Others

శ్రీకృష్ణతులాభారం (ఫ్లాష్‌ బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణ దేవరాయల కొలువులోని అష్టదిగ్గజాల్లో ఒకరైన నంది తిమ్మన వ్రాసిన ప్రబంధమే పారిజాతాపహరణం. ఆ ప్రబంధం ఆధారంగా 1920లో ముత్తరాజు సుబ్బారావు ‘శ్రీకృష్ణతులాభారం’ నాటకాన్ని రచించారు. వందలకొద్దీ ప్రదర్శనలు జరుపుకున్న నాటకంలో ప్రసిద్ధ నటుడు స్థానం నరసింహారావు సత్యభామ పాత్ర పోషించి ‘మీరజాలగలడా’ గీతాన్ని ఆలపించి వనె్నకెక్కారు. ఆ నాటకంలోని పాటలు, పద్యాలు జనరంజకంగా నిలిచాయి. ఆ నాటకం ఆధారంగా నిర్మింపబడిన చిత్రం ‘శ్రీకృష్ణ తులాభారం’. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి రామానాయుడు ‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రాన్ని రూపొందించారు. ఆగస్టు 25, 1966న చిత్రం విడుదలైంది.
నరకాసురుని సంహరించి ద్వారకకు శ్రీకృష్ణునితో వచ్చిన సత్యభామ (జమున)లో గర్వం అతిశయిస్తుంది. దేవలోకం నుంచి నారదుడు (కాంతారావు) పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణుని (ఎన్టీ రామారావు)కి ఇస్తాడు. దాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణిదేవి (అంజలిదేవి)కి ఇవ్వటం, ఆ సంగతి దాసి నళిని (వాణిశ్రీ) ద్వారా తెలుసుకున్న సత్యభామ అలకపాన్పు ఎక్కుతుంది. ఆమె కోరిక తీర్చటం కోసం నందనోద్యానవనంలోని పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు తెచ్చి ఇస్తాడు. సత్యభామ మరింత అతిశయంతో శ్రీకృష్ణుని తన సన్నిధిలోనే ఉంచుకుని, సపత్నులను బాధిస్తుంది. శ్రీకృష్ణుని సూచనపై నారదుడు సత్యభామచే పుణ్య వ్రతాన్ని చేయించి కృష్ణుని, పారజాత వృక్షాన్ని దానంగా పొందుతాడు. తిరిగి తులాభారం ద్వారా భర్త శ్రీకృష్ణుని పొందాలన్న సత్యభామ ప్రయత్నం విఫలంకావటం, కృష్ణుని పురవీధుల్లో నారదుడు అమ్మ చూపటం, సత్యలో అజ్ఞానం నశించి నారదుని సూచనపై రుక్మిణిదేవిని అర్ధించటం, భక్తికి లొంగెడు స్వామి రుక్మిణి వేసిన తులసీ దళానికి తూగటంతో శ్రీకృష్ణుడు జగన్నాధుడు అనే సత్యం సత్యభామతోసహా అందరికీ గ్రహింపు కలగటంతో చిత్రం ముగుస్తుంది.
చిత్రంలో ఇంద్రునిగా రాజనాల, శచీదేవిగా యస్ వరలక్ష్మి, దేవమాతగా ఋష్యేంద్రమణి, దేవకి వసుదేవులుగా నిర్మల, మిక్కిలినేని, అష్ట భార్యల్లో జాంబవతిగా కృష్ణకుమారి, అనురాధ, విజయశ్రీ, విజయలలిత, మరో ఇరువురు నటించారు. వసంతయ్యగా పద్మనాభం, మాలతిగా మీనాకుమారి కనిపిస్తారు.
శ్రీకృష్ణునిగా మహానటుడు ఎన్టీ రామారావు శాంత, వీర, గంభీర భావాలను, లాలింపు, అలరింపు, అనునయం సన్నివేశాలను చక్కని చిరునవ్వుతో అభినయించారు. సాత్వికమైన నటనతో అంజలిదేవి రుక్మిణిగా, సత్యభామను విమర్శించే జాంబవతిగా కృష్ణకుమారి చురుకుదనాన్ని చూపించారు. ఇక సత్యభామగా ఆ పాత్రకుగల అతిశయాన్ని, శ్రీకృష్ణునిపై అనురాగాన్ని తన నటనలో మేళవించి ప్రదర్శించి జమున ఆకట్టుకుని, అపర సత్యభామ బిరుదు మరోమారు సార్థకం చేసుకోగా, నారదునిగా ప్రసిద్ధిపొందిన కాంతారావు సమర్ధవంతంగా నటించారు.
దర్శకులు కమలాకర కామేశ్వరరావు సత్యభామ అలక, ఆపైన పారిజాత వృక్షాన్ని స్వర్గంనుంచి తేవటం, దేవేంద్రుడు, శచీదేవిల సన్నివేశాలు, శ్రీకృష్ణుని లీలావిలాసం, సత్యభామ అతిశయం, రుక్మిణికి అవమానం, పుట్టిన దినమని మెట్టిన దినమని సన్నివేశంలో సపత్నుల వాదాలు, తులాభారం, శ్రీకృష్ణుని బజారులో అమ్మటం వంటి సన్నివేశాలను ఎంతో విపులంగా, పౌరాణిక గాథను దృశ్యకావ్యంగా సెల్యులాయిడ్‌పై ఆకట్టుకునేలా రూపొందించారు. ఇక నందనోద్యానవనం, సెట్‌లు, ఇంద్రుని సభాభవనంలో రంభ (ఎల్ విజయలక్ష్మి) నృత్యం, స్వర్గంలో వింతలు, పూల సజ్జ (పరుపు), పూల పడవ, పారిజాత వృక్షం చిన్నది కావటం, గరుత్మంతుని రెక్కల వేగానికి పారిజాత పుష్పాలు చెదరిపోవడం వంటివి కళాదర్శకుడు రాజేంద్రకుమార్, కెమెరా అన్నయ్యల సహకారంతో రంజింపచేసేలా తీర్చిదిద్దటం విశేషం.
సీనియర్ సముద్రాల సందర్భానుసారమైన సంభాషణలతో ఆకట్టుకున్నారు. ‘ఆవేశంలో పోగొట్టుకున్న మనుషులు ఆపదలో అక్కరకు రారు’, ‘పతిని ప్రేమతో స్వాధీనం చేసుకోవాలి కాని సవతిని ప్రార్థించటం వ్యర్థం’, ‘దిక్పాల కిరీట సంఘటిత రత్నప్రభా సంభావిత పాద జీవుడైన మహేంద్రునకు ఒక ఆడదాని భిక్ష ప్రదానమా రుక్మిణి’ అన్న సంభాషణలు అద్భుతం అనిపిస్తాయి. సత్యభామపై చిత్రీకరించిన ప్రార్ధన గీతం ‘కరుణించవే తులసి మాతా’, రుక్మిణిపై చిత్రీకరించిన గీతంలో ‘నిదురనైనా నాధుని సేవకోరటం’, సత్యపై ‘కలలనైనా గోపాలుడు ననే్న వలచు రీతి’ (ఎస్ జానకి- పి సుశీల), రంభ నృత్యగీతంలో ‘కొనుమిదే కుసుమాంజలిలో కాళియ పడగలపై లీలానాట్యము చేసిన తాండవ కృష్ణా’ (సుశీల), చిత్రం ప్రారంభంలో శ్రీకృష్ణ సత్యల స్వాగత గీతం ‘జయహో, జయ జయహో త్రిభువన మంగళకారి’ మనల్ని అలరిస్తాయి. నృత్య దర్శకుడు కెయస్ రెడ్డి అభినయం, అతనికి ఘంటసాల ప్లేబాక్ పాడటం విశేషం (ఘంటసాల, సుశీల). నందనోద్యానవనంలో గీతం ‘ఇది సరాగాల తోట’ (జయంతి, జమున, విజయలక్ష్మీ అభినయం -పి సుశీల, ఎల్‌ఆర్ ఈశ్వరి), ఆకస వీధినుంచి నారదుడు శ్రీకృష్ణుని స్తుతిస్తూ పాడే గీతం ‘ఓహో, మోహన రూపా’, తొలుత శ్రీకృష్ణుడు సత్యభామ తోటలో ‘మధువులు చిందే మందహాసం’, మందిరంలో రుక్మిణితో ‘ప్రణయారాధనవేళ బాల పతి పూజలు నీకేలబేల’, నదిలో పడవలో జాంబవతితో ‘మధుర సుధారాగమే’, మిగిలిన వారితో పాచికలు, వీణా వాయిద్యం, పన్నీరు చల్లటం, ఊయల నూపటం, నృత్యం చేయటం లాంటివి విడివిడిగా మ్యూజిక్‌తో చూపటం, చివరమధ్యలో శ్రీకృష్ణుడు, చుట్టూ 8మంది చిత్రాలు రావటాన్ని (గానం- ఘంటసాల, పి.సుశీల, వసంత- రచన శ్రీశ్రీ) అలరించేలా చిత్రీకరించారు. సత్యభామ అలక తీర్చే గీతం ‘ఓ చెలీ కోపమా’ (ఘంటసాల, దాశరధి), రక్తిని మేళవించిన రసమయ గీతం ‘మీరజాలగలడా నా ఆనతి వ్రతవిధాన మహిమన్’ (గానం- పి సుశీల, రచన-స్థానం నరసింహారావు, రంగస్థల నటులు), చందాల కేశవదాసు రచనతో ఘంటసాల, పి.సుశీల, మాధవపెద్ది బృందం గానంతో వినుతికెక్కిన మరో గీతం ‘్భలే మంచి చౌక బేరము’ (నారదుడు శ్రీకృష్ణుని అమ్మజూపే సన్నివేశంలోనిది), అద్భుతమైన పద్యాలు ‘అండపిండ వేదోండ సంహతులనెల్ల’, ‘ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి’, ‘మెట్టిన దినమని సత్యయు పుట్టిన దినమని’, ‘అతివరోనను తూచెడు ధనాధులు నీకడ’, ‘సేవలు గొంటయే కాని సర్వేశ్వరుండగు శౌరికింకరు చేయు’, ‘ఏమి తపంబొనర్జి జనియించినాడనో’, ‘కస్తూరి తిలకము పోనాడి ప్రమదల కూడి మాడగానే’, ‘జరిగినది, జరగనున్నది జరుగెడునది’ (ఘంటసాల గానం- రచన ముత్తరాజు సుబ్బారావు నాటకంలోనివి యథాతథంగా ఉపయోగించారు). మరికొన్ని పద్యాలు, సంవాద పద్యాలు సముద్రాల (సీ) వ్రాసారు. వాటిలో ‘విభుడు నీ మాట జవదాట వెరచునంచు’ (ఎస్ వరలక్ష్మి), ‘అన్నులమిన్న భీష్మ సుత ప్రార్థన (పి సుశీల) కొన్ని. భారతీయ సంస్కృతి, పురాణాల పట్ల కళాత్మక విలువలపట్ల ఉత్తమాభిరుచి కల నిర్మాత డి రామానాయుడు భారీ నిర్మాణ వ్యయానికి వెనుకంజ వేయక తమ బ్యానర్‌పై నిర్మించిన శ్రీకృష్ణతులాభారం ఘన విజయం సాధించింది. ఆ తరువాత ఆ సంస్థ ద్వారా పలు వైవిధ్యభరితమైన, ప్రతిష్టాత్మకమైన చిత్రాలు రూపొందటం అభినందించదగ్గ విషయం.

ఫ్లాష్‌బ్యాక్ @ 50

ఛాయాగ్రహణం: అన్నయ్య
నృత్యం: కెఎస్ రెడ్డి
కళ: రాజేంద్రకుమార్
ఎడిటింగ్: మార్తాండ్
రచన, కొన్ని పాటలు, పద్యాలు:
సముద్రాల (సీ)
సంగీతం: పెండ్యాల
నిర్మాత: డి రామానాయుడు
దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు

-సివిఆర్ మాణిక్యేశ్వరి