Others

పెళ్ళికానుక (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో 1959లో విడుదలై విజయం సాధించిన చిత్రం వీనస్ మూవీస్‌వారి ‘కళ్యాణపరిసు’లో అక్కినేని అతిథి పాత్రను పోషించారు. జెమినీ గణేశన్, బి.సరోజాదేవి ప్రధాన జంట. ఆ చిత్ర నిర్మాతలైన కృష్ణమూర్తి, గోవిందరాజన్, శ్రీ్ధర్‌లు అదే చిత్రాన్ని తెలుగులో పునర్ నిర్మించిన చిత్రం ‘పెళ్ళికానుక’. తమిళంలో అక్కినేని పోషించిన అతిథి పాత్రను జగ్గయ్య పోషించగా అక్కినేని, సరోజాదేవి ప్రధాన నాయకీ నాయకులు. కృష్ణకుమారి కీలక పాత్ర పోషించారు. ప్రేమ చిత్రాలకు, కుటుంబ కథాచిత్రాలకు, విషాదాంత చిత్రాలకు పెట్టింది పేరైన నటనా ఆణిముత్యం అక్కినేనికి ఈ చిత్రం అతని అద్భుత నట విన్యాస విశ్వరూపానికి నిదర్శనం! ప్రేమికులు అక్కినేని, బి.సరోజాదేవి ముచ్చటగా ఉన్నారు. ఈ కథకు త్యాగం అంతర్భాగం! తను ప్రాణంగా ప్రేమించిన అక్కినేనిని, తన అక్క కృష్ణకుమారి కూడా ప్రేమిస్తుందని తెలుసుకుని, తనకోసం, తన చదువుకోసం తన జీవితంలో ఎంతో కోల్పోయిన అక్కకోసం తన ప్రేమికుడ్ని త్యాగంచేస్తుంది సరోజాదేవి. అక్కినేని, కృష్ణకుమారిలకు బాబు పుడతాడు. తన చెల్లెలు తనకోసం తన ప్రేమను త్యాగంచేసిందని తెలియని కృష్ణకుమారి వారిద్దరినీ అనుమానిస్తే భారంగా బాధగా దూరంగా వెళ్ళిపోతుంది సరోజాదేవి. కృష్ణకుమారి నిజం తెలిసి బాధతో చనిపోతే, ఒంటరి అయిన అక్కినేని ఆ బాబును సరోజాదేవికి పెళ్ళికానుకగా అప్పగించి పెళ్ళిపందిట్లో ఎవరికీ కనిపించకుండా ఒంటరిగా శూన్యంలోకి వెళ్లిపోతాడు. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీ్ధర్ ఈ చిత్రానికి కూడా దర్శకుడు. చలాకీ చిలిపి అల్లరి వాసంతి పాత్రలో సరోజ, హుషారు ప్రేమికుడు భాస్కర్‌గా అక్కినేని, వౌనం, అమాయకం, సిగ్గు కలగలిసిన పాత్రలో కృష్ణకుమారి మూడు స్తంభాలుగా నిలబడి ఈ చిత్ర విజయానికి దోహదపడ్డారు. హాస్య నట రారాజు రేలంగి, గిరిజతో కలసి వండిన నవ్వుల వంటకం బాగుంది. సన్నివేశ పరంగా చూస్తే అక్కకోసం మన ప్రేమను త్యాగం చెయ్యమని అక్కినేనిని సరోజాదేవి అర్ధించే సన్నివేశం హైలైట్! ఇద్దరూ పోటీపడ్డ ఈ సన్నివేశంలో అక్కినేని భావప్రదర్శన, అభినయం ఎంతో ఉన్నతంగా ఉంటాయి! ప్రేమ, త్యాగం మధ్య నలిగిన నాయక పాత్రలో ఆంగికాభినయ అగ్రశిఖరం అనిపించుకున్నాడు అక్కినేని. క్లైమాక్స్‌లో ఒంటి చేత్తో బాబును ఎత్తుకుని తిరుపతి ఘాట్‌రోడ్లపై అక్కినేని మోటర్ సైకిల్ డ్రైవింగ్ ఎంతో ఉత్సుకతను కలిగిస్తుంది. ఈ చిత్రంలోని విశేషాలు ఏమిటంటే పాతాళభైరవి చిత్రంలో రామారావుకు జోడీగా నటించిన మాలతి హీరోయిన్ల తల్లిగా నటించడం. అక్కినేని చిత్రానికి ఘంటసాల పాట లేకపోవడం మరో పెద్ద విశేషం! తమిళ చిత్రానికి సంగీతం అందించిన ఎ.ఎమ్.రాజా ఈ సినిమాకు సంగీతం అందించడమేకాక, అక్కినేనికి అన్ని పాటలూ తనే పాడటం మరో విశేషం! ఒక్క పాట (పులకించని మది పులకించు) తప్ప, మిగతా పాటలు సుశీలతో పాడించడం విశేషం! ఆ ఒక్క పాట పాడిన జిక్కి, ఎ.ఎం.రాజా భార్య కావడం విశేషం! మనసు పాటల మనోహరుడు ఆత్రేయ ఈ చిత్ర సంభాషణలు వ్రాయగా, ఆత్రేయ, ఆరుద్ర, సీనియర్ సముద్రాల, చెరువు ఆంజనేయశాస్ర్తీ పాటలు వ్రాసారు. ‘కన్నులతో పలకరించు వలపులు’, ‘ఆడే పాడే పసివాడా’, ‘వాడుక మరచెదవేలా’, ‘తీరెనుగా నేటితో నీ తీయని గాథా’ పాటలు ఇప్పటికీ వీనులవిందే. వినె్సంట్ ఛాయాగ్రహణం బాగుంది. ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో సందర్భానుగుణంగా వినిపించే ‘అక్కయ్యకూ సీమంతం’ పాట ఈ సినిమాలోదే. అక్కినేని 82వ చిత్రమైన ‘పెళ్ళికానుక’ ఏప్రిల్ 29, 1960లో విడుదలై శతదినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకుంది. అందుకే ఈ చిత్రం నాకెంతో ఇష్టం!

-తాడ్డి అప్పలస్వామి, పార్వతీపురం