పర్యాటకం

ఆయురారోగ్యాలనిచ్చే జలధీశ్వరస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జలం జీవులకు ప్రాణాధారం. దేహాన్ని పరిశుద్ధంచేసేది, ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని పెంచేది నీరే! ఆ జలంనుండి జనించి జలధీశ్వరునిగా భక్తులచే పూజలందుకుంటున్న కృష్ణాజిల్లా ఘంటశాలలోని శ్రీ బాల పార్వతీసమేత శ్రీ జలధీశ్వరస్వామిని దర్శించి, ఆరోగ్యవంతులైనవారు అనేకం. అగస్త్యమునిచే ప్రతిష్ఠితమైన ఈ ఆలయంలో స్వామిని సేవించిన వారు అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నారు. కొందరు భక్తులు స్వామిపై కొద్ది నీళ్ళుపోసి ఆ జలం త్రాగితే వ్యాధులు పటాపంచలవుతాయని అన్నారు.
‘‘ఏకపీఠేవిరాజన్తం సర్వమంగళయా సహా
ఘంటశాల పురాధీశం జలధీశ్వర యుపాస్మహే
భస్మాలంకృత సర్వాంగ అగస్త్యేన ప్రతిష్ఠితం భక్తేభ్రష్టప్రదం వందే అద్వైతజ్ఞానసిద్ధయే॥
ఈ శ్లోక తాత్పర్యం- స్వామి, శ్రీ బాలపార్వతీదేవితోబాటు ఒకే పీఠంపై కొలువుతీరి వున్నారు. ఈ ప్రత్యేకత మన దేశంలో ఎక్కడా కనిపించదు. ఈ జలధీశ్వర లింగం ఆంధ్రదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. లింగంలోనే జలం వుందట!!
ఈ శైవక్షేత్రంలో గంట మ్రోగిస్తే ‘‘ఓం’’కారాన్ని అంతర్లీనంగా ధ్యానించడాన్ని వినగలం.
ఇక్కడ స్వామివారికి జలాభిషేకం చేయరు. లింగం విభూతి పూతతో తెల్లగా మెరిసిపోతూ వుంటుంది అని ఒక స్థపతి సెలవిచ్చారు. అర్చక స్వాములు వంశపారంపర్యంగా వున్నవారు చెప్పే విశేషాలు ఎన్నో!
ఎవరి అనుభవాలు వారివే!
ఈ ఆలయం విమానం తమిళనాడు, తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని పోలి వుంటుందని పండితులు చెబుతున్నారు. ఇందులకు కారణం బృహదీశ్వర ఆలయంలోవలే ఈ ఆలయ విమాన శిఖరాలు గజపృష్ఠా కారములో వుండటంవలన ఈ పోలిక వచ్చివుండవచ్చునని ఆలయ అధికారులు చెబుతున్నారు.
ఆలయ వృద్ధ అర్చకులను సంప్రదిస్తే వారు చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా వున్నాయి. అష్టాదశ పురాణాలలో అగస్త్యుని వృత్తాంతము పరిశీలిస్తే కొన్ని నిగూఢ రహస్యాలు, పౌరాణిక విశేషాలు తెలియగలవు.
పౌరాణిక గాథ: శివపార్వతులకు వివాహ సుముహూర్తం ముని పుంగవులు నిశ్చయించారు. శంకరుడు సమస్త దేవతలకు పెళ్ళిలో పాల్గొనవలసినదిగా సాదరంగా నారద మహామునిద్వారా ఆహ్వానించాడు. నిశ్చిత ముహూర్తానికి త్రిమూర్తులలో బ్రహ్మ, విష్ణువు, వారి పరివారం మహేంద్రుడు, సకల దేవతలు విచ్చేశారు. ఇలా సమస్త ప్రాణికోటి, దేవతలు ఉత్తరా పధానికి చేరుకొనడంతో ఆ పధంవైపు బరువు పెరిగి క్రుంగిపోసాగింది. అప్పుడు శివుడు అగస్త్యమునిని దక్షిణాపధమువైపుకు వెళ్ళమని, బరువును సమతూకం చేయమని కోరాడు.
అగస్త్యుని మనోవేదన ఇంతాఅంతా కాదు. రంగరంగ వైభవంగా జరిగి శివపార్వతుల కల్యాణాన్నిచూచి తరించాలని వచ్చిన ఆ మహాముని కోరిక. శివాజ్ఞనుబట్టి దక్షిణాపధానికి వెళ్ళే ప్రయత్నంలో వుండగా అగస్త్య మహాముని మనసులోని అసంతృప్తిని ముక్కంటి గ్రహించి ‘‘అగస్త్య మహర్షీ నీవు నిరుత్సాహం చెందకు. దక్షిణాపధంలోని ఒక పుణ్యక్షేత్రంలో పార్వతీపరమేశ్వరులను ప్రతిష్ఠించి, భక్తిశ్రద్ధలతో పూజిస్తే, తన పెళ్ళి వేడుకలు చూచే భాగ్యం అచటనే కలుగుతుందని శివుడు సెలవిచ్చాడు. ముని మనస్సు తేలిక పడింది. అట్లు ఆయన ఘంటశాలలో ఆలయ ప్రతిష్ఠాపన చేశాడట. అందుకే ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసంగా భక్తులు భావిస్తారు.
అర్చకులు మరికొన్ని విశేషాలు చెప్పారు. భక్తులు ఆలయ ప్రదక్షిణలు ఇరవై ఒక్కసార్లుచేస్తూ రుద్రాభిషేకం చేయిస్తే పుణ్యం అనంతం. ఇష్టకామ్యాలు తక్షణం నెరవేరుతాయి. ప్రతి సోమవారం విశేష రుద్రాభిషేకం. మిగిలిన రోజుల్లో అభిషేకం ఉదయం, అమ్మవారికి సాయంత్రం అష్టోత్తర నామార్చన, లలితాసహస్రనామ పారాయణం, ప్రతి శుక్రవారం అమ్మవారికి స్థపన, సహస్ర కుంకుమార్చన, శుద్ధ చతుర్దశి మాస శివరాత్రి రోజున మహాన్యాస పూర్వక ఏకవారాభిషేకం, చతుర్వేద పారాయణం, ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమిరోజున స్వామివారి జగజ్యోతి ప్రజ్వలన, వార్షిక కల్యాణం జరుపబడుతుంది. ఈ ఆలయం ప్రక్కనే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం వుంది. అక్కడ ప్రతి మార్గశిర మాసంలో షష్ఠి ఉత్సవం జరుగుతుంది వైభవంగా! ఘంటశాల రాజకీయంగానూ కాకుండా బౌద్ధక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఆంధ్రప్రదేశ్‌లో క్రీ.శ.2వ శతాబ్ది మొదలు క్రీ.శ.7వ శతాబ్దివరకూ మతవ్యాప్తికి పేరొందిన అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామతీర్థంతోబాటు ఘంటశాల బాగా తోడ్పడింది. స్థూపాలు, అవశేషాలు ఇక్కడ వున్నాయి. ఇచటనే ఉగ్ర నరసింహమూర్తి విగ్రహాన్ని పదిలపర్చారు. ఘంటశాల చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి.
ఈ ప్రసిద్ధ దేవాలయానికి బస్సుమార్గం- విజయవాడ నుండి ఘంటశాలకు (ఉయ్యూరు, కూచిపూడిల మీదుగా) దూరం 40 మైళ్ళు, మోపిదేవినుంచి ఘంటశాలకు 8 మైళ్ళు, కూచిపూడినుండి 8 మైళ్ళు. ఇక్కడ లాడ్జింగ్ వసతి సౌకర్యలు లేవు. అద్దె టాక్సీలలో వచ్చి ఆలయ దర్శనాలు చేసి స్వస్థలాలకు వెళ్ళడం సుఖకరము!!

- బొడ్డపాటి రాజేశ్వరమూర్తి