Others

బాలనాగమ్మ (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ, మాటలు, పాటలు:
సముద్రాల జూనియర్
సంగీతం: టివి రాజు
ఛాయాగ్రహణం:
సి నాగేశ్వరరావు
ఎడిటింగ్: ప్రకాష్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
వేదాంతం రాఘవయ్య.
**
బుర్రకథలలో, జానపద కథల్లో ప్రాచుర్యం పొందిన కథ బాలనాగమ్మ. దీన్ని నాటక రూపంలోనూ పలు నాటక సమాజాలు ప్రదర్శించాయి. విశేష ప్రజాదరణ పొందిన కథను చిత్రంగా తొలుత 1942లో జెమినీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎస్ వాసన్ నిర్మించారు. సి పుల్లయ్య, జిఎన్ రావు దర్శకత్వం, బలిజేపల్లి లక్ష్మీకాంతం రచన, యస్ రాజేశ్వరరావు, డి పార్ధసారథి సంగీతం రూపొందించారు. బాలనాగమ్మగా కాంచనమాల, మాయల ఫకీరుగా గోవిందరాజుల సుబ్బారావు, కార్యవర్ధిరాజుగా బందా కనకలింగేశ్వరరావు, సంగుగా పుష్పవల్లి నటించారు. ఈ చిత్ర నిర్మాణం సమయంలో జెమిని వాసన్‌కు, హీరోయిన్ కాంచనమాలకు విభేదాలు రావటం జరిగింది. భారీ సెట్లతో అద్భుతంగా రూపొందించిన చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోనేకాక, తమిళనాట 25 వారాలు పైగా ప్రదర్శించబడింది. ఈ చిత్రం విజయవంతం కావటంతో వాసన్ ఈ చిత్రాన్ని ‘బహుత్ దిన్ హుయే’ పేరిట హిందీలో నిర్మించి నవంబర్ 26, 1954న విడుదల చేశారు. ఈ చిత్రంలో బాలనాగమ్మగా మధుబాల, సంగుగా సావిత్రి నటించారు. తెలుగు బాలనాగమ్మ చిత్రం 1942 డిసెంబర్ 15న విడుదలైంది. ఇదిలావుంటే, జెమినీ సంస్థలో కళాదర్శకుడైన ఎస్‌విఎస్ రామారావు స్వీయ దర్శకత్వంలో జెమినీ పతాకంపై ‘శాంత బాలనాగమ్మ’ పేరిట ఓ చిత్రం రూపొందించారు. ‘బాలనాగమ్మ’గా మిస్ చెలం, కార్యవర్ధిరాజుగా ఎస్ రాజేశ్వరరావు, మాయల మరాఠిగా ముంజులూరి కృష్ణారావు, సంగుగా శకుంతల నటించారు. జెమినీవారి ‘బాలనాగమ్మ’కు ముందుగా 1942 జనవరి 15న చిత్రం విడుదలైంది. కానీ విజయవంతం కాలేదు.
శ్రీ వెంకటరమణ పిక్చర్స్ పతాకంపై డివిఎస్ రాజు, టివి రాజు నిర్మాతలుగా రూపొందించిన చిత్రం -బాలనాగమ్మ. 1959 అక్టోబర్ 9న విడుదలైంది. కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యులై నృత్య దర్శకునిగా చిత్రసీమలోకి ప్రవేశించి, దర్శకునిగా, నిర్మాతగా రాణించిన వేదాంతం రాఘవయ్య ఈ చిత్రానికి దర్శకులు.
మహారాజు (సిఎస్‌ఆర్) అనుమతితో మహారాణి భూలక్ష్మి (హేమలత) ఈశ్వరుని ప్రార్థించి సంతాన ఫలం పొందుతుంది. అయితే నాగేంద్రుని శాపం కారణంగా ఏడుగురు ఆడ పిల్లలను కని పాముకాటుకు గురై మరణిస్తుంది. మారుటి భార్య మాణిక్యం (సూర్యకళ) వల్ల మహారాజు ఆ పిల్లలను అడవిలో వదిలేస్తాడు. తల్లి భూలక్ష్మి ఆత్మ రక్షణతో అడవిలోనే ఏడుగురు పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. భూలక్ష్మి అన్నగారైన పానుగంటి ప్రభువు (ఏవి సుబ్బారావు) తన కుమారుల ద్వారా వారి జాడ తెలుసుకుని వారిని తన కోడళ్లుగా చేసుకుంటాడు. చివరి బిడ్డ బాలనాగమ్మ (అంజలిదేవి) భర్త కార్యవర్ధిరాజు (ఎన్టీఆర్) రాచకార్యంపై రాజ్యం విడిచి వెళతాడు. ఆ రాజ్యంలోని మాయలమరాఠి (ఎస్‌వి రంగారావు) ఆ సమయంలో బాలింతరాలైన బాలనాగమ్మను అపహరించి తీసుకెళ్లిపోతాడు. బాలనాగమ్మ కోసం వచ్చిన కార్యవర్ధిరాజు, పరివారాన్ని శిలలుగా మారుస్తాడు. మరాఠి ప్రియురాలు సంగు (రాజసులోచన)కు ఇది నచ్చదు. దీంతో కోపోద్రిక్తుడైన మారాఠి ఆమెను భస్మం చేస్తాడు. తీవ్ర ఆవేదకు గురైన బాలనాగమ్మ రాజేశ్వరిదేవి వ్రతం చేయ సంకల్పించి మారాఠిని పనె్నండేళ్ల గడువు కోరుతుంది. ఈలోపు ఆమె కుమారుడు బాలవర్ధిరాజు (మాస్టర్ సత్యనారాయణ) తలారి రాముడు (రేలంగి) సాయంతో వచ్చి.. తన శక్తియుక్తులు, తల్లి సహకారంతో మాంత్రికుని ప్రాణ రహస్యం తెలుసుకుంటాడు. అతన్ని అంతం చేసి చెరనుంచి తల్లిని విడిపిస్తాడు. శిలలుగా మారిన వారంతా సజీవులై రాజ్యానికి చేరటంతో కథ శుభంగా ముగుస్తుంది. చిత్రంలో బాలనాగమ్మ అక్కలలో ఒకతిగా జయంతి, పులిరాజుగా లంక సత్యం, చాకలి తిప్పడుగా చదలవాడ, అతని భార్యగా కనకం నటించారు.
కార్యవర్ధిరాజుగా ఎన్టీఆర్ పాత్ర నిడివి తక్కువ అయినా, ఆకట్టుకునే తన సహజ గంభీర సున్నిత నటనతో మెప్పించారు. బాలనాగమ్మగా అంజలిదేవి ఆ పాత్రకుతగిన హావభావాలను, స్పందనను సన్నివేశాలకు అనుగుణంగా ఎంతో హృద్యంతో నటించి రాణించారు. ఇక చిత్రంలో మాయల మరాఠిగా ఎస్‌వి రంగారావు నటన ఎంతో ప్రశంసనీయంగా సాగింది. 1942 బాలనాగమ్మ చిత్రంలో గోవిందరాజుల సుబ్బారావు పోషించిన మరాఠి పాత్రను కొంత భయంకరంగా రూపొందించినా, ఈ చిత్రంలో ఎస్వీయార్ పోషించిన మరాఠీ పాత్రను రసికత, అనురాగం, ఆప్యాయత చూపేలా మోహావేశపరునిగా చూపటం ప్రత్యేకత. దాన్ని తన నటనతో ఎస్‌వి రంగారావు మరింత రాణింపచేశారు. 1942 బాలనాగమ్మలోను, 1959 బాలనాగమ్మలోనూ తలారి రాముడుగా రేలంగి నటించటం విశేషం.
వేదాంతం రాఘవయ్య చిత్రంలోని సన్నివేశాలను తనదైన శైలిలో రూపొందించి ఆకట్టుకున్నారు. సంతాన ఫలాన్ని ఏడు ముక్కలుగా చూపటం, అదే తిరిగి 7 తొట్టెలైనపుడు దానిలో పిల్లలకు పాడే జోలపాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. భూలక్ష్మి ఆత్మ పిల్లలను రక్షిస్తూనే బాలనాగమ్మను కాపాడలేనని, మాయను మాయతో జయించమని, ఆమె కొడుకే ఆమెను రక్షిస్తాడని చెప్పటంలాంటి సన్నివేశాలు కథను రక్తికట్టించేలా రూపొందించారు. బ్రహ్మచారిణిగా వ్రతమని బాలనాగమ్మ మరాఠీకి చెప్పగా, వ్రత భంగమైతే బాలనాగమ్మ దగ్ధమవుతుందేమోనని మరాఠి ఊహించుకునే సన్నివేశాలతో కథకు కొత్త బలాన్నిచ్చారు. కళాదర్శకునిచే రూపొందించిన మరాఠీ గుహలో రమణుల శిల్పాలు, చక్కని సెట్టింగ్స్ మాయల మారఠీ ప్రపంచంలో ఉన్నామన్న భ్రమ గొలిపేలా అనిపిస్తాయి. బాలనాగమ్మ అదృశ్యాన్ని తలారి రాముడు కార్యవర్ధికి చెప్పటం, తిరిగి వేగంగా కార్యవర్ధి మరాఠి కోటకు బయలుదేరటం, మాయవేషంలో మరాఠి పిల్లల కోర్కెలు తీర్చటంలాంటి పలు సన్నివేశాలు జనరంజకంగా చిత్రీకరించారు. సముద్రాల జూనియర్ సందర్భోచిత పద ప్రయోగాలు పదునుగా అలరించేలా అందించారు. ‘క్షీరసాగర మథనం నాటి మోహినికంటే సమ్మోహిని, సీతకంటే శీలవతి, అనసూయకంటె అనురాగమయి’.. ‘వాడి సోలిన పూలమాలను ఎవరూ కంఠసీమనలంకరించుకోరు’.. బాలనాగమ్మతో ‘పాషాణంగా మారిన భర్తకోసం పరితపించే నీతో సరసాలకిది సమయంకాదు’.. ‘నీమాట ఎప్పుడు కాదన్నాను బాలా’.. ‘చిగురాకు వంటి చిన్నదానికెంత కఠిన హృదయం’ లాంటి సంభాషణలు చిత్రానికి మరింత బలాన్నిచ్చాయి.
చిత్రంలోని గీతాలు:
అడవిలో బాలనాగమ్మ, అక్కలపై -ఎంతో ఎంతో వింతలే’ (ఎస్ జానకి, రాణి బృందం) పాట అలరిస్తుంది. చిత్ర ప్రారంభంలో బుర్రకథ ‘జయము జయము’ (ఘంటసాల), రేలంగిపై చిత్రీకరించిన -ఇంటిలోనిపోరు ఇంతింతకాదయా’, మాంత్రికుని వద్ద ‘బలే బలే ఫలరసం’ (ఘంటసాల) గీతాలు ఆనందాన్నిస్తాయి. ఎన్టీఆర్‌పై పద్యం -అనిలో వైరుల దోల్బలంబణచి’ (ఘంటసాల), -జోజో రాజా చిన్నారిరాజా’ (సుశీల), భూలక్ష్మిపై గీతం -లాలీలాలీ సాపాపాల్లో’ (పి లీల బృందం), రాజసులోచన, ఎస్వీఆర్‌పై గీతం -అందమూ ఆనందమూ (పి సుశీల), మరో గీతం -నీకేల రాహహ ఈ వేదన (పి సుశీల), మరో భక్తిగీతం -జయ జయ గిరిరాజా రమణా (పి లీల) వినసొంపుగా సాగుతాయి. చిత్రంలో ఎన్టీఆర్, అంజలిదేవిపై చిత్రీకరించిన హాయి గొలిపే యుగళ గీతం (చల్లని వెనె్నల, పూదోటలో చిత్రీకరణ) -విరిసింది వింత హాయి (ఘంటసాల, జిక్కి). మరో తమాషా గీతం 1942 బాలనాగమ్మలో లంక సత్యం (తిప్పడు)పై, ఈ చిత్రంలో చదలవాడపై చిత్రీకరణ -అప్పడునే తిప్పడండి పులిమాంగోరు (పిఠాపురం). ఈ బాలనాగమ్మ చిత్రం విజయం సాధించింది. చిత్ర గీతాల సాహిత్యం అలరించేలా సాగుతాయి.
బాలనాగమ్మ కథకు ఉన్న విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకుని -1981లో తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన బాలనాగమ్మ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. 1982లో కెబి క్రియేషన్స్ బ్యానర్‌పై కె శంకర్ దర్శకత్వంలో బాలనాగమ్మను నిర్మాత ఏ ఖాదర్ రూపొందించారు. బాలనాగమ్మగా శ్రీదేవి, కార్యవర్ధిరాజుగా శరత్‌బాబు, మాయల ఫకీరుగా సుదర్శన్, సంగుగా మంజుభార్గవితోపాటు కెఆర్ విజయ, జయ, మాస్టర్ బాబు తదితరులు నటించారు. జెకె ప్రొడక్షన్ బ్యానర్‌పై సిఎస్ రావు దర్శకత్వంలో నిర్మాత జయకృష్ణ బాలనాగమ్మ చిత్రాన్ని చేశారు. బాలనాగమ్మగా జమున, కార్యవర్ధిరాజుగా రామకృష్ణ, మాయల మరాఠిగా సత్యనారాయణ, సంగుగా ప్రమీలతో ఆ చిత్రం ప్రారంభమైంది. కొన్ని అవాంతరాలతో చిత్రం పూర్తయినా, విడుదల కాలేదు. 1966లో కన్నడంలో కౌండిన్య దర్శకత్వంలో బాలనాగమ్మ రూపొందింది. బాలనాగమ్మ కథకున్న విశేషంతో అన్ని భాషల్లో చిత్రాలు రూపొందటం, రామాయణంలోని సీతతో బాలనాగమ్మను పోల్చటం, పనె్నండేళ్ల చెర తరువాత భర్తను కలుసుకునే దృశ్యాలు, బాలవర్ధిరాజు అనేక మాయలు మంత్రాలు ఛేదించటం వంటి దర్శకుల వ్యూహాశక్తి, రచయితల మేధస్సు, అగ్ర నటీనటుల అభినయంతో బాలనాగమ్మకు ప్రత్యేక స్థానం దక్కింది. బాలనాగమ్మ కథతో ఎన్ని భాషల్లో ఎన్నిసార్లు ఎన్ని చిత్రాలు వచ్చినా -1959నాటి బాలనాగమ్మ చిత్రం అలరించేదిగా నిలవటం విశేషం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి