Others

నాకు నచ్చిన పాట-- చల్ చలో చలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రూపొందించిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ మూవీ ఆల్బమ్‌లో ‘చల్ చలో చలో/ లైఫ్ సే మిలో’ పాట ఎంతో స్ఫూర్తివంతం. ధనవంతుడైన హీరో హఠాత్తుగా తండ్రిని, ఆస్తిని పోగొట్టుకుని మధ్యతరగతి జీవితం గడపాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో వచ్చే ఈ పాట చిత్రీకరణ కూడా సహజంగా, నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ ఈ పాటని స్వరపరిచిన తీరు నిజంగా అద్భుతం. ప్రతి పదం, ప్రతి వాక్యం, సన్నివేశానికి తగినట్టు అర్ధవంతంగా అందించిన రామజోగయ్యశాస్ర్తీ సాహిత్యం అభినందనీయం.
‘తీపితో పాటుగా ఓ కొత్త చేదు అందించడం జిందగీకి అలవాటే’ లాంటి వాక్యాలు మనసుకి హత్తుకుంటాయి. ‘కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్?/ తీయగుంటె కడదాకా వదలవు గనక’ ‘కష్టాలెందుకు బరువుగుంటాయ్?/ తేలికైతె బ్రతుకంతా మోస్తూ దించవు గనక’ అంటూ జీవితాన్ని సింపుల్ పదాలతో అర్థవంతంగా విశే్లషించిన తీరుకు రచయితను అభినందించాలి. పాటలోని ఇలాంటి వాక్యాలు మనల్ని ఆలోచింపచేస్తాయి. ఒక వేదాంతపరమైన భావన కలిగిస్తుంది పాట.
‘పుడుతూనే గుక్క పెట్టినాక/ కష్టమన్న మాటేమీ కొత్తేంకాదు’ అన్న వాక్యం చాలు -జీవితానికి ఎంతో ఓదార్పునివ్వడానికి. ‘మడతే నలగని షర్టులాగా/ అలమరాలొపడివుంటే అర్ధం లేదు’ ‘గీతే తగలని కాగితంలా/ ఒట్టి చెదలు పట్టిపోతె ఫలితం లేనే లేదు’ ‘పడ్డవాడే/ కష్టపడ్డవాడే/ పైకి లేచే ప్రతోడు’ ‘ఒక్కడైనా/ కానరాడే/ జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు’ అంటారు రామజోగయ్య. కష్టపడాలి. సాధించాలి. ఓటమికి భయపడకుండా గెలుపుకోసం ప్రయత్నించాలనే స్ఫూర్తి ఈ వాక్యాల నుంచి మనకు అందుతుంది.
దేవిశ్రీప్రసాద్ అద్భుత సంగీతం, రఘుదీక్షిత్, సూరజ్ సంతోష్‌ల గానం, ఈ పాటని మళ్ళీమళ్ళీ వినేలా చేస్తాయి. పాట చిత్రీకరణ, అల్లు అర్జున్ నటించిన తీరు, పాటని మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తాయి. ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఈ పాట వింటే కొండంత ధైర్యం అందుతుంది.

-అనామిక శృతి, హైదరాబాద్