AADIVAVRAM - Others

సమైక్యతా సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ భావాన్ని పాదుకొలిపి, జాతి జనులను సమగ్రత వైపు నడిపించిన ఖ్యాతి కేవలం ‘గణేశ్ చతుర్థి’ ఉత్సవాలకే దక్కుతుంది. హిందువులు అనాదిగా మతపరమైన ఎన్నో పండగలను ఆచరిస్తున్నా, ఏ పర్వదినానికీ లేని విశిష్ఠత వినాయక చవితి ఉత్సవాల్లో కనిపిస్తుంది. అగ్రవర్ణాలు, బడుగువర్గాల మధ్య అంతరాలను తొలగించడంలో కీలకపాత్ర వహిస్తున్నందునే దీన్ని జాతీ య స్థాయిలో భారీ ఉత్సవంగా ఏటా నిర్వహిస్తున్నారు. కేవలం కుటుంబ పరమైన పండగలా కాకుండా, విభిన్న సామాజిక వర్గాలన్నీ కలసికట్టుగా నిర్వహిస్తున్నందున ఈ పండగ జాతీయతకు చిహ్నంగా, సమగ్రతకు వారధిలా గోచరిస్తుంది. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతికి ఇది ప్రతీకలా నిలిచింది. మన దేశంలో ఆసేతు హిమాచలం విభిన్న ప్రాంతాల్లోనే కాదు, పలు విదేశాల్లోనూ ‘గణేశ్ చతుర్థి’ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆధ్యాత్మికతతో పాటు జాతీయతా భావం వెల్లివిరిసే ఈ పండగకు ఘనమైన చరిత్ర ఉంది.
ఒకప్పుడు ఇళ్లలో నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలు నేడు పల్లెసీమల నుంచి నగరాల వరకూ చూస్తే- వీధివీధినా, వాడవాడలా కోలాహలం కనిపిస్తుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలు మొదట్లో అగ్రవర్ణాల వారి ఇళ్లలో జరిపేవారు. ఆ తర్వాత సామాజిక అంతరాలను చెరిపేస్తూ గణేశుడు దళితవాడల్లోనూ, పేదల ముంగిట్లోనూ దర్శనమివ్వడం ప్రారంభించాడు. చరిత్ర పరంగా చూస్తే- శాతవాహన, రాష్టక్రూటుల, చాళుక్య సామ్రాజ్యాల కాలంలో ‘చవితి’ ఉత్సవాలను నిర్వహించేవారు. అప్పట్లో చవితి సంబరాల్లో కొన్ని సామాజిక వర్గాలు మాత్రమే పాల్గొనేవి. మహారాష్టల్రో మరాఠా సామ్రాజ్యాధిపతి ‘్ఛత్రపతి’ శివాజీ (1630- 1680 మధ్య) భారతీయ సంస్కృతిని, జాతీయతను ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహారాజా శివాజీ ఏటా క్రమం తప్పకుండా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ, గణేశుడిని తమ కులదైవంగా ఆరాధించారు. పీష్వాల పాలనలో ఘనంగా కొనసాగిన ఈ సంప్రదాయం భారత స్వాతంత్య్ర సంగ్రామ కాలంలో కొత్తపుంతలు తొక్కింది.
గణేశ్ చతుర్థి ఉత్సవాలను భారీ వేడుకలా నిర్వహించడానికి 1892లో బీజం పడింది. పూణెకు చెందిన కృష్ణాజీపంత్ ఖస్గివాలే అప్పటి మరాఠా రాజ్యంలోని గ్వాలియర్ ప్రాంతాన్ని సందర్శించినపుడు- గణేశ్ ఉత్సవాలను ‘ప్రజలందరి సంప్రదాయ వేడుక’గా జరపడాన్ని చూసి, ఆ విషయాన్ని తన మిత్రులకు తెలిపారు. కృష్ణాజీపంత్ స్నేహితులైన భావ్‌సాహెబ్ లక్ష్మణ్ జవాలే, బాలాసాహెబ్ నాథూ పూణెలో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. జనం మధ్య గణేశుడిని ప్రతిష్ఠించిన తొలి వ్యక్తిగా లక్ష్మణ్ జవాలే కీర్తి గడించారు. ప్రజలను ఐక్యతా పథంలో నిలిపేందుకు జవాలే చేసిన కృషిని ‘లోకమాన్య’ బాలగంగాధర తిలక్ తన ‘కేసరి’ పత్రికలో ప్రముఖంగా ప్రస్తావించారు. తన పత్రిక కార్యాలయం ఆవరణలో తిలక్ 1893లో గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజల కోసం తొలిసారిగా ఉత్సవాలను నిర్వహించారు.
ఆద్యుడు తిలక్..
‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని గొంతెత్తిన బాలగంగాధర తిలక్ ఆధునిక భారతంలో గణేశ్ ఉత్సవాలకు కొత్తరూపు ఇచ్చిన జాతీయవాదిగా చిరకాల కీర్తిని సొంతం చేసుకొన్నారు. బ్రిటన్ దొరల పాలనలో ప్రజల్లో జాతీయతా భావాన్ని నిద్రలేపి, వారిని సమగ్రతా పథంలో నడిపేందుకు గణేశ్ ఉత్సవాలను వేదికగా మలచుకొన్నారు. అంతా కలసి సమైక్యంగా ఉత్సవాలను జరుపుకోవడంతో బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరుల మధ్య విభేదాలు తొలగిపోయి, ‘దేశం దృష్టిలో, దేవుడి దృష్టిలో అంతా ఒకటే’ అన్న భావానికి అంకురార్పణ జరిగింది. సామాజిక అంతరాలను తొలగించే వారధిగా ఉత్సవాలను నిర్వహించడం తిలక్‌తోనే ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు గణేశ్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడమే కాదు, విగ్రహాల నిమజ్జనం నాడు అన్ని వర్గాలవారూ కలసి భారీ సంఖ్యలో పాల్గొనడం తిలక్ వల్లే సాధ్యమైంది. విఘ్నాలను తొలగించే వినాయకుడు అందరి దేవుడని ఆయన భావించి, ఉత్సవాల్లో అంతరాలకు అతీతంగా ప్రజలంతా మమేకం కావాలని పిలుపునకు విశేష స్పందన లభించింది. ఆయన స్ఫూర్తితో ముంబయి సహా మహారాష్టల్రోని పలు నగరాల్లో గణేశ్ చతుర్థిని సామాజిక, ఆధ్యాత్మిక వేడుకగా నిర్వహించడం మొదలైంది. వీధుల్లో భారీ వేదికలను ఏర్పాటు చేయడం, అందరికీ కనిపించేలా పెద్ద పెద్ద వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించడం, అన్ని సామాజిక వర్గాలనూ ఇందులో భాగస్వామ్యం చేయడం, ఉత్సవాల ముగింపు వేళ నిమజ్జనం రోజున ఊరేగింపులు నిర్వహించడంతో జనం మూకుమ్మడిగా పాల్గొనేవారు. ప్రసాదాలను పరస్పరం పంచుకొని సామూహికంగా భోజనాలు చేసేవారు. ఉత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర కాంక్షను రగిలించేలా ప్రముఖుల ఉపన్యాసాలను తిలక్ ఏర్పాటు చేయించేవారు. దేశభక్తి గీతాలు, భక్తిపాటలు, నృత్యం, కవిత్వం, జానపద గీతాలు, సంగీత కార్యక్రమాలను నిర్వహించేవారు. భక్త్భివంతో ప్రజల్లో క్రమశిక్షణ, జాతీయత వంటివి ఏర్పడి స్వాతంత్య్ర సంగ్రామం మరింత బలోపేతం అవుతుందన్నది ‘లోకమాన్య’ ఆలోచన. ఆయన ఆకాంక్షలకు తగ్గట్టుగానే జనం యావత్తూ గణేశ్ ఉత్సవాలను కుటుంబ పరంగా గాక జాతీయ పండగలా నిర్వహించేవారు. వినాయక చవితి ఉత్సవాలకు కులమత భేదాలకు అతీతంగా జనం భారీ సంఖ్యలో గుమికూడడంతో ఊరేగింపులపై అప్పటి బ్రిటిష్ పాలకులు నిషేధాజ్ఞలు విధించేవారు. అయినప్పటికీ ఐకమత్యంతో ఒక్కటైన ప్రజలు నిషేధాజ్ఞలకు భయపడకుండా ఉత్సవాలను సామూహికంగా జరుపుకొనేవారు. బ్రిటిష్ వలస పాలకులను తరిమికొట్టేలా ప్రజల్లో జాతీయతాభావాన్ని రగిలించిన ఈ ఉత్సవాలు స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర వహించాయి. తిలక్ చూపిన అడుగుజాడల్లో ఇపుడు దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలను అత్యంత వేడుకగా జరుపుతున్నారు.
రహస్యంగా పూజలు..
గోవాలో పోర్చుగీసు పాలన కొనసాగిన కాలంలో మతం మార్పిడులకు వ్యతిరేకంగా హిందువులు గణేశ్ ఉత్సవాలను సామూహికంగా నిర్వహించేవారు. ప్రతి హిందూ కుటుంబంలో వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేసేవారు. మట్టి విగ్రహాలపై అప్పటి పాలకులు నిషేధాజ్ఞలు విధించడంతో చాలామంది తమ ఇళ్లలో రహస్యంగా వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి ఉత్సవాలను జరుపుకొనేవారు. ముంబయిలో భారీ ఎత్తున ఈ వేడుకలను నిర్వహిస్తూ జనం పోటెత్తడం చూస్తూ బ్రిటిష్ పాలకులు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి ఏర్పడేది. ఈ ఉత్సవాలతో జనంలో జాతీయతా భావం అంతర్లీనంగా ప్రవహిస్తోందని, ఇది స్వాతంత్య్ర సమరాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్తుందని బ్రిటన్ దొరలు గ్రహించారు.
అగ్రపథాన ముంబయి..
సామాజిక విభేదాలకు అతీతంగా హిందువులు జరుపుకొనే ఉత్సవాల్లో గణేశ్ చతుర్థి ఎంతో ప్రధానమైన పండగలా నిలిచింది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఉత్సవ శోభతో పల్లెలు, పట్టణాలు, నగరాలు కళకళలాడుతుంటాయి. అత్యంత భారీగా ఉత్సవాలను నిర్వహించడంలో ఇప్పటికీ ముంబయి నగరం ముందు వరసలో ఉంది. ఉత్సవాల సందర్భంగా భారీ విగ్రహాల ముందు బారులు తీరే భక్తులతో ముంబయి వీధులు కిటకిటలాడుతుంటాయి. ఎటు చూసినా మహారాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలతో గణేశ్ మండపాలు దర్శనమిస్తాయి.
హైదరాబాద్‌లో..
ముంబయి తర్వాత హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడమే కాదు, భారీ లడ్డూలను వేలం వేయడం హైదరాబాద్‌లో పరిపాటిగా మారింది. ప్రతి గల్లీలో, ప్రతి కాలనీలో గణేశ్ మండపాలు ఏర్పాటు చేస్తున్నందున భాగ్యనగరంలో విగ్రహాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ వద్ద రెండు రోజులపాటు గణేశ్ విగ్రహాల నిమజ్జనాన్ని కోలాహలంగా నిర్వహిస్తారు.
మైసూరులో..
కర్నాటకలోని మైసూరులో గణేశ్ చతుర్థి వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుతారు. అరటి ఆకుల్లో భోజనం చేయడం, అరటి పండ్లను వినాయకుడికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. గణేశ్ చతుర్థి ముందురోజున గౌరీమాతను భక్తిశ్రద్ధలతో పూజించడం మైసూరు వాసులకు ఆచారం. గౌరీమాతను పూజించి వివాహిత మహిళలు వాయనాలు ఇచ్చుకుంటారు. వినాయకుడిని ప్రసన్నం చేసుకొనేందుకు అతని తల్లి అయిన గౌరీమాతను మహిళలు ఆరాధిస్తారు.
దేశ రాజధానిలో..
ఒకప్పుడు మరాఠా ప్రభువులు పాలించిన దేశ రాజధాని ఢిల్లీ నగరంలోనూ గణేశ్ చతుర్థిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా ఢిల్లీలోని మరాఠా కుటుంబాల వారు ఈ వేడుకల నిర్వహణకు భారీగా ధనం ఖర్చుచేస్తుంటారు.
గోవాలో..
ఆహ్లాదకరమైన సముద్ర తీరానికి నెలవైన గోవాలో ‘చొవొథ్’ పేరిట వినాయక చవితిని వేడుకగా జరుపుతారు. ‘మథొవ్’గా పిలిచే ఉత్సవ మండపాలను కొబ్బరాకులు, అరటి ఆకులు, మామిడి ఆకులు, పోక చెట్టు ఆకులతో అందంగా అలంకరిస్తారు. మండపాల్లో పూజలతో పాటు పిల్లల కోసం సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తారు. ‘షామెల్’, ‘ఘుమొట్’ అనే ప్రత్యేక వాయిద్యాలతో సంగీత విన్యాసాలు ఉత్సవాలకు వనె్న తెస్తాయి.
చెన్నపట్నంలో..
తమిళనాడు రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ గణేశ్ ఉత్సవాలతో కనువిందు చేస్తుంది. విభిన్న రంగుల్లో కాంతులీనే వినాయక ప్రతిమలు సాగర తీరానికి కొత్తశోభనిస్తాయి. భారీ సంఖ్యలో పెద్ద పెద్ద విగ్రహాలు కనిపించక పోయినా ‘పర్యావరణ హితం’గా చెన్నైలో ఈ వేడుకలను జరుపుకొంటారు. సామాజిక విభేదాలకు దూరంగా ఈ ఉత్సవాలను మహారాష్టత్రో పాటు తమిళనాడు, కేరళ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఆనందం, ఉత్సాహం, భక్త్భివం, రంగుల మేళవింపు, విభిన్న వంటకాలు, సాంస్కృతిక విన్యాసాలకు నిలయమైన గణేశ్ నవరాత్రి ఉత్సవాలను భారత్ సహా కెనడా, మారిషస్, సింగపూర్, కంబోడియా, మయన్మార్, బ్రిటన్, అమెరికా, ఫిజీ వంటి దేశాల్లోనూ హిందువులు భక్త్భివంతో నిర్వహిస్తారు.
మారిషస్‌లో..
మారిషస్ దేశ జనాభాలో 52 శాతంగా ఉన్న హిందువులు గణేశ్ చతుర్థిని సాంప్రదాయబద్ధంగా పాటిస్తారు. వినాయక చవితిని మారిషస్‌లో సెలవు దినంగా ప్రకటిస్తారు. దేవాలయాల్లో, ఇళ్లలో గణేశుడికి పూజలు జరుపుతారు. మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.
కెనడాలో..
కెనడా రాజధాని టొరొంటోలో హిందువులు గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను జరుపుకొంటారు. ప్రతిమల వద్ద హారతులిచ్చి, ప్రసాదాలను నివేదిస్తారు. చవితి ఉత్సవాల్లో హిందూ సంస్కృతి వెల్లివిరుస్తుంది. కొంతమంది భక్తులు భారత్ నుంచి గణేశ్ విగ్రహాలను తెప్పించుకొని వేడుకలను సామూహికంగా నిర్వహిస్తారు.
అమెరికాలో..
అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయులు గణేశ్ చతుర్థి వేడుకలకు భారీ సన్నాహాలు చేస్తారు. ముంబయి నుంచి వినాయక విగ్రహాలను తెప్పించి మండపాల్లో వాటిని ప్రతిష్ఠిస్తారు. ఉత్సవాల సందర్భంగా పూజలు, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి, పరస్పరం ఆత్మీయతను పంచుకొంటారు.
బ్రిటన్‌లో..
లండన్ నగరంలో హిందువులు భారీ స్థాయిలో ఈ వేడుకలు జరుపుకొంటారు. ఇక్కడి లక్ష్మీనారాయణ ఆలయంలో జరిగే వేడుకలకు పెద్ద సంఖ్యలో హిందువులు తరలివచ్చి పూజలు చేస్తారు. విగ్రహాల నిమజ్జనాన్ని కూడా ఇక్కడి భక్తులు థేమ్స్ నది వద్ద నిర్వహిస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుడు ఎల్లవేళలా తమకు అండగా ఉంటాడని భక్తులు ఎంతో విశ్వాసంగా కొలుస్తారు.

-వౌని