Others

మనసు గీతం.. అభ్యుదయ రాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేవి ఆయన మనసు పాటలు. మనసుమీద ఆత్రేయ రాసినన్ని సినిమా పాటలు (సుమారు నూరు) ప్రపంచవ్యాప్తంగా ఏ కవీ రాసిన దాఖలాలు లేవు. తెలుగు సినిమా పరిశ్రమ ఆయనను ‘మన-సుకవి’గా సభంగ శే్లషతో ముద్దుగా పిలుచుకొంది. ఆ మనసుకవి రాసిన మనసు పాటలే కాదు, వలపు పాటలు, వాన పాటలు, వీణ పాటలు వగైరా సినీ సాహిత్య సంగీతాభిమానులను వెర్రెక్కించాయి. తెలుగు సినిమాల్లో ఎక్కువ వీణ పాటల్ని (9) రాసిన కవి ఆత్రేయ కాగా -ఎక్కువ వీణ పాటల్ని ఆలపించిన గాయని పి సుశీల. ఆత్రేయను వలపు పాటలకు ఒరవడి పెట్టిన ఆచార్యునిగా, కొండొకచో శ్రుతిమించి బూతు పాటలను రాసిన ‘బూత్రేయ’గా అభిమానించి అధిక్షేపించిన సినీ విమర్శకులెందరో! కాని ఆయనను అసాధారణమైన అభ్యుదయ సినీ గీతాలు రాసిన వామపక్ష భావజాలం కలిగిన కవిగా గుర్తించి విశే్లషించిన విమర్శకులు అరుదు!
***
ఆత్రేయ గురించి చాలామందికి తెలియని పార్శ్వం ఆయన పద్య కవితా ప్రావీణ్యం. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అంతటివారి మెప్పు పొందిన పద్యకవి ఆత్రేయ. విద్యార్థి దశలోవుండగానే ఆత్రేయ ఆవేశం కవిత్వ ధోరణిలోనే అక్షర రూపం దాల్చింది. ‘్ఢంకా’ పత్రికలో ఆత్రేయ తొలి రచన ‘దేవుళ్లదంతా అన్యాయమే’ శీర్షికన ప్రచురితమైంది. స్వాతంత్య్రం సిద్ధించగానే ‘సుప్రభాతం’, ‘అరణ్యరోదనం’ అనే పద్య కావ్యాలను రచించారు. పాలకుల వాగ్దాన భంగాలతో హుతాశులైన ప్రజల అసహాయత, ఆర్తి, ఆవేదనకు ‘అరణ్యరోదనం’లో అద్దంపట్టారు. ఇంకా ఆత్రేయ తన ఆత్మకథను, భగవదీత్గతను పద్యాలలో రాయడమే కాకుండా తన మనోవేదనను డైరీలలో ముక్తకాల రూపంలో రాశారు.
ప్రజలతో ప్రత్యక్ష సంబంధం పెట్టుకొని వారిని చైతన్యవంతులను చేయడానికి పద్యం కంటె నాటకం బలమైన ప్రక్రియ అనే అభిప్రాయంతో దానిని చేపట్టడం ఆత్రేయ రచనా వ్యాసంగంలో మలి దశ. ఇబ్సెన్ ప్రభావంతో స్వాభావికవాదాన్ని ఆశ్రయించి, ఆధునిక నాటక రంగంలో నూతన ధోరణులను ప్రవేశపెట్టిన బళ్లారి రాఘవ, పివి రాజమన్నార్‌లను స్ఫూర్తిప్రదాతలుగా భావించి -నాటక రచనను కొత్తపుంతలు తొక్కించిన ఆత్రేయ ఆధునికాంధ్ర వచన నాటక రంగంలో యుగకర్తగా గుర్తింపబడ్డారు. ‘పరివర్తన’, ‘ఈనాడు’, ఎన్.జీ.ఓ., ‘విశ్వశాంతి’, ‘్భయం’ వంటి సంచలనాత్మక నాటకాలను, ‘ఎవరు దొంగ?’, ‘ప్రగతి’, ‘చావకూడదు’, ‘వరప్రసాదం’ వంటి ఆలోచనా స్ఫోరకాలైన నాటికలను రచించి సగటు మనిషి సమస్యలకు ప్రతినిధిగా నిలిచారు. అసంబద్ధ నాటక ధోరణిలో తన అభిమాన పాత్రలకు ఈటెల్లాంటి మాటలను రాసి సమాజాన్ని జాగృతం చేశారు. ఆత్రేయ ఏ రాజకీయ పక్షంకోసం నాటకాలు రాయకపోయినా ‘పరివర్తన’ నాటకం ద్వారా గరికపాటి రాజారావుకు, ఆంధ్ర ప్రజానాట్య మండలికి చేరువై- కమ్యూనిస్టు పార్టీకి సన్నిహితులయ్యారు. 1955 మధ్యంతర ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ప్రచారం కోసం జి వరలక్ష్మితో కలిసి నాటక ప్రదర్శనలిచ్చారు కూడా.
ప్రజల కళ్లు తెరిపించడానికి చేసిన తపస్సు నుంచి తన నాటకాలు వెలువడ్డాయని, తను ఆఖరి నాటకం రాసి దేశం నలుమూలలా ప్రదర్శించి ప్రజల మధ్య రంగస్థలం మీదో, పోలీసుల తుపాకీ గుళ్లకు బలయ్యో చివరి ఊపిరి వదలాలని ఆత్రేయ తన జీవిత చరమాంకంలో ఆవేశ పూరితంగా అంటూండేవారు.
ఇలా కవిత్వ నాటక దశలలో తన అభ్యుదయ దృక్పథాన్ని, సామాజిక స్పృహను ఎలుగెత్తిచాటిన ఆత్రేయ, సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత కూడా అవకాశాల మేరకు పాటల్లో తన అంతర్గత వేదనను అక్షరీకరించారు. తనకు మొదటి అవకాశం లభించిన ‘దీక్ష’ (1951) చిత్రంలోనే కథా సందర్భానికనుగుణంగా- మనుషులంటే వీళ్లేనా/ ప్రపంచమంతా యింతేనా/ లేమితో యెందరో యేడుస్తున్నా/ కలిమితో కొందరు కులుకుతువున్నా/ దొంగలె దొరలై దోచేస్తున్నా/ మామూలనుకొని పోతున్నారే.. -అనే పాట ద్వారా సమాజంలోని నిర్లిప్త్ధోరణిని దుయ్యబట్టారు.
రెండవ చిత్రం ‘ఆదర్శం’ (1952)లోని గేయ నాటకంలో- మతం పేర నెత్తుటేర?/ దేవుడైనా సహించేనా?/ మానవులా? దానవులా?/ మానభంగ మారణాలా? -అంటూ కుల మతాల పేర జరుగుతున్న మారణహోమాన్ని నిరసించాడు. నేటికీ నిత్యనూతనంగా శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీకగా వినిపించే ఆత్రేయ పాట ‘తోడికోడళ్లు’ (1957) చిత్రంలోని- ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిదాన/ బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో చెప్పగలవా?’ -అనేది. ఈ పాట శ్రీశ్రీ రచన అని, డాక్టర్ చక్రవర్తి చిత్రంలోని ‘మనసున మనసై’ అనే పాట ఆత్రేయదని పందేలు కాసిన వాళ్లెందరో! ఈ పాట ఆత్రేయదని తెలియకుండానే ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు శ్రీశ్రీ సంపాదకత్వంలో వెలువడిన ‘నవత’ త్రైమాసిక (1967 అక్టోబరు- డిశంబరు సంచిక)లో 13 పుటల కావ్య ప్రశంస రాశారు. ఈ పాట ఒక సామాజిక వ్యవస్థను పరామర్శిస్తోందని, ఇందులో మూడు ప్రశ్నలు- వాటికి సమాధానాలు ఉన్నాయని బుచ్చిబాబు అభిప్రాయపడ్డారు. కవి నిజానికి కారులో అమ్మాయిని సంబోధించలేదనీ, ఆమె వెనకవున్న సమాజ వ్యవస్థనీ పెత్తందార్లనీ ఉద్దేశించి ప్రశ్నించారనీ- వ్యాఖ్యాత ఉద్దేశం.
కవి మూడు ప్రశ్నలతో ఈ పాటను ముగించి చేతులు దులుపుకోలేదనీ -‘చాకిరొకరిది, సౌఖ్యమొకరిది/ సాగదింక తెలుసుకో’ -అనే హెచ్చరిక లాంటి ముక్తాయింపుతో ‘దేశ చరిత్రలు’ ఖండికలో ‘ఇంకానా? ఇకపై చెల్లవు..’ అన్న మహాకవి శ్రీశ్రీని తలపింపజేశారని విశే్లషకుల అభిప్రాయం. నిజానికి ఆత్రేయ ఈ పాటను ‘తోడికోడళ్లు’ చిత్రం కోసం రాయలేదని, ఆత్రేయ నాటకాలు రాస్తూ, నాటకాలు వేస్తూ పొట్ట పోషించుకోవడం కోసం చిరుద్యోగాలు చేసే కాలంలో నెల్లూరిలోని ‘కస్తూరిబా’ బాలికల పాఠశాలలో శ్రీమంతుల కుటుంబాల నుంచి వచ్చిన ఆడపిల్లల వైభవాలను చూసి ఈ పాటను రాసి ఉంచుకొన్నారని ఆత్రేయ అర్ధాంగి కెవి పద్మావతి సమాచారం. ‘తోడికోడళ్ళు’ చిత్రంలో అతికించినట్టువున్న ఈ సన్నివేశ గీతంపై సమాచారాన్ని బలపరుస్తోంది. రచనాకాలం మాటెలావున్నా, ఈ పాట అన్ని కాలాలకు వర్తించే అభ్యుదయ గేయమనడంలో ఏమాత్రం సందేహం లేదు!
ఇంకా ఆత్రేయ ఈ వ్యవస్థ డొల్లతనాన్ని బయటపెడుతూ, శ్రమజీవుల అవస్థలకు సానుభూతి చూపిస్తూ, దొరల్లా చెలామణీఅయ్యే దొంగల, దోపిడీదారుల దౌర్జన్యాలను యెండగడుతూ రాసిన పాటలెన్నో! వాటిలో కొన్ని మచ్చుతునకలు-
చీకటిరా బాబూ, చీకటిరా/ ఈ చీకటిలో వింత లోకమురా/ దొరికాడా దొంగ, లేకుంటే దొరరా/ ఈ గాథలీ బాధలింతేనురా! -(ఆలుమగలు, 1959)
నేస్తం చూడర ఈ కుళ్లు లోకము/ చూస్తే కోరవు ఈ నరజన్మము -(తోటరాముడు, 1974).
కళ్లూ, కాళ్లూ లేని దాన్ని బాబులు/ అంటే గవ్వైన యివ్వరే మనుషులు/ నా కళ్లు చూడు- కాళ్లు చూడు/ అంటే చాలు కనకవర్షాలే కురిపిస్తారీ సాములు -(ఎంకి-నాయుడుబావ, 1978)
సాపాటు ఎటూ లేదు/ పాటైన పాడు బ్రదర్/ రాజధాని నగరంలో వీధివీధి నీది నాదే బ్రదర్/ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్ -(ఆకలిరాజ్యం, 1981).
దోచే దొంగల్లారా/ మేసే కంచెల్లారా/ ఊళ్లే మింగుతారా, మీ పాపం పండెలేరా -(పిచ్చిపంతులు, 1983). ఈ పాటల్లో డబ్బున్నవారి లీలలు, కూలీల నిరుద్యోగుల నిరాశా నిస్పృహలు, గద్దెలెక్కే పెద్దల బూటకాల సుద్దులు, మదమెక్కిన మారాజుల మదనకుతూహలాలు, అన్నపూర్ణలాంటి దేశంలో ఆకలికేకలూ, ఈగల మోతలూ, చేను మేసే కంచెల్లాంటి పెత్తందార్ల దాష్టీకాలూ.. వెరసి వ్యవస్థలోని సమస్త రోగాలనూ కవి వ్యంగ్యభూయిష్ఠంగా యేకరువు పెట్టారు.
ఆత్రేయ తన వ్యక్తిగత జీవితంలోని వైఫల్యాలను ప్రతిబింబించే స్ర్తి ద్వేషానికీ, ప్రేయసి కాఠిన్యానికి సంబంధించిన కొన్ని పాటలను ఆడబ్రతుకు, కనె్నమనసులు, ఇంద్రధనుస్సు, అభినందన మొదలైన చిత్రాల్లో రాసినా, కవిగా అనాదిగా ఆడవాళ్లకు జరుగుతున్న అన్యాయపై సానుభూతితో స్పందించారు. కథా సందర్భాలనుబట్టి అవకాశాలను అందిపుచ్చుకొని అనేక స్ర్తివాద గేయాలను రాశారు-
అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇదిలే/ అదేమిటో! ఆడదంటే మగవాడికి అలుసులే -(తేనెమనసులు, 1965).
అరిటాకమ్మా ఆడజన్మమూ/ ముళ్లకంచె ఈ మూఢ సంఘమూ/ ముళ్లకెన్నడూ దండన లేదు/ చిరిగిన ఆకు విస్తరి కాదు -(స్ర్తిజన్మ, 1967)
మానుమరల చిగురిస్తూంది/ చేను మళ్లీ మొలకేస్తూంది/ మనిషికి మాత్రం వసంతమన్నది/ లేదని తొలి రాసిందెవరు? -(గాలిపటాలు, 1974).
అందరి రాతలు రాసేది దేవుడు/ ఆడదాని రాత రాసేది మగవాడు -(లక్ష్మణరేఖ, 1975)
కన్నువంటిది ఆడది/ కన్నీరామెకు తప్పనిది -(కుక్కకాటుకు చెప్పుదెబ్బ, 1979).. వంటివి ఆత్రేయ స్ర్తిజాతి దయనీయ స్థితిని తెలియజేసి, వారిని జాగృతం చేసేందుకు రాసిన పాటలలో కొన్ని.
వాటిలో పౌరాణిక కాలంనుంచి మగమహారాజులు వాళ్ల ధర్మపత్నులకు చేసిన అన్యాయాలు, స్ర్తిపురుషులను అరిటాకు- ముల్లు తీరుగా తీర్చిన ప్రకృతి పక్షపాతం, వైధవ్యం పేరుతో ఆడదాని రూపును మారుస్తున్న అమానుష చర్యలూ, తప్పెవరు చేసినా చివరకు స్ర్తియే శిక్ష అనుభవించే ఆటవిక న్యాయం వంటి అంశాలను ప్రస్తావించి మహిళాభ్యుదయం కోసం ఆత్రేయ తన పరిధిలో ప్రయత్నించారు. ఆడవాళ్ల కన్నీళ్లను తుడవడానికి ‘నేనుసైతం’ అంటూ కలాన్ని ఝుళిపించారు. ‘కలడు కలండనెడివాడు కలలో లేడో..’ అని గజేంద్రమోక్ష ఘట్టంలో పోతన సందేహించినట్టు దేవుడి అస్తిత్వాన్ని వ్యాజస్తుతితో అనేక సినీ గేయాలలో ప్రశ్నించాడు ఆత్రేయ. దేవుడనే వాడుంటే లోకంలో జరుగుతున్న కుళ్ళును చూడకుండా కళ్లుమూసుకొని వుంటాడా అని, దేవుడి పేర జరుగుతున్న వంచన, హింసను సహిస్తూ రాతిబొమ్మగా మిగిలిపోతాడా? అని తుకారాం పాత్ర ద్వారా దేవుణ్ని నిందరూపంలో నిలదీశాడు. దేవుడనే వాడుంటే వాడికి మనసులేదన్నాడు. మనసులేని దేవుడు మనిషికి మనసిచ్చి అతడు పడే బాధల్ని చూస్తూ వినోదిస్తున్నాడన్నాడు. ఉన్నాడో లేడో తెలియని దేవుడి కంటె మానవత్వమున్న మనిషి మేలన్నాడు. ఇలా దేవుడి పేర జరుగుతున్న అన్యాయాలను, అరాచకాలనూ నిరసిస్తూ సామాన్యుడి కళ్లు తెరిపించడానికి ఆత్రేయ రాసిన సినీ గీతాలనుంచి కొన్ని మెచ్చుతునకలు-
ఉన్నావా? అసలున్నావా?/ ఉంటే కళ్లు మూసుకున్నావా?/ ఈ లోకం కుళ్లు చూడకున్నావా! -(్భక్తతుకారాం, 1973)
మనసులేని దేవుడు/ మనిషికెందుకో మనసిచ్చాడు -(ప్రేమలు, పెళ్ళిళ్లు, 1974).
దేవుడు లోకంలో కొందరు దేవుళ్లను సృష్టించాడు/ పసిదేవుళ్లను సృష్టించాడు/ వాళ్లను కూడా తనవలెనే/ మూగచెవుడు గుడ్డిగ చేశాడు -(కథానాయకుని కథ, 1975)/
దేవుడు వున్నాడో లేడో/ మానవుడున్నాడురా -(మేమూ మీలాంటి మనుషులమే, 1983)
దేవుడికే హాయిగ వున్నాడు/ ఈ మానవుడే బాధలు పడుతున్నాడు -(శభాష్‌సూరి, 1964).
దేవుడు అడ్డుగా సాగుతున్న అకృత్యాలకు, అక్రమార్జనలకు మనసు మండిన ఆత్రేయ తన చివరిరోజుల్లో ‘దేవుడు నాస్తికుడయ్యాడు’ అనే నాటకం రాయాలనుకోవడం ఈ ధోరణికి పరాకాష్ఠ. ఆత్రేయ రాసిన సినిమా పాటల సంఖ్య రమారమి 1400 మాత్రమే. అయినా వాటిలో అధిక శాతం ప్రజాదరణ పొందడానికి ఆయన సామాన్యుడి కర్థమయ్యే తేలికైన భాషను ఉపయోగించడమే! ఆ భాషే ఆత్రేయ అభ్యుదయ భావాలకు ఉద్దేశించిన ప్రయోజనాన్ని సిద్ధించేలా చేసింది, వేమన పద్యాల్లా జన సామాన్యం నోళ్లలో నానేలా చేసింది. ఆత్రేయ వ్యక్తిగత బలహీనతల గురించి, శృంగార గీతాల గురించి తెలిసీ తెలియకుండా విమర్శించేవారికి ఆయన రాసిన అభ్యుదయ గీతాలు జవాబులు. ఒక శక్తిమంతమైన మాధ్యమానికి సంబంధించిన కవిగా ఆయన తీసుకొన్న సామాజిక బాధ్యతకు నిదర్శనాలు.
కొసమెరుపు: కారులోనూ, ఆటోలోనూ ఎప్పుడూ ఎడమవైపునే కూర్చోవడం ఆత్రేయ అలవాటు. ఆ అలవాటును ఎవరైనా ఆత్మీయులు ప్రశ్నిస్తే- ‘నేను లెఫ్టిస్ట్’ను అనేవారు ఆత్రేయ!

-పైడిపాల