డైలీ సీరియల్

పాండురంగ విభుని పద్య మహిమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గంగా సంగమ మిచ్చగించునె? మదిన్ కావేరి దేవేరిగా/ అంగీకారమొనర్చునే? యమునతో ఆనందముం పొందునే?/ రంగత్తుంగ తరంగ హస్తముల ఆ రత్నాకరేంద్రుండు నీ/ అంగంబంటి సుఖించునేని గుణభద్రా, తుంగభద్రా నదీ!’ - తుంగ, భద్ర అనే నదులు రెండూ వేర్వేరు చోట్ల పుట్టి, పడమటి కనుమల్లోని ‘కూడలి’ దగ్గిర పరస్పరం పెనవేసుకుంటాయి. అవి రెండూ కలిసి, ఒకే నదిగా అయిదు వందల కిలోమీటర్లు ప్రవహించి, ఆ తర్వాత కృష్ణానదిలో లీనమవుతాయి. కృష్ణవేణి హంసలదీవి దగ్గిర బంగాళాఖాతంలో కలుస్తుంది. అంతే తప్ప, తుంగభద్ర ఎక్కడా నేరుగా సముద్రంలో కలవదు. అలా కలవడమే జరిగితే - తెనాలి రామకృష్ణుడి మాటల్లో ‘తుంగభద్ర శరీరాన్ని సముద్రుడు స్పృశించి, సుఖించడమే జరిగి వుంటే’ - రత్నాకరేంద్రుడయిన ఆ సముద్రుడు గంగా సంగమాన్ని ఇష్టపడి వుండేవాడా? కావేరిని దేవేరిగా అంగీకరించి వుండేవాడా? యమునతో ఆనందం పొంది వుండేవాడా? అని అడుగుతున్నాడు కవి. జరిగిన విషయానికి (లేని) కారణాన్ని ఆపాదించడం ద్వారా, చమత్కారం సాధించడం సరళమయిన పద్ధతి. జరగని విషయం జరిగి వుంటే ఏమయ్యేదో ఊహించి, చమత్కారాన్ని సాధించడం చతురమయిన పద్ధతి. తెనాలి రామకృష్ణుడు సాధారణంగా ఈ పద్ధతినే పాటిస్తూ వచ్చాడు.
తెనాలిలోని రామలింగేశ్వరాలయంలో అర్చకుడిగా ఉండిన గార్లపాటి రామయ్య కొడుకే ‘పాండురంగ విభుడి’గా ప్రసిద్ధుడయిన తెనాలి రామకృష్ణుడు. ఇతగాడు పదిహేనో శతాబ్దం చివర్లో రాణించిన కవిగా పరిశోధకులు భావిస్తున్నారు. కాల్పనిక చారిత్రికులు కొందరు తెనాలి రామకృష్ణుడికి ముందు వికటకవిగా ముద్రగొట్టి, తర్వాత ‘అష్ట దిగ్గజా’ల్లో చేర్చి, ఆయన్ని శ్రీకృష్ణ దేవరాయలకి సమకాలీనుడిగా మార్చేంతవరకూ శాంతించలేదు. అతగాడు బాలకవిగా రాయల ఆదరణకి పాత్రుడయ్యాడని - ఆరుద్ర లాంటి కాల్పనిక రచయితలు - కూడా రాశారు. అయితే, అందుకు బలమయిన రుజువులు చూపించలేదు - అది వేరే సంగతి! కాగా, ఆ దశలోనే ఈ కవి ‘ఉద్భటారాధ్య చరిత్రం’ రాశాడంటారు. ఇదే కవి ‘కందర్ప కేతు విలాసం’ ‘హరి లీలా విలాసం’ అనే కావ్యాలను - బహుశా తర్వాతి దశలో - కూడా రాశాడని చెప్పడానికి ఆధారాలున్నాయి. చిత్తూరు సమీపంలో, తమిళనాడు రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న షోలింగారం (షోలింగూరు)లోని నృసింహ క్షేత్రం గురించి ‘ఘటికాచల మాహాత్మ్యం’ రాసేనాటికే ఈ కవి - మతం మార్చుకుని - తెనాలి రామకృష్ణుడు అయ్యాడని చెప్తారు. ఇతని వంశంలో చాలామంది కవులేవున్నారు. తమ్ముళ్లు శ్రీగిరి, అన్నప్ప - తమ్ముడి అల్లుడు, మనవలు, తన అల్లుడు లింగమగుంట రామయ్య, ఈ రామయ్య తమ్ముడు - సులక్షణసారం గ్రంథకర్త - లింగమగుంట తిమ్మకవి తదితరులు తెనాలి రామకృష్ణుడి బంధువులే.
రామకృష్ణుడు రాసిన రచనలన్నింట్లోకీ విఖ్యాతమయిన ‘పాండురంగ మాహాత్మ్యం’ తెలుగులో పంచ మహాకావ్యాల్లో ఒకటిగా ప్రసిద్ధం. ఇది, పదిహేనో శతాబ్ది చివర్లో రాసి వుంటాడని అంటారు. అందులో ‘ఆముక్తమాల్యద’ ‘వసుచరిత్ర’ల ప్రస్తావన వుందని పరిశోధకులు వెల్లడించారు. భట్టుమూర్తికన్నా ముందే రామకృష్ణుడు కవిత్వం రాయడం మొదలుపెట్టి వుండొచ్చు కానీ, పాండురంగ మాహాత్మ్యం మాత్రం వసుచరిత్రకన్నా అర్వాచీనమనే పరిశోధకుల అంచనా. రామకృష్ణుడు ఈ కావ్యాన్ని - ఒక అర్థంలో - కథాకావ్యంగానే చెప్పాడు. సాక్షాత్తూ శివుడి చేతనే నారదుడికి ఓ కథ (అయుత - నియుతుల కథ) చెప్పించాడు రామకృష్ణయ్య. ‘పాండురంగ మాహాత్మ్యం’లో అతను సృష్టించిన అనామక పాత్ర ‘నిగమ శర్మ అక్క’ పాత్రల కల్పన - పోషణల్లో రామకృష్ణుడి ప్రతిభకు ఆమె అద్దంపడుతోంది. ఆమెని మించినవాడు నిగమశర్మ. సద్బుద్ధులు చెప్పిన అక్కగారి నగలే ఎత్తుకుపోయిన ఈ ఘనుడు నృసింహ క్షేత్రంలో కుక్కచావు చచ్చినట్లు రాయడానికి రామకృష్ణుడు వెనుకాడలేదు. తెలుగు నాట మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబ జీవనంలో నిన్నమొన్నటి వరకూ కనిపించిన అనేక సంప్రదాయాలూ, ఆనవాయతీలూ, ఆచారాలను రామకృష్ణుడు కథలో పొదిగాడు. నిగమ శర్మ అక్క గురించి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాసిన వ్యాసం సుప్రసిద్ధం.
తెనాలి రామకృష్ణుడి ‘పాండురంగ మాహాత్మ్యం’ భారతీయ ధార్మిక చరిత్రలో వచ్చిన ఓ ముఖ్యమయిన పరిణామాన్ని నమోదు చేసింది. అదే, దేశమంతటా తలెత్తిన భక్తి ఉద్యమం. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రచురమయిన విటోబా ఆరాధన కులాలూ, మతచట్రాల్లో సంస్కరణలకు దారితీసింది. దక్షిణాది ప్రాంతంలో శ్రీవైష్ణవం, వీరశైవం మొదలుపెట్టిన ధార్మిక సంస్కరణ క్రమాన్ని ఈ భక్తి ఉద్యమం దాని సహజ గమ్యానికి చేర్చింది. పాండురంగడు, విఠ్ఠలనాథుడు, అనే పేర్లతో పిల్చుకునే దేవుడు విష్ణువు అవతారంగానే భక్తుల్లో అత్యధికులు భావిస్తారు. కృష్ణ శబ్దం కిట్టమ్మ, కిట్టప్ప అయినట్లుగానే, విష్ణు శబ్దానికి మరాఠీ అపభ్రంశమే విట్ఠు అయిందంటారు. జ్ఞానేశ్వర్, నామ్‌దేవ్, ఏకనాథుడు, తుకారామ్, జగ్‌నాడె వగయిరా ‘సంత్’లు వ్యాప్తి చేసిన వర్కారీ సంప్రదాయమే విఠోబా ఆరాధనకి మూలమంటారు కొందరు. ఈ సంప్రదాయం పదమూడో శతాబ్దం నాటిదంటారు. మరి కొందరయితే దేశంలో ఉద్యమ రూపంలో ఉవ్వెత్తున తలెత్తిన భక్తి ఉద్యమంలో భాగంగానే విఠోబా ఆరాధన లాంటివి ప్రాచుర్యానికి నోచుకున్నాయంటారు. జైన, బౌద్ధ ధర్మాలు నామమాత్రావశిష్టమయిన దశలో కుల, మత వివక్ష ప్రబలింది. భక్తి ఉద్యమం ఈ వివక్షను కొంతవరకూ నియంత్రించింది. అయితే, క్రీ.శ.ఎనిమిదో శతాబ్దంలోనే ఆది శంకరాచార్య విఠోబా అష్టకం చెప్పివున్నందువల్ల, ఈ ఆరాధన అంతకు పూర్వం నుంచీ ఉందనేది మరో వాదన. తెనాలి రామకృష్ణుడు ‘పాండురంగ మాహాత్మ్యం’ రాసేనాటికి మాత్రం విఠోబా విష్ణువు - కృష్ణుడు అవతారంగా స్థిరపడి వున్నాడు.
పూర్వాశ్రమంలో - శైవుడిగా ఉన్న రోజుల్లో - ఈ కవిగారి పేరు రామలింగడంటారు. ఆ పేరు మీదే, వందలాది కథలు పుట్టించి ప్రచారం చేశారు తెలుగు జానపదులు. తెలుగు వాడి హాస్యస్ఫూర్తికి శాశ్వత చిరునామాగా తెనాలి రామలింగణ్ణి మార్చిపారేశారు ఈ జానపద బ్రహ్మలు. సంస్కృతంలో చమత్కార శ్లోక కథలు, ఆయా కవులు నిజంగా రాసిన శ్లోకాలకన్నా రసవంతంగా ఉండడం కద్దు. తెలుగులో ఈ ప్రక్రియా స్థాయికి ఎదగలేదనే చెప్పాలి. అయితే రామలింగడి కథలు ఉన్నవాటిల్లో గొప్పగా ఉంటాయి. ‘అమవస నిశి’ అని విడ్డూరమయిన ప్రయోగాన్ని చేసిన పెద్దనను పట్టుకుని రామలింగడు ‘ఎమితిని సెపితివి కపితము.. అలసనిపెదన’ అన్నాడంటారు. ‘కుంజర యూధమ్ము దోమ కుత్తుకు చొచ్చెన్!’ అనే సమస్య గురించీ, మొల్లను అడిగినట్లు చెప్పే వెకిలి - బూతు ప్రశ్నల గురించీ చెప్పే కథలు తెనాలి రామకృష్ణుడి సంస్కారానికి కాక, వాటిని కల్పించిన వారి సంస్కారానికే ప్రాతినిధ్యం వహిస్తాయి.