Others

హంతకులొస్తున్నారు జాగర్త! (ఫ్లాష్‌ బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూర్పు: కందస్వామి
కెమెరా: ఎస్‌ఎస్ లాల్
కళ: యం సోమనాథ్
స్టంట్స్: శివయ్య
మాటలు: టి మహారథి
పాటలు: సి నారాయణరెడ్డి
సంగీతం: విజయాకృష్ణమూర్తి
నిర్మాత: పింజల సుబ్బారావు.
దర్శకత్వం: యస్‌డి లాల్

మచిలీపట్నానికి చెందిన పింజల సుబ్బారావు 1957లో మద్రాస్‌కు వచ్చి కొన్ని సినిమాల్లో నటించారు. ‘రామాంజనేయయుద్ధం’, ‘సతీసుకన్య’ చిత్రాలతోపాటు మరికొన్ని చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజరుగానూ పనిచేశారు. కొంతకాలం వేస్ట్ ఫిల్మ్ వ్యాపారం చేశారు. తరువాత ఒక తమిళ చిత్రాన్ని ‘రాజద్రోహి’ పేరిట అనువాదం చేసి విడుదల చేశారు. సొంతంగా చిత్రాలు నిర్మించాలని ‘నానళ్’ తమిళ చిత్రాన్ని హక్కులు కొని ‘హంతకులొస్తున్నారు జాగర్త’గా పియస్‌ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. 50ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 6, 1966న విడుదలైంది. ‘నానళ్’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కె బాలచందర్ సమర్పిస్తే, తెలుగు చిత్రానికి యస్‌డి లాల్ దర్శకత్వం వహించారు.
***
తమకు జైలుశిక్ష విధించిన జడ్జిపై పగ తీర్చుకోవాలని నలుగురు దొంగలు అతనింటికి చేరిన కథే ‘నానళ్’. ఆ చిత్రంలో జడ్జిగా వియస్ రాఘవన్, భార్య సావిత్రిగా షావుకారు జానకి, చెల్లెలుగా కెఆర్ విజయ, ఇన్‌స్పెక్టరుగా ముత్తురామన్, తమ్మునిగా శ్రీకాంత్, గుమస్తాగా నాగేష్, దొంగల్లో ఒకడిగా మేజర్ సౌందర్‌రాజన్ నటించారు.
తెలుగులో కథను కొద్దిగా మార్చితీయడం జరిగింది. ధనంజయరావు (కాశీనాథ్ తాతా)ను జైలునుంచి తప్పించుకున్న నలుగురు దొంగలు ప్రభాకర్‌రెడ్డి, త్యాగరాజు, ఉదయకుమార్ (కన్నడ నటుడు), మరో విలన్ సముద్రం ఒడ్డున హత్య చేస్తారు. అతని కుమారుడుని కూడా చంపబోతుండగా ఓ పెద్దమనిషి రఘురామయ్య (గుమ్మడి) ఆ దృశ్యాన్ని చూస్తాడు. ఇంతలో పోలీసులు రావటాన్ని గమనించిన దొంగలు అక్కడినుంచి పారిపోతూ, జరిగిన విషయం ఎవరికైనా చెబితే కుటుంబాన్ని నాశనం చేస్తామని రఘురామయ్యను బెదరిస్తారు. తరువాత టైటిల్స్ అస్తిపంజరం, సంకెళ్లు, జైలు, సాలెగూడు వంటి చిత్రాలను చూపిస్తూ సాగుతాయి.
టైటిల్స్ పూరె్తైన తరువాత -పోలీసులు నలుగురు దొంగలనీ బంధించి పోలీసు స్టేషన్‌కు తీసుకొస్తారు. అదే సమయానికి తన చెల్లెలు జయ (గీతాంజలి)కు నిశ్చయమైన వరుడు పోలీస్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ (రామకృష్ణ)ను కలిసేందుకు రఘురామయ్య కూడా అదే పోలీస్‌స్టేషన్‌కు వస్తాడు. అక్కడ రఘురామయ్యను చూసిన దొంగలు, అతనే తమను పోలీసులకు పట్టించాడని భావిస్తారు. ఒక సందర్భంలో -రఘురామయ్య తన మామగారికి బాగలేదని ఊరు వెళతాడు. ఇంటిలో భార్య సావిత్రి (అంజలీదేవి), తమ్ముడు మురళి (చలం), చెల్లెలు జయ, కళ్ళులేని తండ్రి, నౌకరు పోతురాజు (బాలకృష్ణ) ఉంటారు. జైలునుంచి తప్పించుకున్న హంతకులు రఘురామయ్యను అంతం చేయాలనే కోపంతో వారింట ప్రవేశిస్తారు. ఆ కుటుంబ సభ్యులను హింసిస్తూ రఘురామయ్యకు ఫోన్ చేయించి ఊరినుంచి రప్పిస్తారు. ధనంజయరావు హత్య చూసిన అతని కుమారుడు పోలీసు కస్టడీలో ఉండగా, ఆ బాబుడిని చంపమని ఓ హంతకుడు త్యాగరాజును పంపుతాడు. తమనెందుకు ఇలా బాధిస్తున్నారని అడిగిన రఘురామయ్యకు పాపా (ఉదయ్‌కుమార్) తన ఫ్లాష్‌బ్యాక్ చెబుతాడు. తను గతంలో ధనంజయరావు కారు డ్రైవర్‌నని, అతను చేసిన కారు ఆక్సిడెంటు కేసు తనమీద వేసుకుని జైలుకెళ్తే, తన కుటుంబాన్ని కాపాడతానన్న ధనంజయరావు వారికి సాయం చేయలేదని వివరిస్తాడు. ఆ కారణంగానే తన భార్యా బిడ్డా మరణించారని, అందుకే తాము పగతో అతన్ని అంతం చేశామని ఫ్లాష్‌బ్యాక్ చెబుతాడు. హత్య చేయడానికి వెళ్లిన త్యాగరాజును ఇన్‌స్పెక్టర్ భాస్కర్ తెలివిగా బంధించి, తరువాత మిగిలిన హంతకులనూ బంధించి రఘురామయ్య కుటుంబాన్ని రక్షిస్తాడు. ఈ పోరాటంలో హంతకులు మరణించటం, భాస్కర్, జయలు ఏకం కావటంతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో భాస్కర్ తండ్రిగా రావి కొండలరావు, పాలమ్మాయిగా సురభి బాలసరస్వతి, కానిస్టేబుల్‌గా రామచంద్రరావు, మరో ఇన్‌స్పెక్టర్‌గా భీమరాజు, గుమస్తాగా పద్మనాభం నటించారు.
నటులంతా పాత్రోచితంగా తమ పరిధిమేరకు నటించి మెప్పించారు. పెద్దమనిషిగా గుమ్మడి, అతని భార్యగా అంజలీదేవి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునే పాత్రల్లోకి ఒదిగిపోయి పరిణితితో మెప్పించారు. జయగా గీతాంజలి నటన చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండటం విశేషం. ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌గా రామకృష్ణ పాత్రోచితంగా చురుకుదనాన్ని, నిదానాన్ని ప్రదర్శించి మెప్పించారు. ప్రేమగీతం, సోలోసాంగ్‌లో హుషారు నటనలో కనిపిస్తారు.
రీమేక్ చిత్రాలకు సంబంధించి క్రైం చిత్రాల్లో ప్రత్యేక ప్రతిభ చూపించే దర్శకుడు యస్‌డి లాల్ -ఈ చిత్రాన్నీ తనదైన శైలిలో తీర్చిదిద్దారు. బీచ్‌రోడ్డులో ధనంజయ హత్య, కుక్కతో బాలుడు పారిపోవటం, ఇసుకలో కూరుకుపోవటం, నైట్ ఎఫెక్ట్‌లో ఓ అమ్మాయి పాట వైవిధ్యమైన చిత్రీకరణ, జయమీద ఆశపడిన హంతకుడు ప్రభాకర్‌రెడ్డి ఆమెను బలవంతం చేయటం, దాన్ని కింద పళ్లెంలో చూసిన ఉదయకుమార్ మేడమీదకు అతి తేలికగా చేరుకుని తుపాకితో కాల్చి చంపటం, ఈ విషయంపై మరో విలన్‌తో ఉదయ్‌కుమార్ మధ్య సాగిన పోరాటాన్ని థ్రిల్లింగ్‌గా చూపటం, తాంబూలంలో విషం పెట్టి హంతకులను చంపాలనే నౌకరు ప్రయత్నాన్ని మానవత్వంతో అంజలీదేవి వారించటం, చివరలో తెలివిగా ఇన్‌స్పెక్టర్ ఇంటిలోకి ప్రవేశించి హంతకులతో పోరాటం సాగించటం, ఇంటినుంచి తప్పించుకున్న హంతకులు చివరకు అంతం కావటం... ఇలా వెరైటీ సన్నివేశాలతో దర్శకుడిగా తనదైన శైలిని ప్రదర్శించారు యస్‌డి లాల్. ఒకే ఇంటిలో పలు పాత్రలు, వారి హావభావాలు, బయటినుంచే వచ్చివెళ్ళే గుమాస్తా, వీటిని బాలన్స్ చేస్తూ చక్కగా సాగించిన చిత్రీకరణ ఆసాంతం ఆకట్టుకుంటుంది.
ఇక పాటల విషయానికి వస్తే-
గీతాంజలి, కుటుంబ సభ్యులపై చిత్రీకరించిన తొలి గీతం -మా చల్లని ఇల్లు మమతల పుట్టిల్లు మా ఇంట వెలసెనులే (గానం- పి.సుశీల). రామకృష్ణ, గీతాంజలిపై చిత్రీకరించిన పాట -పల్లవించిన భావాలు పరిమళించెను ఈనాడు (పి సుశీల). రామకృష్ణ, గీతాంజలిపై నైట్ ఎఫెక్ట్‌తో రాత్రిపూట వంతెనలపై, ఫుట్‌పాత్‌పై చిత్రీకరించిన తమాషా గీతం -అమ్మారుూ ఓ అమ్మారుూ నువు గమ్మత్తుగా ఇటు రావాలి/ నీ చేయి నాచేరుూ నాజూకుగా పెనవేయాలి (ఘంటసాల). అంజలిదేవి వెంకటేశ్వరుని ప్రార్థిస్తూ పాడే గీతం (చలం, గీతాంజలి మిగిలిన వారిపై చిత్రీకరణ) -దిగి రావయ్యా ఓ దేవా నింగిని తావే కొండకోనలో నిండుగ కొలువై వున్నావా? (ఘంటసాల, సుశీల).
తొలి సినిమాగా క్రైం సబ్జెక్ట్‌తో పింజల సుబ్బారావు నిర్మించిన సాంఘిక చిత్రం ప్రత్యేక సస్పెన్స్ చిత్రంగా నిలిచింది. తరువాత వీరు పలు జానపద, సాంఘిక, క్రైం, పౌరాణిక చిత్రాలు రూపొందించారు. ‘హంతకులు వస్తున్నారు జాగ్రత్త’ ప్రేక్షకుల మన్నన పొందిన చిత్రంగా నిలవటం విశేషం. ఇదే కథాంశంతో హిందీలో 1974లో ‘చత్తీస్‌ఘంటే’గా రూపొందించారు.

-సివిఆర్ మాణిక్యేశ్వరి