రాష్ట్రీయం

ఫలించని పాలసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: ఇసుకను తక్కువ ధరకు వినియోగదారులకు అందించాలని ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలేవీ సఫలం కావడం లేదు. ఇసుక విధానాన్ని పదే పదే మార్చి చూసినా ఫలితం కనిపించడం లేదు. ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టడానికి ప్రభుత్వం గత ఏడాది ఇసుక పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. డ్వాక్రా మహిళల ద్వారా ఇసుకను విక్రయించింది. దీంట్లో చాలా అక్రమాలు చోటు చేసుకున్నాయి. లెక్కా, జమా లేకుండా ఇసుకను తరలించారు. ఈ వ్యవహారంలో అక్రమార్కులు కోట్ల రూపాయలు ఆర్జించారన్న ఆరోపణలు లేకపోలేదు. పోనీ వినియోగదారులకు ఏమైనా ప్రయోజనం చేకూరిందా? అంటే అదీ లేదు. దీంతో ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చాలని నిర్ణయించింది. కొత్త విధానంలో ఇసుక తవ్వకం, విక్రయాల బాధ్యతను మైనింగ్ శాఖకు అప్పగించింది. క్యూబిక్ మీటరు ఇసుక 500 రూపాయలకు మించి విక్రయించకూడదన్న నిబంధన విధించింది. అలాగే, ఒక లారీలో రెండు యూనిట్లకు మించి రవాణా చేయకూడదని పేర్కొంది. ఈ విధానం ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. 15 రోజులు గడచినా ఇప్పటికీ ఇసుక విక్రయాలు సాగడం లేదు. భారీ ఎత్తున నిర్మాణాలు జరుగుతున్న విశాఖ నగరంలో ఇసుక కొరత తీవ్రంగా ఉంది. శ్రీకాకుళం, రాజమండ్రి, అమరావతి నుంచి రావల్సిన ఇసుకను నిలిపివేశారు. దీంతో విశాఖ జిల్లాలోని నాశిరకం ఇసుకను విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారు.
ఇదిలా ఉండగా విశాఖ ప్రాంతానికి కటక్, ఛత్తీస్‌గడ్ ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఐదున్నర యూనిట్ల ఇసుక కనిష్ఠ ధర 36 వేల రూపాయలు పలుకుతోంది. గరిష్ఠంగా 40 వేల రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. ఒక లారీలో సుమారు 20 టన్నుల ఇసుకను ఒడిశా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకువస్తున్నారు. ఈ ఇసుకను స్థానిక రిటైల్ వ్యాపారులకు 33 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. వాళ్లు మూడు చిన్న చిన్న లారీల్లో ఈ ఇసుకను సర్ది, రెండు యూనిట్ల ఇసుకను 11 నుంచి 12 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. మూడు యూనిట్ల ఇసుకను 16 నుంచి 18 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో వినియోగదారులు ఈ ఇసుకను కొనుగోలు చేయాల్సి వస్తోంది.
పుష్కరాలకు ఇసుక ఆదాయం మళ్లింపు
ఇదిలా ఉండగా వివిధ రీచ్‌ల నుంచి ఇసుకను విశాఖలోని స్టాక్ పాయింట్‌కు తరలించి, దాన్ని వినియోగదారులకు గత నెల వరకూ విక్రయించారు. ఈ ఆదాయం అంతా డిఆర్‌డిఏ ఖాతాలోకి చేరింది. ఇలా వచ్చిన మొత్తాన్ని గోదావరి పుష్కరాల ఖర్చులకు మళ్లించినట్టు అధికారులు చెపుతున్నారు. విశాఖలో లారీ యజమానులకు నవంబర్ నెల నుంచి ఇప్పటి వరకూ బిల్లు బకాయిలు చెల్లించలేదు. ప్రస్తుతం విశాఖలోని ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఇసుకను డంప్ చేశారు. దాన్ని తరలించడానికి ఏ ఒక్క లారీ యజమాని ముందుకు రావడం లేదు. దీంతో వినియోగదారులు ఇసుక మాఫియానే ఆశ్రయించాల్సి వస్తోంది.