AADIVAVRAM - Others

ఆపదలో గజరాజు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం)
హిందూ సంస్కృతిలో గజరాజులకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో ప్రతీ దేవాలయంలోనూ ఓ ఏనుగు కనిపిస్తుంటుంది. ఏనుగు ఆశీర్వాదం తీసుకోవడం ఓ మంచి శకునంగా భావిస్తారు. అయితే ఇప్పుడు దేశంలో గజరాజులకు రక్షణ లేకుండా పోయింది. 2009 నుంచి 2017 వరక దేశంలో 655 గజరాజులు వివిధ ప్రమాదాలకు గురై మరణించాయని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం భూమీద జీవిస్తున్న జంతువుల్లో అతి పెద్దవి ఏనుగులు. భారీకాయంతో భారీగా ఆహారం తీసుకునే ఏనుగుల ప్రాణాలకు నేడు రక్షణ లేకుండా పోయింది. గడిచిన పదేళ్లలో దేశవ్యాప్తంగా 928 ఏనుగులు చనిపోయాయి. ఆశ్చర్యకరంగా మన దేశంలో ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఏనుగుల సంఖ్య పెరుగుతూ ఉంటే, శ్రీలంకలో తగ్గుతూ వస్తోంది. ఏనుగుల మరణాలు ఇలాగే కొనసాగితే ఏషియన్ ఏనుగులు కూడా అంతరించిపోయే జాబితాలో చేరిపోతాయని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రోజూ 100 గజరాజులను స్మగ్లర్లు వాటి దంతాల కోసం చంపేస్తున్నారు. ఓ ఏనుగు రోజుకు 300 కిలోల ఆహారం, 160 లీటర్ల నీళ్లు తాగుతుంది. అందుకే శత్రువుకు బహుమానంగా ఏనుగును ఇచ్చేవాళ్లు ప్రాచీన కాలంలో.
ఉత్సవాల్లో దేవుడి ప్రతిమను అంబారీపైనే ఊరేగించేవారు. థాయ్‌లాండ్ దేశీయులు ఆ దేశ జాతీయ జంతువుగా ఏనుగును ఎన్నుకున్నారు. ఏనుగులను కాపాడుకోవాలంటూ ప్రజలందరిలో అవగాహన తీసుకురావడానికి థాయ్‌లాండ్‌లోని ‘ఎలిఫెంట్ రీ ఇంట్రడక్షన్’ అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. ఏనుగులను కాపాడుకోవటం మన బాధ్యతంటూ ‘సేవ్ ది ఎలిఫెంట్’ డే ని జరుపుతున్నారు.
ఆవాసాన్ని కోల్పోతున్న ఏనుగులు
భూమిపై సంచరించే జంతువులన్నింటిలోకి పెద్దది ఏనుగే. కరి, గజము, దంతి, హస్తి మొదలగునవి ఏనుగుకున్న ఇతర పేర్లు. భారతీయ సంస్కృతిలోనూ ఏనుగులకు విశిష్ట స్థానం ఉంది. ఏనుగు 70 సంవత్సరాల కంటే ఎక్కువగా జీవిస్తుంది. హిందువులు ఏనుగులు వివిధ రకాలుగా పూజిస్తారు. ఇవి పూర్తిగా శాకాహారులు. బాగా తెలివైనవి. ఏనుగులు కష్టపడి పని చేసే జంతువులు. అడవులలో భారీ వృక్షాలను పడగొట్టడానికి, తరలించడానికి ఉపయోగిస్తారు. యుద్ధాలలో ఏనుగులను భారతదేశంలోను, తర్వాత పర్షియాలోనూ ఉపయోగించారు. వీటికి జ్ఞాపకశక్తి ఎక్కువ. మనుషుల్లానే వీటికీ భావోద్వేగాలుంటాయి. మనుషులతో చాలా స్నేహంగా ఉంటాయి.
అటువంటి ఏనుగుల సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది. దంతాల కోసం, శరీర భాగాల కోసం అమానుషంగా వీటిని చంపేస్తున్నారు. ఆకారం భారీగా ఉన్నా అందరితో ప్రేమగా మెలిగే ఏనుగులను కాపాడాలనే ఉద్దేశంతో ‘ప్రపంచ ఏనుగుల దినోత్సవం’ మొదలైంది. గత పది సంవత్సరాలలో ఏనుగుల సంఖ్య 62 శాతం తగ్గింది. ప్రతిరోజూ దాదాపు 100 పైగా ఏనుగులు చనిపోతున్నాయి. అడవులు ఏనుగుల సహజ నివాస స్థలాలు. అడవుల విస్తీర్ణం తగ్గడం వలన ఏనుగులు తమ నివాస స్థలాన్ని కోల్పోతున్నాయి. అందువల్ల ఇవి అడవులను వదిలి ప్రజలు నివసించే స్థలాలకు తరలి వస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలో కేవలం రెండేళ్ల కాలంలో లక్షల ఏనుగులు నేలకూలాయట. నూట డెబ్బై టన్నుల ఏనుగు దంతాలు అక్రమంగా సరిహద్దులు దాటాయి. వన్యప్రాణుల సంరక్షణ జరుగుతున్నప్పటికీ పులుల సంఖ్యతో పాటు ఏనుగుల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది.
నేపథ్యం
ఏనుగులకు ఓ ప్రత్యేక రోజు అన్న ఆలోచన కెనడాకు చెందిన ఫిలిమ్ మేకర్, ఏనుగుల సంరక్షణ ప్రచారకులు పేట్రేషియా సిమ్స్‌ది. ఈమె 2012లో ఆగస్టు 12న ‘ప్రపంచ ఏనుగుల దినోత్సవం’గా ప్రకటించారు. సిమ్స్ థాయ్‌లాండ్‌లో ‘ఎలిఫెంట్ రీ ఇంట్రడక్షన్ ఫౌండేషన్’ స్థాపించారు. ఏటా ఏనుగుల దినోత్సవం జరపటం వల్ల ప్రజల్లో ఏనుగుల సంరక్షణకు సంబంధించి కొంత చైతన్యం పెంపొందింది. ముఖ్యంగా అంతరించిపోయే జాతుల జాబితాలో చేరిన ‘ఆసియా ఏనుగులు’ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కేవలం 40 వేలు మాత్రమే ఉండటం విచారకరం. పెద్దలను, పిన్నలను ఆకర్షించే గజరాజు లక్షల సంఖ్యలో ఉన్నా అవి నేడు ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షలలోపే ఉండటం విచారకరం. భారతదేశంలో 1992 సం.లో ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ అనే కార్యక్రమాన్ని ఆరంభించారు. ముప్పై రెండు గజ సంరక్షణ కేంద్రాలను ఏనుగులు ఎక్కువగా తిరుగాడే రాష్ట్రాలలో నెలకొల్పారు.
పశ్చిమ బెంగాల్‌లో డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులు ఏనుగు దంతాలు, పులి దంతాలు, గోళ్లు స్మగుల్ చేసే ముఠాను పట్టుకున్నారు. వారి నుంచి 12 కిలోల ఏనుగు దంతాలను, ఐదు పులి దంతాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1,147 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. లోకంలో దేని వెంట్రుకా పవిత్రం కాదు, ఒక్క ఏనుగు వెంట్రుక వినా. ఏనుగు వెంట్రుకకు ఉన్న శక్తి అమితమైనది. అది దృష్టి దోషాన్ని తొలగించి అదృష్టాన్ని ఇస్తుంది. అలాగే సమస్త విఘ్నాలను తొలగిస్తుంది. వెంట్రుక అనేది అత్యంత హేయము, ఉత్తర క్షణంలో ఆ పదార్థాన్ని విసర్జించవలసి ఉంటుంది. కానీ ఒక్క ఏనుగు వెంట్రుక మాత్రం పూజనీయం మరియు శరీరంపైన ధరించదగినది. ఈ విషయం మహాభారతంలోని ఆదిపర్వంలో చెప్పబడింది.
మరణాలకు కారణాలు..
2015-18 మధ్యలో కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే వివిధ కారణాలతో దాదాపు 373 గజరాజులు మృత్యువాత పడటం బాధాకరం. ఆహారం కోసం పొలాల్లోకి వచ్చిన సమయంలో విద్యుదాఘాతానికి గురై మరణిస్తే, రైలు బండి ఢీకొనడంతో కొన్ని, వేటగాళ్ల బారిన పడి కొన్ని మరణిస్తున్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి, అల్లీపూర్ ద్వారా రైల్వే మార్గంలోనే రైలు ఢీకొనడంతో గత ఎనిమిదేళ్లలో దాదాపు 68 ఏనుగులు మరణించాయని అధికారుల అంచనా. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల్లో గనుల తవ్వకాలకై పెద్ద పెద్ద కంపెనీలకు అటవీ భూములు ధారాదత్తం చేయడంతో అక్కడి నుండి ఈ జంతువులు వేరే ప్రాంతాలకు తరలిపోవలసి వచ్చింది. అందుకే అంతరిస్తున్న జంతువులను పరిరక్షించుకోవాలి.
గతంలో 24 రకాల ఏనుగులు ఉండగా, ఇప్పుడు కేవలం ఆఫ్రికా, ఆసియా జాతికి చెందిన ఏనుగులే అధికంగా ఉన్నాయి. అత్యధికంగా తంజావూరు, నీలగిరి, కోయంబత్తూరు, సేలం తదితర జిల్లాల్లో ఏనుగుల తాకిడి అధికంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రదర్శనశాలల్లో, సర్కస్‌లలో ఏనుగులు ప్రధాన ఆకర్షణలు. గజారోహణం, గండపెండేరంలతో మహారాజులు ఆనాటి కవులను, పండితులను సన్మానించేవారు. అడవులలో క్రూరమృగాలు, ముఖ్యంగా పులుల్ని వేటాడటం కోసం ఏనుగుల మీదే మహారాజులు వెళ్లేవారు.
వైద్యశాల
వినాయకుడి తలను ఖండించిన శివుడు ఏనుగు తలను తెచ్చి అతికించినట్లు పురాణాలు చెబుతున్నాయి. గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో మొసలిని సంహరించి గజేంద్రుణ్ని రక్షిస్తాడు. క్షీర సాగర మథనంలో పుట్టిన ఐరావతం అనే తెల్లని ఏనుగు ఇంద్రుని వాహనం. గజలక్ష్మీ అష్టలక్ష్ములలో ఒకరు.
వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలున్నట్టే ఉత్తరప్రదేశ్‌లో మధురలో గజరాజుల ఆస్పత్రి ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఇదే తొలి ఏనుగుల వైద్యశాల. 2017 గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 3వేల ఏనుగులు అక్రమ నిర్బంధంలో ఉన్నాయి. అలా నిర్బంధంలో ఉన్న ఏనుగులను కాపాడి చికిత్స అందించడమే ఈ వైద్యశాల లక్ష్యం. ప్రమాదాల్లో గాయపడిన ఏనుగులకూ ఇక్కడి సిబ్బంది చికిత్స అందిస్తారు. గతేడాది వివిధ కారణాలతో 125 అడవి ఏనుగులు మృతి చెందాయి. తమిళనాడు నుంచి కోయంబత్తూరు, నీలగిరి, సత్యమంగళం, కడలూరు, కేరళ, కర్ణాటక సరిహద్దు తదితర ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో వందకు పైగా ఏనుగులు మృతి చెందాయి. కరువు, నీటి సౌకర్యం లేకపోవడం, వివిధ అవసరాలకు అడవుల ఆక్రమణలు, చెట్లు నరికివేయడం వంటి కారణాలతో ఏనుగులు గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏనుగుల్లో ఆసియా, ఆఫ్రికా అనే రెండు రకాలున్నాయి. చూడటానికి ఇంచుమించు రెండూ ఒకేలా కనిపిస్తాయి. దాదాపు 13 దేశాల్లో ఆసియా ఏనుగులు కనిపిస్తాయి. ప్రస్తుతం ఆఫ్రికా ఏనుగుల సంఖ్య 4 లక్షలుండగా, ఆసియా ఏనుగులు నలభై వేలున్నాయి. ఏనుగులను చంపడం, వాటిని అక్రమ మార్గాల్లో తరలించడం చట్టరీత్యా నేరం. వీటిని అమ్మడం వల్ల ఎక్కువ లాభాలు వస్తుండటంతో ఈ చర్యలకు పాల్పడుతున్నారని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రథమ లక్ష్యం ఆఫ్రికా, ఆసియా ఏనుగుల దుస్థితి మీద తక్షణ అవగాహన పెంచడానికి, వాటి భద్రత, సంరక్షణ, నిర్వహణ గురించి విజ్ఞానం పెంచడం. ఏనుగులను కాపాడుకుని వాటి రక్షణకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుని, ఏనుగులను వేటాడకుండా, చంపకుండా చూసుకునే బాధ్యత అందరిపై ఉంది.

- కె.రామ్మోహన్‌రావు 9441435912