Others

టాలీవుడ్ స్థాయెక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ నాగరికతకు కేంద్రం ప్యారిస్ నగరం. అబ్బుర పరచే ఫ్యాషన్లకు జన్మస్థానం. ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన ‘ఈఫిల్ టవర్’ కనిపించేది ఇక్కడే. ఫ్రాన్స్ దేశ రాజధానే ప్యారిస్ నగరం. మే 11నుండి 22వరకు ఫ్రాన్స్ దేశంలో ‘కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం’ నిర్వహించారు. దీంతో వచ్చే ఆదాయాన్ని ‘ఎయిడ్స్ నిర్మూలనకు వెచ్చిస్తుంది ఆ సంస్థ. ఆ ఉత్సవంలో విరాళాలను దాతల నుంచి సేకరించి ప్రోగు చేస్తుంది ఆ కమిటీ. సరే, ఎయిడ్స్ విరాళాలను ప్రక్కనపెట్టి అసలు విషయానికి వద్దాం. పలు దేశాల చలన చిత్ర రంగ ప్రముఖులు ఉత్సవానికి ఆహ్వానించబడతారు. ఎర్రతివాచిపై నడిచే కోరిక తీర్చుకుంటారు. పలు దేశాల చిత్రరంగ ముద్దుగుమ్మలు అత్యంత ఖరీదైన ఫ్యాషన్ దుస్తులను ధరించి, అందాలు, వొంపుసొంపులను ప్రదర్శిస్తూ ఎర్రతివాచిపై చిరునవ్వులు, క్యాట్ వాక్ (పిల్లి నడక)లు కలబోసి హొయలు ఒలకబోస్తారు. ‘సెలబ్రేటీ’లన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్టు వొంపులు తిరుగుతూ మెరుస్తారు. అందిన ద్రాక్ష తియ్యనన్నట్టు కొంతకాలంగా అందివచ్చిన అవకాశాలతో -మన బాలీవుడ్ భామలూ కేన్స్ కార్పెట్లపై తెగ నడిచేస్తున్నారు. హాలీవుడ్‌కు మేమేం తక్కువకాదన్నట్టు -అంతకుమించి అత్యాధునిక మోడల్ దుస్తులకు వజ్రాలు పొదిగి, ముత్యాలు తగిలించి, పసిడి అంచులద్ది దేవతా వస్త్రాలతో కులుకుల నడకలు నడుస్తున్నారు. విచిత్ర కేశాలంకరణతో ఎర్రతివాచీపై పిల్లి నడకలు నడుస్తున్నారు. హంగూ ఆర్భాటంతో విదేశీ చలనచిత్ర రంగ దర్శకుల దృష్టిలో పడాలని, తద్వారా ప్రపంచ సినిమా స్క్రీన్‌పై అవకాశాలు పొందాలనే వారి తపన సామాన్యులకు అర్థం కాకపోవచ్చు. అదీకాక మన బాలీవుడ్‌లో పది చిత్రాల్లో నటిస్తే వచ్చే ఆదాయం కన్నా, హాలీవుడ్ చిత్రరంగంలో ఒక్క చిత్రం చేస్తే చాలు... అంతకు మించిన ఆదాయం వస్తుందన్న ఆలోచన కూడా కావొచ్చు. పైగా ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన పాపులారిటీ. ఇదే మన బాలీవుడ్ భామల మనోవాంఛ. వజ్రాలు, ముత్యాలు, పసిడి కలగలిపిన దుస్తులు అవసరమా? లక్షలు వెచ్చించి ఒక్కరోజు ప్రదర్శనకు అంత ఆర్భాటపు ఖర్చు అవసరమా? డబ్బులు ఎక్కువైతే ఏంచేయాలో తెలియక ఇలా దుబారా చేస్తున్నారా? లాంటి ప్రశ్నలు సామాన్యుడి మదిని దొలిచేయక మానవు. పరిశ్రమ ఒక అందాల ప్రపంచం కనుక, ఆ మాత్రం ఆర్భాటం లేకపోతే పట్టించుకునే వాళ్లెవరు? అన్న సన్నాయి నొక్కులూ వినిపించొచ్చు. కెరియర్ ఎంత అందాల ప్రపంచం అంచున నడుస్తున్నా -్భరతీయ సినీ ప్రతినిధులుగా, ప్రముఖులుగా అక్కడ అడుగుపెట్టిపుడు.. జాతి గౌరవం, ఔన్నత్యం, నిండుదనం గుర్తుకురాకుండా పోవాలా? అన్నదే అసలు ప్రశ్న. పదిమంది మధ్య ప్రతినిధిగా నడుస్తున్నామన్న స్పృహ లేకుండా -‘అందాంగ’ ప్రదర్శనలతో భారతీయత పరువు బజారున పడేయాలా? అన్నది మరో ప్రశ్న.
బహుశ, సొమ్ములు ఎక్కువైతే ఎవరికైనా ఇలాంటి పిచ్చి చేష్టలు రాకమానవేమో. ఒక ఏడాదిలో పలు నగరాల్లో ఇలాంటి అంతర్జాతయ చలన చిత్రోత్సవాలు చేస్తూనే ఉంటారు. జరుగుతూనే ఉన్నాయి. మన ప్రముఖులంతా ఎగేసుకుని అక్కడకు వెళ్లడం వల్ల -మన దేశ చిత్ర రంగానికి ఒరిగేదేమిటి? మన ఆర్భాటపు ముద్దుగుమ్మలు అతిధి హోదాలో కొందరు, ఎర్రతివాచిపై మోజుతో మరికొందరు హాజరై సాధించిందేమిటి? అవార్డులు -రివార్డులు సాధించారా? ప్రశంసల జల్లులో తడిచారా? కీర్తి గౌరవాలు మూటకట్టుకొచ్చారా?
‘ఫేస్‌బుక్’ వ్యవస్థాపకుడు మార్క జుకెర్ బర్గ్ తనకు కూతురు పుట్టిందన్న ఆనందంతో ఆస్తిలో 90శాతం ప్రపంచ పేదరిక నిర్మూలనకు విరాళంగా ప్రకటించాడు. తన సంతోషంతో నిరుపేదల ఆకలి దప్పులు తీరితే చూచి ఆనందిస్తానన్నాడు. అదీ మానవత్వం. అదీ గొప్పతనం. అదీ గొప్పగుణం. ప్రపంచ ప్రఖ్యాత మార్షల్ ఆర్ట్స్ నటుడు జాకిఛాన్ తన సినీరంగ సంపాదనలో 75శాతం పేదరిక నిర్మూలనకు విరాళంగా ఇస్తున్నాడు. త్వరలో మరో పదిశాతం పెంచుతానంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల తన చిత్రాలను ఆదరిస్తున్నందునే, వసూళ్ళ పరంపర కల్పిస్తున్నందునే -సాధారణ వ్యక్తిని ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ గుర్తింపు తెచ్చుకోగలిగానన్నాడు. తన సినిమాలను ఆదరించి అభిమానులు, ప్రేక్షకులు ఇచ్చిన ఆస్తిని పేదల కోసం ఖర్చుపెట్టడానికి మించిన ఆనందం లేదన్నాడు. మనిషిగా అది తన ధర్మమని, ఋణం తీర్చుకోవడమే అవుతుందని మీడియా ముందు ఉద్వేగంగా ప్రకటించాడు. అదీ నిజాయితి. అదీ మానవత్వం. అదీ దానగుణం. ఇలాంటివాళ్లే చరిత్రలో ఒక పేజీ సంపాదించుకుంటారు. కనీసం -మనవాళ్లు అక్కడ అడుగుపెట్టి, అలాంటి గొప్పవాళ్లతో స్నేహం చేసి, అలాంటి గొప్ప గుణాలనైనా అలవర్చుకుని వస్తున్నారా? అంటే అదీ ఉండదు. వృత్తిపరంగా సోకులు, సంబరాలు తప్పవనుకున్నా -మనిషిగా సాధించిన విజయంలో, సంపాదించిన ఆస్తిలో పిసరంత పరులకు తిరిగి ఇవ్వలేని గుణం ఉన్నవాళ్లను ఎందుకంత గొప్పగా చూడాలి. వాళ్లు కనిపించినపుడో, బయటకు వచ్చినపుడో ‘మేం అభిమానులం’ అంటూ వేలంవెర్రిగా ఎందుకు పరుగులెత్తాలి?
మన క్రీడాకారులకు, నటీనటులకు, రాజకీయవేత్తలకు కీర్తికోసం ఆరాటమెక్కువ. లండన్‌లోని మేడం టుస్సాడ్ మ్యూజియం వారు మైనపు బొమ్మలు చెక్కుతాం, మ్యూజియంలో పెడతామని అడిగీ అడకముందే మనవాళ్లు ఆత్రంగా కొలతలిచ్చి సంబరపడతారు. పిదప లండన్ వెళ్లినపుడు ఆ మైనపు విగ్రహాన్ని చూసుకుని ఉబ్బితబ్బిపైపోతారు. ఇదంతా కీర్తికాముకత్వం. ప్రపంచ ప్రజల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచిపోయే ‘మదర్’నే తీసుకుందాం. భారతరత్న, నోబుల్ గ్రహీత మథర్ థెరిసాను 30ఏళ్ల కిందటే టుస్సాడ్ మ్యూజియం వారు మైనపు విగ్రహం పెట్టేందుకు సంప్రదించారట. ‘శిల్పాలు, బొమ్మలు నాకు ఇష్టం లేదు. నిరుపేదలు, అనాధలు, వ్యాధిగ్రస్తుల హృదయాల్లో ఒకింత చోటుచాలు’ అంటూ మ్యూజియంవారి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిందట. అటువంటి మహోన్నత గుణంలో వందోవంతు అయినా కీర్తిని సంపాదించుకుంటున్న క్రీడాకరులు, నటీనటులు, రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఉంటుందా? వస్తుందా?
కొందరు సెలబ్రిటీలు ఏదో సామాజిక సేవ చేస్తున్నాం... ఫౌండేషన్ సంస్థలు పెట్టాం.. పదిమందిని చదివిస్తున్నాం.. అనాధలకు నీడ కల్పిస్తున్నాం.. ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నాం.. ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తగా ఉన్నామంటూ డబ్బా కొట్టుకోవడం ఇటీవల మీడియాలో ఎక్కువైంది. గోరంత సహాయానికి కొండంత ఆర్భాటం చేస్తున్నారు. మీడియా మార్కెట్‌లో కనిపించే ఆ ఆర్భాటంతో ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, బెనిఫిట్లు పొందుతున్న వాళ్లనూ చూస్తున్నాం. కోట్ల ఆదాయం సంపాదిస్తూ ఇరవైమంది పిల్లలను ఆదుకోవడం గొప్పా? కోటిలో వెయ్యి రూపాయల ఖర్చు దాతృత్వమా? మరింత మార్కెట్ చేసుకుని అభిమానులను పెంచుకోవడానికే ఈ తతంగం అన్న విషయం అర్థమవుతూనే ఉంటుంది. ప్రభుత్వం నుంచి అవార్డులు, రివార్డుల కోసమో, మరేవిధంగానో లబ్ది పొందే ప్రయత్నమే ఇదంతా అన్నది అక్షర సత్యం. ‘శ్రీమంతుడు’ చిత్రం చూశాం. మాలో మానవత్వం కదిలించింది. గ్రామాలను దత్తత తీసుకుంటున్నాం అని ప్రకటించిన పెద్ద మనుషులు ఆయా గ్రామాలను అభివృద్ధిపర్చారా? ఆ సీజన్‌లో స్టేట్‌మెంట్లు ఇచ్చిన వాళ్లంతా -సీజన్ మారగానే కనిపించకుండాపోయారు. ఇదీ సినీ బాగోతం. చేసేవారు చెప్పరు. చెప్పేవారు చేయరన్న సామెత మనకు తెలీంది కాదు.
చివరిగా టాలివుడ్ చిత్రరంగానికి వద్దాం. పంచ్ డైలాగ్స్ కొట్టేవారు.. వంశాన్ని కీర్తించుకునే వారు.. ఒక్క దెబ్బతో పదిమందిని కుప్పకూల్చేవారు.. వారసత్వం ముసుగులో తొంగి చూచేవారు.. పెట్టుడు బిరుదులకే పొంగిపోయేవారు.. బ్లాక్ బస్టర్ చిత్ర హీరోలు.. రికార్డులు తిరగరాసిన పహిల్వాన్లు కేన్స్‌లాం అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో కనిపించరేం. వారి చిత్రాలు అక్కడ ప్రదర్శించబడవేం? ఓవర్‌సీస్ కలెక్షన్లతో కోట్ల క్లబ్‌లు దాటేశామని జబ్బలు చరుచుకునేవారి సినిమాలు, కథలు ఒక్కటీ అక్కడ కనిపించవేం. నాసిరకం కథ, నాసిరకం నటన, నాసిరకం సంగీత సాహిత్యాలు, అర్ధనగ్న తైతక్కలు.. సినిమాల నిండా ఇవేవుంటే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎందుకు అర్హత సంపాదిస్తాయి. ఒకవేళ ఇలాంటి చిత్రాల ప్రదర్శనకు అవకాశం దొరికినా.. మనకు మర్యాద నిలుస్తుందా? తెలుగు చిత్రరంగం పట్ల ఉన్న కొద్దిపాటి (అక్కినేని, నందమూరి కాలం) గౌరవం మట్టిపాలు కాదా? తెలుగు సినిమా ఎంత ఆధునిక స్థాయికి చేరుకున్నా -అలాంటి ఉత్సవాలస్థాయి మన టాలీవుడ్‌కు లేదని సరిపెట్టేసుకోవడమే ఉత్తమమేమో.

-మురహరి ఆనందరావు