Others

ఏదీ బృందగాన మాధుర్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో కనీసం ఒక్క బృంద గానమైనా లేని సినిమా మచ్చుకు కూడా ఉండకపోయేది. డ్యూయెట్లు, భజనలు, అంతర్నాటకాలతో బృంద గానాలు కూడా సినిమాకు వనె్న తెచ్చేవి. అప్పటి నిర్మాతలు సినిమాలలో బృంద గానాలకు స్థానం కల్పించేవారు. కొన్ని చిత్రాల్లో ఈ బృంద గానాలు కథలో అంతర్భాగం కావడంతో ప్రేక్షకులు వాటిని బహుదా ఆదరించారు.
**
ఆధునిక సినిమా కాలానికి వచ్చేసరికి బృందగానాలు కాస్తా -బూతు గానాలుగా మారిపోయాయ. ఒకటీ అరా సినిమాల్లో కోరస్‌కు చాన్స్‌లు దొరికినా -ఆ పాటల్లో డబుల్ మీనింగ్ పదాలకే ప్రాధాన్యత పెరిగింది. పైగా బృందగానాలు ధ్వనికాలుష్యాన్ని పెంచడంతో మాధుర్యం అనేది మట్టిలో కలిసిపోయంది.
**
బృంద గానాలవల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. ప్రధాన గాయకుడు లేక గాయకితో గొంతు కలిపి పాడటం అంత సులభమేమీ కాదు. ఈ బృంద గానాల్లో పాల్గొన్న వారిలో కొందరిని భవిష్యత్‌లో ప్రధాన గాయకులుగా కూడా తీసుకొనేవారు.
పూర్వం దాదాపు అన్నీ జానపద చిత్రాలే. ఒకరాజుగారు, ఆయన కుమార్తె తప్పనిసరి పాత్రలు. మరి రాకుమారి ఉన్నప్పుడు వ్యాహ్యాళికి వెళ్లడానికి తోట ఉండాలి. ఆ తోటలో చెలికత్తెలతో కథానాయిక గానం చేస్తుంటే చెలికత్తెలు ఆమెతో కలిసి పాడేవారు. వసంతగానమే హారుూ, వసంత నాట్యమే హాయ్ హాయ్ ఇలాంటిదీ.
జగదేకవీరుడు చిత్రంలో దేవలోకంనుంచి భూలోకానికి వచ్చి ఇక్కడ ఒక కొలనులో స్నానమాడుతూ ‘ఏమి హాయి లే హలా’ అంటూ పాడిన పాట ఇలాంటి బృందగానమే. పౌరాణిక చిత్రాల్లోనూ బృంద గానాలు సందర్భోచితంగా ప్రవేశపెట్టేవారు. అవి అసలు కథకు మరింత మెరుగుపెట్టి రాణింపచేసేది.
ఇంద్రుడి దర్బారులో నాట్యకత్తెలు నృత్యం చేస్తూ బృందగానంలో పాల్గొనేవారు. ‘వరింపవచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా? అవున చెలీ, అవున సఖీ అయితే వినవే మా మాట కూడా’ జగదేకవీరుడు లోనిదే! సాంఘిక చిత్రాలలో కూడా బృంద గానాలకు ఆనాటి నిర్మాతలు స్థానం కల్పించేవారు. ఒక సూపర్ హిట్ సాంఘిక చిత్రరాజంలో కథానాయకుడు నాగేశ్వరరావు ఇతర తోటి విద్యార్థులతో కలిసి హాస్టల్‌లో పాడిన పాట అందరికీ గుర్తుండే వుంటుంది. ‘ఉప్పూకారం లేని హోటల్ సాంబారుతో చప్పబడిపోయామురా బ్రదర్...’ అన్న పాట వింటున్న యువజనులు, విద్యార్థుల చప్పట్లతో, ఈలలతో హాలు మారుమ్రోగిపోయేది.
కొన్ని చిత్రాలలో గురు, శిష్యులు కలిసి తత్వాలు బృందగానంగా పాడేవారు. బృంద గానాలుకాకపోయినా ఇరువురిమధ్య పాడించిన పాటలు కూడా ప్రేక్షక జనామోదాన్ని పొందాయి. పిబి శ్రీనివాస్ సారథ్యంలో ‘శాంతి నివాసం’లో వినిపించిన బృందగానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంది. ఒక్కొక్క సందర్భంలో ఇరువురిమధ్యా పాడించిన పాటలు కూడా హాస్య రసస్ఫోరకంగా ఉండేవి. ఒక చిత్రంలో తాను సన్యాసిని అన్నట్టు ‘కాశీకి వెళ్లాను రామాహరీ/ గంగతీర్థమే తెచ్చాను రామాహరీ’ అని రేలంగి అంటే అంతకన్నా పెద్ద స్వరంతో గిరిజ ‘కాశీకి పోలేదు రామాహరీ/ గంగ తీర్థమ్ము తేలేదు రామాహరి’ అన్న వంత పాటకు అవి ‘సైడు కాల్వలో నీళ్లేను రామాహరీ’ అన్నది కొసమెరుపు. ఒకరుకన్నా ఎక్కువమంది పాల్గొనే బుర్రకథను కూడా మనం బృంద గానంగా పేర్కొనవచ్చు. పౌరాణిక చిత్రాలలో భజనలు తప్పనిసరే! అవన్నీ బృంద గానాలే! భక్తపోతన, యోగివేమన, త్యాగయ్య వంటి భక్తిరస చిత్రాల్లోని బృంద గానాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. ఒక విజయవంతమైన సాంఘిక చిత్రంలో రేలంగి ‘గుళ్లో హాజరు ప్రతి శనివారం, గూడుపుఠాణి ప్రతాదివారం’ పాడుతుంటే సీతారాం, సీతారాం అంటూ మిగిలినవారు బృంద గానంలో పాల్గొంటారు. ఈ పాటలలో చాలా భాగం వేదాంత ధోరణిలో ఉండేవి. అప్పటి పాతకాలపు ప్రేక్షకులు తత్వాలను ముఖ్యంగా వేమనగారి బోధనలను, బ్రహ్మంగారి తత్వాలను ఎక్కువగా ఇష్టపడేవారు. ‘వేమన బోధనలు వినరండీ’ అనే పాట కూడా బృంద గానంగానే చిత్రీకరించారు. తత్వాలను కొద్దిగా మార్చి కొన్ని దురాచారాలను ఖండించడానికి బృంద గానాలుగా ప్రవేశపెట్టేవారు. పిఠాపురం నాగేశ్వరరావు బృందం, వారి పాటలు సాంఘిక చిత్రాల్లో రాణించినట్టు, మాధవపెద్ది సత్యం బృందం పాటలు పౌరాణిక చిత్రాలకు వనె్నతెచ్చాయి.
మహాకవి దేవులపల్లి కృష్ణశాస్ర్తీ తెలుగువారికి ప్రసాదించిన గేయాలలో ‘జయజయజయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి/ జయజయజయ శతసహస్ర నరనారీ హృదయనేత్రి’ అనే గేయం బాలలచే రేడియోలో పాడించేవారు. అదే పాటను ‘రాక్షసుడు’ చిత్రంలో పాఠశాల విద్యార్థులచే బృందగానంగా పాడించారు.
ప్రేక్షక జనాదరణ లేనందువల్లనే బహుశ బృందగానాలు చిత్రాల్లో నేడు కరువైపోతున్నాయి. ఒక మాటనే పాటగా పాడి ఆనందించి కేరింతలు కొడుతున్న యువతకు ఇప్పుడు డ్యూయెట్లమీద, భజనలమీద ఆసక్తి లేదు. ఒకవేళ హీరోయిజాన్ని ఎక్స్‌పోజ్ చేయడానికో, ఐటెమ్ పాటల్లోనూ ఇలాంటి గొప్ప కోరస్ ప్రక్రియను వాడుకున్నా -అర్థంపర్థం లేకుండా పోతోంది. అందుకే మనకు ఆ రకమైన దృశ్యాలు, చిత్రాలు మృగ్యమైపోతున్నాయి.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం