Others

కథలు మార్చండి బాసూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేక్షకుడు తిడితే -తిట్టారన్న ఏడుపేగాని, నిజానికి మన తెలుగు సినిమా కథలు ఎప్పుడివి చెప్పండి. ఒక్కో దశలో ఒక్కో ట్రెండ్ సృష్టించే కథను పట్టుకుని ఏళ్లతరబడి దానే్న నూరుతూ, కాస్త అటూఇటూగా అవే సన్నివేశాలు వండి వడ్డించేయడం ఏమైనా బాగుందా?
**
ఒక్క సినిమా హిట్టయితే -దాని దరిదాపుల్లోనే మళ్లీ కథలల్లేసి.. అదే కోవలో సినిమాలు తీసేసి.. అభాసుపాలవుతున్న కేసులెన్నో. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇలాంటి వాళ్లు ఉన్నారనడానికి -ప్రేక్షకుల ముందుకొస్తున్న కథలు, మళ్లీ మళ్లీ చూస్తున్నామేమో అనిపించే సినిమాలే నిదర్శనం. వేలాది సినిమాలు చూసిన తరువాత -మూలాల్లోకి ఆలోచించగలిగే సామర్థ్యం పెరిగిన ప్రేక్షకుడు ఈ సినిమా ఫలానా సినిమాకు దగ్గరగా ఉంది.. ఫలానా సినిమా ఇప్పటి సినిమాకు మాతృక అయివుంటుందని ఠక్కున చెప్పేస్తున్నారు.

***
తెలుగు సినిమా స్వర్ణయుగపు కాలాన్ని పక్కన పెడితే -1983లో వచ్చిన ‘ఖైదీ’ తెలుగు చలనచిత్ర పరిశ్రమ రూపురేఖల్నే మార్చేసింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయమేంటంటే -‘ఖైదీ’ హిట్టయ్యేసరికి ఇంచుమించు ఇదే తరహాలో కథలల్లేయడం మొదలెట్టారు. దాదాపు పదేళ్ళపాటు ఈ ట్రెండ్ కొనసాగింది. హీరో ఏదో కారణాలవల్ల జైలుకెళ్లడం.. పోలీసులను కొట్టో మాయచేసో వాళ్లనుంచి తప్పించుకుని బయటకు రావడం.. బంధువులకో స్నేహితులకో ప్లాష్‌బ్యాక్ చెప్పుకోవడం.. తరువాత విలన్లకోసం వేటసాగించడం.. దుష్టుల పనిపట్టే ప్రయత్నంలో అడవికెళ్లడం.. ఈ ప్రయత్నం సాగుతుండగానే కథానాయికతో నాలుగు పాటలు, ఆరు స్టెప్పులు.. ఫ్లాష్‌బ్యాక్ చెప్పడానికో కథను ముందుకు తీసుకెళ్లడానికో హీరోకి సోలో సీరియస్ సాంగ్.. చివరకు విలన్లను తుదముట్టించి ప్రతీకారం తీర్చేసుకుని కథానాయికతో సెటిలైపోవడం.. కొద్దిగా మార్పులు చేర్పులున్నా.. ఇదీ ఖైదీ తరువాత వచ్చిన చాలా సినిమాల కథాకమామీషు. ఈ రకమైన ధోరణితో చాలా సినిమాలొచ్చి ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టాయి. తరువాత 1989లో వచ్చిన ‘శివ’, ‘అంకుశం’ సినిమాలు పరిశ్రమను ఒక ఊపు ఊపేశాయి. ట్రెండ్ సెట్టరై నిలిచాయి. వెంటనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆ ధోరణిని అందుకుంది. మళ్లీ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ‘శివ’ సినిమాను కాస్త అటూ ఇటూ మార్చో.. కొద్దోగొప్పో మార్పులతోనూ కొన్ని సినిమాలు, రాజకీయ నేపథ్యం, పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో అంకుశాన్ని గుర్తు చేసేలా ఇంకొన్ని సినిమాలు వచ్చేశాయి. మరో పది పనె్నండేళ్ళపాటు తెలుగు తెరను ఏలేశాయి. అందులో ఎన్ని హిట్టయ్యాయి? అన్న ప్రశ్న వేసుకుంటే -వేళ్లమీదే లెక్కలు చెప్పొచ్చు. గత పది పదహారేళ్ల నుంచీ ఒకే మూసలో పోసినట్టు ఒకే తరహా కథలతో ఇప్పటివరకూ వందల సినిమాలు ప్రేక్షకులను భయపెట్టాయి.. విసిగించాయి. **
మళ్లీ కొంచెం ట్రెండ్ మారింది.
సినిమా ఆరంభంలో హీరోయిన్ భయంతో పరుగు. ఆమెను తరుముతూ బోలిరో, టాటాసుమో లాంటి వాహనాల్లో తెల్లటి బట్టలు ధరించిన రౌడీలు. పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని ఆమెను తుదముట్టించేందుకు వెంబడిస్తుంటే.. ఆ దృశ్యం హీరో కంట పడుతుంది. కథానాయకుడు ఆమెను విలన్ల బారినుండి రక్షిస్తాడు. ఇంటికి తీసుకెళ్లి ప్లాష్‌బ్యాక్ వింటాడు. ఆమె చెప్పిన కథలో ఆమె పేరుమీద వేల కోట్ల ఆస్తి ఉండటం, ఆ డబ్బుకోసం కుటుంబానికి అయినవాళ్లో కానివాళ్లో, స్నేహితులో బంధువుల్లో.. ఇష్టంలేని పెళ్లి చేస్తుంటే పీటలమీద నుంచి పారిపోయి హీరోకి కనిపించే కథ. అప్పటినుండి హీరో ఆమెకు ధైర్యం చెప్పి, వెంటేసుకుని తిరగడం.. మధ్యమధ్యలో విలన్లు వారి వెంటపడటం.. ఆమెను రక్షిస్తూ క్లైమాక్స్‌లో హీరో దుష్టుల భరతం పట్టి కథానాయికను పెళ్ళిచేసుకుని ఆమెని, ఆమె డబ్బుని సేవ్ చేయడంతో శుభంకార్డు పడటం. ఇంకొన్ని సినిమాల్లో అయితే అచ్చం ఇలాంటి కథకే కొద్దిపాటి మార్పు చేస్తూ మధ్యలో హీరోకి ఒక ఫ్లాష్‌బ్యాక్ తగిలించడం చేసి, ఇది వెరైటీ కథ.. ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగు సినిమా చరిత్రలోనే రాలేదని ఊదరగొట్టడం. తీరా విడుదలైన తరువాత ఇది ఫలానా సినిమాలానే ఉందని ప్రేక్షకుడు ఫీలవడంతో -బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టిన, కొడుతున్న సినిమాలు కోకొల్లలు. ఇంత ప్రయాసపడి ఇవన్నీ చెప్పుకునేకంటే ఒక ఉదాహరణ ప్రస్థావించుకుందాం. శంకర్ అపరిచితుడు సినిమాలో హీరోతో కుంభీపాకం, ఇంకేదో పాకమంటూ విలన్లను చంపే సీన్స్ చాలా వెరైటీ అనిపించాయి. ఆ పాయింట్ నచ్చి సినిమాను అందరూ ఆదరించారు. ఆయనే అదే హీరోతో ‘ఐ’ సినిమాలో విలన్లను రకరకాల రసాయినాలచ్చి ప్రయోగాలతో జీవచ్ఛవాల్లా మార్చడంతో అపరిచితుడు, ఐ సినిమాల కథలు ఒకేలా అనిపించి బోర్ ఫీలై ‘ఐ’ సినిమాను ‘నో’ అనేశారు. రచయితలైనా, దర్శకులైనా, నిర్మాతలైనా ఒక్క సినిమా హిట్టయిందంటే కథకోసం దానిచుట్టూ పరిభ్రమించకుండా -ఎప్పుడూ కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల కోసం కొత్త కథల కోసం అనే్వషించి నిత్యనూతనంగా సినిమాలు తీస్తే విజయం తథ్యమని ఎన్నో సినిమాలు నిరూపించాయి. ఇప్పటికీ నిరూపిస్తూనే ఉన్నాయి. మరొక్క విషయం. దర్శక నిర్మాతలూ రచయితలకు పూర్తి స్వేచ్ఛనివ్వండి. అపుడు దేశంలో ఎన్నో సమస్యలపై కొత్తకొత్త కథలు పుట్టుకొచ్చి సినీ పరిశ్రమను కొత్త పంథాలో నడిపించడం సాధ్యమవుతుంది. ఒకప్పుడు దర్శక నిర్మాతలు, రచయితలు ఎంతో సమిష్ఠి కృషితో నెలల తరబడి కూర్చొని సూపర్ డూపర్ కథలను సినిమాలుగా మలిచారన్న సంగతి మర్చిపోకూడదు. అది వారికెలా సాధ్యమైందంటే -వారిలో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్న అహంకారం పక్కకుపెట్టి కేవలం సినిమా ఎలా రావాలి? అన్నదానిపైనే దృష్టి పెట్టడంవలన భారీ విజయాల్ని కైవసం చేసుకోగలిగారు. రచయిత ఏకంగా ఒక కథ రాసుకొచ్చినపుడు పది ఇరవైమంది కూర్చొని కథలో వేలుపెట్టడం, అసలు పరిశ్రమతో ఏమాత్రం సంబంధంలేని వ్యక్తులు రచయిత కథను ఏదో వంకపెట్టి ఆపించడమూ చేస్తూ అతడు తయారు చేసుకున్న కథలో తలోకొంత బాగాలేదని డామినేట్ చేస్తూ తొంభై శాతం కథను మార్చేస్తూ వారికినచ్చిన సూచనలతో ఏదో చెత్త తీసేస్తే అపజయాలు మూటకట్టుకోక మరింకేం చేస్తాయి.

-బంటు గిరివాసు