AADIVAVRAM - Others

‘విహంగాల విడిది’లో బాణసంచా బంద్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లిళ్లకు, పండగలకు చెవులు చిల్లులు పడేలా ఆర్భాటంగా బాణసంచా కాల్చడం నేడు ఆనవాయితీ.. పెద్ద పెద్ద సౌండ్ బ్యాక్స్‌లు పెట్టి భారీ శబ్దాలతో హోరెత్తించడం తమ ‘హోదా’కు చిహ్నమని చాలామంది అట్టహాసం చేస్తుంటారు.. అయితే- ఇలాంటి ఆర్భాటాలకు ఆ రెండు ఊళ్లు దశాబ్దాల తరబడి దూరంగా ఉంటున్నాయి.. మతాబుల్లో ‘జిగేల్’మనే రంగుల్ని వారు పక్షుల రెక్కల్లో చూస్తూ ఆనందడోలికల్లో తేలియాడుతుంటారు.. దీపావళి రోజున చుట్టుపక్కల గ్రామాలన్నీ బాణసంచా వెలుగుల్లో ధగధగలాడినా- ఆ రెండు పల్లెల ప్రజలు మాత్రం మతాబులు, పటాకుల వైపు కనె్నత్తయినా చూడరు.. తీపి వంటకాలను రుచి చూస్తూ పండగ నాడు ఆనందం పంచుకుంటారు.. తమ గ్రామాల వద్ద విడిది చేసిన పక్షులకు భారీ శబ్దాల వల్ల ఎలాంటి కీడు జరగరాదన్న ఆలోచనతోనే వారు ‘బాణసంచా రహిత దీపావళి’ని పాటిస్తున్నారు.
తమిళనాడులోని శివగంగ జిల్లాలో కొల్లుకుడిపట్టి, సింగం పునరి గ్రామాల ప్రజలు సుమారు గత మూడు దశాబ్దాలుగా బాణసంచాకు దూరంగా ఉండడం నిజంగా విస్మయం కలిగిస్తుందని స్థానిక అటవీశాఖ అధికారులు చెబుతుంటారు. ఏటా ఏప్రిల్‌లో కోలాహలంగా జరిగే తిరువీధి ఉత్సవాల్లో సైతం బాణసంచా జాడే ఉండదు. ఈ రెండు గ్రామాల్లో ఇళ్ల ముందు గానీ, బహిరంగ స్థలాల్లో గానీ బాణసంచా కాల్చరాదని స్థానికులు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు.
ఉత్తర భారతంతో పాటు సైబీరియా, న్యూజిలాండ్ వంటి విదేశాల నుంచి వేలాది పక్షులు ఈ గ్రామాలకు చేరుకొంటాయి. ఏటా అక్టోబర్ నుంచి అయిదు నెలల పాటు లిటిల్ కర్మొరాంట్, లిటిల్ ఎగ్రెట్, కేటిల్ ఎగ్రెట్, ఫ్లెమింగో తదితర రకాల పక్షులు ఈ రెండు గ్రామాల వద్ద చెట్లపై విడిది చేస్తాయి. ఈ పక్షులు ఇక్కడే గుడ్లు పెట్టి, తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని ఫిబ్రవరి తర్వాత తిరుగుముఖం పడతాయి. నవంబర్ నుంచి నాలుగైదు నెలల పాటు ఈ పక్షులను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. దీపావళి నాటికి కొల్లుకుడిపట్టి, సింగం పునరి గ్రామాలు విదేశీ పక్షుల కిలకిలారావాలతో పర్యాటకులకు ఆహ్వానం పలుకుతాయి.
‘్భరీ శబ్దాలు, మిరుమిట్లు గొలిపే కాంతి వల్ల మనం ఎంతో బాధ పడుతుంటాం.. అలాంటిది పక్షులు వీటిని ఎలా తట్టుకొంటాయి..?’ అని గ్రామస్థులు ప్రశ్నిస్తుంటారు. ఈ కారణంగానే పక్షులకు అండగా నిలవాలని భావించి వీరంతా దీపావళిని ఎలాంటి బాణసంచా లేకుండానే నిరాడంబరంగా జరుపుకొంటారు. భారీ శబ్దాల వల్ల పక్షులు చెల్లాచెదురవుతాయని, చెట్లపై నుంచి గుడ్లు, పక్షిపిల్లలు నేలపై పడుతుంటాయని, ఈ పరిస్థితిని నివారించేందుకు దాదాపు ముప్పయి ఏళ్ల క్రితమే తాము బాణసంచాకు స్వస్తి పలికినట్లు గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు. సరదా కోసం కాల్చే బాణసంచా వల్ల పక్షులు ప్రమాదంలో పడడం తమకు ఇష్టం లేదంటున్నారు. మతాబులు కాల్చకుండా పసిపిల్లలను ఒప్పించేందుకు పెద్దలు, ఉపాధ్యాయులు కొంత కష్టపడాల్సి వచ్చింది. దీపావళి నాడు బాణసంచా కాల్చాలని ఆరాటపడే పిల్లలు మాత్రం ఈ గ్రామాలకు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి తమ ముచ్చట తీర్చుకోవాల్సిందే. వలస పక్షులను కాపాడుకోవడంలో కొల్లుకుడిపట్టి, సింగం పునరి గ్రామాల ప్రజలు తమిళనాడు రాష్ట్రానికే ఆదర్శప్రాయులుగా నిలిచారని ‘వేదకుండి పక్షి సంరక్షణ కేంద్రం’ అధికారులు ప్రశంసిస్తున్నారు.

-శ్రీ