Others

మహాకవి శ్రీశ్రీ (వెండి వెలుగులు 6/1 )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలను జాగృతం చేయడం ఎలా? అనే సమస్య వస్తే, శ్రీశ్రీ ప్రధానంగా సాహిత్యానికే పెద్దపీట వేస్తారు. నిరక్షరకుక్షులు, పామరులు త్వరగా అర్ధం చేసుకుని మేలుకొనేలా, కర్తవ్యం వారికి వెనువెంటనే బోధపడేలా వ్రాయగల ధీశాలి ఆయన. ‘వెలుగునీడలు’ (పాత) చిత్రంలో ‘ఓ రంగయో! పూల రంగయో’అనే పాట, ‘శభాష్‌రాముడు’ చిత్రంలోని ‘జయమ్ము నిశ్చయమ్మురా’ పాట ఇందుకు ఉదాహరణలు మాత్రమే. ప్రజలను దురదృష్టజాతకులు, నష్టజాతకులు కావద్దని, నడిమంత్రపుసిరి కోసం అడ్డదారులు త్రొక్కి అష్టకష్టాల పాలుకావద్దని, నిజానిజాలు మరువవద్దని ‘్భమికోసం’ చిత్రానికి వ్రాసిన పాటలో ‘ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి నిదురపోకుమా’ అని హెచ్చరించారు. శ్రీశ్రీ విప్లవ కవితలే గాదు, వేదాంతం, నిగూఢార్ధ్భరితమైన నగ్నసత్యాలనూ వ్రాయగలరు. ‘వెలుగునీడలు’కు వ్రాసిన మరోపాట ‘కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు’ ఇందుకుదాహరణ.
‘కమ్యూనిజం’ అమలులోకి వస్తే దేశకాల పరిస్థితులు, అన్నివర్గాల మనుషుల భావాలు తప్పక మారతాయని, అందుకు విప్లవమార్గమే శరణ్యమని ‘మనుషులు మారాలి’ చిత్రం కోసం ‘విప్లవం జిందాబాద్’ పాట వ్రాశారు. ఒకటేమిటి.. యుగళ గీతాలు, బృంద గీతాలు, భక్తిగీతాలు, దేశభక్తి గేయాలు, ముక్తి, విముక్తి, విరక్తి పాటలు, ప్రబోధ గీతాలు అన్నీ ఉన్నాయి. ‘కవిత్వం పండితుల కొరకుగాదు, పామరుల కొరకు కూడ’ అని ఋజువుచేసిన కవి శ్రీశ్రీ. ‘ఎర్రమల్లెలు’ చిత్రంకోసం ‘కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు’లాంటి పాటలిందుకు ఉదాహరణలు.
ఏఎన్నార్ ఆరాధనలో -నా హృదయంలో నిదురించే చెలి, డాక్టర్ చక్రవర్తిలో-మనసున మనసై, ఎన్టీఆర్ దేవతలో -ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి, ఎంఎల్‌ఏలో -నీ ఆశ అడియాసా, ప్రాయశ్చిత్తంలో -పోతే పోనీ పోరా, రాణిరత్నప్రభలో -నిన్న కనిపించింది, భార్యాభర్తలులో -జోరుగా, హుషారుగా షికారు పోదమా.. ఇలా ఎన్నో. ముఖ్యంగా మాదాల రంగారావు, ప్రత్యగాత్మ వంటి దర్శకులు తీసిన చిత్రాల్లోనివి ఆయన వ్రాసినవి హిట్ సాంగ్స్ అయినాయి. ఆ తరం కవులకు ఆయన ఆదర్శప్రాయుడు.
వామపక్ష భావ కవులలో అగ్రగామి శ్రీశ్రీ 1954, 1966లో రష్యాలో పర్యటించారు. 1952లో మద్రాసు శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1976లో చైనా వెళ్ళారు. 20 ఏళ్ళు అభ్యుదయ రచయితల సంఘం (అ.ర.సం.)లో క్రియాశీలక పాత్ర పోషించారు. తర్వాత విప్లవ రచయితల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. 1960లో ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు వచ్చింది. శ్రీశ్రీ రెండుసార్లు సోవియట్ లాండ్ అవార్డు పొందారు.
ఆధునిక యుగపు భావికవిత్వానికి ఒక చక్కని పరమార్థాన్ని, అందరినీ మెప్పించగల ప్రయోజనాన్ని కల్పించిన అభ్యుదయ, ఆధునిక కవులలో శ్రీశ్రీ ఒకరు. ఆయన ప్రజాకవి. ప్రజల కవి. అన్నివర్గాల వారికి నచ్చేలా, అందరు కాకున్నా కొందరైనా స్పందించే విధంగా ఆయన కవిత్వం వ్రాశారు. కావ్యాలూ వ్రాశారు. ఆయన రచనా నైపుణ్యం, ప్రతిభాపాటవాలు, పాండిత్య ప్రకర్ష, భాషపైన పట్టు సమాజంపై దానిలోని దురాచారాలపై, దురాగతాలపై, దురన్యాయాలపై నిరసనగా గట్టిపట్టుగా కవిత్వంతో చేసిన సేవ, కృషి ఆదర్శప్రాయమైనవి. అమోఘమైనవి అనితర సాధ్యమైనవి. అనన్య సామాన్యమైనవి. అందుకే ఆయన ప్రజాకవే కాదు, మహాకవి. ‘డబ్బింగ్ చిత్రం’ ‘ఆహుతి’కి పనిచేసి ఒక కొత్త వృత్తి సృజించారు.
ఆయన తన రచనలతో మూఢ నమ్మకాన్ని ఖండించారు. అంధ విశ్వాసాల్ని అధఃపాతాళానికి పంపించారు. వర్గ, వర్ణ, కుల, మత, వయోబేధాల్లేని మరో ప్రపంచాన్ని సృష్టించారు. ఆంధ్రా యూనివర్సిటీ అప్పటి రీడరు డాక్టరు మిరియాల రామకృష్ణ ఆయన రచనలపై పరిశోధన చేసి పిహెచ్‌డి పొందారు. సినీ నటుడు రాజబాబు ఆయనకు తోడల్లుడు. ఏమైనా ఆయన చిరస్మరణీయుడు. ఇంత ప్రఖ్యాతిగాంచిన శ్రీశ్రీ 1983 జూన్ 15న మరణించారు. ఆయన చనిపోయినా ఆయన భావ గీతాలు, గేయాలు, కవితలు ఆచంద్రతారార్కాలు అజరామరాలు.

-డా.దేశిరాజు లక్ష్మీనరసింహారావు