ప్రసాదం

ఏది అవసరమో అది లభ్యమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురువు జ్ఞానమిస్తాడు.సుజ్ఞాన మందిస్తాడు. ఆలోచనని ఇస్తాడు. ఓ విధానాన్ని, ఓ పథాన్ని ఇస్తాడు. జీవనాన్ని ఇస్తాడు. జీవన విధానాన్ని తెలియజేస్తాడు. ఓ టార్చ్‌లైట్‌లా చూపుతాడు. ఓ తల్లిలా మనకేం కావాలో అవి సమకూరుస్తాడు. ఓ తండిలా మన చేయిపట్టి నడిపిస్తాడు. నడక నేర్పుతాడు. మొత్తంగా జీవన తత్తాన్ని, జీవితతత్త్వాన్ని నేర్పిస్తాడు.
అయితే ఆ నేర్పడం-ప్రత్యక్షంగా ఉండొచ్చు. పరోక్షంగా ఉండొచ్చు. అన్యాపదేశంగా ఉండొచ్చు. అనుభవైక వేద్యంగా ఉండొచ్చు. ఆ బోధని ప్రబోధని మనం అందుకోవాలి. అందుకోగలగాలి. అది సాధకుడి కర్తవ్యం! బాధ్యత!!
ఓ ఆధ్యాత్మిక నిలయం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాల్లో ఓ కుర్రాడు పదేళ్ళు చదివేడు. ఎంబిఏ పూర్తి చేసేడు. పరీక్ష ఫలితాల్లోనే కాకుండా నిలయంలోఅందే అందించే మానవ విలువలు, మానవత ఇత్యాది విషయాన్ని ఒంట పట్టించుకున్నాడు. జీవిత పాఠాలు నేర్చుకున్నాడు. జీవన విలువల్ని ఒంట పట్టించుకున్నాడు. ‘శిష్య’ పరమాణువు ‘విశ్వ’ పరమాణువుగా పరివర్తన చెందే మార్గంలో అడుగులేస్తున్నాడు.
ఆ కుర్రోడో ఉద్యోగం కోసం బహుళ జాతి సంస్థలో ఓ పెద్ద ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లేడు. ఇంటర్వ్యూ చేసే బోర్డు ఈ కుర్రాడి బయోడేటాని చూసింది. ఇంటర్వ్యూ మొదలైంది. కుశలు ప్రశ్నలు మొదలయ్యేయి. ఎంతో మెలకువగా సమాధానాలు, సామరస్యంగా ఇస్తున్నాడీ కుర్రాడు. మంచి సుహృద్భావ వాతావరణం నెలకొంది. అక్కడ ఇంటర్వ్యూ కొనసాగుతోంది. ఇంతలో - బోర్డులో ఉన్నాయన ఒక్క ప్రశ్నతో వాతావరణాన్ని మార్చే ప్రయత్నం చేసేడు.
‘‘మీ గురువు ఆశ్రమానికి వచ్చే వాళ్లకి ఉంగరాలు, బొంగరాలు సృష్టించి ఇస్తారట. నిజమా?’’ అని అడిగేడు. ఆ ప్రశ్నలో ఎక్కడో వ్యంగ్యం, ఎకసెక్కం కనిపించింది. ‘నిజమే’ ఎంతో ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చేడు కుర్రాడు. ‘‘నువ్వు చూసేవా?’’ బాణంలా దూసుకొచ్చింది మరో ప్రశ్న. ‘‘ఖచ్చితంగా చూసేను’’ ఆత్మ విశ్వాసం, గురువు మీది విశ్వాసం ద్విగుణీకృతమయ్యింది కుర్రాడి సమాధానంలో. ‘‘అవి ఎక్కడ్నుంచి వస్తాయి. ఎక్కడ్నుంచి తెప్పిస్తారు మీ గురువు’’, ఇన్విస్టిగేషన్ పంథాలో మరో ప్రశ్న సంధించేడా బోర్డు మెంబర్. మెల్లగా వాతావరణం మొత్తం గంభీరంగా మారిపోతోంది. చెక్కు చెదరని వ్యక్తిత్వ దీక్షతో, ఏ మాత్రం చలించకుండా, చెదిరిపోకుండా ‘‘ఆయన దివ్యదృష్టి అనే స్టోర్ లోంచి వస్తాయి అవి’’ మెల్లగా స్థితప్రజ్ఞునిలా సమాధానమిచ్చేడా కుర్రాడు. ప్రశ్న అడుగుతున్న బోర్డ్ మెంబర్‌లో కొంచెం మానవసిద్ధమైన పట్టుదల, పంతం పెరిగింది. కుర్రాడ్ని ఎలాగైనా ‘పల్టీ’ కొట్టించాలనే తాపత్రయం కనపడుతోంది. వెంటనే మరో ప్రశ్న వదిలేడు బోర్డు మెంబర్ ‘‘నీకు తెలిసి ఎవరెవరికి ఆయన ఏమేమి ఇచ్చాడు అని లోతుగా గుచ్చిగుచ్చి అడిగేడు’’. స్థిరంగా తన గురువు ఎప్పుడు ఎవరెవరికి ఏమేమి సృష్టించి ఇచ్చారో తేదీలతో సహా పెద్ద లిస్ట్ చెప్పేడు ఆ కుర్రాడు. ఆ సమాధానంలో తన గురువు మీద విశ్వాసం ప్రతి పదంలోను తొణికిసలాడింది. ‘‘ఆహా! అలాగా!! నువ్వు ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా మహామహా ఒప్పవాళ్లు, పెద్దపెద్ద దేశాధినేతలు, పెద్ద పదవుల్లోను స్థానాల్లోను ఉన్న వారనుకుంటాను’’ అని ఎదురు ప్రశ్న వేసేడు బోర్డు మెంబరు. బోర్డుమెంబర్ ఎందుకు అలా ఇంటర్వ్యూని కొనసాగిస్తున్నారో పసిగట్టేడు. ఉక్రోషం తన్ను కొస్తోంది. తను చేసిన సాధనా ఫలితంగా ఏ మాత్రం సహనం కోల్పోకుండా ‘‘అవును’’ ఎంతో మృదువుగా సమాధానమిచ్చేడా కుర్రాడు.పరిస్థితి యుద్ధానికి ముందు ప్రశాంతంలా ఉంది. మేనేజ్‌మెంట్‌లో ‘‘క్రైసిస్ మేనేజ్‌మెంట్’’ కూడా భాగమే కాబట్టి ఆ బోర్డ్ మెంబర్ కూడా వదల్లేదు. ‘‘అంటే- మీ గురువు పెద్దపెద్ద వాళ్లకి, బడా బాబుల్నే పట్టించుకుంటాడు. హారాలు, వజ్రాలు ఇస్తాడు. ఏమ్ కరెక్ట్?’’ డైరక్టుగా సంధించేడు అసలైన సిసలైన ప్రశ్నా బాణాన్ని’’. బోర్డు మెంబర్. ‘‘నాకు తెలిసి ఇవి. తెలీని ఎన్నో ఉన్నాయి.’’ పంతానికి పోకూడదనే ఉద్దేశంతో కుర్రాడి జవాబు. అప్పుడు బోర్డు మెంబర్ డైరక్ట్‌గా, సూటిగా అంతవరకు ఉన్న పరిస్థితిని ఒక్క పెట్టున మార్చే ప్రయత్నం చేస్తూ ‘‘ఆహా నీకెప్పుడైనా నీ గురువు ఓ హారాన్ని గానీ ఉంగరాన్ని గానీ బొంగరాన్ని గాని సృష్టించి ఇచ్చేరా?’’ కుర్రాడ్ని ఎక్కడ పడగొట్టాలో అక్కడ కొట్టేలా బుల్లెట్‌లా దూసుకొచ్చింది బోర్డ్ మెంబర్ ప్రశ్న. ‘‘లేదు’’ తొణక్కుండా బెణకకుండా, స్థిరంగా, ధైర్యంగా కుర్రాడి సమాధానం. ‘‘చూసేవా? పదేళ్లు అక్కడ చదివేవు ఆయన్ని అనుసరించేవు, ఆచరించేవు. ఆయనే కనిపించే దేవుడని మనసా, వాచా, కర్మణా నమ్ముకున్నావ్ కానీ నీకు ఏదీ ఇవ్వలేదు. ఒఠ్ణి బూడిద తప్ప. కానీ పెద్దపెద్ద వాళ్లందరికీ మంచి విలువైనవి ఇచ్చేరు. ఇస్తుంటారు. ఇస్తూనే ఉంటారు.’’ హాస్యం, వ్యంగ్యం, ఎత్తిపోత ధోరణి, ఎదురుదాడితో కూడిన విధంగా మెంబర్ ప్రశ్న. ఒక్కసారిగా వాతావరణం మారింది. సరైన సమాధానానికి ఇది సరైన అనిపించి ‘‘నాకు అంతకన్నా విలువైనవి ఇచ్చేరు నా స్వామి’’ బిగ్గరగా స్థిరంగా జవాబిచ్చేడా కుర్రాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం రాజ్యమేలింది ఆ రూమ్‌లో. ‘‘అవున్సార్ ఉంగరాల, బొంగరాలు ఆఫ్ట్రాల్. అంతకన్న విలువైనది నాకిచ్చేడు నా స్వామి. ఎక్కడో ఓ మారుమూల కుగ్రామంలో తల్లీదండ్రీలేని ఓ అనాధని తీసుకొచ్చి, ప్రపంచాన్ని శాసిస్తున్న ఓ బహుళ కంపెనీ నిర్వహిస్తున్న మహామహుల ముందు ఓ వ్యక్తిగా కూచునే స్థాయిని, కూచునే స్థానాన్ని నాకు నా స్వామి ఇచ్చేడు. అంతకన్నా ఏమివ్వాలి సార్!’’ ఎప్పుడు, ఎక్కడ ఏ విధంగా సమాధానం ఇవ్వాలో తెలిసి, మంచి స్థితప్రజ్ఞత, అచంచల విశ్వాసం మిళితమైన స్వరంతో కుర్రాడి సమాధానం. అంతలో ఊరుకోలేదు కుర్రాడు. ఇంకా నాకు నా గురువు నాకు ఏమిస్తున్నాడో తెల్సా సార్! మీతో మీ ఎదురుగా ఇంటర్వ్యూ కోసం కూచునే స్థాయినే కాదు. ఈ ఇంటర్వ్యూ తర్వాత మీ అందరి సహ ఉద్యోగిగా, ఈ బహుళ జాతి కంపెనీ సారథ్య బాధ్యతల్ని పంచుకునే స్థానాన్ని, మహోన్నత స్థాయిని, అద్భుతాల్లో అద్భుతాన్ని నాకు అందిస్తున్నాడు నా స్వామి’’ సూటిగా, ధీటుగా, ధాటిగా, స్పష్టంగా, విస్పష్టంగా చెప్పదలచినంతా చెప్పి నిర్మలంగా కూచున్నాడు కుర్రాడు. ఏమనాలో, ఏం ప్రశ్నించాలో తెలీలేదు బోర్డ్ మెంబర్‌కి. ఒక్కసారి మార్మోగిపోయింది ఆ హాలంతా బోర్డ్ మెంబర్ల చప్పట్లతో.
***

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669