Others

అక్కినేని ఆదర్శం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాలలో రాణించి ముఖ్యమంత్రి అయిన వారిలో ఆద్యుడు ఎమ్.జి.రామచంద్రన్. ఐతే ఆయన సినీ హీరోగా ప్రస్తానం మొదలుపెట్టి సూపర్‌స్టార్ అయిన తర్వాత రాజకీయాలలోకి అడుగుపెట్టలేదు. ఆయన మొదటి నుంచి రాజకీయాలలో వున్నవాడే. పెరియార్ రామస్వామి నాయకర్ ప్రారంభించిన ద్రావిడ ఉద్యమంలో పాల్గొని నాటకాలు వేస్తూ నటనలో మెరుగులు దిద్దుకున్నవారే ఎమ్.జి.రామచంద్రన్, శివాజీ గణేషన్. గణేషన్ శివాజీ పాత్రలో అద్భుతంగా నటిస్తున్న సమయంలోనే రామస్వామి ఆయనకు ‘శివాజీ’ బిరుదును ఇచ్చారు. అప్పటినుంచే ఆయన శివాజీ గణేషన్‌గా ప్రసిద్ధుడయ్యాడు. తర్వాత ఆయన ద్రావిడ కజం నుంచి తప్పుకుని కాంగ్రెసులో చేరాడు.
ఉత్తరాది పార్టీ అయిన కాంగ్రెసుని ఓడించడం, ప్రజలలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ద్రావిడ కజం ఉద్యమం ప్రారంభించింది. అన్నాదురై, కరుణానిధి రచయితలుగా కాంగ్రెసు నాయకులను విలన్‌లుగా స్క్రిప్ట్‌లు తయారు చేసేవారు. వారిని ఎదుర్కొని విజయం సాధించే హీరోగా ఎమ్.జి.ఆర్. సినిమాలు తయారయ్యేవి. పెరియార్‌తో విభేదాలు మొలకెత్తి అన్నాదురై, కరుణానిధి, ఎమ్.జి.రామచంద్రన్ ద్రావిడ మునె్నట్ర కజం అని వేరు పార్టీ స్థాపించారు. తమిళనాడు ప్రజలలో విపరీతమైన పాపులార్టీ సంపాదించి సూపర్ స్టార్ అయ్యాడు ఎమ్.జి.ఆర్. కాంగ్రెసుని మట్టికరిపించి 1967లో అధికారంలోకి వచ్చింది డి.ఎమ్.కె. పార్టీ. ముందు అన్నాదురై ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కరుణానిధి ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. కరుణానిధితో విభేదాలు వచ్చాయి ఎమ్.జి.రామచంద్రన్‌కి. ఒక దశలో ఎమ్.జి.ఆర్. సినిమాకు ఆటంకాలు కలిగించడానికి మద్రాస్‌లో బేనర్లు నిషేధించింది కరుణానిధి ప్రభుత్వం. నగరంలో వాల్‌పోస్టర్లు, బ్యానర్లు లేకుండా కేవలం పేపర్లో పబ్లిసిటీ యిచ్చి రిలీజైంది ‘ఉలగం చుట్రుమ్ వాలిబన్’. తెలుగులో ‘లోకం చుట్టిన వీరుడు.’ సూపర్ డూపర్ హిట్టయి సిల్వర్ జూబ్లీలు చేసుకుంది. ఎమ్.జి.ఆర్. మలయాళీ అని చేసిన ప్రచారం కూడా ఆయన పాపులార్టీకి అడ్డురాలేదు. అన్నా డి.ఎమ్.కే. పార్టీ స్థాపించి కరుణానిధిని గద్దెదించాడు ఎమ్.జి.ఆర్. ఆయన స్వతహా రాజకీయ నాయకుడు. ఆ తర్వాతే సినీ హీరో అనే వాస్తవం, ఇప్పటి హీరోలు గ్రహించడం లేదు. ఉద్యమ నాయకుడిగా ప్రజల హృదయాలలో దేవుడిగా మిగిలాడు ఎమ్.జి.ఆర్. ఆయనతో పోల్చదగిన హీరో మరొకరు లేరు.
ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జయలలిత ఆయన వారసురాలు మాత్రమే. శివాజీ గణేషన్, విజయకాంత్ వంటి హీరోలు రాజకీయ పార్టీలు స్థాపించి విఫలమైన సంగతి తెలిసిందే. నాలుగు దశాబ్దాలు మాస్ హీరోగా వందల చిత్రాలలో ప్రజలను అలరించి రాజకీయ పార్టీ స్థాపించి కేవలం తొమ్మిది నెలలలో అధికారానికొచ్చిన ఎన్.టి.రామారావుది ఘనమైన చరిత్ర. అటువంటి ఫీట్ మరొకరికి సాధ్యంకాదు అనేది మరొక చరిత్ర.
మాస్ హీరో కృష్ణ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తేడా వచ్చింది. అంతకుముందు కృష్ణ అందరివాడు. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ వాడయ్యాడు. వివిధ పార్టీలను అభిమానించే ప్రేక్షకులు కృష్ణ సినిమాలకు దూరమయ్యారు. ఒక దశలో కృష్ణ సినిమాలు ఆడుతున్న థియేటర్ల దగ్గర గొడవలు జరిగేవి. సినిమా ప్రదర్శనలకు ఆటంకాలు సృష్టించేవాళ్ళు. వరస కుదిరితే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలనుకున్న కృష్ణ కోరిక నెరవేరలేదు. 1989 కాంగ్రెస్ గెలిచినా ఆ క్రెడిట్ చెన్నారెడ్డికి దక్కి ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ స్థాపించకుండా వున్న పార్టీలో చేరడం కృష్ణ చేసిన మంచి పని. లేకపోతే పార్టీ స్థాపించి విఫలమై తెల్ల ఏనుగు లాంటి ఆ పార్టీని మెయింటైన్ చెయ్యలేక జాతీయ పార్టీలో విలీనం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చి వుండేది. చిరంజీవి ప్రజారాజ్యం అనుభవం అదే కదా? ఇప్పుడు రాజకీయం దానిద్వారా వచ్చే పదవులు ఒక వ్యాపారంగా మారిన సంగతి బహిరంగ రహస్యం. అదొక జూదం కూడా. డబ్బున్న మారాజుల క్రీడారంగం. కోట్లు ఖర్చుపెట్టడం. గెలిస్తే దానికి పదిరెట్లో, వంద రెట్లో సంపాదించుకోవడం. డబ్బుతోపాటు హోదాకూడా. నేమ్ అండ్ ఫేమ్. అంతేగాని ప్రజాసేవ అనేది నేతి బీరకాయలో నెయ్యి. అరకొర దాన ధర్మాలు చేస్తూ ప్రజల సమస్యలు శాశ్వతంగా తీరకుండా, తమపై ఆధారపడేట్లు చేసే వికృత క్రీడ రాజకీయం. మరైతే హీరోలు రాజకీయాలలోకి ఎందుకు ప్రవేశిస్తున్నట్టు? సామాన్యులైతే డబ్బు ఖర్చుపెట్టాలి. హీరోల ముఖాలు ఆల్రెడీ పాపులరై వుంటాయి గనుక సభలకు జనం ఎగబడతారు. స్వచ్ఛందంగా వస్తారు. లారీలలో తరలించి లిక్కర్ బాటిల్స్, బిర్యానీ పేకెట్లు పంచాల్సిన పని లేదు. కుదిరితే పదవి. లేకపోతే ఎటూ సినిమాలు వుండనే వున్నాయి.
గతంలోనూ సినిమావాళ్ళు ఎమ్మెల్యేలు, ఎం.పీలు, మంత్రులు అయ్యారు. పదవిలోకి వచ్చిన తర్వాత అయినా ప్రజలలోకి వచ్చారా? సమస్యలు తెలుసుకున్నారా? ఏమైనా తీర్చారా? ఏం వుండదు. వాళ్ళకి కిరీటంలో కలికి తురాయి. అంతకంటే ఏం లేదు.
ఎమ్.జి.రామచంద్రన్, ఎన్.టి.రామారావులతో పోల్చుకోవడం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా వుంటుంది. కఠినంగా వున్నా యదార్థం అదే.
అక్కినేని నాగేశ్వరరావుని ఆదర్శంగా తీసుకుంటే కళాకారులుగా ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతారు.
ఆయన్ని రాజకీయాలలోకి రమ్మని ఆహ్వానించినప్పుడు చెప్పారు.
‘‘సినిమాలలో ఎటూ నటిస్తున్నాను కదా! మళ్ళీ రాజకీయాలలోకి వెళ్ళి, అక్కడ నటించడం ఎందుకు?’’
సినిమా వాళ్ళకు సుభాషితం కదా?

-వాణిశ్రీ