Others

నేలరాలిన తారలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టినవాడు మరణించక తప్పదు. మరణించిన వాడు జన్మించక తప్పదు. అనివార్యముగు ఈ విషయమును గూర్తి శోఖింపతగదు అని ఘంటసాల వారు చెప్పినా.. పోయినోళ్లు అందరూ మంచోళ్లు/ ఉన్నోళ్లు పోయినోళ్ల తీపిగురుతులు అంటూ ఆత్రేయవారు సినీ విరచితాన్ని వినిపించినా.. దూరమైన వాళ్లతో ఉండే బంధాన్నో, అనుబంధాన్నో, అభిమానాన్నో గుర్తు చేసుకోకుండా ఉండలేం.
తెలుగు సినిమా రంగంలో తమ కళానైపుణ్యంతో అలరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, సంగీతకర్తలు, సాహితీవేత్తలు మననుంచి దూరమయ్యారని గుర్తుకురాగానే -సొంత కుటుంబీకులు ఎవరో దూరమయ్యారన్న భావన కలుగకమానదు. ఒకింత బాధ ఉబికరాకమానదు. అయితే, గత రెండేళ్లతో పోల్చుకుంటే 2016లో సినీ పరిశ్రమకు జరిగిన నష్టం ఒకింత తక్కువగా ఉండటం -నిజంగా చిన్న ఓదార్పు. గత ఏడాది 300 మందికిపైగా ప్రముఖులను కోల్పోయిన సినీ పరిశ్రమలో -ఈ ఏడాది తక్కువ బాంధవ్యానే్న కలిగివున్నా ఎక్కువ ముద్రవేసిన ఇద్దరు దిగ్గజాలు కనుమరుగవడంతో ఎక్కువ బాధ అనుభవించక తప్పలేదు. అందులో ఒకరు సంగీత ద్రష్ట బాలమురళీ కృష్ణ అయితే, ఇంకొకరు పరిశ్రమ నుంచి వెళ్లి తమళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న పురచ్చితలైవి జయలలిత. నవంబర్, డిసెంబర్ నెలల్లో అశనిపాతంలాంటి ఈ రెండు ఘటనలు సినీలోకాన్ని ఎక్కువగా బాధించేవే. గోదావరి జిల్లాల నుంచి స్వరాక్షరాలను ఏరుకుంటూ బయలుదేరి వాగ్గేయకారుడిగా ఎదిగిన బాలమురళీకృష్ణ, నిజానికి సినీ ప్రపంచం కోసం ఆయన గొంతు అందించింది తక్కువే. కానీ, కళామతల్లి సేవకు నిదర్శనంగా, శ్రోతల అదృష్టానికి పరాకాష్టగా ఆణిముత్యాల్లాంటి పాటలే పాడారు. నర్తనశాలలో -సలలితరాగ సుధారస సారం, దొరికితే దొంగలు చిత్రంలో -తిరుపతివాస శ్రీవేంకటేశ, ఉయ్యాల జంపాలలో -ఏటిలోని కెరటాలు, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ చిత్రంలో -వసంతగాలికి వలపులురేగ, భక్తప్రహ్లాదలోని -నారద సన్నుత నారాయణ, అందాలరాముడు చిత్రంలో -పలుకే బంగారమాయెరా, ముత్యాలముగ్గులో -శ్రీరామ జయరామ సీతారామ, గుప్పెడు మనసులో -వౌనమె నీ భాష ఓ మూగమనసా, ప్రియమైన శ్రీవారు చిత్రంలో -జాతకాలు కలిశాయి జీవితాలు ముగిసాయి లాంటి పాటలు.. సినీ అభిమానుల హృదయాల్లో ఆయనను చిరస్మరణీయం చేసేవే. నవంబర్ 22న భౌతికంగా దూరమైన బాలమురళి -ఆయన పాటతో ఆజన్మతారార్కం నిలిచేవుంటారు. స్టార్ హీరోయిన్‌గా అలనాటి దిగ్గజాలతో నటించి, తరువాత స్క్రీన్ నుంచి పొలిటికల్ టర్న్ తీసుకున్న జయలలిత డిసెంబర్ 5న తుది శ్వాస విడిచారు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ అప్రతిహత విజయాలు అందుకుని రికార్డులు సృష్టించిన జయలలిత మరణం సినీలోకాన్ని దిగ్బ్రాంతికే గురి చేసింది.
సినీ పరిశ్రమతో అనుబంధాన్ని పెంచుకుని తెరపైనో, వెనుకనుంచో ఎంతోమందిని గుర్తుంచుకోదగిన మరికొందరినీ ఈ ఏడాదిలో కోల్పోయాం. నివాళిగా వారిని ఒక్కసారి మననం చేసుకుందాం. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో మంచి నటిగా పేరొందిన కల్పన జనవరి 25న కన్నుమూశారు. ‘ఊపిరి’ చిత్రంలో నటించడానికి హైదరాబాద్ వచ్చి ఒకరోజు షూటింగ్‌లో పాల్గొని మరుసటిరోజు నిద్రలోనే ‘ఊపిరి’ వదిలేశారు కల్పన. నటుడు ప్రదీప్‌శక్తి ఫిబ్రవరి 20న కన్నుమూసారు. ప్రతినాయకుడిగా మొదలుపెట్టి కమెడియన్‌గా కెరీర్ ముగించిన ప్రదీప్‌శక్తి -లేడీస్ టైలర్, వారసుడొచ్చాడు, నాయకుడు, ఏప్రిల్ 1 విడుదల, సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాల్లో గుర్తుంచుకోదగిన పాత్రలు పోషించారు. హాస్య నటి బండ జ్యోతి ఫిబ్రవరి 26న మరణించింది. విజయరామరాజు, కళ్యాణరాముడు, భద్రాచలం, స్వయంవరం తదితర చిత్రాల్లో ఆమె నటనతో ఆకట్టుకున్నారు. నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు కళాభవన్ మణి మార్చి 6న తుది శ్వాస విడిచారు. తెలుగుతోపాటు తమిళ మళయాళ చిత్రాలు దాదాపు 200 పైగా నటించిన మణి, జెమిని, అర్జున్, ఎవడైతే నాకేంటి లాంటి చిత్రాల్లో గుర్తుంచుకోదగ్గ పాత్రల్లో కనిపించారు.
హీరో కృష్ణంరాజుకు మేకప్‌మాన్‌గా పనిచేస్తూ నిర్మాతగా మారి మన ఊరి పాండవులు, సీతారాములు, మంత్రిగారి వియ్యంకుడు, నీకూ నాకూ పెళ్ళంట తదితర చిత్రాలు నిర్మించిన దర్శకుడు విక్రంగాంధీ మే 11న తుది శ్వాస విడిచారు. స్టేట్‌రౌడీ (శివాజీ) చిత్రంతోపాటు హాస్యనటుడు వేణుమాధవ్ హీరోగా నిర్మించిన ‘ప్రేమాభిషేకం’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సీనియర్ దర్శకుడు ఏసి తిరులోక్ చందర్ జూన్ 15న మరణించారు. ఎన్టీఆర్ హీరోగా రాము, నాదీ ఆడజన్మతోపాటు భద్రకాళి, అవేకళ్ళు, ముత్యమంత ముద్దు చిత్రాలకు దర్శకత్వం వహించారాయన. రచయిత గూడ అంజయ్య జూన్ 21న కన్నుమూసాడు. జానపద పల్లె గీతాలు రాయటంలో అంజయ్య ప్రసిద్ధికెక్కాడు. ‘ఊరుమనదిరా ఈ పల్లెమనదిరా’ పాట బహుళ ప్రజాదరణ పొందింది. అంతేకాదు, 16 భాషల్లోకి అనువాదమై పాపులార్టీ సంపాదించుకుంది. మరొక పాపులర్ సాంగ్ ‘నేను రానుబిడ్డో సర్కారు దవాఖానకు’ పాట ప్రభుత్వాస్పత్రిపై విమర్శనాత్మకంగా రాసిన పద్ధతి పలువురిని ఆకర్షించింది. రంగస్థల సినీనటుడు జెవి రమణమూర్తి జూన్ 23న మరణించారు. సొంత నాటక సంస్థ నటరాజ కళాసమితి ద్వారా ఫణి, కాళరాత్రి, కన్యాశుల్కం నాటకాల ద్వారా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చి తెలుగు నాటక ప్రియులకు చిరపరిచితులయ్యారు. కెబి తిలక్ నిర్మించిన యంయల్‌ఏ చిత్రం ద్వారా తెలుగు చిత్రరంగానికి పరిచయమై అత్తా ఒకింటి కోడలే, బావమరదళ్ళు, అన్నాచెల్లెలు, పెళ్ళిమీద పెళ్ళి మొదలగు చిత్రాల్లో హీరోగా నటించి పరిశ్రమ రాజకీయాలవల్ల కొంతకాలంపాటు దూరమయ్యారు. తర్వాత కె విశ్వనాథ్, కె బాలచందర్ చిత్రాలు సప్తపది, మరోచరిత్ర, సిరిసిరిమువ్వ, ఆకలిరాజ్యం తదితర చిత్రాల్లో నటించారు. సీనియర్ నృత్య దర్శకుడు వేణుగోపాల్ ఇదే నెలలో కన్నుమూసాడు. వేణుగోపాల్ తెలుగుతోపాటు బెంగాలీ చిత్రాలకూ పనిచేశారు. సావిత్రి, జమున, వహీదారెహమాన్, వాణిశ్రీ మొదలగు వారు నటించిన చిత్రాలకు వేణుగోపాల్ నృత్య దర్శకుడిగా వ్యవహరించారు.
తెలుగు, తమిళ చిత్రాల్లో శృంగారపరమైన నృత్యాలకు ప్రసిద్ధిచెందిన జ్యోతిలక్ష్మి ఆగస్టు 9న చెన్నైలో మరణించింది. తెలుగులో పెద్దక్కయ్య చిత్రంతో కెరీర్ ప్రారంభించి దాదాపు 300 చిత్రాల్లో శృంగార నృత్యాల ద్వారా యువతను అమితంగా ఆకర్షించిన జ్యోతిలక్ష్మి చనిపోవటానికి ఒకరోజుముందు కూడా షూటింగ్‌లో పాల్గొంది. జ్యోతిలక్ష్మి నృత్యం సినిమాలో ఉందా? అని పంపిణీదారులు నిర్మాతలను ప్రశ్నించేస్థాయికి జ్యోతిలక్ష్మి ఎదిగింది.
జంటనగరాలలో ప్రముఖ సాంస్కృతిక సంస్థగా వెలుగొంది దశాబ్దాలపాటు తెలుగు సినిమా టీవి సీరియల్స్‌కు అవార్డులను ప్రకటిస్తూ తెలుగు సినిమా రంగానికి అతి సన్నిహితుడైన బి కిషన్ ఆగస్టు 20న మృతి చెందారు. కిషన్ పలు చిత్రాల్లో సహాయ నటుడి పాత్రలు పోషించారు. జయసుధను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ లక్ష్మణరేఖ చిత్రానికి దర్శకత్వం వహించిన తిరువీధి గోపాలకృష్ణ సెప్టెంబర్ 27న కన్నుమూశారు. సినీ రచయిత వినయ్‌కుమార్ అక్టోబర్ 13న మృతి చెందారు. వినయ్‌కుమార్ అమ్మదొంగ, ఏమండీ ఆవిడ వచ్చింది, ప్రేమఖైదీ తదితర చిత్రాలకు రచయితగా పనిచేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు, తమిళ చిత్రాలకు స్టంట్ మాస్టర్‌గా వ్యవహరించిన సాంబశివరావు కూడా అక్టోబర్ 13న మృతి చెందారు. సర్దార్ పాపారాయుడు, కొండవీటి దొంగ, శ్రీరంగనీతులు, నేటి భారతం, ప్రతిఘటన తదితర చిత్రాలకు స్టంట్ మాస్టారుగా వ్యవహరించిన సాంబశివరావు, ఎన్టీఆర్ చిత్రాలకు ఎక్కువగా పనిచేశారు.

చిత్రాలు..
బాలమురళీకృష్ణ, ప్రదీప్ శక్తి, జెవి రమణమూర్తి, తిరులోక్‌చందర్, జ్యోతి లక్ష్మి

-పిఎస్‌కె