AADIVAVRAM - Others

అడవి బిడ్డల అద్భుత కళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవి బిడ్డల అద్భుత వర్ణచిత్రాలిప్పుడు ‘ఆన్‌లైన్’లో హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. గిరిజన చిత్రకళకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. సంప్రదాయ సిద్ధంగా తమతమ పద్ధతుల్లో, వివిధ వస్తువులను, జంతువులను, పక్షులను, తీగెలను, చెట్లను చిత్రిస్తున్న యువ ఆదివాసీ (గిరిజన) చిత్రకారుల సృజన కొత్త అందాలతో కొలువుతీరింది.
అడవి బిడ్డలేమిటి? ఆర్ట్ ఏమిటి?.. ఆన్‌లైన్ ఏమిటి?.. హాట్‌కేక్ లేమిటి? అని కొందరు ఆశ్చర్యపోయినా ఇది నూటికి నూరుపాళ్లు నిజం.
ఆదివాసీలు తమ ఆలయాల వద్ద, ఇళ్లకు అనేక సంప్రదాయ చిత్రాలను వేసుకుంటారు. శతాబ్దాలుగా ఈ ‘ట్రైబల్ ఆర్ట్’ వర్థిల్లుతోంది. స్థానికంగా లభించే దేశీ రంగులతో తమ పూర్వీకులు వేసిన వేట దృశ్యాలను, జంతువులను, ఇంట్లో కనిపించే వస్తువులను, నృత్యాలను, శ్రమైక జీవన సౌందర్యపు బొమ్మలు గీయడం వారికి పుట్టుకతో అబ్బిన విద్య. ఇది తరం తరువాత తరం కొనసాగుతూ వస్తోంది.
అబ్బురపరిచే ఈ ఆదివాసీల ‘ఆర్ట్’ వాళ్ల గూడెలకు, గ్రామాలకు, ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయకుండా, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని, తెలంగాణ ఆదివాసీల సృజన శక్తిని లోకానికి చాటాలని, వారి వర్ణ అవగాహనను, వస్తువును, రంగుల పోహళింపును, పొందికగా కనిపించే ఆకృతులను అందరి దృష్టికి తీసుకురావాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన మ్యూజియం క్యూరేటర్ ద్యావ సత్యనారాయణ పూనుకుని వివిధ ప్రాంతాలలోని ఆదివాసీ చిత్రకారులను హైదరాబాద్‌కు రప్పించి, చిత్రలేఖనానికి అవసరమైన కాన్వాసులు, రంగులు, బ్రష్‌లు, ఈజిల్స్ తదితర సదుపాయాలు సమకూర్చి కొంత కాలం శిక్షణను ఇచ్చి ‘ఆర్ట్ క్యాంప్’ను నిర్వహించారు. గోండ్, నాయక్ పోడ్, కోయ తెగలకు చెందిన యువ చిత్రకారులు ఇందులో ఉత్సాహంగా పాల్గొని తాము బాల్యం నుంచి చూస్తూ వస్తున్న తమదైన సంప్రదాయ గిరిజన చిత్రకళకు మెరుగులు దిద్దుతూ ఆదివాసీల జీవితాన్ని వర్ణ చిత్రాలుగా తర్జుమా చేశారు. కొందరు మాస్క్‌లను తయారుచేశారు. మొత్తం మీద కొత్త వర్ణ ప్రపంచం కొలువుతీరింది.
మడలి రాజేశ్వర్ అనే గోండు యువ చిత్రకారుడు హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బిఎఫ్‌ఏ కోర్సు చేస్తున్నాడు. అతనికి కాన్వాస్‌పై బొమ్మలు గీసే విధానం తెలుసు. వర్తమాన చిత్రకళపై కొంత అవగాహన ఉంది. అలాగే తన ఆదివాసీ పునాదులు బలంగా ఉన్నాయి. దాంతో తోటివారికి అవసరమైన సూచనలు - సలహాలు అందించాడు. కాన్వాసుపై బొమ్మలు గీయడంలో గల బెరుకుతనాన్ని పోగొట్టి ధైర్యంగా ఆదివాసీల ‘వస్తువు’ను కుంచెతో గీయడాన్ని ప్రోత్సహించాడు. దేవాలయాలపై, గోడలపై ఇతర చోట్ల గీసిన బొమ్మలకు కొంత మెరుగులు దిద్ది ‘ట్రైబల్ ఆర్ట్’ మూల భావనకు ఏ మాత్రం గండిపడకుండా వారు వర్ణచిత్రాలను రూపొందించారు.
అలా ఆకృతిదాల్చిన చిత్రాలు అధికారులను అబ్బురపరిచాయి. ఆదివాసీలది ఎంత గొప్ప చిత్ర కళాసంపద అని మురిశారు. ఆదివాసీ యువ చిత్రకారుల ప్రతిభకు, సృజనకు జేజేలు పలికారు. వాటిని మ్యూజియంలోనో, మరోచోటనో పెట్టడంగాక ఈ విశిష్ట చిత్ర సంపదను ప్రపంచానికి చూపాలని, అభిరుచి గలవారు కొనుక్కునేందుకు వీలుగా అమెజాన్ వాళ్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో పెట్టారు. ఆశ్చర్యం తొలిసారి పెట్టిన 17 వర్ణ చిత్రాలను అడవి బిడ్డల సృజనకు ముగ్ధులైన ఆర్ట్ ప్రియులు, చిత్ర కళాభిమానులు, అభిరుచిగల చిత్రకళా ప్రేమికులు కొనేశారు. ఈ పరిణామం ఇటు అధికారులకు, అటు యువ చిత్రకారులకు అనూస్య శక్తిని అందించింది. ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగించింది. ఆదివాసీ చిత్రకారులకు - అమెజాన్ ఆన్‌లైన్‌కు మధ్య వారధిగా ట్రైబల్ శాఖ అధికారులు నిలిచి రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఆర్ట్ క్యాంపులు కొనసాగుతున్నాయి.
ఇదొక పార్శ్వమైతే ఈ చిత్రకారులు వేసిన అనేక బొమ్మలను ఇటు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ (మాదాపూర్)లో, అటు దక్కన్ తాజ్ లాంటి చోట్ల ప్రదర్శనకు పెట్టగా నాగరిక ప్రపంచపు చిత్రకళా ప్రియులు ఒరిజినల్ గిరిజన తెగల చిత్రాలను, వారి శైలిని, రంగుల గాఢతను, భావుకతను, జీవితాన్ని చిత్రాల్లోకి ఒంపే వైనాన్ని తిలకించి ముగ్ధులయ్యారు. దాంతో చిత్రకళారంగంలోకి ఓ కొత్త ఆదివాసీ/ గిరిజన చిత్రకళా కెరటం ఉవ్వెత్తున ఎగిసినట్టయింది. తెలంగాణ చిత్రకళా వైభవానికి సరికొత్త ‘సొగసు’ తోడయింది. అడవి బిడ్డల ఆర్ట్ ‘అధ్యాయం’ ఆరంభమైంది.
మడవి రాజేశ్వర్
గోండు గిరిజనులు ఎంతో వెనుకబడిన వారని విన్నాం. కానీ వారిలో ఎందరో వర్తమాన సమాజానికి స్పందిస్తూ తమదైన ప్రతిభను, సృజనను చాటుతున్న వారు కనిపిస్తారు. అలాంటి వారిలో మడవి రాజేశ్వర్ ఒకరు. కొమురం భీం - అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం, రాశిమెట్ట గ్రామానికి చెందిన ఈ యువకుడు ప్రస్తుతం హైదరాబాద్‌లో హాస్టల్‌లో ఉంటూ బిఎఫ్‌ఏ కోర్సు చేస్తున్నాడు. చిత్రకళా ప్రపంచపు అంచులు తాకాలని ఉవీళ్లూరుతున్నాడు. రాజేశ్వర్ పోచమ్మలొద్దిలో ప్రాథమిక విద్య చదివాడు. ఆరవ తరగతిలో డ్రాయింగ్ టీచర్ ప్రోత్సాహంతో బొమ్మలు వేయడం ప్రారంభించాడు. ఖమ్మం జిల్లా పాల్వంచలో ఇంటర్ చదువుతున్నప్పుడు లోయర్, హైయ్యర్ డ్రాయింగ్ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్ విద్య పూర్తయ్యాక హైదరాబాద్‌లోని జెఎన్‌టియుసిలోని ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో 2016 సంవత్సరంలో చేరాడు. గోండ్ సంప్రదాయ పద్ధతిలో గీసిన రాజేశ్వర్ బొమ్మలు జోడేఘాట్‌లోని కొమురం భీం మ్యూజియంలో, మిగతా చోట్ల కనిపిస్తాయి. గత సంవత్సరం ఆదివాసీ మహాసభల సందర్భంగా చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేసి తన బొమ్మలు - తోటివారి బొమ్మలను పెట్టారు. అక్కడ సత్కారం కూడా పొందారు. చిత్రకళా రంగంలో చురుకైన పాత్రను పోషిస్తున్నాడు. ఆదివాసీ సామాజిక కార్యక్రమాల్లోనూ కనిపిస్తారు.
మడవి ఆనందరావు
ఇతను మడవి రాజేశ్వర్ తమ్ముడు. ఇటీవలనే ఇంటర్మీడియెట్ విద్యను పూర్తి చేశాడు. డ్రాయింగ్‌లో లోయర్, హయ్యర్ పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఈ ఏడాది ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో చేరనున్నాడు. అన్న ప్రోద్బలంతో చిత్రకళా రంగంలోకి వచ్చానని చెప్పాడు. అన్న నేర్పిన మెళకువలు తెలుసుకుని ఇప్పుడు అన్నను మించిన చిత్రకారుడిగా ఎదుగుతున్నాడు. ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ‘ఆర్ట్ క్యాంప్’లో పాల్గొని అద్భుత చిత్రాలను గీశాడు. తాను రోజూ చూసే కోడిపుంజును సృజనాత్మకంగా చిత్రించి అందరిని అబ్బురపరిచాడు. కోడిపుంజు కాళ్లు, చెట్టు వేర్లుగా చిత్రించి, తలపై ఆకుల కొమ్మను వేసి ఓ కొత్త అర్థాన్ని, అద్భుత సృజన శక్తిని చాటి అందరి చేత ‘శభాష్’ అనిపించుకున్నాడు. చివరికి ఈ పెయింటింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సి.ఎఫ్) జోషికి బహూకరించినప్పుడు ఆయన ఆనందరావును ప్రశంసలతో ముంచెత్తాడు. పిన్నవయసులోనే పెద్దవారి ఆశీస్సులు ఆశీర్వాదాలు అందుకున్న గోండు చిత్రకారుడు ఆనందరావు. అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందని ఆయన వేసిన బొమ్మలే చాటి చెబుతున్నాయి.
*
చిత్రాలు..మడవి రాజేశ్వర్.. 63005 79498 , మడవి ఆనందరావు.. 63017 38141

-వుప్పల నరసింహం 99857 81799