Others

ప్రయివేటు పాఠశాలల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన విద్యా సంవత్సరానికిగాను జూన్ 12వ తేదీనుండి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కానుండగా, విద్యార్థుల ప్రవేశాలపై ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రయివేటు విద్యాసంస్థల మధ్య సహజ సిద్ధంగా నెలకొనియున్న పోటీలు నానాటికీ తీవ్రతర మవుతున్నాయి. ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విద్యార్థుల అవసరాలు తీర్చలేక, ఉపాధ్యాయుల కొరతలు, భౌతిక వసతుల లేమి కారణాలుగా ప్రయివేటు విద్యా సంస్థలుప్రతి మండలంలో, మారుమూల ప్రాంతాలలో కుక్కగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రయివేటు విద్యాసంస్థలు విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రచారమే ప్రధానాయుధంగా, ప్రజల్లోకి వెళుతున్నాయి. వివిధ తరగతులలో ప్రవేశాలకోసం విద్యార్థులను, వారి తలిదండ్రులను ఆకట్టుకోవడానికి ఎన్నికల ప్రచారాన్ని తలదనే్న రీతిలో, ప్రయివేటు పాఠశాలలు, తెలుగు, ఆంగ్ల మాధ్యమ కానె్వంటు స్కూళ్ళు భేదం లేకుండా, తమతమ ప్రచార ఆర్భాటాలను ప్రత్యేక శైలులలో ముమ్మరం చేశాయి. కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెగ్జీలు, మైకులతో కూడిన వాహనాలు, స్థానిక కేబుల్ నెట్ వర్క్ ద్వారా ప్రచారాలు చేస్తూ, మారుమూల గ్రామాలకు సైతం తమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందంతో ప్రచారం నిర్వహించడం సర్వత్రా కనిపిస్తున్నది. ఈసందర్భంగా పాఠశాలల యాజమాన్యాలు చెప్పేమాటలు రాజకీయ నాయకుల ఎన్నికల హామీలను తలదనే్న రీతిలో ఉంటున్నాయి. తమ పాఠశాలనే అన్ని రంగాలలో ప్రత్యేక గుర్తింపును కలిగి ఉందని, తమ యాజమాన్యంలోనే, ఇతర పాఠశాలలలో లేని హంగులు కల్పించడం జరుగుతున్నదని, తమ విద్యా సంస్థనే ర్యాంకుల పంటలు పండిస్తున్నదని సంస్థల యాజమాన్యాలు ప్రచారాలు చేస్తుండగా, ఎవరి మాటలను విశ్వసించాలో? ఏపాఠశాలలో చేర్పించాలో? గ్రామీణ ప్రాంత విద్యార్థుల తలిదండ్రులకు పాలుపోని స్ధితి నెలకొన్నది. ఏటా కోకొల్లలుగా కొత్త పాఠశాలలు పుట్టుకు వస్తుండడంతో ఏ పాఠశాలలో చేర్పించాలో తెలీక తలిదండ్రులు తికమక పడుతున్నారు. ప్రయివేటు విద్యాసంస్థల స్థాపన, వాటి నిర్వహణ విషయంలో అధికారుల అజమాయిషీ లోపం కారణంగానే విద్యాబోధన పేరుతో యాజమాన్యాలు వ్యాపార దృక్పదంతో పాఠశాలలు ప్రారంభిస్తూ, ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవలి కాలంలో కానె్వంట్‌ల, ఇంగ్లీషు మీడియం పాఠశాలల పట్ల మధ్య తరగతి, పేద తరగతి వర్గాల్లోనూ పెరుగుతున్న మోజు కారణంగా, వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని, సదరు పాఠశాలల యాజమాన్యాలు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా పాఠశాలలను నిర్వహించడం సర్వత్రా కనిపిస్తున్నది. విద్యను నిర్వాహకులు వ్యాపార దృష్టితో చూస్తున్నారనే విమర్శలు నానాటికీ అధికమవుతున్నాయి. విద్యార్థి బలహీనంగా ఉన్నాడని, ట్యూషన్లు లేకపోతే పరీక్ష తప్పడం ఖాయమని, యాజమాన్యాలు చెప్పేమాటలకు తల్లిదండ్రులు తలొగ్గక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈనేపథ్యంలో జూన్ రెండవ వారంలో పాఠశాలలు పున:ప్రారంభం కానున్న సందర్భంలో ప్రయివేటు విద్యాసంస్థల జోరు ఊపందుకుంది. ఉచిత ప్రవేశాలు కల్పిస్తామని, నెలవారీ ఫీజుల్లో రాయితీలు ఇస్తామని, వసతి గృహాల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని, ఉచిత బస్ పాస్ సౌకర్యం వర్తింప జేయగలమని చెపుతూ, విద్యార్థుల జాబితాలను చేత పట్టుకుని, తమతమ నెలవులను వదిలి, గ్రామాల్లో ఇల్లిల్లూ తిరుగుతూ, తొక్కిన గడప తొక్కకుండా, కాలికి బలపాలు కట్టుకుని, తమసంస్థలోనే విద్యార్థులను చేర్పించాలని తలిదండ్రులను ప్రాధేయపడుతున్నారు. జిల్లాలో, డివిజన్‌లో, మండలంలో, తమకు సాటియైన, సరితూగగల సంస్థేలేదని, బోధన మరియు బోధనేతర విషయాలలో తమ విద్యార్థులే అన్ని రంగాలలో అగ్రగాములుగా ఉన్నారని, క్రమశిక్షణలో, ఉత్తమ విద్యాశిక్షణలో, పోటీ పరీక్షల విషయంలో విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచడంలో తమకు వేరెవరూ సాటి రారని స్కోత్కర్షలతో తమ అమ్ముల పొదిలోగల సకల సమ్మోహన అస్త్రాలనూ విద్యార్థుల తలిదండ్రులపై సంధిస్తున్నారు. విద్యాబోధనలో, ఫలితాల సాధనలో పోటీ మనస్తత్వం ఆహ్వానకర, ఆమోదయోగ్యమైన పరిణామమే అయినా, విద్యార్థుల ప్రవేశాలకై ప్రచారాలలో పోటీ పడడం, పిల్లల అడ్మిషన్లకై తలిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, తద్వారా నైతిక విలువలకు స్వస్తి చెప్పడం, విద్యారంగాన్ని వ్యాపార దృక్పదంతో చూస్తున్నారనే విమర్శలకు అవకాశాన్ని కల్పించడం ఆక్షేపణీయమని మేధావులు, విద్యావేత్తలు, విద్యాభిమానులు చేస్తున్న వ్యాఖ్యలను అవలోకించి, ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఆత్మ విమర్శలు చేసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉన్నాయి.

- సంగనభట్ల రామకిష్టయ్య