ప్రసాదం

భగవంతుడు - భక్తుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడిదీ భక్తుడిదీ విడదీయలేని సంబంధం. విడదీయరాని అనుబంధం. ఒకరుంటేనే మరొకరు. ఓ తత్త్వముంటేనే రెండోది సత్యమయ్యేది. నిత్యమయ్యేది. సాఫల్యమయ్యేది. భగవంతుడు లేనిదే భక్తుడుండడు. భక్తి ఉండదు. భక్తుడికి అస్తిత్వం ఉండదు. భక్తుడు లేకపోతే భగవంతునికి ఓ సాకారం ఉండదు. ఆకారం ఉండదు. భక్తుడుంటేనే భగవంతుడికి అస్తిత్వం ఉండేది. భగవంతుడుంటేనే భక్తుడికి పూర్ణత వచ్చేది. పరిపూర్ణత లభించేది.
భగవంతుడు భక్తుడు ఇద్దరూ- ఒకరికి మరొకరు తోడుగా, నీడగా, జోడుగా, జోడీగా ఉంటేనే భక్తి ఉండేది. భక్తికో రూపం ఉండేది. స్వరూపం ఉండేది. సారూప్యం ఉండేది. సాయుజ్యం ఉండేది.
అయితే భగవంతుడు, భక్తుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? ఎవరి అధీనంలో ఎవడుంటారు? ఎవరి ఆధిపత్యంలో ఎవరుండేది? ఈ ప్రశ్నలు సహజంగా కలగకమానవు.
అవును, నిజానికి ఇద్దరిలో ఎవరు గొప్ప?
ఈ సందేహం ఓసారి ఓ కొంటె శిష్యుడికి వచ్చింది. సందేహం రావడమే ఆలస్యం, సందేహ నివృత్తికోసం తిన్నగా గురువుగారిని ఆశ్రయించేడు. భగవంతుడు - భక్తుడు- వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని అడిగేడు.
అపుడు గురువు శిష్యుణ్ణి అడిగేడు. పంచభూతలున్నాయి కదా.. ఆ పంచభూతాలలోని నీరు గొప్పదా అని శిష్యుణ్ణి ప్రశ్నిస్తాడు. నీరు మూడు వంతులు ఉంటే భూమి ఒక వంతే ఉన్నది కదా స్వామీ! కాబట్టి నీరే గొప్పది అని శిష్యుడు సమాధానమిచ్చేడు.
అయితే అంత గొప్పదైన నీటిని అగస్త్యుడు ఒక్క గుక్కతో ఔపోసన పట్టేశాడు కదా. మరి నీరు గొప్పదా, అగస్త్యుడు గొప్పవాడా అనడుగుతాడు గురువు.
అంతటి గొప్పదైన నీటిని ఔపోసన పట్టేసిన అగస్త్యుడే గొప్పవాడంటాడు శిష్యుడు. అహా అలాగా! అంతటి గొప్పవాడైన అగస్త్యుడు ఆకాశంలో ఉంటాడు కదా- ఆకాశం గొప్పదా అగస్త్యుడు గొప్పవాడా అని మళ్లీ ప్రశ్నిస్తాడు గురువు. గొప్పవాడైన అగస్త్యుని నివాసం కాబట్టి ఆకాశమే గొప్పది అంటాడు శిష్యుడు. అంతటి విశిష్టమైన ఆ ఆకాశాన్ని భగవంతుడు వామన రూపంలో ఒక్క పాదంతో ఆక్రమించుకున్నాడు కదా.. ఆకాశం గొప్పదా భగవంతుడి పాదం గొప్పదా అని ప్రశ్నించాడు గురువు. భగవంతుడి పాదమే గొప్పదంటాడు శిష్యుడు. భగవంతుని పాదమే అంత గొప్పదైనపుడు భగవంతుడు ఎంతటి గొప్పవాడై ఉండాలో ఆలోచించు అంటాడు గురువు.
అవునవును.. భగవంతుడు నిజంగా చాలా గొప్పవాడంటాడు శిష్యుడు. అపుడు గురువు అంటాడు శిష్యుడితో- ‘‘చూడు నాయనా! అంతటి గొప్పవాడైన భగవంతుడు భక్తుడి హృదయంలో ఉంటాడు కదా! అపుడు భగవంతుడు గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా అని మళ్లీ ప్రశ్నిస్తాడు. భగవంతుడు భక్తుడి హృదయంలో బందీగా ఉంటాడు కాబట్టి.. భక్తుడే గొప్పవాడు అంటాడు శిష్యుడు. ఇదీ భక్తుడి విశిష్టతని ఉదాహరణ పూర్వకంగా, చాకచక్యంగా, చమత్కారంగా చాటి చెప్పే కథ!్భగవంతుడ్ని ఒప్పించేది, మెప్పించేది, బంధించేది, బందీ చేసేది, చిక్కించేది, చిక్కేలా చేసేది, దక్కించేది, దక్కేలా చేసేది.. మహోన్నతమైన భక్తి మాత్రమే.
అంతటి శక్తి భక్తిది.
అంతటి శక్తివంతమైన భక్తికోసం తపించాలి, తపనపడాలి. వేధించాలి. వేదనపడాలి. రోదించాలి. సాధన చేయాలి. శోధన చేయాలి. అలాంటి భక్తితత్త్వాన్ని సంపాదించాలి. స్వంతం చేసుకోవాలి. సాఫల్యం చేసుకోవాలి. అసలు సిసలైన భక్తితత్త్వాన్ని ఆకళింపు చేసుకోవాలి. అనుభవించాలి. అనుభవంలోకి తెచ్చుకోవాలి.
ఆ భగవంతుని అనుగ్రహానికి పాత్రులం కావాలి. పునీతులం కావాలి. భక్తి అలవడితే హెచ్చుతగ్గులు, తారతమ్యాలు ఇవేవీ కనబడవు. అంతా పరమాత్మ స్వరూపంగా భాసిస్తుంది. ప్రతివారు భగవంతుని స్వరూపులుగా కనిపిస్తారు. అంతా భగవంతుడే కనిపిస్తే హెచ్చుతగ్గులేముంటాయ. *

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669