ప్రసాదం

విశ్వాన్ని గెలిపించేది విశ్వాసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వాసమనేది అతి విశిష్టమైంది. బలోపేతమైంది. బలవత్తరమైంది. విశ్వాసమున్నచోట అన్నీ ఉంటాయి. విశ్వాసమే అన్నిటికి పునాది అవుతుంది. విశ్వాసమున్నవాడు విలక్షణుడవుతాడు. విశిష్ఠుడవుతాడు. వశిష్ఠుడవుతాడు. విశ్వాసం శ్వాసను నింపుతుంది. శ్వాసను పెంచుతుంది. విశ్వాసం మనిషిని కదిలిస్తుంది. మనిషిని కదలిస్తుంది. మనిషిని మనీషిని చేస్తుంది. మహితాత్ముడ్ని చేస్తుంది. విశ్వాసం విశ్వాన్ని నడిపిస్తుంది. విశ్వానికి నడకలు నేర్పుతుంది. విశ్వాన్ని పాదాక్రాంతం చేస్తుంది. మొత్తంగా విశ్వాసం విశ్వాన్ని గెలిపిస్తుంది. విశ్వమంతటిని గెలుస్తుంది.
విశ్వాసమనేది ఎలా ఉండాలి? అచంచలంగా ఉండాలి. అచంచల విశ్వాసమంటే? కొంచెం విచారణ చేద్దాం.సముద్రంలో అలలు ఎగిసెగసిపడుతుంటాయి. దగ్గరలో వున్న పెద్ద రాయికి ఆ కెరటాలు చెళ్ళున తగుల్తుంటాయి. నిరంతరంగా కెరటాలు రాయిని తాకుతుంటాయి. రాపిడి పుట్టిస్తుంటాయి. అయినా ఆ రాయి మాత్రం ఏమీ పట్టించుకోదు. ఏ మాత్రం సడలిపోదు. అలా నిటారుగా నిలబడుతుంది. నిశ్చలంగా, నిర్మలంగా తొణకక బెణకక అలా నిలబడే ఉంటుంది. అదీ అచంచలమైన విశ్వాసమంటే!
పూర్వం ఓ ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళిద్దరిలో ఒకరు పరమ ఆస్తికుడు, మరొకుడు కరడుగట్టిన నాస్తికుడు. ఈ ఆస్తికుడు సర్వదా దైవ ధ్యానంలో ఉంటాడు. నామజపం చేస్తుంటాడు. భజనలు కీర్తనల్లో మునిగితేలుతుంటాడు. మొత్తానికి సమస్తమూ అతనికి భగవంతుడు, భగవత్ తత్వమే. అన్నింటిలోను అంతటా అతనికి దైవమయంలా కనిపిస్తుంటుంది.
ఇక రెండోవాడు- దైవ వ్యతిరేకి. భగవంతుని ఎడల నమ్మకం ఆ దేవుడెరుగు, కనీసం గౌరవం కూడా లేదు. భగవంతుడంటే గిట్టదు. భగవంతుని విషయాలంటే అంతెత్తున లేస్తాడు. మిత్రుడు చెప్పే దేవుడి లీలలు మహిమలు, ఆతని విశిష్ఠత, దేవుని గుణగణాల్ని అంగీకరించడు. పైగా దేవుడ్ని చులకన చేస్తాడు. అర్థం పర్థం లేని వాదాలు, వివాదాలతో తర్కానికి నిలబడని తార్కికతతో దేవుడ్ని గుడ్డిగా వ్యతిరేకిస్తుంటాడు. భగవంతుడి ఎడల నాస్తికుడి ప్రవర్తనని ఆస్తికుడు ఒప్పుకునేవాడు కాదు. నాస్తికుడు చేసే భగవద్విమర్శల్ని ఆస్తికుడు తీవ్రంగా ఖండించేవాడు. దేవుడు విషయంలో ఇద్దరిమధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేది.
ఇలా కాలం గడుస్తోంది. కొన్నాళ్ల తర్వాత మిత్రులిద్దరూ ఓ చోటుకి కాలినడకన వెళ్తున్నారు. రోడ్డు సరిగా లేదు. గుంతలతో, ఎత్తుపల్లాలతో ఎగువ దిగువగా ఉంది రోడ్డు. రోడ్డుకేసిన కంకర కూడా బైటకొచ్చి నోరెళ్ళబెడుతోంది. దారిలో ఓ చోట ఆస్తికుడి కాలికి ఓ రాయి తగిలి పెద్ద గాయం అయింది. కాలికి కట్టు కట్టుకున్న తర్వాత మిత్రులిద్దరూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కొంత దూరం వెళ్ళేక నాస్తికుడికి చిన్నపాటి బంగారు ఉంగరం దొరికింది. ఆ ఉంగరాన్ని తీసుకున్నాడు నాస్తిక మిత్రుడు. అతడికి మంచి అవకాశం దొరికింది. దొరికిన అవకాశాన్ని ఆస్తిక మిత్రునిమీద ఉపయోగించేడు నాస్తికుడు. మిత్రమా! నువ్వేమో ప్రతిక్షణం, అనుక్షణం దేవుడు, దేవుడు అని కొట్టుమిట్టాడుతుంటావు. దేవుడు సర్వస్వం అ భావిస్తుంటావు. అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడని అనుకుంటుంటావు. అమాయకుడా! అలాంటి నీకు ఏం జరిగింది? కాలికి దెబ్బ తగిలి కాలు గాయమైంది. దైవాన్ని నమ్ముకోవడం వల్ల, దైవం మీద నమ్మకం వలన ఏం లాభం వచ్చింది? అంటూ ఆస్తిక మిత్రున్ని ఎగతాళిచేసేడు. నాస్తికుడు పరిహసించేడు. అంతటితో నాస్తికుడు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. దేవుడ్ని విశ్వసించడంవల్ల నీకు ఎదురు దెబ్బ. నాకేమో చూడు! దేవుడు అనే వాడు లేడు. దైవత్వం అనేది ఓ భ్రమ. దేవుడు లేదు, దెయ్యం లేదు అని ఘంటాపథంగా చెప్పే నాకు ఓ బంగారు ఉంగరం దొరికింది. ఎవరికి మేలు అయ్యింది? ఎవరికి మంచి అయ్యింది? కచ్చితంగా నాకే అంటే భగవంతుడు లేడని ఆ భగవంతుని ఉనికినే ప్రశ్నిస్తున్న నాకే మంచి అయ్యింది. దీన్నుండైనా దేవుడు లేడు అనే నాస్తికవాదమే ఉన్నతమైందనే సత్యన్ని నువ్వు గ్రహించు. తర్క ధోరణిలో సాగే విమర్శ వాదాన్ని ఉపయోగించాడు నాస్తికుడు. నాస్తికుడి మాటలు విన్న ఆస్తికుడికి ఏం పాలు పోలేదు. ఏం అనాలో తెలీలేదు. ఏం చేయాలో తోచలేదు. విచారం పట్టుకుంది. సమాధానం లేక లోలోపల బాధపడుతూ మిన్నకుండిపోయేడు. కొంత సమయం గడిచింది. రాత్రయ్యింది. భోజనాలు కానిచ్చేక ఓ చోట మిత్రులిద్దరూ బస చేసేరు. నిద్రకి ఉపక్రమించేరు. ఆ నిద్రలో ఆస్తికుడికి ఓ కలొచ్చింది. కలలో తను నమ్మే ఆ దేవుడు సాక్షాత్తు కనిపించేడు. ఆస్తికుడికి దేవుడు ఇలా చెప్పేడు. ‘‘రోడ్డుమీద పడున్న ఆ రాయివల్లనీకు గాయమైందని నువ్వు అనవసరంగా విచారించకు. నిజం ఏంటో చెప్పమన్నావా? ఓ కాల సర్పం కాటులో నువ్వు ఈనాడు మరణించవలసి ఉంది. నీకు నామీద వున్న అచంచలమైన భక్తి విశ్వాసాల కారణంగా కాలసర్పం కాటు నీకు తప్పింది. కాలసర్పం కాటుకు బదులుగా రాయి తగిలి కాలికి గాయమైంది. అందుకు సంతోషించు’’. జరిగింది ఆస్తికుడికి తెలిసొచ్చింది. దేవుడు చెప్పటం కొనసాగిస్తున్నాడు. ‘‘నీతో వున్న నీ నాస్తిక మిత్రుడికి, నేడు ఎన్నోవేల కోట్ల విలువైన ఓ పెద్ద నిధి లభించి ఉండాలి. అతడి నాస్తిక ధోరణి కారణంగా, దైవ ద్వేషం కారణంగా, ఆ నిధికి మారుగా నీ మిత్రుడికి కేవలం చిన్నపాటి బంగారు ఉంగరం మాత్రమే దొరికింది. అది తెలుసుకో’’ అని అంతర్థానమయ్యేడు దేవుడు. ఇది.. దైవ విశ్వాసంవల్ల జరిగే మేలును, దైవ వ్యతిరేకతవల్ల వచ్చే ముప్పుని సవివరంగా చెప్పే ఓ చిన్న కథ.
అందుకే మనం భగవంతుని మీదుండే విశ్వాసానికి, భగవంతుని మీద వ్యతిరేకతకి మధ్య నుండే వ్యత్యాసాన్ని గమనించాలి. గమనించుకోవాలి. గమనాన్ని సాగించుకోవాలి.
*

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669