మెయన్ ఫీచర్

రెండు రాష్ట్రాలు.. రెండేళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రా ష్ట్ర విభజన జరిగి రెండేళ్లయింది. చూస్తుండగానే రెండేళ్లు సినిమా రీళ్లలా గిర్రున తిరిగిపోయాయి. వెనక్కి తిరిగిచూస్తే పెద్దగా సాధించిందేమీ లేకపోగా, బోలెడంత లోటు. కాకపోతే ఇద్దరు చంద్రుల విషయంలో సాధించిన విజయాల తీరు వేర్వేరు. అదృష్టలక్ష్మి ఇద్దరి విషయంలో సమన్యాయం చూపడం లేదు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నిశ్చింతగా ఉంటే, కోరి లేఖ ఇచ్చి మరీ విభజనకు గురైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నిరంతరం సమస్యలే. తెలంగాణలో విపక్షం మరగుజ్జుగా మారి, మీడియా విధేయతతో కేసీఆర్ వెలిగిపోతుంటే, ఏపిలో బలమైన ప్రతిపక్షంతోపాటు మీడియా చైతన్యంతో బాబు నలిగిపోతున్నారు. ఇదీ ఇద్దరు చంద్రుల మధ్య గత రెండేళ్లలో కనిపించిన సారూప్యం!
తెలంగాణ మిగులు బడ్జెట్‌తో అలరారుతుంటే, ఏపి లోటు బడ్జెట్‌తో భోరుమంటోంది. అనుభవశాలి, కొనే్నళ్లు దేశ రాజకీయ యవనికలో కీలకపాత్ర పోషించిన బాబు పరిస్థితి జాలిగొలిపేలా ఉంది. తనకంటే జూనియర్ అయిన మోదీ ముందు నిటారుగా నిలబడలేని పరిస్థితి. ప్రత్యేక హోదా సహా, ఇతర విభజన హామీలను గట్టిగా నిలదీయలేని నిస్సహాయత. ఇప్పుడున్న పరిస్థితిలో బాబుకు కేంద్ర దన్ను అవసరం. రాజకీయంగా, పరిపాలనాపరంగా, వ్యక్తిగతంగా ఢిల్లీ ఆసరా లేకపోతే మనుగడ ప్రమాదంలో పడుతుంది. అది తెలిసినందుకే బాబు తన మీడియా నయా రాజగురువు బిజెపి బంధం తెంచుకోవాలని, ప్రతివారం సలహాలిస్తున్నా కాదని, తన సహజ స్వభావానికి విరుద్ధంగా మోదీ దగర్గ మెత్తగా ఉంటున్నారు. దానివల్ల కేంద్రం నుంచి పొందిన అదనపు లాభాలూ లేవు. అదొక దయనీయం.
ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా బాబుకు తెలుసు. తాను ఆవేశపడితే, ప్రత్యర్ధి జగన్ లాభపడతారన్న విషయమూ తెలుసు. అందుకే తన ప్రత్యర్ధి ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా, అడిగిన వెంటనే కేంద్రం అపాయింట్‌మెంట్ ఇస్తున్నా ఏమీ అనలేక వౌనం వహిస్తున్నారు. అయితే బాబు రాజకీయ ఎత్తుగడ, గతానుభవం చూస్తే ఇదంతా శాశ్వతం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ముందు ఏటికి ఎదురీదడం, తర్వాత ఎదురుగాలి వీచినప్పుడు వెనక్కితగ్గడం బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.
ఈ రెండేళ్లలో బాబు ఎక్కడా విశ్రమించింది లేదు. అది ఆయన స్వభావం. ప్రతిపక్షంలో ఉన్నా అదే తీరు. శరీరానికి, మెదడుకు విశ్రాంతి ఇవ్వడం ఆయనకు నచ్చదు. తనతోపాటు, మిగిలిన వారు కూడా తన స్థాయిలో పనిచేయాలనుకుంటారు. అయితే, అంత అవసరం మిగిలినవారికి ఉండదన్న వాస్తవం బాబు ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. అదే సమస్య! పార్టీ, ప్రభుత్వాన్ని సొంతం చేసుకునే అవకాశం ఆయన ఎవరికీ ఇవ్వరు. అందువల్ల సహచరులు, అనుచరులు పార్టీ మనది కాదు, బాబుది. దానికి కర్త, కర్మ, క్రియ ఆయనే అన్న భావనలో బతుకుతున్నారు. మనమడిని ఎత్తుకుని ఆడుకోవలసిన వయసులో కూడా రాష్ట్రం కోసం కాళ్లకు బలపం కట్టుకుని, విదేశాలు తిరుగుతున్నారు.
కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. కాబట్టి, ఇప్పుడు బాబు ఒక్కరే కాదు, ఎవరు ఏ నీతులు చెప్పినా ఎవరూ వెంటనే నమ్మే సత్తెకాలపురోజులుకావు.విలువలతో కూడిన రాజకీయాల గురించి ఎవరు చెప్పినా, వెంటనే సదరు నేతాశ్రీ గతంలో ఏమి చేశారో సోషల్‌మీడియాలో ప్రత్యక్షమవుతోంది. దీన్ని బాబు ఇంకా గ్రహించకపోవడమే ఆశ్చర్యం. విజయసాయిరెడ్డిని వైసీపీ అభ్యర్ధిగా నిలబెట్టిన తర్వాత బాబు చేసిన వ్యాఖ్యలు ఆయన వైపు వేలెత్తి చూపాయి.
ఏ-2ను రాజ్యసభకు పంపిస్తున్నారన్న బాబు, తన పక్కనే నాంపల్లి కోర్టులో విదేశీబ్యాంకు వ్యవహారంలో, ముద్దాయిగా ఉన్న కేందమంత్రి సుజనాచౌదరి ఉన్నట్లు మర్చిపోయి ఆ వ్యాఖ్యలు చేసినట్లు కనిపించింది. రేవంత్‌రెడ్డి, సండ్రవెంకటవీరయ్య ఓటుకునోటు కేసులో ముద్దాయిలుగా ఉండి జైళ్లకు వెళ్లొచ్చిన వారే. వారు న్యాయప్రక్రియ ప్రకారం నెలకోసారో, వారానికోసారో కోర్టుకు హాజరకావలసిందే. అందుకు ఎవరూ అతీతులు కాదు. అలాగే జగన్, విజయసాయిరెడ్డి కూడా జైలుకు వెళ్లి కోర్టుకు హాజరవుతున్నారు. మరి వారిని ప్రతివారం కోర్టుకు వెళ్లేవారు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని బాబు స్థాయి నాయకుడు మాట్లాడితే, ఆ సూత్రం తెలంగాణలో రేవంత్, సండ్ర, ఏపిలో సుజనా చౌదరికీ వర్తిస్తుందని గ్రహించాలి కదా?
తెలంగాణలో ఎబిఎన్‌పై కేసీఆర్ సర్కారు అనధికారికంగా నిషేధం విధిస్తే విమర్శించిన టిడిపి, ఏపిలో ఎన్‌టివి విష యంలో తానూ అదే సూత్రం అనుసరించింది. నిజానికి బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయనలో మార్పు వస్తుందని భావించారు. కానీ, ఆయన వ్యవహారశైలి ఏమాత్రం మారలేదని బాబు చేస్తున్న వ్యాఖ్యలే చెబుతున్నాయి. ఈ రెండేళ్లలో పరిపాలన కంటే ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయడానికే ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. కావలసినంత మెజారిటీ ఉంది. అయినా ఎందుకు వెంపర్లాడుతున్నారో తెలియదు. దీన్నిబట్టి, బాబు ప్రతిపక్షాన్ని చూసి భయపడుతున్నారన్న వ్యాఖ్యలు నిజమవుతున్నాయి.
రెండేళ్లలో ఏపి పరిస్థితి దారుణంగానే ఉంది. దానికి కారణం బాబు కాదు. విభజన ఫలిత గాయాలను, బాబు లాంటి అనుభవజ్ఞుడైన రాజకీయ వైద్యుడు మాన్పుతారన్న భరోసాతోనే జనం ఆయనను గెలిపించారు. బాబు ఆ పని చూడకుండా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లోబరచుకుంటున్నారు. ఇది ఎవరికీ నచ్చడం లేదు. రెండేళ్ల క్రితం అద్భుత అమరావతిని ఆవిష్కరించినందున, జనం ఇంకా ఆ భ్రమల్లోనే ఉన్నారు. ఈ రెండేళ్లలో అక్కడ కనీసం ఇటుక కూడా పేర్చలేదు. ఆ అవకాశం, సదుపాయం కూడా లేదు. ఆ విషయానే్న నిజాయితీగా ప్రజలకు చెప్పి, ఉన్న వెలగపూడినే వెలిగించి, వాస్తవాలు చెబితే ప్రజలు ఆయన నిజాయితీని మెచ్చుకుంటారు. అలాకాకుండా, ఇంకా అమరావతి చుట్టూ అందమైన కల్పనలు అల్లితే జనం నమ్మే పరిస్థితిలో లేరు. రెండేళ్లయిపోయాయి. ఇంకా మిగిలింది మూడేళ్లు. చివరి ఏడాది ఎలాగూ ఎన్నికల హడావిడి ఉంటుంది. కాబట్టి బాబు ఇక జనాలకు, తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాల్సి ఉంది. మామూలుగా అయితే హానీమూన్ ముగిసింది అంటుంటారు. పాపం చంద్రబాబుకు రెండేళ్ల నుంచీ సమస్యలే కాబట్టి, ఆ పదం ఆయన విషయంలో సరిపోదేమో? ఈ రెండేళ్లలో ఆయన ఎవరిలోనూ విశ్వసనీయత పెంచుకోలేకపోయారు. తన కోసం పనిచేసిన వారిని కాకుండా, కృత్రిమ ప్రేమతో వచ్చిన వారిని, సొంత సామాజికవర్గానికి పెద్దపీట వేసే పనిలో ఉన్నారు. ఇటీవల ఒక డిజి స్థాయి అధికారిని లూప్‌లైన్‌లో పంపిస్తున్నారని తెలిసి, సదరు అధికారి తనపై అధికారిని కలిశారట. తనకు లూప్‌లైన్ పోస్టింగ్ ఇచ్చినట్టయితే, డీఎస్పీ పోస్టింగులలో ఒకే సామాజికవర్గానికి చెందిన వారిని ఎంతమందికి పోస్టింగులిచ్చారో బయటపెడతానని హెచ్చరించారట. దానితో ఆయనకు ప్రాధాన్యం ఉన్న పోస్టింగు దక్కింది. బాబు తొమ్మిదేళ్ల కాలంలో కూడా లేనంత కుల వాసన ఈ రెండేళ్లలో ముక్కుపుటాలదిరిస్తోందన్న భావన అందరిలోనూ ఉంది. దీన్ని బాబు గ్రహించాల్సి ఉంది.
అయితే కేంద్రంతో అంతంతమాత్రపు సంబంధాలు, బలమైన ప్రతిపక్షం, సొంత పార్టీలో అసంతృప్తి ఉన్నప్పటికీ బాబులో ఆత్మస్థైర్యం ఎక్కడా చెక్కుచెదరడం లేదు. సంక్షోభాన్ని కూడా అవకాశంగా తీసుకుంటానని తరచూ బాబు చెబుతుంటారు. అది ఇదేనేమో?! ఏపిని తిరిగి అగ్రస్థానానికి తీసుకువెళ్లి, రాష్ట్రాన్ని పెట్టుబడుల స్వర్గ్ధామంలా మార్చాలన్న బాబు కృషి ఫలిస్తే మంచిదే. ఆ సామర్థ్యం బాబుకు ఉంది. మరో మూడేళ్లలో అమరావతి, ప్రత్యేక హోదా, రైల్వే జోన్, నిధుల సాధన వంటి కీలక అంశాలపైనే బాబు మూడవ ఏడాది భవితవ్యం ఆధారపడి ఉంటుంది. కొత్త రాష్ట్రం ఆయన హయాంలో పరుగులు తీయాలని ఆశించడంలో తప్పులేదు.
ఇక తెలంగాణ ఏలిక కేసీఆర్ పెద్దగా కష్టపడకుండా ఆడుతూ పాడుతూ పరిపాలిస్తున్నారు. కావలసిన వర్గాలకు కావలసిన వరాలిచ్చి, కొడుకు కేటీఆర్‌ను ఉత్తరాధికారి పీఠానికి చేరువ చేసే పనిలో ఉన్నారు. కేసీఆర్ అదృష్టం కొద్దీ ప్రతిపక్షాలు ఇప్పట్లో లేచి నిలబడే పరిస్థితి లేదు. రాజకీయ రణక్షేత్రంలో అంతా క్షతగాత్రులై తలోదిక్కు తలదాచుకుంటున్నారు. ధరావతు కూడా దక్కని చోట్ల టీఆర్‌ఎస్ మీసం మెలేసే స్థాయికి చేరడం ఒక్క అదృష్టమే కాదు, కార్యదక్షత కూడా ప్రధాన కారణం.
ఇతరులను నమ్మడం, వారిని నమ్మకమైన సహచరుల్లా పరిగణించడం, వారిలో ఆత్మవిశ్వాసం నింపటం నిజమైన నాయకుడి లక్షణం. కేసీఆర్-బాబు మధ్య సారూప్యమదే! ఒకప్పుడు రెండు సీట్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పుడు మేయర్ పీఠమే చేజిక్కించుకోవడానికి కారణం కూడా ఆ విశ్వసనీయతే. కేసీఆర్ కూడా బాబు కంటే ముందుగానే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. అది నైతికమేమీ కాదు. కానీ జనం దాన్ని ఆమోదిస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. ఉద్యమ సమయంలో తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియాను అధికారంలోకి వచ్చిన తర్వాత వేధించడం మాని, వారిని మచ్చికచేసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లనూ కారెక్కించేశారు. ఇదీ నమ్మకమంటే! కానీ, ఏపిలో ఒక ప్రముఖ జర్నలిస్టును ఉద్యోగం నుంచి తొలగించేంతవరకూ యువరాజులు నిద్రపోలేదు.
కేసీఆర్ డబుల్‌బెడ్‌రూము, మూడు ఎకరాల భూమి, ఉద్యోగాల హామీ నెరవేరినంత వరకూ ఆయన సర్కారుకు వచ్చిన ఢోకా లేదు. ప్రతిపక్షాల బలహీనత, సరైన నేత లేకపోవడం కూడా ఆయనకు వరమే. డబుల్‌బెడ్‌రూముల దరఖాస్తులు లక్షల్లో పేరుకుపోయాయి. మూడెకరాల భూమి అందుబాటులో లేవని అధికారులు చెబుతున్నారు. మరి భూములెక్కడ నుంచి తెస్తారో చూడాలి. విపక్షాలెంత అచేతనంగా ఉన్నప్పటికీ తెలంగాణ సమాజం నిత్య చైతన్యంగానే ఉంటుంది. ఎన్టీఆర్ వంటి జనాకర్షక నేత ఎన్ని పథకాలు చేపట్టినా ఓటమి తప్పలేదు. బిజెపి కేవలం రెండు సీట్ల నుంచే అధికారంలోకి వచ్చింది. ఈ విషయం బాగా తెలిసిన కేసీఆర్, అందుకు అనుగుణంగా పనిచేస్తే, ఆయన కత్తికి ఎదురుండదు.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144