AADIVAVRAM - Others

విజయానికి ప్రతీక.. సుబ్రహ్మణ్యస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిసెంబర్ 2 సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా...
*
ఆదిదంపతులు పార్వతీ పరమేశ్వరుల రెండవ కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి (కుమారస్వామి). ఆయన అన్న వినాయకుడు విఘ్నాధిపతి అయితే కుమారస్వామి విజయాధిపతిగా లోకం స్తుతిస్తుంది. తరిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని సకల దేవతా స్వరూపునిగా, జ్ఞాన స్వరూపుడిగా సర్వజగత్తు ఆరాధిస్తుంది.
కారణజన్ముడు
సుబ్రహ్మణ్య స్వామి కారణ జన్ముడు. లోకకంటకుడైన తారకాసురుని సంహరించడానికి అవతరించాడు. తారకాసురుని చేత పీడించబడిన దేవతలను, సాధు, సజ్జనులను కాపాడి విముక్తి కలిగించాడు. పదవీ భ్రష్టున్ని చేసిన ఇంద్రుణ్ణి తిరిగి సింహాసనాధిష్టుణ్ణి చేశాడు. తనను ఆరాధించి కార్యములు తలపెట్టిన వారందరికి జయములు చేకూర్చి విజయప్రదాతగా సుబ్రహ్మణ్యస్వామి లోక ఆరాధకుడయ్యాడు.
సుబ్రహ్మణ్య షష్టి విశిష్టత
సుబ్రహ్మణ్య స్వామి మార్గశిర షష్టినాడు జన్మించాడు. అదే దినాన తారకాసురున్ని సంహరించాడు. అదే షష్టిన ఇంద్రుని కుమార్తెలయిన ‘శ్రీదేవసేన’ ‘శ్రీవల్లీదేవి’ (పెంపుడు కుమార్తె)లను వివాహమాడాడు. అదే షష్టిన దేవతలకు సైన్యాధిపతి అయ్యాడు. అన్ని సంఘటనలు షష్టి పవిత్రదినానే్న సంభవించినందున సుబ్రహ్మణ్య షష్టిగా విశిష్టత సంతరించుకొని అది మహోన్నత పర్వదినంగా లోకంచే సుబ్రహ్మణ్య షష్టిగా నామకరణం జరిగి ఆరాధించబడుతోంది.
ఏడేళ్ల ప్రాయంలోనే
దేవతల సైన్యాధిపతి
బ్రహ్మ, విష్ణువు, ముక్కోటి దేవతల ప్రార్థనలను మన్నించి పరమశివుడు కేవలం ఏడేళ్ల వయసు బాలుడైన తన ద్వితీయ కుమారుడు కుమారస్వామికి దేవతల సైన్యానికి సర్వసైన్యాధిపత్య మహత్తర బాధ్యతను లోకోపకార నిమిత్తం అప్పగించాడు. తండ్రి ఆజ్ఞను శిరసావహించి కుమారస్వామి అతి భయంకరుడు, ప్రమాదకారి అయిన అసురుడు తారకాసురున్ని సంహరించి లోక కల్యాణం గావించాడు.
దేవసేనతో వివాహం
తారకాసుర సంహారంతో తనకు తిరిగి స్వర్గ్ధాపత్యాన్ని ప్రసాదించినందుకు ఇంద్రుడు పరమానంద భరితుడయ్యాడు. అందుకు కృతజ్ఞతగా తన కుమార్తె దేవసేనను సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి వివాహం చేశాడు. దీంతో కుమారస్వామిని అల్లునిగా, పరమేశ్వరుని వియ్యంకుడిగా చేసుకున్నాడు దేవేంద్రుడు.
వల్లితో కల్యాణం
ఇదే క్రమంలో - కణ్వ మహర్షి శాపవశాన నంబిరాజుగా అవతరించిన దేవేంద్రుడు వేట కోసం వచ్చి పొదల్లో లభించిన ఆడశిశువును తీసుకొని వచ్చి పొదల్లో లభించినందున ఆ శిశువుకు ‘వల్లి’ అని నామకరణం చేసి పెంపుడు తండ్రిగా అతిగారాబంతో పెంచాడు. ఆమె పూర్వ వృత్తాంతం.. కణ్వ మహర్షి శాపవశాన శివమునిగా అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు అడవిలో తపస్సు చేసుకుంటున్న సమయంలో అతనికి ఒక జింకతో సాంగత్యమేర్పడింది. ఈ నేపథ్యంలో శివమునికి, జింకకు ఒక ఆడశిశువు జన్మించింది. ఆ శిశువును జింక పొదల్లో వదిలి వెళ్లింది. వేట సందర్భాన ఆ పొదల నుంచి తెచ్చి సాకిన అమ్మాయే ‘వల్లిదేవి’ అని చెప్పి దేవేంద్రుడు ఆమెను కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చి కళ్యాణ మహోత్సవమును వైభవోపేతంగా జరిపాడు. పెళ్లి పెద్దలుగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, ముక్కోటి దేవతలు అందరూ వచ్చి స్వర్ణ, పుష్ప అక్షింతలు చల్లి సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవిలను ఆశీర్వదించారు. అప్పటి నుంచి దేవసేన, వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్త జనుల పూజలందుకుంటున్నారు.
మయూర వాహనుడు: సర్ప ప్రేమికుడు
పరస్పర వైరుధ్యం ఉన్న మయూరమును వాహనంగా, సర్ప ప్రేమికుడిగా సర్పమును సుబ్రహ్మణ్య స్వామి చేపట్టి వాటికి సఖ్యత చేకూర్చి మయూర, సర్పధ్వజునిగా పేరు గాంచాడు. ఇందుకు గుర్తుగా, సుబ్రహ్మణ్యస్వామి చెంత సదా నెమలి, త్రాచుపామును చూస్తాము. అవి కూడా భక్తులకు ఆరాధనమయ్యాయి.
సుబ్రహ్మణ్య స్వామికి ఎన్నో పేర్లు
సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు, స్కంధుడు, షణ్ముఖుడు, గుహుడు, కుమారస్వామి, శరవణుడు, మురుగేశుడు, శక్తివేలు, మయూర కేతువు, మహాసేనుడు, వైజయంతుడు అని ఇంకా మరెన్నో పేర్లు ఉన్నాయి.
స్వామికి ఎందరో పూజలు
స్వామిని ప్రపంచంలోని ఎందరెందరో తమ అభీష్టాలు నెరవేరడానికి పూజలు చేస్తారు. ముఖ్యంగా తాము తలపెట్టిన కార్యాల్లో విజయాన్ని కోరుతూ పూజిస్తారు. అలాగే సంతానం కోసం, విద్యాప్రాప్తి కోసం, వంశాభివృద్ధి కోసం, పాడిపంటలతో పిల్లా పాపలతో, సుఖశాంతులతో వర్థిల్లజేయాలని, పూజలు చేస్తారు. మార్గశిర షష్టినాడు పలువురు శత్రువులపై విజయాల కోసం పూజా పునస్కారాలు చేయడం విశేషం.
పాము మంత్రాలు
సుబ్రహ్మణ్య షష్టి రోజున సుబ్రహ్మణ్య స్వామి కృపకు పాత్రమై పాము మంత్రాలు నేర్చుకోవాలన్న విశ్వాసం ఉంది. ఈ క్రమంలో ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని దీక్షతో ఉపాసిస్తే మళ్లీ సంవత్సరం వరకు గొప్ప శక్తి ప్రభావితమై ఆ మంత్రం వచ్చి దివ్య మహిమాన్వితంగా పని చేస్తుందని పలువురిలో నమ్మకం ఉంది.
పూజా విధానం
సుబ్రహ్మణ్య షష్టినాడు వేకువ జామునే నిండుగా స్నానం చేసి అదే తడిబట్టలతో ఉపవాసం చేస్తూ స్వామివారి ఆలయానికి వెళ్లి పువ్వులూ, పండ్లు, పడగల రూపం లాంటివి స్వామికి సమర్పిస్తారు. దీన్ని నాగపూజగా కూడా భావిస్తారు.
బ్రహ్మచారి పేరుతో పూజలు
ఇక వివాహం కాక ముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని.. ‘బ్రహ్మచారి’గా ఆయనకు మరో పేరున్నందున.. ఆ పేరుతో గొప్పగా పూజిస్తారు. ఈ విధానంలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి పూజలు చేసి పట్టువస్త్రాలు సమర్పించి భోజనాలు పెట్టి గౌరవిస్తారు. బ్రహ్మచారికి పూజలు చేయడం స్వయంగా సుబ్రహ్మణ్య స్వామికి చేసినట్లుగా భక్తులు దివ్య అనుభూతిని చెందుతారు.
స్వామిని ఆరాధిస్తే...
స్వామిని ఆరాధిస్తే ఆయురారోగ్యాలతోపాటు జ్ఞానం లభిస్తుంది. సర్వం తానే ఉన్నవాడు, ఆరు ముఖాలుకల వాడు కనుకనే షణ్ముఖుడు అని పేరు వచ్చింది.
అంతటా ఘనంగా...
కార్తికమాసంలో శుద్ధ చవితినాడు నాగుల చవితినీ, మార్గశిర మాసంలో శుద్ధ షష్టినాడు దేవసేన, వల్లీసతుల సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారల కల్యాణ మహోత్సవాలను తెలుగునాట అన్ని గ్రామాల్లో పట్టణాల్లో ఘనంగా నిర్వహించి తరిస్తారు.
కోస్తా జిల్లాల్లో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో సుబ్రహ్మణ్య షష్టి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో సుబ్బారాయునికి పువ్వులు, పడగలు సమర్పిస్తారు. పెద్దఎత్తున పూజలు, అభిషేకాలు, అన్నదానాలు నిర్వహిస్తారు. కాగా పిల్లలకు సుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బమ్మ, సుబ్బయ్య, సుబ్బారాయుడు, సుబ్బి, సుబ్బారావు పేర్లు పెట్టడం ద్వారా సుబ్రహ్మణ్య స్వామిపై తమ అపార భక్తిప్రపత్తులను చాటుకుంటారు.
ఇతర వ్రతాలు
మార్గశిర షష్టినాడే చంపా షష్టి, ప్రవార షష్టి వ్రతాలను కూడా చేయాలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి.
అనేక రూపాలలో...
సుబ్బారాయుడు బాలుడైన బాలసుబ్రహ్మణ్యంగా, పెద్దవాడై సుబ్రహ్మణ్యంగా, స్కంధుడిగా, షణ్ముఖుడిగా ఇలా అనేక రూపాలలో పూజలు అందుకుంటాడు.
శ్లోక పఠనం
ప్రత్యేకంగా పూజలు చేయలేని పరిస్థితి ఉన్నవారు కేవలం నిండు స్నానం ఆచరించి సుబ్రహ్మణ్య స్వామిని మదిలో తలచుకొని
శ్లో శక్తిహస్తం విరూపాక్షం శిభీవాహం షఢాననం
ధారుణం రిపురోగగ్నం భావమే కుక్కుట ధ్వయం
శ్లోకాన్ని వీలైనన్ని సార్లు త్రికరణ శుద్ధిగా పఠించినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కృపకు పాత్రులై సుఖ సంతోషాలు, సర్వ శుభాలతోపాటు కైవల్యప్రాప్తిని పొందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి.
సామాజిక ప్రయోజనం
సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ వ్రతం వల్ల మహర్షులు సామాజిక ప్రయోజనాన్ని పొందుపరిచారు. మార్గశిర మాసం అంటే చలిపులిగా మారి పీక్కు తినే మాసం. ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా ఉత్తరీయాలు, కంబళ్లు, దుప్పట్లు వ్రత కార్యంలో భాగంగా దానం చేయాలని పురాణాలు చెబుతున్నాయి. ఇదే సామాజిక ప్రయోజనం కలిగించే మహత్తర పుణ్య కార్యం.
తమిళనాడులో.. కావడి పండుగ
తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామిని ప్రతీ ఇంటా ఇలవేల్పుగా ఎంతో మక్కువగా, అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా కొలుస్తారు. స్వామికి ‘కావడి పండుగ’ (మొక్కు) నిర్వహిస్తారు. స్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడం వల్ల స్వామి కృపకు పాత్రవౌతామన్నది భక్తుల నమ్మకం. కుండలను పంచదారతోను, పాలతోను నింపి వాటిని కావడితో మోసుకొని వెళ్లి కుమారస్వామికి సమర్పిస్తారు. ఈ విధంగా జరుపుకునే ‘కావడి పండుగ’ తమిళనాడులో ఎంతో ప్రసిద్ధికెక్కింది.
అనువైన కాలం
సుబ్రహ్మణ్య షష్టి వెళ్లగానే వానలు కూడా తగ్గుముఖం పడతాయనీ, చెరువుల్లో నీరు తేటగా మారుతాయనీ, అలా వానలు తగ్గాక చేసుకోవలసిన పనులన్నింటినీ చేసుకోడానికి అనువైన కాలంగా రైతులు సంబరపడతారు.. ఈ విధంగా సనాతన భారతీయ సంస్కృతి పరంపరలో సుబ్రహ్మణ్య షష్టిని విశిష్ట పర్వదిన మహోత్సవంగా జరుపుకుంటూ పునీతులవుతున్నారు భక్తులు.

-తాళ్లపల్లి యాదగిరి గౌడ్ 9949789939