సబ్ ఫీచర్

వారసత్వపు వెలుగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ పార్టీలన్నీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా మారిన మనదేశంలో వారసత్వ రాజకీయాలు ఇప్పుడు కొత్తేమీ కాదు. ఇప్పుడున్న అన్ని పార్టీలూ ఓనర్‌షిప్ కంపెనీలే కాబట్టి, ఎవరి కంపెనీలు వారి వారసులకే పట్టం కట్టడం సహజం. దీనికి ప్రతిభ, క్రమశిక్షణ, పనితనం వంటి పూతలు ఎన్ని పోసినా జనం నమ్మరు. కాకపోతే తమ నిర్ణయలకు ‘డెమోక్రసీ డ్రెస్సు’ వేయాలి కాబట్టి, సొంత పార్టీలో సీనియర్ల నుంచి కిందిస్థాయి కార్యకర్తలతో- ‘వారసులు తమను ఉద్ధరించి జన్మధన్యం చేయాల’ని ఒత్తిళ్లు చేయించటం, నాయకత్వం కూడా అందరి ఆకాంక్షలతో పాటు తమ వారసులు పనిమంతులే కాబట్టి వారికి కిరీటం పెడుతున్నట్లు ప్రకటిస్తుంటాయి. ఈ ప్రహసనం జనాలకు తెలియదనుకుంటే భ్రమ. రాహుల్ గాంధీ నుంచి లోకేష్ బాబు వరకూ జరుగుతున్న తంతు ఇదే.
సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా అరంగేట్రం వరకే తండ్రుల ‘కార్డు’ అక్కరకొస్తుంది. వారసులు హిట్టవ్వాలన్నా, ఫట్టవ్వాలన్నా అది వారి స్వయంప్రతిభ మీద తప్ప తండ్రులు, పార్టీల చేతుల్లో ఏమీ ఉండదు. ‘కాబోయే ప్రధాని’ రాహుల్ ఇనే్నళ్లయినా ఇంకా పనిమంతుడు కాలేకపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా సోనియామాత తలచుకుంటే ‘యువరాజా’వారు ప్రైమ్మినిష్టర్ కావడం పెద్ద పనికాదు. అన్నీ ఉన్నా అయిదోతనమే లేదన్నట్లు రాహుల్‌బాబాకు ఆ పదవి చేపట్టేంత జ్ఞానదంతాలు ఇంకా రాలేదు! వచ్చినా పదవిని అందిపుచ్చుకునే ధైర్యమూ చేయలేకపోయాడు. ఇందిరమ్మ మనుమడు, రాజీవ్ పుత్రుడు, సోనియా ముద్దుబిడ్డ వంటి ‘ట్యాగు’ లెన్ని ఉన్నా, అబ్బాయిగారు ఒక్క ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించలేకపోగా ‘ఐరన్ లెగ్’గా ముద్రపడిపోయాడు. దేశాన్ని శాసించే శక్తి ఉన్న పార్టీకి ఉత్తరాధికారి, ఇమేజ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినా రాహుల్ ఇప్పటికీ వెలుగులోకి రాకపోవడానికి కారణం పరిణతి లోపంతోపాటు, సరైన సలహాదారులు కరవవడం!
ఏపిలో ఇప్పటివరకూ మాజీ సీఎం వైఎస్ తనయుడు జగన్ తప్ప మిగిలిన మాజీ సీఎంల వారసులెవరూ రాజకీయాల్లో హిట్టవలేదు. ప్రజలు ఆదరించే స్థాయిలో పనిచేయకపోవడంతో వారంతా మాజీ సీఎం కొడుకులుగానే మిగిలిపోయారు. జగన్‌కు, వీరికీ అదే తేడా! సినిమాల్లో ఎంతోమందికి హిట్లిచ్చిన దాసరి వంటి దిగ్దర్శకుడు తన కొడుక్కి ఒక్క హిట్టూ ఇవ్వలేకపోయారు. సినిమాలు తీసినా ఆదరించాల్సింది ప్రజలే కదా? అంటే ఎంట్రీలకు ఎన్ని రిఫరెన్సులున్నా, అవి సక్సెస్ కావాలంటే ఎవరైనా సొంత ప్రతిభ చూపక తప్పదన్నమాట! రాజకీయాల్లో అవకాశాలు రావడం ఎంత సులభమో, దాన్ని నిలబెట్టుకోవడం అంత కష్టం. ఇప్పటి తరంలో విపరీతమైన అసహనంతోపాటు, చిన్న వయసులోనే భజనకు అలవాటుపడుతున్న తత్వం, అన్నీ తెలుసనుకునే అతితెలివి కనిపిస్తోంది. ఇది ప్రమాదం. దీనికితోడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ యువనేతలను జనంలోకి వెళ్లకుండా, మరింత సోమరిపోతులుగా మారుస్తోంది. వారి టెక్నాలజీ తెలివికి మురిసిపోయే తండ్రులు కొడుకులకు రాజకీయాల్లో ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు నేర్పించకుండా,చూపించకుండా భు జం తట్టడమే అసలు సమస్య. ప్రతి తండ్రీ ఒక ధృతరాష్ట్రుడేనని మన నేతలను చూస్తే నిజమేననిపించకమానదు. అందు కు తెలుగు రాష్ట్రాల పితాశ్రీలూ మినహాయింపు కాదు.
తాజాగా యుపి ఎన్నికల ఫలితాలు నేటి యువతరానికి ఒక హెచ్చరిక. సీఎంగా ఇచ్చిన అవకాశం వినియోగించుకోకుండా, తండ్రినే పక్కకు జరిపి, సొంత ఎంపికలతో మాడుపగలకొట్టుకున్న అఖిలేష్ వైఫల్యం నేటి యువనేతలకు ఒక గు ణపాఠం. అనుభవానికి, ఆవేశం-అతి తెలివితేటలకు ఎంత తేడా ఉంటుందో యుపి ఎన్నికలు చా టాయి. వచ్చే ఎన్నికల్లో తెరంగేట్రం చేయాలనుకుంటున్న ‘తెలుగు’ వారసులకు యుపి ఫలితాలు ఓ మార్గదర్శి.
రెండు దశాబ్దాల క్రి తం.. రాజకీయాల్లో అ డుగుపెట్టిన వారసులకు అధికారం అనుభవించాలన్న పట్టుదల ఉండేది. తండ్రుల మాదిరిగానే ప్రజల్లో గౌరవం పొందాలన్న కసి ఉండేది. ఇప్పటి యంగ్‌టర్కుల్లో అధికారంలో ఉన్న ఐదేళ్లలో అడ్డగోలుగా సంపాదించుకోవాలన్న ధ్యాస తప్ప, అధికారం అనుభవించాలనే తపన భూతద్దం వేసి వెతికినా కనిపించడం లేదు. అందుకు పితాశ్రీల ఆశీస్సులూ ఉండటం మరో ఆశ్చర్యం. ఇప్పటి యువ వారసులకు జనంలో క్రెడిబిలిటీ త క్కువ.
ఇంకో అరాచక ఆలోచన కూడా నేటి యువనేతల్లో కనిపిస్తోంది. జగన్ లక్షకోట్లు అడ్డదారిలో సంపాదించినా జనం ఆయన పార్టీకి 67 సీట్లు ఇచ్చారు కాబట్టి, మనం సంపాదించుకున్నా ఫర్వాలేదన్న భావన నాటుకుపోవడం వారి భవిష్యత్తుకు మంచిది కాదు. అసలు అవినీతి ఒక అంశం కాదని, దాన్ని జనం ఎక్కువ కాలం పట్టించుకోరన్న ధీమాతో వేస్తున్న తప్పటడుగులు పుట్టిముంచక తప్పదు. వేరుశనగ, చెప్పుడుమాటలు తియ్యగా ఉంటాయని సీమలో ఒక సామెత ఉంది. ఇప్పటి యువనేతలు ఈ వయసులోనే చెప్పుడుమాటలు, భజనలకు లొంగిపోతున్నారు. తెలుగుదేశం పార్టీకి కొత్త వారసుడైన ఎమ్మెల్సీ నారా లోకేష్ ‘పెద్దల సభ’లో పిన్న వయస్కుడు మరి! ఇప్పటివరకూ తెరవెనక కనిపించిన చినబాబు ఇకపై తెరపైనే ఉండక తప్పదు. ‘వ్యక్తుల ప్రైవేట్ జీవితాలు మనకనవసరం. పబ్లిక్‌లోకి వస్తే ఏమైనా అంటామ’ని శ్రీశ్రీ చెప్పినట్లు, ఇక తన వ్యవహారాలేమీ ప్రైవేటుకాదని లోకేష్ గ్రహించాలి. అనుభవం లేకపోయినా, తండ్రిలా ఎలాంటి ఎదురుదెబ్బలు తినకుండా, కింద స్థాయి నుంచి పనిచేయకపోయినా అప్పుడే ఆయనకు-జగన్‌కూ పోటీ అని ప్రచారం చేస్తున్నందున, లోకేష్ జనజీవన స్రవంతిని తన పనితనంతోనే మెప్పించాల్సి ఉంటుంది. బాబు కాలేజీ రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాల వరకూ ఎదిగిన క్రమంలో చాలా కష్టపడవలసి వచ్చింది. ఆయనకు ఏదీ కష్టపడకుండా దక్కలేదు.
అలాంటి కష్టాలేమీ పడకుండానే సులభంగా ఉత్తరాథిపతి అయ్యే అవకాశం వచ్చిన లోకేష్ రాజకీయ జీవితం సక్సెస్ అవుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. ఒక నాయకుడి పక్కన, వెనుక ఎవరుండి నడిపిస్తున్నారు? ఆయన సలహాదారులెవరు? వారికున్న వయసు, రాజకీయ అనుభవమేమిటి? అనే దానిని ప్రతి ఒక్కరూ గమనిస్తుంటారు. ఇప్పుడు జగన్ ఎవరు చెప్పినా వినరని, తాను అనుకున్నదే చేస్తారని, సరైన సలహాదారులు లేకనే జగన్ రాణించలేకపోతున్నారన్న ప్రచారం ఉంది. తండ్రి వైఎస్‌లా కాకుండా డబ్బు ఖర్చుకు వెనుకాడే నాయకుడన్న పేరు ప్రచారంలో ఉంది. లోకేష్ ఇన్నాళ్లూ తెరవెనుకే ఉన్నందున ఆయన గుణగణాలు, నాయకత్వ లక్షణాలు, ఇతర అంశాలు కొద్దిమందికే తెలుసు. అవి అందరికీ తెలియాలంటే కొంతకాలం పడుతుంది.
సరైన సలహాదారులు లేకపోతే అభాసుపాలుకాక తప్పదు. తన ఆస్తులపై జగన్ మీడియా రాసిన కథనాలకు లోకేష్ స్వయంగా స్పందించడమే ఆశ్చర్యం. ఆ ఒక్క పత్రికకు ఖండన పంపించే బదులు, ఏకంగా మీడియా పేరంటమే పెట్టి జగన్ పత్రిక చదవని వారినీ తన ఆస్తుల వివరాలు చదివేలా చేసిన వైనం ఒక్కటి చాలు సలహాదారుల ‘పనితనం’ చెప్పడానికి. ప్రారంభంలోనే ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలు మంచిది కాదు. ఎదిగే నేతలకు భజన సంఘాలే అవరోధం. హితైషులే విమర్శలు చేస్తారు. పొగడ్తలు తీపిగా, విమర్శలు చేదుగానే ఉంటాయి. కులాభిమానంతోనో, ప్రాంతాభిమానంతోనో, పార్టీ అభిమానంతోనో, ఏదైనా ప్రయోజనాలు ఆశించే వారి పొగడ్తలు తప్పుదారిపట్టిస్తుంటాయి. కులం ముద్ర పడేందుకూ దారితీస్తుంది. ఇప్పటికే అలాంటి ప్రచారం పెరుగుతోంది. పైకి కనిపించకపోయినా చుట్టూ ఉండే వారిని బట్టే ప్రజలు అంచనాకు వస్తారన్న విషయాన్ని కూడా కొత్త నేతలు గుర్తెరగాలి.
రానున్న రెండేళ్లలో లోకేష్ తన ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తేనే నిలదొక్కుకోవడం సాధ్యమవుతుంది. వ్యాపారం వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాల్లో ప్రజలను మెప్పించాల్సి ఉంది. తండ్రి మాదిరిగా సహనం, లౌక్యం, అందుబాటులో ఉండే నైజం, కలుపుగోలుతనం ఉంటేనే యువనేతకు భవిష్యత్తు. ఏపిలో జగన్ గానీ, తెలంగాణలో కేసీఆర్ కుటుంబం గానీ, తమిళనాడులో కరుణానిధి వారసులకు మొదట తండ్రుల కార్డు పనికొచ్చినా, ఆ తర్వాత వారంతా స్వయంప్రతిభతోనే దాన్ని నిలబెట్టుకున్న వైనాన్ని మర్చిపోకూడదు. భ్రమల్లో బతకకుండా నిరంతరం జనం మధ్యలో నిలిచినందుకే వారి పునాదులు పటిష్టంగా ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ‘తెలుగు’ వారసుడి రాజకీయ భవితవ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు.
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144