Others

తోడికోడళ్లు (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీతం: మాస్టర్ వేణు
నృత్యం: ఎకె చోప్రా, వేణుగోపాల్
ఛాయాగ్రహణం: సెల్వరాజ్
కళ: కృష్ణారావు
దర్శకత్వం, కూర్పు:
ఆదుర్తి సుబ్బారావు
నిర్మాత:
డి మధుసూధనరావు
**
అన్నపూర్ణ సంస్థ నిర్మించిన ‘దొంగరాముడు’ చిత్రానికి దర్శకుడు కెవి రెడ్డి. ఆ చిత్రం విజయం సాధించటంతో తిరిగి మరో చిత్రం వారి దర్శకత్వంలో రూపొందించాలని ఆశించారు డి మధుసూధనరావు. ఈలోగా కెవి రెడ్డికి వాహిని సంస్థనుంచి ఓ అవకాశం వచ్చింది. దీంతో, తనకు తెలిసిన అమరసందేశం చిత్ర దర్శకుడు, స్వతహాగా ఎడిటర్ అయిన ఆదుర్తి సుబ్బారావు పేరును మధుసూధనరావుకు సూచించారు కెవి రెడ్డి. దర్శకత్వం వహించకపోయినా స్క్రిప్ట్ చర్చల్లో పాల్గొంటానని హామీ ఇచ్చారు. దాంతో మధుసూధనరావు ఈ విషయాన్ని కాశ్మీర్ షూటింగ్‌లోవున్న ఏఎన్నార్‌కి చెప్పడంతో, ‘కన్నతల్లి’ చిత్ర నిర్మాణ సమయంలో సహాయ దర్శకునిగా ఆదుర్తి సుబ్బారావు ప్రతిభ గమనించానని, ఆయననే ద్వితీయ చిత్ర దర్శకుడిగా తీసుకోవచ్చని అక్కినేని అంగీకారం తెలిపారు.
అలా మధుసూధనరావు, ఆదుర్తి, ఆత్రేయ కలిసి బెంగాలీ నవల శరత్‌చంద్ర వ్రాసిన ‘నిష్కృతి’ ఆధారంగా తెలుగులో రూపొందించిన చిత్రమే -తోడికోడళ్లు. చిత్ర కథకు అదనంగా వైకుంఠం పాత్ర జోడించమన్న కెవి రెడ్డి సూచనను, తెలుగుతోపాటు తమిళంలోనూ నిర్మిస్తే బాగుంటుందన్న ఆదుర్తి సలహాను అమలు చేశారు. ‘దేవదాసు’ చిత్రంతో తమిళంలోనూ ఏఎన్నార్ మంచి ఫాలోయింగ్ సంపాదించటం, సావిత్రి, కన్నాంబ, ఎస్వీ రంగారావు తమిళులకు పరిచయమైన నటులే కావడంతో ప్రాజెక్ట్ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నిర్మించారు. తెలుగు చిత్రానికి మాటలు ఆత్రేయ వ్రాయగా, తమిళ చిత్రానికి మాటలు సివి శ్రీ్ధర్ వ్రాసారు. తమిళ చిత్రానికి పాటలు ఉడుమలై నారాయణ వ్రాయగా, తెలుగు చిత్రానికి ఆత్రేయ, శ్రీశ్రీ, కొసరాజు, తాపీ ధర్మారావు వ్రాసారు. తమిళంలో ‘వింగవీట్టు మహాలక్ష్మి’ పేరిట, తెలుగులో ‘తోడికోడళ్ళు’గా చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం నిర్వహించిన సెల్వరాజ్, తరువాత అన్నపూర్ణ సంస్థకు 16 చిత్రాలకుపైగా పనిచేయటం విశేషం.
***
లాయరు కుటుంబరావు(ఎస్వీ రంగారావు)కు కోర్టు వ్యవహారాలు తప్ప ఇతర విషయాలు పట్టవు. భార్య అన్నపూర్ణ (కన్నాంబ), సవితి తమ్ముడు సత్యం (ఏఎన్నాఆర్), అతని భార్య సుశీల (సావిత్రి), పల్లెటూళ్లో సొంత తమ్ముడు రమణయ్య (రేలంగి), అతని భార్య అనసూయ (సూర్యకాంతం), కుమారుడు కుందుతో కలిసి పండుగకు పట్నం వస్తారు. అక్కడ సుశీలకు లభిస్తున్న ఆదరణ, గౌరవం, పెత్తనం చూసి అసూయపడిన అనసూయ సృష్టించిన గొడవల వల్ల సత్యం దంపతులు పల్లెటూరు వెళ్లిపోతారు. పట్నంలో కుటుంబరావు మిల్లు మేనేజర్ వైకుంఠం (జగ్యయ్య), తాను పాల్పడే అక్రమాల్లోకి రమణయ్యను చేర్చుకుంటాడు. నవనీతం (రాజసులోచన) అనే వేశ్యతో అతనికి పొత్తు కలుపుతాడు. పల్లెలో సత్యం బడుగు రైతుల కష్టాలు తీర్చటానికి, బంజరులో సమిష్టి వ్యవసాయం చేసి ఫలితం సాధిస్తాడు. మిల్లు ఖాతాదారుడు తిరపతయ్య (చదలవాడ) వద్ద డబ్బుకాజేసి నోటు వ్రాయటం, పలుచోట్ల అప్పులు చేసిన వైకుంఠం, రమణయ్యలు పల్లెకువెళ్ళి సత్యంపై, రైతులపై దాడి చేయటం, నిజం తెలుసుకుందామని పల్లెటూరు వచ్చిన కుటుంబరావు దోషులను విచారించి బుద్ధిచెప్పి తిరిగి సత్యం దంపతులను తనతో తీసుకెళ్ళటంతో చిత్రం సుఖాంతం అవుతుంది. ఈ చిత్రంలో మిల్లు గుమాస్తా అయోమయంగా అల్లు రామలింగయ్య, ఎస్వీ రంగారావు, కన్నాంబల కుమార్తె కమలగా పార్వతి, కుమారుడు సూర్యంగా మాగంటి బాపినీడు, సత్యం కొడుకుగా మాస్టర్ శరత్ నటించారు. ఇంకా బొడ్డపాటి, చిత్ర కథలో ఆవు పాత్ర ఉంటుంది. అలాగే అక్కినేనికి మదనపల్లిలోని అభిమాని వద్దనున్న కుక్క రూడ్ (జిమ్మి)ను చూసి, ఆ పాత్ర పరిధి పెంచి కుక్కతో పలు విన్యాసాలు చేయించటం విశేషం.
చిత్రంలో హీరో సత్యంగా అక్కినేని పలు కోణాలున్న పాత్రలో జీవించారు. మిల్లులో, పల్లెటూరిలో అన్యాయాన్ని సహించక ఎదురుతిరిగి స్వతంత్రంగా ఆత్మగౌరవంతో బ్రతికే యువకునిగా, అనురాగవంతుడైన భర్తగా, అన్నా వదినెల పట్ల గౌరవం కలిగిన తమ్మునిగా, వాత్సల్యం కలిగిన తండ్రిగా పలు భావాలను ప్రతిభావంతంగా ప్రదర్శించి ఆకట్టుకునే నటన అందించారు. సుశీలగా సావిత్రి నిండుదనమైన పాత్ర పోషించారు. కుటుంబాన్ని, పిల్లలను తీర్చిదిద్దటంలో గడుసుతనం, అక్కాబావలను మెప్పించటంలో నిండుదనం, కష్టసుఖాల్లో భర్తకు బాసటగా నిలిచే ఉత్తమ ఇల్లాలిగా చక్కగా నటించారు.
ఇక మతిమరుపు లాయర్‌గా, అవసరమైనవి మాత్రమే గుర్తు పెట్టుకునే దక్షతగల వ్యక్తిగా ఎస్వీ రంగారావు తన నటన ద్వారా ఆ పాత్రకు గుర్తింపు తెచ్చారు. కరుణ రసపూరిత నటనలో కన్నాంబ, అనకు అలవాటైన గయ్యాళితనం పాత్రలో సూర్యాకాంతం సహజ నటనతో మెప్పించారు. వైకుంఠంగా జగ్గయ్య తమాషా మేనరిజమ్‌తో అందర్నీ కొట్టి మాట్లాడటం, దాన్ని రమణయ్య పాత్రధారి రేలంగి నీ బండపడ అంటూ కామెంటు చేయటం తమాషాగా సాగుతుంది.
దర్శకునిగా రెండో చిత్రం అయిన ఆదుర్తి సుబ్బరావు తన సృజనాత్మకతతో సన్నివేశాలను తీర్చిదిద్దారు. దసరా పండుగ, పిల్లల పాటలు సంప్రదాయకంగా తోడికోడళ్ళ మధ్య పిల్లలగూర్చి వచ్చే తగవులు, సంభాషణలను ఎంతో సహజంగాను రూపొందించారు. బిఏ పరీక్ష తప్పాడని అన్నగారు సత్యంను మందలించటం, తిరిగి మెచ్చుకోవటం, జ్వరంపడిన తండ్రికోసం బాబు పండ్లు తేవబోవటం, పెద్దమ్మవద్ద పిల్లలు ఉండటం, సత్యం కొడుకు కోసం సున్నుండలు రాత్రిపూట పెద్దమ్మ పెట్టడం. తిరిగి పల్లెటూరు వెళ్ళాక వాటిని పంపటం, బాబుకోసం వేదన, అలాగే ప్రోనోటు కోసం రమణయ్య, వైకుంఠాల పాట్లు, జిమ్మి (కుక్క) వారిని అటకాయించటం, చివరకు కాల్వలోకి దూకి ఆ ప్రోనోటు తేవటంలాంటి సన్నివేశాలు సహజంగా, అర్ధవంతంగా చిత్రీకరించి దర్శకునిగా తన ప్రత్యేకత నిలుపుకున్నారు. విలనీకి కామెడీ జోడించిన తమాషా మరో ప్రత్యేకాంశం. సంగీతపరంగా, సాహిత్యపరంగా ఈ చిత్రంలోని గీతాలు శ్రోతలను పరవశింపచేశాయి.
చిత్ర ప్రారంభంలో అక్కినేని, పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ పాడే పాట ‘గాలిపటం గాలిపటం’ (ఘంటసాల, పి సుశీల, కె రాణి-కొసరాజు), దసరా పండుగ పాట ‘ముల్లోకములనేలు’ (పి సుశీల బృందం- కొసరాజు), పిల్లలపై చిత్రీకరించిన గీతం ‘ఎంతెంత దూరం’ (పి సుశీల, కె రాణి బృందం- ఆత్రేయ) ఆనందపరవశులను చేస్తాయి. ఇక మహాకవి శ్రీశ్రీ వ్రాసారేమో అనిపించే ఆత్రేయ విరచిత గీతం (అక్కినేని, సావిత్రి, రాజసులోచనలపై చిత్రీకరణ) ‘కారులో షికారుకెళ్ళే’ (ఘంటసాల) అప్పట్లో సెనే్సషన్ సృష్టించింది. రాజసులోచనపై చిత్రీకరించిన గీతం ‘పొద్దయినా తిరగకముందే’ (జిక్కి -శ్రీశ్రీ), రేలంగి, రాజసులోచనలపై చిత్రీకరించిన గీతం ‘నీ సోకు చూడకుండా’ (జిక్కి, మాధవపెద్ది -కొసరాజు) సందర్భోచితంగా ఉంటాయి. ఈ చిత్రంలోని ఎవర్‌గ్రీన్ హిట్ సాంగ్ అక్కినేని, సావిత్రి, మాస్టర్ శరత్‌లపై చిత్రీకరించారు. గూడూరు వద్దగల పల్లెటూళ్లోని పొలంలో పాటను చిత్రీకరించారు. ఈ పాటలో గూడ వేయటం కోసం సావిత్రి కొన్ని రోజుల ప్రాక్టీసు చేయటంతో, సన్నివేశం ఎంతో సహజంగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఆ గీతం ‘ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపూ ఉండదు (ఘంటసాల, పి సుశీల- కొసరాజు). బాబుతో సావిత్రి పాడే జోల పాట ‘కల కలామీ కలత’ (పి సుశీల- తాపీ ధర్మారావు). సమిష్టి వ్యవసాయం గూర్చి చెబుతూ సాగే ప్రబోధ గీతం ‘నలుగురు కలిసి పొరువులు మరచి’ (ఘంటసాల, బృందం- కొసరాజు). నృత్య దర్శకుడు చోప్రా, ఇవి సరోజలపై చిత్రీకరించిన తమాషా గీతం ‘టౌన్ పక్కకెళ్ళద్దురో’ (ఘంటసాల, జిక్కి- కొసరాజు).
‘తోడికోడళ్ళు’ తమిళం, తెలుగు రెండు భాషల్లో విజయం సాధించింది. తెలుగులో శత దినోత్సవం, తమిళంలో రజితోత్సవం జరుపుకున్న చిత్రానికి రాష్టప్రతి ప్రశంసాపత్రం లభించింది. 1957 జనవరి 7న విడుదలైన ‘తోడికోడళ్ళు’ చిత్రం 60 ఏళ్లు పూర్తి చేసుకుని నేటికీ అలరించే చిత్రంగా నిలవటం అభినందనీయం. వారం ఆలస్యంగా తమిళ చిత్రం జనవరి 14న విడుదలైంది.

-సివిఆర్ మాణికేశ్వరి