Others

కొత్త పొద్దు పొడవాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా సృజనాత్మక వ్యాపారమే. ఎవ్వరూ కాదనలేరు. అందుకోసమే ఏటా లెక్కకుమించి చిత్రాలు విడుదలవుతున్నా -సంస్కృతీ సంప్రదాయాన్ని, విలువలను నిలబెట్టే సినిమా ఒక్కటీ రావడం లేదన్నది మాత్రం ఎవ్వరూ కాదనలేని నిజం.
**
తెలుగు సినిమాలను తెలివున్న వాళ్లెవరూ చూడటం లేదన్న టాక్ జనంలో బాగా బలపడింది. కారణం -లేకితనానికి మారుపేరుగా మారడమేనన్న వాదన వినిపిస్తోంది. విజయ, వాహినీ, నాగిరెడ్డి, చక్రపాణి, నాగయ్య, భానుమతి, రేలంగి, యస్వీ రంగారావు, సముద్రాల, ఘంటసాల, సింగీతం శ్రీనివాసరావు, మాధవపెద్ది వంటి మంచి సృజనాత్మక వ్యక్తుల స్థానంలో కులమురికి సమృద్ధిగా చేరింది. పరోక్ష వామపక్ష మార్గాన్ని తెలుగు సినిమాకి పునాదిగా, రాజమార్గంగా, సంప్రదాయంగా స్థిరపరచిన నీచ స్వభావుల లోభగుణంతో ప్రస్తుత తెలుగు సినిమా రంగం లోపల్లోపల కుళ్లిపోయి, పైకి మాత్రం మేకప్ హంగులతో కవిరి కంపుకొడుతోంది. ఈ ధోరణి చస్తేనే, సరికొత్త తెలుగు సినిమా బతికి బట్టకడుతుందని ప్రస్తుతం పరిశ్రమను ఏలుతున్న పెద్దలు గ్రహించాలి.
ఒకప్పుడు సత్వగుణం, త్యాగం, సృజనాత్మకతలకు పరాయి పాలనలో ఎంతో శ్రమకోర్చి పునాదులు వేసిన మహనీయుల కృషిని ఈ పెద్దలనబడే రాబంధులు బూడిదలో పోసిన పన్నీరుగా మార్చి, మూడుతరాల తెలుగు ప్రేక్షకులను వెర్రివాజమ్మలను చేశారు. దేశభక్తి, దైవభక్తి భారతీయత తెలుగుదనంతో హృదయాలను రంజింపజేసే సినిమాల స్థానంలో మురికి భావాలు, లేకి నటన, మూర్ఖ దర్శకత్వం, చచ్చు సాహిత్యం, పిచ్చి హాస్యంతో తెలుగు సిన్మాలు చూసేవాళ్ళను హింసిస్తున్నాయి.
మంచి నిర్మాతలు, రచయితలు, నటులు, దర్శకులను సైతం ఈ సూడో కళాపోషకులు తమ ధనమదంతో చెత్తమార్గంలోకి విజయవంతంగా లాగారు. దీనికి ఉదాహరణగా విశ్వనాథ్, కృష్ణ, సిరివెనె్నల, హరనాథ్, పద్మనాభం, సావిత్రి, వేటూరి, బాలువంటి మరెందరో మంచి నైపుణ్యం, సహృదయశీలుర్ని ఈ లేకి సినిమా కోటరీ నాశనం చేసింది. మహామహులు తీసిన గొప్ప సినిమాలకు థియేటర్లు దొరక్కుండా, ప్రచారం జరక్కుండా చేసిన మరుగుజ్జు మనస్తత్వానికి ముగింపుకోసం తెలుగు ప్రజానీకం ఎదురుచూస్తోంది.
నేరాలు, ఘోరాలు, మానభంగాలు, హత్యలు, ఆత్మహత్యలకు తెలుగు సినిమా పేరుగాంచింది. జరిగిన ప్రతి చెడ్డ సంఘటనకు ఈ కుహనా నాయకులు బాధపడిన దాఖలాలేకపోగా, మనకు ఇక తిరుగులేదనే సంతోషంతో వ్యవహరించడం దారుణం.
నల్ల ధనమేగాక, దొంగ, దోపిడీ, మాఫియా ధనికులకు తెలుగు సినిమారంగం వేదికగా మారుతోంది. దీనికి అధికార, ప్రతిపక్ష, కుల రాజకీయం తోడైంది. వాళ్ళు తీసిన, తీస్తున్న అసభ్య, బూతు సినిమాలు ఒకటికి రెండుసార్లు చూస్తే వారికే తెలుస్తుంది. కానీ వాళ్ళు చూడరు, విమర్శను విన్పించుకోరు. కుళ్ళు కళ్ళున్న గుడ్డివాళ్ళు. ముహూర్తంలో దేవుడు, మంత్రాలు, పురోహితుడు కావాలి. సినిమాలో బ్రహ్మానందం, అలీలతో హిందూ దేవుళ్ళను, మంత్రాలను, బ్రాహ్మణులను కించపర్చడం దేనికి నిదర్శనమో వారే చెప్పాలి. హిందూ ధర్మాన్ని నమ్మనివాళ్ళే అయితే నిర్భయంగా చెప్పాలి. ముస్లిం, క్రైస్తవ మతాలను ఇలా హేళన చేసి, అసభ్యంగా చూపగలరా? ఇక పోలీసులను, టీచర్లను, సంగీత విద్వాంసులను, పండితులను, కవులను నీచాతినీచంగా చూపుట అలవాటుగా మారింది. ఇలా తీసేవాళ్ళకు బహుశా అదే మనస్తత్వం ఉంటేనే అట్లా తీయగలరు.
రాష్ట్ర విభజనకుగల పెద్ద కారణాలలో తెలుగు సినీ పెద్దల అహంభావ వైఖరి ఒక ప్రముఖ కారణమని తెలిసిపోయింది. ఇకముందైనా ఈ ప్రముఖులు లెంపలువేసుకుని మంచి సినిమాలు, మంచి దృష్టి ఉద్దేశ్యంతో తీస్తే మంచిది. లేదా తప్పుకుంటే కొత్తనీరు వచ్చి చేరుతుంది. మురికిని తొలగించేందుకు ఇది చక్కని కాలం. సినిమా, మీడియా, విద్యారంగం, వైద్యరంగం ఒకే మాఫియా చెట్టుకొమ్మల్లాగా రాష్ట్రంలో విస్తరించాయి. వీటి మూల వేరుకు యాసిడ్ వైద్యం హైద్రాబాద్‌లో జరిగింది. ఈ విష వృక్షం మళ్ళీ విజయవాడ, విశాఖపట్నం నగరాలకు విస్తరించకుండా ఉంటే సరికొత్త జవజీవాలతో తెలుగు సినిమాలు వస్తాయనటంలో సందేహం లేదు. దీనికి మేధావులు, రాజకీయ నేతలు హృదయ పూర్వకంగా కృషిచేయాలి. ప్రజలెప్పుడూ మంచివెంటే ఉంటారు.

-పి రాజేశ్వరరావు, జగ్గయ్యపేట