, అహహా పెళ్లీ’ అన్నా, ‘నమ్మకురా.. ఇల్లాలు పిల్లలూ బొమ్మలురా జీవా’ అన్నా, ‘సైకిల్‌పై వనె్నలాడీ పోతున్నదీ’ అన్నా, ‘వలపుల గిలకా వైజయంతిమాలా- తలపుల చిలకా చెలి మధుబాలా’ అన్నా ఆంధ్ర రఫీ- పిఠాపురం స్వరమే మార్మోగుతుంది. అయితే జరిగిందేమిటీ? ఆ మహాగాయకులు పాడగలిగిన స్థాయిలో, స్థితిలో ఉండగానే -వూస్ట్ డేట్ ఫ్రం ది ఎరీనా. అనేకానేక కారణాలవల్ల కీర్తిశేషులు అయిపోయారు. కొన్ని దశాబ్దాలు టీ.ఎం.సౌందరరాజన్ గొంతు లేని తమిళ సినిమానే లేకుండేది! అసలా పేరున గాయకుడున్నాడనే సంగతే ‘్ఫల్డు’ మరచిపోయే స్థితికి వచ్చిందంటే.. అంతటి గాయకుడూ ‘ఆత్మహత్యా’ ప్రయత్నం చేసుకొనే స్థితికి వచ్చాడంటే.. కారణాలేమిటీ? మన జి.ఆనంద్ మంచి గాయకుడే కదా! ఎందుకు ఎవరూ అవకాశాలివ్వరు? మాధవపెద్ది రమేష్- జీవితం అర్ధాంతరంగా ఎందుకు ముగిసిందీ? ఇటీవల కీర్తిశేషుడైన రామకృష్ణ ఎందుకు అవకాశాలు లేనివారిగా మిగిలిపోయారు. వీటన్నిటికీ జవాబులు ఉంటాయి, కానీ దొరకవంతే. పాతంతా రోతగా భావించే క్రొత్త నీరు.. ఇప్పుడు విష రసాయనంలా చాపక్రింద నీరులా మెల్లిగా సాగుతోంది చిత్రసీమలో. క్రొత్త తరాల్ని ప్రోత్సహించే బ్రాండ్ రేటింగ్‌లో కొంత గౌరవమూ- సొంత లాభమూ చూసుకుంటున్నారు నేటి మేటి కళారత్నాలు. కాదని ఏవేవో కుంటిసాకులు ఏకరువు పెట్టొచ్చు. కానీ- నిజం మాత్రం అదే. వెనకటి రోజుల్లోనూ క్రొత్తను ప్రోత్సహించే తత్వముండేది. ఉంది కనుకనే.. శాంతకుమారి, ఎస్ వరలక్ష్మి, భానుమతి తమ పాటలు తామే పాడుకునే దినాల్లోనూ బాలసరస్వతీ రాణి, సరోజిని, లీల, జిక్కి, వసంతకుమారి తదితరులు గాయనిలుగా అవతరించారు. పి లీల, బాలసరస్వతి, జిక్కి, వసంతకుమారిల కెరీర్ ఉధృతంగా సాగుతున్న దినాల్లోనే -సుశీల, జానకి, జమునారాణి, కోమల, వైదేహి, స్వర్ణలతలూ వచ్చారు.
నాగయ్య స్వతహాగా పాడుకుంటున్న దినాల్లోనే -సూరిబాబు, రఘురామయ్య ఆ బాటలో క్రొత్తగా చేరారు. వీరంతా గొప్ప స్థితిలో ఉన్న సమయంలోనే ఘంటసాల రంగప్రవేశం చేశారు. ఘంటసాల గాత్రం విశ్వరూపం. చలనచిత్ర విశ్వరంగాన్నంతా ఆక్రమించుకోగలిగేదే. అయినా- ఎఎం రాజా, మాధవపెద్ది, పిఠాపురం, పిబి శ్రీనివాస్ తదితర గాయకుల స్థానాలను తాను ఆక్రమించుకోవాలని అనుకోలేదు. అదీ విలువలను గౌరవించే సౌశీల్యం. కొన్ని చిత్రాల్లో అన్ని గీతాలూ తానే పాడిన సందర్భాలూ లేకపోలేదు. కొన్ని చిత్రాల్లో తాను ఒక్క పాటనీ పాడని చిత్రాలూ లేకపోలేదు. అయినా అవి అప్పటి కొన్ని ప్రత్యేక సంఘటనలు మాత్రమే.
‘శ్రీ వేంకటేశ్వర మహాత్యం’లో నాగయ్యను చెరసాలలో వేసే సన్నివేశం ఒకటుంది. వేగరారా ప్రభూ వేగరారా గీతం ఆయనపై చిత్రీకరించారు. నాగయ్య స్వతహాగా మంచి గాయకుడే. అయినా రికార్డింగుకు తన గాత్రం ఇప్పుడంతగా సహకరించే పరిస్థితి లేనందున ఘంటసాలతో పాడించమన్నారు. ఘంటసాల అందుబాటులో లేకపోవడంతో సంగీత దర్శకుడు పెండ్యాల, మాధవపెద్దికి అవకాశం ఇచ్చారు. మాధవపెద్ది నాగయ్య వద్ద కూర్చొని పెండ్యాల చెప్పిన ‘రాగాన్ని’ నాగయ్య నోట విని ఆ శైలిలో ఆయన పాడే రీతిగా పాడారట. ఇవీ ఆనాటి విలువల విశేషాలు. అటువంటి సంగీత దర్శకులు, గాయకులు ఆనాడు మనకుండేవారు. ప్రతి రంగంలోనూ వెనకతరాన్ని గౌరవించటమనే ‘మంచి ఆచారం’ ఆనాడుండేది. ఘంటసాల, పెండ్యాల, సాలూరు, టివి రాజు, మాష్టర్ వేణు రమేష్‌నాయుడు అవసరమూ, సందర్భాన్ని బట్టి వెనకతరం గాయనులకు ఒక గీతం పాడే అవకాశమైనా ఇచ్చే మంచి సాంప్రదాయాన్ని పాటించేవారు. మరి ఇప్పుడేమైంది ఆ సంప్రదాయం. వయసు మీదపడి రికార్డింగుకి రాలేని అవస్థలో ఉంటే సరే. అయినా ‘్ఫలానా గీతాన్ని సుశీలతో, జానకితో- పాడించాలని అనుకున్నామని, అయితే వారు అందుబాటులో లేనందున, రాలేనందునా మరొకరితో పాడించామని చెప్పే దర్శకుడు ఎక్కడైనా తారసపడతారా?
ఒక్కటి మాత్రం నిజం. ఇప్పటి ‘చిత్ర నిర్మాణ వేగం- వాల్కనో- లావా’లా పరుగులు పెడుతోంది. నిన్న ఉన్నవాడు నేడు, నేడున్నవాడు ఆ సాయంత్రానికే అదృశ్యమైపోయే తంతు సాగుతున్న స్థితిలో- ఎవ్వరూ ఏ రంగంలోనూ వెనకటిలా కొన్ని దశాబ్దాలపాటు వెలిగే అవకశాలు మృగ్యమే కదా. ఏమో! రాబోయే తరానికి బాలు తదితర గాయకులు ‘విస్మృత గాయకులు’ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మనం వెనకటి తరాలని స్మరిస్తూ, గౌరవిస్తుంటే, ముందు తరాలు మన దారిలో నడుస్తూ మనల్నీ గౌరవించటం సత్యం కదా! మరి అలా జరుగుతుందా? ఆశించగలమా?

-దినకర్