Others

తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాలు మాతృదేవోభవ, పితృదేవోభవ అని ఘోషిస్తున్నాయి. తల్లినే మొదటి దేవతగా, గురువుగా ఆరాధించుమని పెద్దలు సెలవిచ్చారు. ప్రపంచంలో నిస్వార్థమైన ప్రేమ కేవలం తల్లికే ఉంది. సంతానానికై కడుపులో పెరుగుతున్న బిడ్డకై ఆమె పడే తపన ఆరాటం మాటలకందని విషయం. సంతానానికై స్ర్తి ఎన్నో వ్రతాలు, పూజలు ఆచరిస్తుంది. ముక్కోటి దేవతలకు మ్రొక్కుతుంది. తన బిడ్డ సౌఖ్యానికై ఎంతటి త్యాగానికైనా వెనుదీయని ప్రేమమూర్తి తల్లి. బిడ్డ యోగక్షేమాలకై ఎన్నో ఆహార నియమాలు పాటిస్తూ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని నవమాసాలు మోసి మృత్యువునకు భయపడకుండా తన రక్తాన్ని పాలుగా మార్చి జన్మనిచ్చి, ఆకలి తీర్చి, అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. రాత్రిపగలు అనకుండా మలమూత్రాలను ఎత్తి అనేక రకాల ఊడిగాలు చేస్తూ తన నిద్రాభంగంను లెక్కచేయకుండా ఎంతగా అలసిపోయిననూ విసుగు చెందక తన బిడ్డ గురించే ఆలోచిస్తుంది. మాతృ హృదయం మాతృప్రేమ కేవలం మానవులలోనే గాక భగవంతుడు సృష్టిలోని అన్ని ప్రాణులకు మాతృ హృదయాన్నిచ్చి తనకు బదులుగా తల్లిద్వార పోషణగావిస్తూ సేవలందిస్తున్నాడు.
ఏ ప్రాణికైనా తల్లియే మొదటి గురువు, దైవం. ఆ దేవతయే తన బిడ్డకు నడక నేర్పుతుంది. మాటలు నేర్పుతుంది. ఇక మనుష్యులలోనైతే ప్రేమ, వినయ విధేయతలు, సంస్కారం, భగవద్భక్తి నేర్పిస్తుంది. సహనానికి మారుపేరే తల్లి. మన మెడలో ఎవరైనా ఒక పూలదండ వేస్తే కొంత సేపటికి ఎప్పుడు తీసివేద్దామా అనిపిస్తుంది. అలాంటిది ఒక బిడ్డ బరువును తల్లి ప్రేమతో ఆనందంగా, నవమాసాలు ఏ అరమరికలులేకుండా మోస్తుంది. ఆ ఋణం తల్లికి మనం ఏమి ఇచ్చినా ఏమిచేసినా తీరనిది. ప్రపంచంలో ఏది పోగొట్టుకొనినా తిరిగి సంపాదించుకొనవచ్చు కాని తల్లిని, తల్లి ప్రేమను మాత్రము సంపాదించలేము. తన పిల్లలు తల్లిని ఎంత హింసించినా, ఎన్ని బాధలకు గురిచేసినా, తిండి పెట్టకున్నా, చివరకు ప్రాణం తీసినా ఆమె ప్రేమ చెక్కుచెదరదు. ఎక్కడ ఉన్నా తానేమైనా తన సంతానం క్షేమంగా ఉండాలని ఆమె హృదయం పరితపిస్తుంది. తల్లడిల్లుతుంది.
ఒకసారి ఘోరక నాధుడనే దైవభక్తుడు అరణ్యంగుండా ప్రయాణిస్తుండగా దైవమా! రక్షించు రక్షించు అనే ఆర్తనాదం వినబడుతుంది. ఆ పిలువ వచ్చిన ప్రదేశమునకు వెళ్ళగా ఒక కోయరాజు కొందరు కన్యలను బంధించి బలి ఇచ్చుటకు ఏర్పాట్లుగావిస్తున్నాడు. ఘోరకనాధుడు కోయరాజుకు ఎన్నోరకాల హిత బోధ చేసినప్పటికిని అతని మనస్సు మారలేదు. అప్పుడు ఘోరక నాధుడు ఆ అమ్మాయిలకు బదులుగా నా ప్రాణములు తీసుకొమ్మని వేడుకొంటాడు. కోయరాజు ఏమాత్రం కనికరం లేకుండా నీవాఅమ్మాయిలను రక్షించాలంటే నీ తల్లి గుండెను మాకర్పిస్తే వదిలిపెడతామనగా ఘోరకనాధుడు ఒక (తన) తల్లి గుండెతో ఎంతోమంది కనె్నలను రక్షించవచ్చని ఒప్పుకొని తల్లి గుండెకోసం బయలుదేరుతాడు. తాను ఒక్కపూట కనిపించకపోతే నిద్రాహారాలుమానే తల్లిని అమానుషంగా కత్తికి గురిచేయుటయా? ఈ కసాయి పని ఎలాచేయాలి భగవాన్ అని పరితపిస్తాడు. కాని చివరకు అమ్మాయిల ప్రాణాలు కాపాడుటకు తల్లి గుండెను తీసికొని వెళ్ళుటకే నిర్ణయించుకొని బాగా త్రాగి ఇంటికెళుతాడు. కుమారునికి భోజనం వడ్డించి తినాలని ఎదురుచూస్తున్న తల్లి పలికే మాటలకు అతని హృదయం ముక్కలైంది. అయినా కర్తవ్యాన్ని గుర్తుచేసుకొని తల్లిని చంపి గుండె తీసికొని వెళుతుండగా మత్తులో ఒకచోట తూలిపడినప్పుడు చేతిలోని తల్లి గుండె క్రిందపడింది. ఆ కరుణామూర్తి గుండె ఎంతో తల్లడిల్లి నాయనా! జాగ్రత్త దెబ్బ తగిలిందా? జాగ్రత్తగా నడువు అని అంటుంది. తనను చంపినప్పటికిని తల్లి ప్రేమ ఇసుమంతైనా తగ్గలేదు. ఘోరక నాధుని హృదయం ముక్కలై అమ్మా! అమ్మా! అనే పిలుపుతో అరణ్యం మారుమ్రోగుతుంది. అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పదో మనకర్థమగుతుంది కదా!
ఇక తండ్రి మనకు దేహమునిచ్చి విజ్ఞానము, బ్రహ్మోపదేశమిచ్చి జీవన మార్గాన్ని, ఇహపరాలు సాధించే హితోపదేశమిచ్చి మార్గదర్శి అగుతాడు. కుక్కుట మహాముని, పుండరీకుడు, ధర్మవ్యాధుడు, శ్రవణకుమారుడు లాంటివారు మాతాపితల సేవజేసి ధన్యులై కీర్తినొందారు. పురాణాలలో, భారత, భాగవతాలలో ఇలాంటి దృష్టాంతములెన్నియో మనకు కనిపిస్తాయి. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అని వేదాలు ఘోషిస్తున్నాయి. వేదాలలోని ప్రథమ సాధన అదియే. ఆ సాధనే మనస్సు నిలకడను బుద్ధిప్రశాంతతను కలిగిస్తుంది. ఆధునిక కాలంలో ప్రత్యక్ష దైవాలను గుర్తించేవారు కరువైనారు. పక్షులకు రెక్కలురాగానే తల్లిని విడిచి ఎగిరిపోయినట్లు సంతానం సంపాదన పరులుకాగానే ప్రత్యక్ష దైవాలను పరామర్శించకుండా ఇళ్ళనుండి తరిమివేస్తున్నారు. లేదా వారే దూరంగా వెళ్ళుతున్నారు. తలిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేరుస్తూ వారి సంతానానికి ప్రేమానురాగాలు, ఆత్మీయత, మానవ విలువలు తెలియకుండా చేస్తున్నారు. ఇంకా కొందరేమో చివరకు తల్లిదండ్రుల అంతిమ దర్శనం చేసికొనలేక పోతున్నారు.
ఆధునిక విద్యావిధానంలోకూడా అనేక లోపాలవలన విద్యార్థులు నైతిక విలువలు, మానవీయత, శీలము మొదలగువాటికి దూరమై మనుష్య రూపములోనున్న మృగాలవలె ప్రవర్తిస్తున్నారు.

- పెండెం శ్రీధర్