AADIVAVRAM - Others

గానగంధర్వుడు ఘంటసాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిసెంబర్ 4న ఘంటసాల జయంతి
*
తన గానామృతంతో ఆబాలగోపాలాన్ని ఊహల లోకంలో విహరింపజేసిన గాన గంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు. ఘంటసాల అనగానే ఆ మధుర గాయకుడే ప్రతి ఒక్కరి మనసును తాకుతాడు. జీవితంలో అనేక కష్టనష్టాను చవిచూసి, ఒక్కో మెట్టు ఎదిగి సంగీత ప్రియుల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న గాయక దిగ్గజం 4 డిసెంబర్ 1922లో సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో తెలుగు బ్రాహ్మణులలో వెలనాటి వైదిక అర్చక కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలో తండ్రి సూర్యనారాయణ ఘంటసాలను భుజాలపై ఎక్కించుకుని భజన కార్యక్రమాలకు, భక్తి సంగీత కచేరీలకు తీసుకుని వెళ్లేవాడు. తండ్రి ఆ కచేరీలలో పాటలు పాడుతుండగా ఘంటసాల అందుకు అనుగుణంగా నాట్యం చేసేవారు. ఆ నాట్యానికి అందరూ ముగ్ధులై ప్రశంసిస్తూ ‘బాల భరతుడు’ అని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట తండ్రి సూర్యనారాయణ కన్ను మూశారు. ఘంటసాల పెద్ద సంగీత విద్వాంసుడు కావాలని సూర్యనారాయణ కోరిక. కానీ తండ్రి మరణంతో ఆ కుటుంబం తల్లి రత్తమ్మ తమ్ముడైన ర్యాలీ పిచ్చయ్య వద్దకు చేరింది.
తండ్రి కల నెరవేర్చడానికి సంగీత శిక్షణ
తాను సంగీత విద్వాంసుడు కావాలని తండ్రి కన్నకలల్ని నెరవేర్చాలనే తపనతో ఘంటసాల గురుకులంలో చేరారు. అక్కడి కట్టుబాట్లను ఆయన తట్టుకోలేక తిరిగి తన ఊరికి వచ్చేశారు. ఆ సమయంలో సమీప గ్రామంలో సంగీత పోటీలు జరిగాయి. ఆ కచేరీలో సంగీత విద్వాంసుడితో పోటీ పడిన ఘంటసాల ఓడిపోయారు. అందరూ నవ్వుకోవడంతో ఆయనలో పట్టుదల పెరిగింది. అప్పటికి ఘంటసాల తొమ్మిదవ తరగతి వరకు మాత్రమే విద్యాభ్యాసం చేశారు. తరువాత చదువు అబ్బలేదు. నాటకాల వాళ్లు పరిచయం కావడంతో సతీసక్కుబాయి, చింతామణి ఇత్యాది నాటకాలలో చిన్నచిన్న వేషాలు వేసేవారు. అయితే ఘంటసాలకు సంగీతంపై మక్కువ తగ్గలేదు. తండ్రి బ్రతికున్న రోజుల్లో ఘంటసాలను అక్కున చేర్చుకుని సంగీత విద్యను నేర్చుకుని తరించమని కోరేవారు. ఆ కారణంగా తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల వద్దకు వెళ్లి వాళ్ల ఇళ్లల్లో పనికి కుదిరి సంగీతం నేర్చుకోవాలని ఆయన భావించారు. రెండు సంవత్సరాల కాలంలో ఒకరి ఇంట్లో వంట చేయడం, మరొకరి ఇంట్లో బట్టలు ఉతకడం చేస్తూ సంగీత నేర్చుకోవడం ప్రారంభించారు. ఆ తరువాత సంగీత కళాశాలకు వెళ్లి అభ్యసించడమే సరైన పద్ధతని భావించిన ఘంటసాల తన వద్దగల 50 రూపాయల విలువగల ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు అమ్మి అప్పట్లో ఆంధ్ర రాష్ట్రంలోని విజయనగరంలో కల ఏకైక సంగీత కళాశాలకు చేరుకున్నారు. విజయనగరం చేరేప్పటికి వేసవి సెలవుల కారణంగా కళాశాల మూసి ఉంది. అక్కడి ప్రిన్సిపల్‌ను అభ్యర్థించగా కళాశాల ఆవరణలో బస చేయడానికి అంగీకరించాడు. సంగీత మహామహులైన ఆదిభట్ల నారాయణ, ద్వారం వెంకటస్వామి నాయుడు వంటి విజయనగర విద్వాంసుల గురించి ఘంటసాల విని ఉన్నారు. ఏది ఏమైనా అక్కడే సంగీత శిక్షణను పొందాలని బలీయమైన సంకల్పానికి పూనుకున్నారు. ఘంటసాల అక్కడే ఉండి రోజుకొక ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవారు. సంగీత కళాశాలలో శిక్షణ చేస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు చేసిన తప్పును ఘంటసాలపై వేయడంతో కళాశాల నుండి బహిష్కరించారు. ఈ విషయం తెలిసిన వారాలు పెట్టే కుటుంబాల వారు ఘంటసాలను తమ ఇళ్లకు రావద్దనడంతో భోజనం సమస్య వచ్చి పడింది. ఏం చేయాలో పాలుపోక ఆయన ఎల్లమ్మ గుడికి వెళ్లి తలదాచుకున్నారు. ఆ సమయంలో గుడికి వచ్చిన పట్రాయని సీతారామశాస్ర్తీ ఘంటసాల గురించి తెలుసుకుని తన ఇంట ఉచిత సంగీత శిక్షణ నివ్వడానికి అంగీకరించారు. ఈ కృతజ్ఞతతో ఘంటసాల బ్రతికున్నంత కాలం తన గురువంటే పట్రాయని సీతారామశాస్ర్తీ అని చెప్పుకున్నారు.
మాధుకర భిక్ష
ఇంతలో ఘంటసాలకు మరో చిక్కు వచ్చి పడింది. సంగీత గురువు సీతారామశాస్ర్తీ పేదవాడు కావడంతో భోజన వసతి కల్పించలేక పోయారు. ఆకలితో ఉన్న ఘంటసాల భుజానికి ఒక సాధువు జోలెకట్టి ఇంటింటా అడుక్కోవడం నేర్పించాడు. ఇలా ఆయన మాధుకరం (ఇంటింటికీ తిరిగి అడుక్కోవడం) చేయడం ప్రారంభించారు. భుజాన జోలె కట్టుకుని రెండు పూటలా సరిపడ అన్నాన్ని తెచ్చుకునేవారు. ఒక్కోసారి మిగిలిన అన్నం వస్త్రంలో చుట్టి ఉంచడం వల్ల సాయంత్రానికి చీమలు పట్టి పాడై పోయేది. ఆ సందర్భాలలో ఆయన పస్తులు ఉండవలసి వచ్చేది. ఆ సమయంలో చిన్న గినె్న కనుక్కోవడానికి డబ్బులు లేక మేనమామకు ఉత్తరం రాయగా ఆయన పంపిన డబ్బులతో చిన్న డబ్బా కొనుక్కుని అన్నాన్ని భద్రపరచుకుని తినేవారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న పిదప ‘ఏ తల్లి మొదట కబళం నా జోలెలో వేసిందో ఆమె ఆ వాత్సల్యపూరితమైన భిక్ష నాకు అష్టైశ్వర్యాలతో కూడిన భవిష్యత్తునే ప్రసాదించింది’ అని ఘంటసాల స్వయంగా పలు వేదికలపై చెప్పుకున్నారు. కొందరు ఆకతాయి విద్యార్థుల వల్లనే ఘంటసాల సంగీత కళాశాల నుండి బయటకు వెళ్లవలసి వచ్చిందని తేలిన పిదప తిరిగి వారిని కళాశాలలో చేర్చుకున్నారు. శాస్ర్తీగారి వద్ద సంగీత శిక్షణ పొందడం వల్ల కోర్సును సునాయాసంగా పూర్తి చేశారు. విజయనగరంలో ఆరేళ్లపాటు శాస్ర్తియ సంగీతాన్ని అభ్యసించారు. సంగీతంలో పట్ట్భద్రుడైన తరువాత కొంతకాలం విజయనగరంలో సంగీత కచేరీలు చేశారు. ఆ తరువాత స్వగ్రామమైన చౌటపల్లెకి చేరి శ్రీరామనవమి, శారదా నవరాత్రులు, గణపతి నవరాత్రులు, వివాహ మహోత్సవాలలో సైతం సంగీత కచేరీలు చేస్తూ విద్యార్థులకు సంగీత శిక్షణ నిచ్చేవారు. అనంతరం మద్రాసు చేరి కొంతకాలం ఆలిండియా రేడియోలో శాస్ర్తియ సంగీత కార్యక్రమాలు ఇచ్చారు.
నాటక సమాజ స్థాపన
కేవలం సంగీత కచేరీలతో ఆర్థికంగా పుంజుకోలేమని భావించిన ఘంటసాల ఒక నాటక సమాజాన్ని స్థాపించారు. ఆ సమయంలోనే అద్దంకి శ్రీరామమూర్తి, పోరుపల్లి సుబ్బారావు, సత్యనారాయణ, పులిపాటి వెంకటేశ్వరరావు, పీసపాటి నరసింహమూర్తి, రఘురామయ్య ఇత్యాది పెద్దల పరిచయం ఏర్పడి వారితో నాటకాలలో సైతం నటించారు. అయితే నటుడిగా ఘంటసాలకు ఎటువంటి గుర్తింపూ రాలేదు. ఈ విధంగా ఒకవైపు కచేరీలు చేస్తూ, మరోవైపు సంగీతం శిక్షణనిస్తూ, ఇంకోవైపు నాటకాలు ఆడుతూ పలు సమస్యలతో సతమతవౌతున్న సమయంలో 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమం మహోగ్ర రూపం దాల్చింది. ఈ సమయంలో భారత పౌరుడిగా తన కర్తవ్యాన్ని గుర్తెరిగిన ఘంటసాల పర ప్రభుత్వ దాస్యం నుండి భారతదేశాన్ని కాపాడుకోవాలని భావించి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనగా 18 నెలలపాటు అలీపూర్ కారాగారంలో శిక్షను అనుభవించారు. జైలు జీవిత కాలంలో గోపాలరెడ్డి, పొట్టి శ్రీరాములు, ఎర్నేని సుబ్రహ్మణ్యం ఇత్యాది నాయకుల సహచర్యంలో ఘంటసాల అనేక విషయాలు నేర్చుకున్నారు.
వివాహం
ఘంటసాల జైలు నుండి విడుదలైన పిదప తిరిగి తన సంగీత, నాటక కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలోనే తన మేనకోడలైన సావిత్రమ్మతో 4 మార్చి 1944న ఘంటసాలకు వివాహం జరిగింది. తన పెళ్లిలో తనే సంగీత కచేరీ చేసి ఆయన అందరినీ సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తారు. పెళ్లి జరిగిన కొంతకాలానికి అత్తగారి గ్రామమైన పెదపులివర్రుకు సముద్రాల రాఘవాచారి వచ్చారు. అప్పటికే సముద్రాల వారు సినీ పరిశ్రమలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఘంటసాల ప్రతిన గురించి విన్న సముద్రాల రాఘవాచారి ఒకసారి మద్రాసు వచ్చి కలవమన్నారు. సముద్రాల రాఘవాచారిని కలిసిన ఘంటసాలను రేణుకా ఫిలిమ్స్‌కు తీసుకువెళ్లి చిత్తూరు నాగయ్య, బి.ఎన్.రెడ్డిల ముందు పాటలు పాడించారు. ఆ పాటలు విన్న వారిద్దరూ అవకాశం ఉన్నప్పుడు తప్పక సినిమాలలో పాడిస్తామని మాట ఇచ్చారు.
సినీ రంగంలోకి ఘంటసాల
సినీ అవకాశాల కోసం మద్రాసు వెళ్లిన ఘంటసాలకు సముద్రాల రాఘవాచారి తన ఇంట బస ఏర్పాటు చేశారు. ఆ ఇల్లు చాలా చిన్నది కావడంతో సముద్రాల వారిని కష్టపెట్టడం ఇష్టంలేని ఘంటసాల అక్కడ నుండి తన మకాంను పానగల్ పార్కుకు మార్చి వాచ్‌మేన్‌కు నెలకు రెండు రూపాయలు చెల్లించి అక్కడే బస చేశారు. పగలంతా అవకాశాల కోసం తిరిగి రాత్రికి పార్కులో నిద్రపోయేవారు. పార్కులో ఆకలితో ఉన్నవారికి తన భోజనంలో కొంచెం పెట్టి ఆకలి తీర్చేవారు. ఈ తరుణంలో సముద్రాల వారు మద్రాసు ఆలిండియా రేడియోలో లలిత గీతాల గాయకుడిగా ఘంటసాలకు అవకాశం ఇప్పించారు. ఇలా రేడియోలో పాటలు పాడుతూ, గాయకుడిగా సినీ అవకాశాల కోసం తిరుగుతూ, అప్పుడప్పుడూ సినిమాలలో చిన్నాచితకా వేషాలు వేస్తూ, మధ్యమధ్యలో బృంద గానాలలో పాడుతూ సినీరంగ ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు.
ఘంటసాల గళానికి తిరస్కారం
మద్రాసు వెళ్లిన కొత్తలో తన గొంతు గ్రామఫోన్ రికార్డు పాడటానికి పనికి వస్తుందా? చూడమని ఘంటసాల ‘హిజ్ మాస్టర్స్ వాయిస్’ కంపెనీకి వెళ్లారు. అప్పట్లో ఆ గొంతు విన్నవారు ఈ గొంతు మైక్‌కు పనికిరాదని తేల్చి చెప్పారు. ఆ తరువాత పేకేటి శివరాం ‘హిస్ మాస్టర్స్ వాయిస్’ ఆర్కెస్ట్రా ఇన్‌చార్జ్ అయిన పిదప అవకాశం ఇవ్వడంతో ఘంటసాల గానం చేసిన తొలి గ్రామఫోన్ రికార్డు హెచ్.ఎం.వి. వారు విడుదల చేశారు. ఆ రికార్డులు బాగా అమ్ముడు పోవడంతో ఘంటసాలకు మంచి గుర్తింపు వచ్చింది.
సినీ గాయకుడిగా అవకాశం
తొలుత భానుమతి, రామకృష్ణలు తీసిన ‘స్వర్గసీమ’ చిత్రంలో ‘ఓహో నా రాజ’ పాట ద్వారా ఘంటసాల గళం తెలుగు చిత్రసీమకు పరిచయమయింది. తొలి పాటే భానుమతి సరసన పాడే అవకాశం పొందారు ఘంటసాల. భానుమతి వంటి సీనియర్ నటీమణి సరసన పాడటానికి తొలుత ఆయన భయపడ్డారు. చిత్తూరు నాగయ్య ధైర్యం చెప్పగా ఘంటసాల పాడిన ఆ పాటకు రూ.116 పారితోషికం పొందారు. తరువాత భానుమతి తీసిన ‘రత్నమాల’ చిత్రానికి సహాయ సంగీత దర్శకుడిగా అవకాశం లభించింది. ఆ చిత్రానికి సి.ఆర్.సుబ్బరామన్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. వారికి సహాయ సంగీత దర్శకుడిగా ‘రత్నమాల’ చిత్రానికి తొలిసారిగా టైటిల్స్‌లో ఘంటసాల పేరు వేశారు. ఆ చిఅతంలో కొన్ని పాటలకు వరుసలు కట్టారు. సుబ్బరామన్ ఘంటసాల వారిని ‘రాజా’ అని పిలిచేవారు. 1947లో తన కుటుంబాన్ని మద్రాసుకు పిలిపించుకుని ఒక అద్దె ఇంట్లో కాపురమున్నారు ఘంటసాల. 1946-47 మధ్య ప్రాంతంలో ఘంటసాల వందకు పైగా కచేరీలు చేశారు. తదుపరి మన దేశం, బాలరాజు వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించగా అవి ఎంతో ప్రజాదరణ పొందాయి. 1948లో విడుదలైన ‘బాలరాజు’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుకు నేపథ్య గానం అందించారు. ఇది ఆయన సంగీత జీవితాన్ని మలుపు తిప్పింది. ఘంటసాల సంగీతం నేర్చుకునేటప్పుడు ముద్దు పాపారావు
ఘంటసాల (10వ పేజీ తరువాయ)
అనే స్నేహితుడుండేవాడు. 1947లో ఆయన ఘంటసాలకు ఒక ఉత్తరం రాశరు. ‘అన్నా వెంకటేశ్వరరావు. నువ్వింత అన్యాయం చేస్తావనుకోలేదు. వాచీ కొనిపెట్టమంటే గొప్పవాడినయితే చూద్దాం అన్నావు. ఇప్పుడు గొప్పవాడివయ్యావు కదా? ఏదీ నా వాచీ’ అంటూ విజయనగరంలో ఉన్నప్పటి మాట గుర్తు చేశాడు పాపారావు. ఆ ఉత్తరం చదివిన ఘంటసాల వంద రూపాయలు మనియార్డర్ చేసి వాచీ కొనుక్కోమని ఉత్తరం రాశారు. మద్రాసు వస్తే హార్మోనియం వాయించడానికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయని ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, పాపారావుకు టైఫాయిడ్ జ్వరం రావడంతో లేఖ చేరేలోపే ఆయన చనిపోయాడు. ఈ సంఘటన ఘంటసాలను కలచివేసింది. ఆ తరువాత పాపారావు కుమారుడు నరసింగరావును తన ఇంట్లోనే పెట్టుకుని సొంత కుమారుడిలా పెంచి విద్యాబుద్ధులు నేర్పించారు. ఇది ఘంటసాల ఔదార్యానికి మచ్చుతునక
వెనుతిరగని ఘంటసాల
ఈ విధంగా సినీ ప్రస్థానం చేసిన ఘంటసాల వెనుతిరిగి చూసుకోలేదు. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘లక్ష్మమ్మ’. ఈ చిత్రం నాలుగు సంస్థల చేతులు మారి 1950లో విడుదలైంది. ఆ చిత్రంలో నాయకిగా నటించిన కృష్ణవేణికి ‘లక్ష్మమ్మ’ చిత్రంలో పాటలు బాగా నచ్చడంతో ‘మన దేశం’ చిత్రంలో ఘంటసాలకు అవకాశం కల్పించారు. ఇది ఎన్‌టిఆర్ తొలి చిత్రం. 1951లో విడుదలైన ‘పాతాళభైరవి’ చిత్రం విడుదలతో తెలుగునాట ఘంటసాల పేరు మారుమ్రోగిపోయింది. ఆ సమయంలోనే మద్రాసులో ఇల్లు కొనుక్కుని కుటుంబాన్ని తెచ్చుకున్నారు. గృహ ప్రవేశం సందర్భంగా తన గురువైన సీతారామ శాస్ర్తీని మద్రాసుకు రావలసిందిగా ఆహ్వానంతోపాటు రైలు ఛార్జీలు కూడా పంపారు. గృహ ప్రవేశానికి వచ్చిన గురువుగారిని వెయ్యి నూట పదహార్లు, నూతన పట్టువస్త్రాలను వెండిపళ్లెంలో పెట్టి సత్కరించి సాష్టాంగ నమస్కారం చేసి తన గురుభక్తిని చాటుకున్న నిగర్వి ఘంటసాల. గృహ ప్రవేశ సమయంలోనే పాతాళభైరవి శత దినోత్సవ వేడుకలు జరిగాయి. ఘంటసాల హాజరు కాలేక పోవడంతో జ్ఞాపికను అందుకోలేక పోయారు. ఘంటసాల, సావిత్రమ్మ దంపతులకు 1951లో ఒక కొడుకు పుట్టాడు. విజయా సంస్థతో అనుబంధానికి గుర్తుగా ఆ అబ్బాయికి వేంకట సుబ్రహ్మణ్య విజయకుమార్ అని నామకరణం చేశారు. ఆ మీదట సాలూరు రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఘంటసాల వారు ‘మల్లీశ్వరి’ చిత్రంలో పాడిన పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. 1951లో విడుదలైన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావుకు ఘంటసాల నేపథ్య గానాన్ని అందించారు. విజయా వారు 1952లో నిర్మించిన ‘పెళ్లి చేసి చూడు’ అనే తెలుగు చిత్రానికి, ‘కల్యాణం పణ్ణిప్పార్’ అనే తమిళ చిత్రానికి ఘంటసాల సంగీత దర్శకత్వం వహించారు. ఇదే ఏడాది నిర్మించిన ‘పల్లెటూరు’ అనే చిత్రంలో తన గురుపుత్రులు బృందగానాన్ని పాడే అవకాశాన్ని ఘంటసాల కల్పించారు. అదే సమయంలో ఆంధ్రులకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని 19 అక్టోబర్ 1952లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్షను పూనారు. ఈ నేపథ్యంలో శ్రీరాములు 15 డిసెంబర్ 1952లో మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళుతుంటే అంతిమ యాత్రలో పాల్గొన్న ఘంటసాల అనేక దేశభక్తి గీతాలను ఆలపించారు. తన తమ్ముడు సదాశివుడికి ఏదైనా చేస్తే బాగుంటుందనుకున్న ఘంటసాల చిత్ర నిర్మాతగా అతడ్ని నిలబెట్టాలని మరి కొందరితో కలిసి ‘పరోపకారం’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం సరిగా ఆడకపోవడంతో ఘంటసాల అప్పుల పాలయ్యారు. చలనచిత్ర నిర్మాణంలో తగిన అనుభవం లేని కారణంగానే ఘంటసాల చేతులు కాల్చుకుని అనేక రోజులు బాధపడ్డారు.
1953లో విడుదలైన ‘దేవదాసు’ చిత్రం ఆయన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. తెలుగు చిత్రసీమలో ఘంటసాల పేరు సుస్థిరమైంది. ‘దేవదాసు’ చిత్రంలో తన నటన కంటే ఘంటసాల వారి పాటలే తనకు చాలా ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు అనేక సందర్భాలలో చెప్పారు. మద్రాసు మ్యూజిక్ అకాడెమీ వారి వార్షిక సంగీత సభలో పాల్గొనడానికి 1953లో ప్రముఖ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు బడే గులాం అలీఖాన్ తన ఎనిమిది మంది బృందంతో మద్రాసు వచ్చారు. వారి గానామృతానికి పరవశించిన ఘంటసాల వేదికపైకి వెళ్లి గులాం అలీఖాన్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఆ బృందం రెండు నెలలపాటు భారతదేశంలో ఉండి కచేరీలు చేయాలనుకున్నారు. కానీ సరైన బస లభించకపోవడంతో కలవరపడుతుంటే వారందరికీ ఘంటసాల తన ఇంట బసను ఏర్పాటు చేశారు. ఆ తరువాత 1954 ఫిబ్రవరిలో వాహినీ స్టూడియోలో గులాం అలీఖాన్ కచేరీని ఘంటసాల ఏర్పాటు చేయించి మూడు గంటలసేపు గానం చేయించారు.
ఘంటసాల ప్రభంజనం
1955 తరవాత ఘంటసాల ప్రభంజనం మొదలైంది. ఆ ఏడాది ఆయన సంగీత దర్శకత్వంలో మొత్తం ఏడు చిత్రాలు విడుదల కావడం విశేషం. వాటిలో నాలుగు తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి. ఇదే ఏడాది విడుదలైన ‘అనార్కలి’ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చి పెట్టింది. 1956లో ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ‘సొంత ఊరు’ చిత్రంతోపాటు కనకతార, చిరంజీవులు, జయం మనదే చిత్రాలు కూడా విడుదలయ్యాయి. 1957లో ఆయన సంగీత దర్శకత్వం వహించిన మాయాబజార్, వినాయకచవితి, సతీ అనసూయ, సారంధర చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో ‘మాయాబజార్’ చిత్రం చక్కటి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించి పెట్టింది. 1958లో ఆయన సంగీత దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘గిరిజా కల్యాణం’ విడుదలైంది. అదే ఏడాది పార్వతీ కల్యాణం, పెళ్లినాటి ప్రమాణాలు, మంచి మనసుకు మంచి రోజులు ఇత్యాది నాలుగు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. 1959లో సతీ సుకన్య, పెళ్లి సందడి, శభాష్ రాముడు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. 1960లో విడుదలైన ‘శ్రీ వెంకటేశ్వర మహత్యం’ చిత్రంలో ‘శేషశైలావాస శ్రీ వేంకటేశ’ అనే పాటలో తెరపై కూడా ఘంటసాల స్వయంగా పాడుతున్నట్లు చిత్రించారు. 1961లో ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన శభాష్ రాజా, శ్రీకృష్ణ కుచేల చిత్రాలు విడుదలయ్యాయి. ఇదే ఏడాది ఆయన అద్భుతంగా పాటలు పాడిన జగదేక వీరుని కథ, భక్త జయదేవ, భార్యాభర్తలు, వాగ్దానం, వెలుగు నీడలు చిత్రాలు కూడా విడుదలయ్యాయి. 1962లో ఆయన గుండమ్మ కథ, టైగర్ రాముడు, రక్త సంబంధం చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. అటు గాయకుడిగా, ఇటు సంగీత దర్శకుడిగా ఘంటసాలకు తృప్తినిచ్చిన చిత్రం ‘గుండమ్మ కథ’. 1963లో లవకుశ, ఆప్తమిత్రుడు, బందిపోటు, వాల్మీకి చిత్రాలకు, 1964లో గుడిగంటలు, మర్మయోగి, వారసత్వం, శ్రీ సత్యనారాయణ మహత్మ్యం చిత్రాలకు సంగీతం సమకూర్చారు. 1964లో విడుదలైన అమరశిల్పి జక్కన, ఆత్మబలం, డాక్టర్ చక్రవర్తి, మూగమనసులు వంటి అనేక చిత్రాలు గాయకుడిగా ఘంటసాలకు కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించి పెట్టాయి. 1965లో పాండవ వనవాసం, సిఐడి, 1966లో పరమానందయ్య శిష్యుల కథ, శకుంతల, 1967లో నిర్దోషి, పుణ్యవతి, భువనసుందరి కథ, రహస్యం, పెద్దక్కయ్య, స్ర్తిజన్మ, వీరపూజ, 1968లో గోవుల గోపన్న, చుట్టరికాలు, జీవితబంధం, 1969లో జరిగిన కథ, భలే అబ్బాయిలు, 1970లో అలీబాబా నలభై దొంగలు, విజయం మనదే, మెరుపు వీరుడు, తల్లిదండ్రులు, రెండు కుటుంబాల కథ, 1971లో పట్టుకుంటే లక్ష, పట్టిందల్లా బంగారం, రామాలయం, రంగేళీ రాజా, 1972లో మేనకోలు, రామరాజ్యం, వంశోద్ధారకుడు, 1973లో తులసి ఇత్యాది అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. 1970 వరకు ప్రతి పాట ఘంటసాల పాడిందే అన్నా అతిశయోక్తి లేదు. సినిమాలకు సంబంధం లేకుండా దైవ భక్తిగీతాలు, దేశభక్తి గీతాలు, ఖండకావ్యాలు ఎన్నో ఆలపించారు. మహాకవులు గురజాడ అప్పారావు రచించిన ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ శ్రీశ్రీ కలం నుండి జాలువారిన ‘పొలాలన్నీ హలాల దున్ని’ ‘ఆనందం అర్ణవమైతే’ అనే గేయాలు, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్ర్తీ రచించిన ‘పుష్పవిలాపం’ ‘కుంతీకుమారి’ ఇత్యాది ఖండకావ్యాలకు సంగీతం సమకూర్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి తరఫున వంద అన్నమాచార్య కీర్తనలను పాడారు. దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాలు, పట్టణాలలో కచేరీలు చేసి ప్రజల ప్రశంస లందుకోవడంతోపాటు లెక్కలేనన్ని కళాసంస్థల, ప్రజా సంఘాల సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. అప్పటి రాష్టప్రతి సర్వేపల్లి రాధాకృష్ణ సమక్షంలో ఘంటసాల పాడి ప్రశంసలందుకున్నారు. జగదేవవీరుని కథ చిత్రంలో ‘శివశంకరి’ అనే పాటను 14 రోజుల పాటు రిహార్సల్స్ చేసిన పిదప ఒకే టేక్‌లో రికార్డింగ్ జరిపించిన గాయక దిగ్గజం ఘంటసాల.
ఘంటసాలకు అనారోగ్యం
ఘంటసాల తల్లి రత్నమ్మ 1968 నవంబర్‌లో మరణించారు. ఆ తదుపరి సంవత్సరం 1969 తరువాత ఆయన తరచూ అనారోగ్యానికి గురయ్యారు. 26 జనవరి 1970లో గణతంత్ర దినోత్సవం నాడు ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అప్పటి రాష్టప్రతి వి.వి.గిరి చేతుల మీదుగా ఘంటసాల పద్మశ్రీ అందుకున్నారు. 1971లో అమెరికా, ఐరోపా దేశాలలో పర్యటించి కచేరీలు చేసి సంగీత ప్రియులను అలరించారు. అమెరికా వెళ్లి ప్రవాస భారతీయుల కోసం ఆయన పాడిన రఘుపతి రాఘవ రాజారాం, హరేరామ, హరేకృష్ణ పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి. 1972 అక్టోబర్‌లో రవీంద్రభారతిలో కచేరీ చేస్తుండగా గుండెనొప్పి అనిపించి ఉస్మానియా ఆసుపత్రిలో చేరి నెల రోజులపాటు ఉన్నారు. చాలాకాలం నుండి చక్కెర వ్యాధితో బాధపడుతున్న ఘంటసాల కొంతకాలం చికిత్స పొంది ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చారు. ఆ సమయంలోనే భగవద్గీత పాడాలనే కోరిక ఆయనకు కలిగింది. భగవద్గీత పాడే సమయంలో కాషాయ దుస్తులు ధరించి నేలపై పడుకునేవారు. ఘంటసాల పాడిన భగవద్గీత ఆయన జీవితంలో ఒక కలికితురాయి అని చెప్పవచ్చు. ఆ శ్రీకృష్ణ భగవానుడే వచ్చి భగవద్గీతను ఆలపించాడా? అన్నంత గొప్పగా ఆయన ఆలపించారు. భగవద్గీత పూర్తి చేసిన తరువాత సినిమాలలో పాడకూడదని ఆయన భావించినప్పటికీ పాడటం తప్పలేదు. 1972లో విడుదలైన భార్యాబిడ్డలు, విచిత్రబంధం, మేనకోడలు, రైతు కుటుంబం, బీదలపాట్లు, వంశోద్ధారకుడు, దత్తపుత్రుడు, బాలభారతం, సంపూర్ణ రామాయణం, బడిపంతులు, కాలం మారింది, కుల గౌరవం, కొడుకు-కోడలు, పండంటి కాపురం, మంచి రోజులు వచ్చాయి ఇత్యాది అనేక చిత్రాలలో ఆయన పాటలు పాడారు. ఆ తరువాత 1973లో భక్తతుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు ఇత్యాది అనేక చిత్రాలకు పాటలు పాడారు. ఆ చిత్రాలు విజయవంతంగా నడిచాయి. ఆ మీదట ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో 11 ఫిబ్రవరి 1974లో ఘంటసాల ఆస్పత్రిలోనే కన్నుమూశారు. ఆయన మరణవార్త విని తెలుగు జాతి శోక సముద్రంలో మునిగిపోయింది. తన గానామృతంలో ప్రజలను సంగీత ప్రపంచంలో విహరింపజేసిన ఆ గాన గంధర్వుడు అమరలోకాలకు చేరారు. తుది శ్వాస విడిచేవరకు నేను పాడుతూనే ఉండాలని ఘంటసాల, ఊపిరి ఉన్నంతవరకు నేను నటిస్తూనే ఉండాలని అక్కినేని నాగేశ్వరరావు అనుకునేవారు. ఘంటసాల మరణించినప్పుడు భౌతికకాయాన్ని చూడటానికి అక్కినేని వెళ్లకపోవడంతో విమర్శలు వెలువెత్తాయి. కానీ ఆ సమయంలో అక్కినేని గుండె జబ్బుతో బాధపడ్తున్నారు. అనారోగ్య సమస్యలతో వెళ్లడాన్ని వైద్యులు నిరాకరించడంతో అక్కినేని వెళ్లలేక పోయారు. ఘంటసాల చనిపోయిన రెండు నెలలకు 22 ఏప్రిల్ 1974లో ఎన్టీఆర్ విజయవాడ దుర్గా కళామందిర్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భగవద్గీత రికార్డులను ఆవిష్కరించి తొలి రికార్డును కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు అందజేశారు. భగవద్గీత గానం ద్వారా ఘంటసాల తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, సింహళం ఇత్యాది అనేక భాషల్లో దాదాపు 13వేలకు పైగా పాటలు పాడి, 107 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ఘంటసాల ప్రజల హృదయాలలో సుస్థిరం సంపాదించుకున్నారు. దాదాపు రెండు వేల విభిన్న పాటలకు ఆయన స్వరకల్పన చేశారు. పుట్టపర్తి సత్యసాయిబాబాకు ఆయన పరమభక్తుడు. కంచి కామకోటి పీఠాధిపతిని కూడా వారు కలిసేవారు. తిరుపతికి వెళ్లి కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారు. ఘంటసాల, సావిత్రమ్మ దంపతులకు ఇద్దరు మగ సంతానం విజయకుమార్, రత్నకుమార్, ముగ్గురు ఆడసంతానం శ్యామల, సుగుణ, శాంతి. పెద్ద కుమారుడు విజయకుమార్ కాలం చేశారు. చిన్న కుమారుడు రత్నకుమార్ ప్రస్తుతం కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చెన్నైలో ఉన్నారు. భార్య సావిత్రమ్మ చెన్నైలోని తన కుమార్తె శాంతి వద్ద ఉంటున్నారు. మరో ఇద్దరు కుమార్తెలు శ్యామల, సుగుణ హైదరాబాద్‌లో ఉంటున్నారు.
భారత ప్రభుత్వ తపాలా శాఖ వారు ఘంటసాల స్మృతికి గౌరవంగా 11 ఫిబ్రవరి 2003లో ఆయన ముఖారవిందంతో అయిదు రూపాయల తపాలా బిళ్లను విడుదల చేసింది. నాలుగు లక్షల స్టాంపులను అప్పట్లో ముద్రించారు. వారి కుమారుడు రత్నకుమార్ ‘పితృదేవోభవ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్టాంపును విడుదల చేశారు. అప్పటి కేంద్ర కమ్యూనికేషన్ శాఖామాత్యులు తిరువనావుక్క రసర్ తొలి స్టాంపును ఘంటసాల సతీమణి సావిత్రికి అందజేశారు. దక్షిణ భారత నటీనట సమాఖ్య వారు 1962లో ఏర్పాటు చేసిన సభలో అప్పటి ఉపరాష్టప్రతి జాకీర్ హస్సేన్ చేతుల మీదుగా ఆయన సత్కారం పొందారు. 1971లో యుఎస్‌ఏ ప్రభుత్వం ఆయనకు శాంతి పతకాన్ని అందించింది. లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు ఘంటసాలను వరించాయి. నేటితరం గానగంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో సినీ మాటల రచయిత డా.పరుచూరి గోపాలకృష్ణ రచనలో వెలువడిన ‘మన ఘంటసాల’ గ్రంథంలో ఆయన జీవిత చరిత్రను అద్భుతమైన ఛాయాచిత్రాలతో ప్రచురించారు. ఈ గ్రంథానికి బాపు గీసిన ఘంటసాల వారి చిత్రాన్ని ముఖ చిత్రంగా ముద్రించారు. జర్మనీకి చెందిన కుర్త్‌వెబర్ అనే చిత్రకారుడు ఘంటసాల రేఖా చిత్రాన్ని చిత్రించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఘంటసాల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో కోటి రూపాయల వ్యయంతో 2002లో ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత, నృత్య కళాశాలను ప్రారంభించి సంగీతం, నృత్యంలో ఏడాదికి వందలాది మందికి శిక్షణనిస్తున్నారు.
నేటి తరం గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం హైదరాబాద్ లలిత కళాతోరణంలో నెలకొల్పిన ఘంటసాల విగ్రహాన్ని ప్రముఖ హిందీ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ 14 ఫిబ్రవరి 1993లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి సమక్షంలో ఆవిష్కరించారు.
ఘంటసాల భౌతికంగా మన మధ్య లేకున్నా అందరి హృదయాలలో కొలువైవున్న ఆ గానగంధర్వుడు, అమర గాయకుడికి నివాళులర్పిస్తూ అనునిత్యం స్మరించుకుంటూనే ఉన్నారు.

-షేక్ అబ్దుల్ హకీం జానీ 9949429827