పర్యాటకం

పంచారామాల్లో ప్రథమం అమరారామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యంత పురాతన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అమరావతి పట్టణంలోని అమరేశ్వర ఆలయం ఒకటి. ఈ పట్టణంతోపాటు ఆలయానికీ గొప్ప చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని మొదటి నాగులు అనే వంశం వారు పరిపాలించారు. తెలుగు వారైన వీరి కాలంలోనే అప్పటివరకూ కేవలం మాట్లాడుకోవడం వరకూ ఉన్న తెలుగు భాషకు రూపురేఖలు ఏర్పడ్డాయి. అంటే3లిపి సృష్టించబడింది. ఇలా తెలుగు లిపిలో ఉన్న మొట్టమొదటి పదం ‘నాగబు’గా ప్రసిద్ధి పొందింది. ఈ ‘నాగబు’ అనే పదం చెక్కివున్న రాతి పలక ఈ ఆమరావతిలోనే దొరికింది.
నాగులు తర్వాత శాతవాహన వంశస్థులు పరిపాలించారు. వీరి పాలన సుమారు క్రీ.పూ. మూడో శతాబ్దంలో ప్రారంభమై నాలుగు వందల ఏళ్ళ వరకు కొనసాగింది. వీరి రాజధాని అమరావతి పట్టణం. అయితే, అప్పట్లో ఈ ఊరు పేరు దాన్యకటకం. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకు వంశస్థులు ఈ ప్రాంతానికి చక్రవర్తులయ్యారు. వీరి కాలంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆచార్య నాగార్జునుడు అమరావతిలో ఒక బౌద్ధ విశ్వవిద్యాలయం నడుపుతూ ఉండేవాడు. బుద్ధ భగవానుని పవిత్రధాతువును ఇక్కడ పెట్టి, దానిపై నాగార్జునుడు ఒక స్థూపం నిర్మించారు. ఆ స్థూపం ఇప్పటికీ మనం ఇక్కడ చూడవచ్చు.
అమరేశ్వర స్వామి ఆలయం కృష్ణానది ఒడ్డునే, నదీ నీటిని తాకుతూ ఉంటుంది. ప్రధాన ద్వారం అనుకునే స్నానఘట్టం ఉంది. విశాలంగా, పొడుగుగా నిర్మించిన మెట్లు ఉన్నాయి. ఈ ఆలయాన్ని మిగతా ఆలయాల కంటే భిన్నంగా నిర్మించినట్టు కనిపిస్తుంది. మూడు ప్రాకారాలు ఉన్నాయి. ఆలయంలో బాలచాముండేశ్వరీదేవి అమ్మవారి ఆలయం కూడా నిర్మించారు. ప్రణవేశ్వరుడు, శంకరాచార్యులు, కాశీ విశే్వశ్వరుడు, ఉమా మహేశ్వరుడు, దత్తాత్రేయుడు, జ్వాలాముఖీదేవి, అగస్త్వేశ్వరుడు, పార్దివేశ్వరుడు, సోమేశ్వరుడు, నాగేశ్వరుడు, కోసలేశ్వరుడు, మహిషాసుర మర్దని, వీరభద్రుడు తదితర దేవతామూర్తులు విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. ఆలయంలో ఉన్న అమరేశ్వరుడు మెరుస్తూ నిలువెత్తుగా నిలబడి, భక్తులను ఆశీర్వదిస్తుంటాడు.
స్థల పురాణం
ఒకప్పుడు తారకుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను జన్మతఃరాక్షసుడైనప్పటికీ గొప్ప శివ భక్తుడు. శివుని నుంచి గొప్ప వరాలు కూడా పొందాడు. దీంతో దేవతలను, సాధు, సన్యాసులను బాధిస్తుండేవాడు. దీంతో దేవతలందరూ, విష్ణుమూర్తిని వెంటబెట్టుకుని శివుని వద్దకు వెళ్ళి తారకుడి బాధలను ఏకరువుపెట్టుకున్నారు. అప్పుడు శివుడు తన అంశతో జన్మించిన కుమారు స్వామిని దేవతల సైన్యానికి నాయకుడిగా చేసుకుని తారకుని జయించమని చెబుతాడు. అయితే, కుమారస్వామి ఎంత వీరోచితంగా పోరాడుతూ ప్రయత్నించినా తారకాసుడిని జయించలేకపోతాడు. తిరిగి అందరూ శివుని వద్దకు వెళతారు. తారకాసురిని కంఠంలో ఒక లింగం వుంది అనీ, అతని ప్రాణాలు ఆ లింగంలోనే ఉన్నాయని చెబుతాడు. అప్పుడు కుమారస్వామి వెళ్ళి తన శూలంతో తారకాసురిని కంఠంలో ఉన్న లింగాన్ని ముక్కలు చేస్తాడు. దాంతో తారకుడు మరణిస్తాడు.
తారకుని కంఠంలో ఉన్న ప్రాణలింగం శివుడు ప్రసాదించింది. దానిని కుమారస్వామి శూలంతో ముక్కలు చేశాడు. ఆ ముక్కలు నేల మీద పడగానే, అవి తిరిగి సంపూర్ణ లింగంగా మారతాయ. అంతేగాక అలా తిరిగి తయారైన లింగ విగ్రహాలు అనంతంగా పెరిగిపోతాయని, ఈ దృష్ట్యా వాటిని వెనువెంటనే ప్రతిష్ఠ చేయాలని శివుడు దేవతలతో చెబుతాడు.
కుమారస్వామి చేత ఛిన్నాభిన్నం అయిన ఆ లింగం మొత్తం అయిదు ముక్కలయింది. ఆ ముక్కలు అయిదుచోట్ల పడి అయిదు శివలింగాలు తిరిగి ఉద్భవించాయి. ఈ లింగాలకోసం ఆలయాలు నిర్మించారు. ఆ అయిదు ప్రదేశాలనే 3పంచారామాలు2అంటారు. ఒక్కొక్కచోట ఉన్న ఆలయంలోని ఆకారానికి ఒక్కొక్క పేరుంది. ఇవే.. అమరావతిలోని అమరేశ్వరుడి అమరారామం, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం గుణుపూడిలోని కుమారారామం, పాలకొల్లులో క్షీరారామం, తూర్పు గోదావరి జిల్లాలోని సామర్లకోటలోని భీమారామం, ఇదే జిల్లాలోని ద్రాక్షారాములు. అన్నింటికన్నా పెద్ద ముక్క, మొట్టమొదటిసారిగా పడ్డచోటే ఈ అమరారామం. ఇది ఎక్కడ పడిందో అని వెదుక్కుంటూ దేవేంద్రుడు, దేవగురువైన బృహస్పతితో కలిసి పరుగు పరుగు వచ్చాడు. అప్పటికే ఆ ముక్క శివలింగ రూపం ధరించడంతోపాటు దాదాపు పది అడుగుల పొడవుకు పెరిగిపోయింది కూడా. వెంటనే దేవేంద్రుడు బృహస్పతి సలహాలను అనుసరించి ఆ లింగాన్ని అలాగే ప్రతిష్ఠించాడు. ఆ రోజు ఆశ్వయుజశుద్ధ దశమి. అప్పుడు శుక్రాచార్యుడు అక్కడకు వచ్చి బృహస్పతితో మాట్లాడుతూ.. ఇంకా కొంతకాలం తర్వాత కృష్ణవేణి అనే నది సహ్యాద్రి అనే పర్వతం మీద జన్మించి, ఈ అమరావతి మీదుగా ప్రవహించుకుంటూ వెళుతుందని విష్ణుమూర్తి చెప్పాడని, ఆ నది వేగానికి ఈ విగ్రహం నిలబడుతుందా? అని ప్రశ్నించాడు. అప్పుడు బృహస్పతి చెబుతూ... ఈ విగ్రహం పడినచోటను క్రౌంచ పర్వతం అని అంటారు. ఈ పర్వతం అడుగుభాగం పాతాళం వరకు ఉంది. అందువల్ల ఈ లింగం స్థిరంగా ఉంటుంది. అదీగాక ముందు ముందు జన్మించబోయే కృష్ణానది సాక్షాత్తూ విష్ణుస్వరూపం గనుక విష్ణువు, శివుడు అభేదులైన వారు గనుక ఆ నదీ పర్వతం పక్క నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పాడు. ఇలా అమరుల అధిపతి అయిన మహేంద్రుడిచేత ప్రతిష్ఠించిన స్థలం గనుక దీనిని అమరారామం అని, దేవేంద్రుడి నగరమైన అమరావతి అనే పేరు కూడా వచ్చినందని పురాణాలు చెబుతున్నాయి.
క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దంలో మెగస్తనీసు అనే గ్రీకు చరిత్రకారుడు రాసిన పుస్తకాల్లో భారతదేశంలో ఉన్న అతిగొప్ప నగరాల్లో ఈ ధాన్యకటకం ఒకటి అని పేర్కొన్నాడు. శాతవాహనుల తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు తమ రాజధానిని ఈ ధ్యానకటకం నుంచి నాగార్జున కొండకు మార్చుకున్నారు. ఆ కాలంలో ఈ ధాన్యకటకం పేరు కొంత మరుగునపడింది. తిరిగి ఇక్ష్వాకుల తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవులు వారి తర్వాత విష్ణుకుండిన వంశీయులు కాలంలో ధ్యానకటకం తిరిగి పేరుప్రతిష్ఠలు సంపాదించుకుంది. క్రీ.శ. 1156లో వెలమనాటిలోని దావులూరు ప్రభువైన కొమ్మనాయుడు ఈ ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకుని కొంత దెబ్బతిన్న ఆలయాన్ని పునరుద్ధరించాడు. మరొక మూడు వందల ఏళ్ళ తర్వాత కొండవీటిని రాజధానికి పరిపాలించిన ప్రోలయవేమరెడ్డి ఆలయాన్ని తిరిగి మరమ్మతు చేయించి, చుట్టుపక్క ప్రాకారాలు, గోపురాలు నిర్మించించాడు. మళ్ళీ క్రీ.శ 1526లో హంద్రికం పెద్దప్పం అనే వ్యక్తి ఈ ఆలయాన్ని మరొకసారి పునరుద్ధరించారు. విజయనగరాన్ని పాలించి శ్రీ కృష్ణదేవరాయులు ఈ స్వామి దర్శనం చేసుకున్నారని ఈ ఆలయ గోడలమీద అనేక శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.
అమరావతికి కొద్ది దూరంలో ఉన్న చింతపల్లి అనే గ్రామ జమిందారుగా ఉన్న రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు, అమర్వేశ్వరస్వామి తనకు కలలో కనబడి ఆజ్ఞాపించిన ప్రకారం తన రాజధానిని ఈ అమరావతికి మార్చుకున్నాడు. వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు అచంచలమైన దైవభక్తుడు. అమరావతికి పక్కనే ఉన్న ధరణికోటలో ఒక కోట నిర్మించుకున్నాడు. వెంకటాద్రినాయుడు అమరేశ్వరుని ఆలయాన్ని ఎంతో అభివృద్ధి పరిచాడు.

- గున్న.కృష్ణమూర్తి