Others

భక్తపోతన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ: సీనియర్ సముద్రాల
మాటలు: దాసం గోపాలకృష్ణ
నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి
ఛాయాగ్రహణం: సి నాగేశ్వరరావు
కళ: వివి రాజేంద్రకుమార్
ఎడిటింగ్: ఆర్ హనుమంతరావు
సంగీతం: సాలూరు రాజేశ్వరరావు.
దర్శకత్వం: జి రామినీడు

***
రాజమండ్రికి చెందిన నిర్మాత తమ్మినేని విశే్వశ్వరరావు భారత్ ఫిలింస్ సంస్థ ప్రారంభించి, తొలి చిత్రంగా ‘భక్తపోతన’ నిర్మించారు. 1966లో నిర్మితమైన ఈ చిత్రానికి జి రామినీడు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత భారత్ ఫిలింస్ నుంచి బాలచందర్ దర్శకత్వంలో ‘ఇది కథకాదు’ (1979), ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ (1981) చిత్రాలు వచ్చాయి.
పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రులో జన్మించిన గుత్తా రామినీడు డిగ్రీ చదివే కాలంలో కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్నారు. స్టిల్ ఫొటోగ్రఫీ తెలిసిన వీరు మద్రాస్ వెళ్ళి నటులు ఎస్‌వి రంగారావు పరిచయంతో వేదాంతం రాఘవయ్య వద్ద ‘అన్నదాత’ చిత్రానికి సహాయ దర్శకులుగా పని చేశారు. అలా, చిత్రసీమలో ప్రవేశించారు. తరువాత మిత్రులతో కలిసి పర్వతనేని గంగాధరరావు నిర్మాతగా నవశక్తి సంస్థ ద్వారా ‘మా ఇంటి మహాలక్ష్మి’ చిత్రాన్ని రూపొందించారు. తమ ప్రతి చిత్రంలో నూతన నటులనో, సాంకేతిక నిపుణులనో పరిచయం చేయటం వీరి లక్షణం. అభిరుచి, సాహసం, సౌజన్యంకల దర్శకునిగా పేరుపొందారు. మద్రాస్‌లో ఆంధ్రా క్లబ్ అభివృద్ధికి, క్లబ్ ద్వారా ఎన్నో ప్రదర్శనలు ఇప్పించారు. పలు ప్రదర్శనల్లో పాల్గొన్న వాణిశ్రీ, శారద, రాళ్ళపల్లి, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం వంటి వారెందరో తరువాత చిత్రసీమలో రాణించారు.
***
కొండవీటి రాజ్యాన్ని పెదకోమటి వేమారెడ్డి, రాజమహేంద్రవరాన్ని వీరభద్రారెడ్డి, రాచకొండ మండలాన్ని సర్వజ్ఞ సింగభూపాలుడు (బాలయ్య), హంపీ విజయనగరాన్ని ప్రౌఢ దేవరాయలు పాలిస్తున్న కాలమది. పరస్పర కలహాలతో రాజ్యాలు అల్లకల్లోలంగా ఉన్న రోజుల్లో జన్మించి, తమ కవితా చతురతతో ప్రజలను, ప్రభువులను సాహిత్యంవైపు మళ్ళించిన ప్రముఖ కవులు పోతన (గుమ్మడి), శ్రీనాథుడు (ఎస్‌వి. రంగారావు). ఏకశిలా నగరంలో శ్రీరామచంద్రుని ఆరాధనలో కొద్దిపాటి భూసేద్యంతో సంసారం సాగిస్తున్నాడు పోతన. భార్య ధర్మాంబ (అంజలీదేవి), కొడుకు మల్లన్న (హరనాథ్), కూతురు శాంత (జయచిత్ర). తల్లిలేని కారణంగా శ్రీనాథుడి కుమార్తె శారద (వాసంత) వీరింట పెరుగుతుంది. శ్రీనాథుడు కొండవీటి రెడ్డిరాజుల ఆస్థాన కవిగా, విద్యాధికారిగా, పండితులను జయించి కనకాభిషేకాలు అందుకుంటూ, బిరుదులు పొందుతూ, భోగాలు అనుభవిస్తూ హేమాంగిని (పద్మిని) అనే నాట్య కళాకారిణిని అభిమానిస్తుంటాడు. శ్రీరాముని ఆదేశం మేరకు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తాడు పోతన. ఆ కృతిని సర్వజ్ఞ సింగభూపాలునికి అంకితమిచ్చి సుఖించమని పోతనకు సలహాఇస్తాడు శ్రీనాథుడు. దానికి పోతన అంగీకరించడు. దాంతో పోతనపై ఆగ్రహానికి గురైన రాజు, సైనికులను పంపించి ఆ గ్రంథాన్ని స్వాధీనం చేసుకోబోగా సరస్వతీదేవి (సావిత్రి) అగ్నివర్షం కురిపిస్తుంది. రాజు పోతనను క్షమాపణ కోరతాడు. పోతన తన గ్రంథాన్ని శ్రీరామచంద్రునికి అంకితమిస్తాడు. తరువాత మల్లన్న, శారదలకు వివాహం జరుగుతుంది. ఈ సమయంలో తనకు ఆశ్రయమిచ్చిన రాజులు, రాజ్యాలు పోవటం.. హేమాంగి మరణం శ్రీనాథుని కృంగదీస్తుంది. బొడ్డుపల్లిని కౌలుకు తీసికొని వ్యవసాయం చేయగా ప్రకృతి వైపరీత్యంవల్ల నష్టపోయి పన్ను కట్టలేక శ్రీనాథుడు ప్రభుత్వ ఖైదీగా శిక్షింపబడతాడు. పోతన తన ఆస్తి సర్వస్వం అమ్మి శ్రీనాథుని పన్ను బాకీ చెల్లించి అతన్ని విడుదల చేయిస్తాడు. గత అనుభవాలను స్మరించుకుంటూ మనోవేదనతో శ్రీనాథుడు మరణిస్తాడు. శ్రీరాముని భక్తిపారవశ్యంతో పోతన ఆయనలో ఐక్యమవుతాడు.
ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో శారద, చలం, జయశ్రీ, ప్రభాకరరెడ్డి, మిక్కిలినేని, రాజబాబు, కెఆర్ విజయ కనిపిస్తారు. అతిథి పాత్రల్లో సావిత్రి (సరస్వతి), శోభన్‌బాబు (శ్రీరాముడు) నటించారు.
పోతన, శ్రీనాథులుగా గుమ్మడి వెంకటేశ్వరరావు, ఎస్‌వి రంగారావు పోటీపడి ఎంతో శ్రద్ధాసక్తులతో నటించి మెప్పించారు. ముఖ్యంగా శ్రీనాథుని అవసాన దశలో ఎస్‌వి రంగారావు ప్రశంసనీయమైన నటన చూపారు. అయితే, 1942లో వచ్చిన ‘్భక్తపోతన’ స్థాయికి ఈ చిత్రం సరితూగక పోవటంతో వారి కృషికి తగిన గుర్తింపు రాలేదు.
దర్శకులు జి రామినీడు సన్నివేశాలను తనదైన శైలిలో తీర్చిదిద్దారు. 1942నాటి భక్తపోతన కథను పొడిగించి పోతన, శ్రీనాథుల అవసాన దశవరకూ కథను నడిపించారు. శ్రీనాథుడిపై చిత్రీకరించిన పద్యాలు కరుణరస పూరితంగా ఆర్ధ్రతతో సాగటం, పద్మినిపై చిత్రీకరించిన నృత్యాలు, అగ్నివర్షం కురిపించడం వంటి సన్నివేశాలు మంచి ఎఫెక్ట్‌తో ఆకట్టుకునేలా చిత్రీకరించారు దర్శకుడు రామినీడు.
1942నాటి భక్తపోతనకు, 1966నాటి భక్తపోతనకు రచన సీనియర్ సముద్రాలే కావటం, 4 గీతాలు వ్రాయటం గమనార్హం. పద్మినిపై చిత్రీకరించిన జావళి -రారా శతకోటి మన్మథా కారా (పి సుశీల బృందం), పోతన గుమ్మడిపై -సర్వమంగళ నామా రామా (పిబి శ్రీనివాస్), శ్రీనాథుడు అతిథులతో రాగా ధర్మాంబ సీతమ్మను వేడుకునే గీతం -అమ్మా సీతమ్మా (లీల), భాగవతం సైనికుల దాడికి గురయ్యే సమయంలో పోతన గీతం -పట్టి విడువరాదూ (పిబి శ్రీనివాస్), పద్మినిపై చిత్రీకరించిన నృత్య గీతం -అందెలు పలికెనులే (ఎస్ జానకి -సి నారాయణరెడ్డి), బమ్మెరపోతన పద్యాలు -కాటుక కంటినీరు, -శారదా నీరదేందు, -శ్రీకైవల్య పదాంబు చేరుట (పిబి, గుమ్మడి), బాల రసాలసాల (మంగళంపల్లి), ఘంటసాల ఆలపించగా శ్రీనాథపై చిత్రీకరణ మహాకవి పద్యాలు, ఎస్‌వి రంగారావుపై చిత్రీకరణ -కవిరాజు కంఠంబు కౌగలించెను పురవీధి, ఎస్‌వి రంగారావు, పద్మినిలపై చిత్రీకరించిన గీతం -శ్రావణమేఘాలు కూరిమి భావాలు (ఆరుద్ర -ఘంటసాల, పి సుశీల) ముఖ్యమైనవి.
శ్రీనాథుని పాత్రపట్ల మక్కువతో నటరత్న ఎన్టీ రామారావు శ్రీనాథకవి సార్వభౌమ (1990) చిత్రాన్ని నిర్మించటం విశేషం. పోతన, శ్రీనాథుల వంటి మహాకవుల సమప్రాధాన్యతతో నిర్మించబడిన భక్తపోతన (42), భక్తపోతన (66) చిత్రాలు తెలుగువారికి దృశ్యకావ్యాలుగా నిలవటం, జయాపజయాలతో సంబంధం లేకుండా నూతన నిర్మాత విశే్వశ్వరరావు చేసిన ప్రయత్నం అభినందించదగ్గది.
**
నా నట జీవితంలో నిరాశ, నిస్పృహ కలిగించిన చిత్రం ‘భక్తపోతన’. ఈ చిత్రం చూశాక ఎంతోమంది మిత్రులు, శ్రేయోభిలాషులు వారి అసంతృప్తి వ్యక్తం చేశారు. కీర్తిశేషులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు సంజీవయ్యగారు ఎంపీ పున్నయ్యగారి ద్వారా పంపిన ఉత్తరంలో -రంగారావుగారు, మీరూ కలిసి నటించిన ఈ చిత్రంలో మీ పాత్రల పోషణ నిరుత్సాహంగా, నిరాశాజనకంగా ఉందని తెలియచేయటానికి బాధపడుతున్నాను’ అంటూ రాశారు.
***
ఓ సందర్భంలో నాగయ్యగారితో...
-‘నాన్నగారూ మీ పోతన చూసి సమాధిలోకి వెళ్ళిన బాలయోగికి నా పోతన చిత్రం చూపితే సమాధి నుండి లేచి వస్తారు’ అని బాధగా చమత్కరించాను. -‘నటునిగా నువ్వేమీ తక్కువేం చేయలేదు’ అంటూ నాగయ్యగారు గంభీరంగా ఓదార్పునిచ్చారు. అది నాకు చాలా ధైర్యాన్నిచ్చింది’.
గుమ్మడి ‘తీపి గురుతులు-
జ్ఞాపకాలు’ నుంచి.

-సివిఆర్ మాణిక్యేశ్వరి