Others

మూగమనసులు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినీ చరిత్రలో తనకో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, ఈనాటికీ అందరిచేత కీర్తింపబడుతున్న చిత్రాలలో మేటి ఆదుర్తివారి అసాధారణ ప్రతిభకు అద్దంపట్టిన చిత్రం ‘మూగమనసులు’.
కథ, కథనము, సంభాషణలు, మామ మహదేవన్ అజరామర సంగీతం సినిమా స్థాయిని ఆకాశమంత ఎత్తులో నిలిపాయి. ఆదుర్తివారి మానసపుత్రునిగా భావించగల అద్భుత ప్రతిభాశాలి పద్మశ్రీ కాశీనాథుని విశ్వనాథ్ ఈ చిత్రానికి పనిచేశారు. గోదావరిని అంత అందంగా, అవసరం మేరకు వాడుకున్నారు.
పునర్జన్మ ఆధారిత కథనం అయినప్పటికీ, ఎక్కడా అనవసర పోకడలకు తావివ్వకుండా చిత్రీకరించడం జరిగింది. పడవ వాడిగా దాదాసాహెబ్ ఫాల్కే గ్రహీత డాక్టర్ అక్కినేని, రాధగా నటనకు భాష్యం చెప్పిన సావిత్రిగారు, గౌరిగా జమునగారు.. ఇలా చెప్పుకుంటే శ్రీ నాగభూషణంగారి దగ్గరనుంచి, అల్లు రామలింగయ్యగారి వరకు ఎవరు తక్కువ. గుమ్మడిగారు, ఆంధ్రుల ఆరాధ్య గయ్యాళి సూర్యకాంతంగారు, పద్మనాభంగారు పాత్రలలో జీవించారు.
సన్నివేశపరంగా అన్నీ అద్భుతాలే. భర్తను కోల్పోయి వచ్చిన సావిత్రిగారికోసం వెళ్లిన అక్కినేనిగారి చేతిలోని బంతిపువ్వు బండి చక్రం క్రిందపడి నలిగిన సన్నివేశం శ్రీ విశ్వనాథ్‌గారి ఆలోచన అని అంటారు.
మామ మహదేవన్‌గారు, మనసుకవి, మన ‘సుకవి’ ఆచార్య ఆత్రేయగారి అద్భుత పదాలకు అజరామరమైన స్వరాలు సమకూర్చారు. ‘‘ముద్దబంతి పూవులో’’, ‘నాపాట...నీనోట..’, ‘ఈనాటి బంధం ఏనాటిదో..’, ‘మానూ మాకునుగాను...’, అల్లరిగా సాగే ‘గోదారి గట్టుంది’’.. చిందులు వేయించే ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మా’..
ఒక దానిని మించి మరొకటి.
అల్లువారి సహజ నటన మరువలేము.
అప్పటికే గొప్ప స్థాయిలోనున్న అక్కినేనిగారు నేలమీద కూర్చుని ‘చిలకా కాదు, సిలక సిలక’ అని అంటుంటే, ఎంత సహజంగా తీశారు.
తరువాత కాలంలో ఈ చిత్ర ప్రేరణతో, కథాగమనంతో చిత్రాలు వచ్చినా నాటికి నేటికి బాబూ మూవీస్‌వారి ‘మూగమనసులు’ ఓ అద్భుతం.

- డాక్టర్ ప్రసాద్ కల్లూరి, అనంతపురం