సబ్ ఫీచర్

దాతృత్వం.. భారతీయతకు చిహ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానగుణం, క్షమ, దయ, కరుణకు ఒకప్పుడు విశ్వవ్యాప్తంగా భారత్ ప్రసిద్ధి చెందింది. అయితే- కాలగతిలో అనేక పరిణామాల కారణంగా భారతీయుల్లో దాతృత్వం తగ్గుతోందన్న వాదనలు లేకపోలేదు. తరచూ విదేశీ ప్రభువులు మనపై దండయాత్రలు చేయడం, వారి మతాన్ని విస్తరింపచేయడం, పరాయిపాలనలోకి మన దేశం వెళ్లిపోవడం గత చరిత్ర. ఇటీవలి కాలంలో ప్రపంచీకరణ ఫలితంగా పెరిగిన వస్తువ్యామోహం, వినిమయ సంస్కృతి వంటివి మన ప్రజల జీవన విధానంలో పలు మార్పులు తెచ్చాయి. దీంతో ఇతరులను ఆదుకోవాలన్న భావన తగ్గుతున్నా, భారతీయుల్లో దానగుణం పూర్తిగా తొలగిపోలేదని అనేక ఉదంతాలు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి.
దాతృత్వంపై ‘చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్’ సంస్థ ఇటీవల 145 దేశాల్లో సర్వే నిర్వహించగా మన దేశం 106వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న దేశాలలో మనది నాల్గవ స్థానం కావడం గమనార్హం. ‘్ఫర్బ్స్’ పత్రిక కథనం ప్రకారం, మన దేశంలోని 84 మంది బిలియనీర్ల వద్ద 274 బిలియన్ డాలర్ల సంపద ఉంది. అయితే, ‘ఇండియన్ ఫిలాంథ్రఫిక్’ నివేదిక ప్రకారం- గత ఐదారు సంవత్సరాల కాలంలో భారతీయుల్లో దాతృత్వ గుణం కాస్త పెరుగుతోందట! ఈ నివేదిక ప్రకారం 2009లో 14 శాతం మంది డబ్బు విరాళంగా ఇవ్వగా, 12 శాతం మంది సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. 2013 నాటికి డబ్బు విరాళంగా ఇచ్చేవారు 28 శాతానికి, సేవా కార్యక్రమాలలో పాల్గొనేవారి సంఖ్య 21 శాతానికి పెరిగింది. కాగా, యువతలో ఎక్కువ శాతం మంది తమ మొదటి వేతనాన్ని సేవాసంస్థలకు విరాళంగా ఇస్తున్నారు. ఇది చాలా హర్షణీయమైన పరిణామం. ‘క్రేడ్ ఫండింగ్ సంస్థ’ అయిన కెట్టో గత నాలుగేళ్లలో రెండు లక్షల మంది నుంచి 10 మిలియన్ డాలర్లు సేకరించి, వివిధ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇలాంటి సంస్థలు సేవాకార్యక్రమాలను పారదర్శకంగా నిర్వహించే స్వచ్ఛంద సంస్థల వివరాలను వెబ్‌సైట్‌లలో ఉంచుతున్నాయి. దీంతో పలువురు తమ వేతనాల నుంచి ప్రతి నెలా కొంత సొమ్మును ఈ సంస్థలకు అందచేస్తున్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఏటా అక్టోబర్ 2న దేశంలోని పలుప్రాంతాలలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ‘దాన్ ఉత్సవ్’ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. బిపిన్ మహంతి అనే కమ్యూనికేషన్ కన్సల్టెంట్ భువనేశ్వర్‌లో పనిచేస్తూ దానగుణంలో ఇతరులకు స్ఫూర్తిని కలిగిస్తున్నారు. తాను జన్మించిన ఒడిశాలోని కంకదపాల్ గ్రామానికి ఏదైనా చేయాలనే తలంపుతో ఆయన 2009లో తొలుత ‘దాన్ ఉత్సవ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 15 గ్రామాలకు చెందిన 400 మంది ఉత్సాహవంతంగా పాల్గొన్నారు. ఇటీవల ఆయన నయాగఢ్ జిల్లా దాసపల్లా సమితిలో ‘దాన్ ఉత్సవ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 100 గ్రామాలకు చెందిన 20వేల మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగువేల మందికి ఆహారధాన్యాలు, దుప్పట్లు, టార్చిలైట్లు, చెప్పులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన 20 ట్రక్కుల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేశారు. దాన్ ఉత్సవ్‌లో పాల్గొనడానికి వచ్చిన 20వేల మందికి భోజనం వండి పెట్టడానికి 7వేల మంది మహిళా పొదుపు సంఘాల సభ్యులు స్వచ్ఛందంగా ముందుకురావడం విశేషం. ఏడు లక్షల రూపాయలతో అంబులెన్స్‌ను కొనుగోలుచేసి ప్రజలకు బిపిన్ అందచేశారు. ఇదే పద్ధతిలో ఇటీవల గాంధీ జయంతి సందర్భంగా పలు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేర సంస్థల ప్రతినిధులు 200 ప్రాంతాలలో 1100 సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఎంఎడి ఫౌండేషన్, ముంబయి ఫస్ట్ అనే సంస్థలు సంయుక్తంగా ‘హమారా స్టేషన్- హమారా షాన్’ అనే నినాదంతో ముంబయిలో 36 సబర్బన్ రైల్వేస్టేషన్ల సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో 20 కార్పొరేట్ సంస్థలు, 25వేల మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. లోడ్‌స్టార్ సిఇఓ నందినీ దాస్ ముంబయిలోని నాలుగు మురికివాడల్లోని అన్ని విద్యాసంస్థలను దత్తత తీసుకొని, విద్యార్థుల కోసం బెంచీలు, ఫ్యాన్‌లు, పుస్తకాలు అందచేసి, గ్రంథాలయాలను కూడా ఏర్పాటుచేశారు.
బెంగళూరుకు చెందిన ‘శంకర్ ఐ హాస్పటల్’ వారు అంధుల కోసం 50వేలకు పైగా పుస్తకాలను ఆడియో రూపంలోకి మార్చుతున్నారు. ఈ కార్యక్రమానికి 100 కార్పొరేట్ సంస్థలు, 20 విద్యాసంస్థలు, 50 ఎన్‌జిఓలు, 30 అపార్ట్‌మెంట్ కాంప్లెక్‌లకు చెందిన కుటుంబాల వారు చేయూత ఇస్తున్నారు. లెటస్ ఫీడ్ బెంగళూరు, హ్యూమన్ యూనివర్సల్ గుడ్‌విల్ సంస్థలు నిరుపేదలకు ఆహారాన్ని అందచేస్తున్నాయి. తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన విద్యార్థులు తమ గ్రామంలో ప్రతి ఒక్కరి నుంచి ఒక రూపాయి చొప్పున వసూలుచేసి ఆస్పత్రుల్లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో ఆమధ్య ‘రైస్ బక్కెట్ ఛాలెంజ్’లో భాగంగా పేదలకు పంపిణీ చేసేందుకు 10వేల కిలోల బియ్యం సేకరించారు. గోవాలో బీచ్ క్లీనింగ్, అనాధలకు ఉచిత క్షవరం, పేద వృద్ధులకు విహార యాత్రలు, పేద పిల్లలకు ఆహారం పంపిణీ వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు.
అన్షూ గుప్తా ‘గుంజ్’ అనే సంస్థను 1999లో ఏర్పాటుచేసి ఇప్పటివరకూ 15కోట్ల రూపాయలు సేకరించి వివిధ సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి నుంచి రెండు మీటర్ల కాటన్ క్లాత్‌ను సేకరించి వాటితో శానిటరీ నాప్‌కిన్స్ తయారు చేసి పేద మహిళలకు ఉచితంగా అందచేయడానికి ఆమె సన్నాహాలు చేస్తున్నారు. చెన్నైకి చెందిన ‘్భమి’ అనే సంస్థ ఒక్కొక్కరి నుంచి వంద రూపాయలు వసూలుచేసి, అనాథాశ్రమాలలో వెయ్యి మంది పిల్లలకు మెట్రోరైల్ పాస్‌లను అందచేస్తున్నది. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ’ పథకం కింద పలు కార్పొరేట్ సంస్థలు విద్య, వైద్య, సామాజిక అభివృద్ధి రంగాలలో విశేషంగా కృషిచేస్తున్నాయి. నిజాయితీగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే, విరాళాలు ఇవ్వడానికి భారతీయులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారనడానికి ఈ సేవా కార్యక్రమాలే ప్రత్యక్ష నిదర్శనం. భారతీయులలో నిద్రాణమై ఉన్న దానగుణం మళ్లీ మేల్కొనడం హర్షణీయం.

-పి.మస్తాన్‌రావు