ప్రసాదం

అర్హత అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏది సంపాదించాలన్నా, సాధించాలన్నా మనకి అర్హత ఉండాలి. అర్హత ఉంటేనే మనం ఏ అధికారాన్నైనా సాధించగలం. ఈ సూత్రం, ఈ నియమం భౌతిక ప్రపంచానికి సంబంధించినవే కాకుండా ఆధ్యాత్మికానికి సంబంధించిన విషయాలకీ వర్తిస్తుంది.
అర్హత ఉంటేనే అధికారం వస్తుంది. అధికారం తెచ్చుకుంటేనే ఏదైనా అర్థమయ్యేది. అనుభవానికొచ్చేది. అధికారం అంటే మనం అనుకునే అధికారం కాదు. అజమాయిషీ చేసి, ఆధిక్యాన్ని చూపించే మనం అనుకునే అధారిటీ కాదు. ఆధిపత్యం అంతకన్నా కాదు.
మనల్ని మనమే ఉద్ధరించుకోవటానికి, మన జీవితాలను ఇహంలోను పరంలోను ఉన్నతం చేసుకోవటానికి, మనం చేసే పనులతో మనం తెచ్చుకునే సామర్థ్యమే అర్హత. ఆ అర్హతని ఆసరాగా చేసుకొని ఆధ్యాత్మికంగా మనం ఉన్నత స్థితికి చేరుకోవటానికి మనం ఆచరించే కర్మలే మనకి ఆ అధికారాన్ని ఆధ్యాత్మికంగా మనకి అందిస్తాయి.
పరం గురించి ఆలోచిస్తే అంతా అయోమయంగా వుంటుంది. గందగోళం అనిపిస్తుంది. బ్రతికున్నంత కాలం సద్భావనలు, సశ్చింతలతో, సకర్మలను ఆచరిస్తూంటే - మనం మరణించేక మనకి స్వర్గం ప్రాప్తిస్తుంది అని అంటారు. దుష్టబుద్ధితో పాపకర్మలు ఆచరిస్తూ జీవితమంతా గడిపితే, పరంలో నరకం ప్రాప్తిస్తుందంటారు. అక్కడ ఘోరాతిఘోరమైన పైశాచికమైన శిక్షల్ని అనుభవించాలంటారు. ఇవన్నీ నిజమో కాదో వాదాలు, తర్కాలు అటుంచుదాం. వెరశి మంచి మంచి పనులు చేస్తే స్వర్గం వెళ్ళేందుకు అధికారం వస్తుంది. స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఎలాగో విచారిద్దాం, విచారణ చేద్దాం. ఒక సమయంలో- ముగ్గురు వ్యక్తులు స్వర్గద్వారం దగ్గరికి వచ్చారు. మొదటి వ్యక్తి ద్వారపాలకునితో ‘నేను పండితుడ్ని, సర్వ శాస్త్ర పారంగుతుణ్ణి. అన్ని శాస్త్రాల్ని గ్రంథాలను ఔపోసన పట్టేను. నాకు స్వర్గ ప్రవేశం కల్పించు’ అన్నాడు. దానికి స్వర్గపాలకుడన్నాడు- ‘‘అయ్యా! మీకు గ్రంథాలతో పరిచయం ఉంది. శాస్త్రాలమీద పట్టు ఉంది. కాని అనుభవం, అనుభవజ్ఞానం లేదు. మీకు స్వర్గం ప్రవేశించడానికి అర్హత లేదు’’ అన్నాడు.
రెండో వ్యక్తి ద్వారపాలకునికి దగ్గరకొచ్చాడు. ద్వారపాలకునితో ‘‘నేను ఎన్నో యాజ్ఞాలను, యాగాలను, క్రతువుల్ని చేసిన వ్యక్తిని. చేయించినవాడను. యాజ్ఞయాగాల్ని చేసిన సోమయాజిని. ద్వారం తెరువు’’ అన్నాడు. దానికి ద్వారపాలకుడు ‘‘అయ్యా! మీరు ఎన్నో యాగాలు, యాజ్ఞాలను ఆచరించేరు కానీ, స్వార్థబుద్ధితో ఆచరించేరు. మీరు చేసిన వాటిలో ఏ మాత్రం నిస్వార్థత లేదు. స్వార్థంతో చేసిన ఎంతటి మంచి పనైనా స్వర్గప్రవేశానికి అర్హత సంపాదించలేవు. కాబట్టి నీకు స్వర్గంలోకి ప్రవేశించే అధికారం లేదు. వెళ్లిపో’’ అన్నాడు.
అపుడు మూడో వ్యక్తి ద్వారపాలకుని వద్దకు వచ్చేడు. అతనొక రైతు. ఆ రైతు అంటాడు- ‘‘నాకు మూడెకరాల పొలం ఉంది. ఒక చిన్న గుడిసె వేసుకునే జీవించేను. అహోరాత్రాలు నా దృష్టి అంతా నా పొలం సాగుమీదే. కష్టపడి నా శక్తిమేర సాగుచేశాను. పంటలు పండించేను. నాకున్నంతలో వారికింత పెట్టేను. నేను కూడా తింటూ కాలమంతా గడిపేను. నేను ఇంతకన్నా ఏమీ చేయలేదు. ఏదీ సాధించలేదు’’ ద్వారపాలకుడికి చెప్పేడు.
అపుడు ద్వారపాలకుడు ఆ రైతుతో ‘‘అంతకన్నా ఏం చేయాలి? నీకున్నదాంట్లో కొంత త్యాగం చేసేవు. ఇతరులకి ఇంత పెట్టేవు. కాబట్టి నీకు స్వర్గప్రవేశాధికారం ఉంది. నీకు స్వర్గప్రవేశం కల్పిస్తున్నాను’ అంటూ స్వర్గద్వారం తెరిచేడు. త్యాగగుణం అన్ని గుణాలలోను మహోత్కృష్టమైనది. త్యాగగుణం స్వర్గ నివాసయోగం కల్పిస్తుంది. స్వర్గప్రవేశాధికారం కలిగిస్తుంది. అందుకోసం మనం జీవించి ఉన్నపుడే సేవాదృక్పథంతో, త్యాగగుణాన్ని అలవాటు చేసుకోవాలి. అలవర్చుకోవాలి. ఇహంలోనే పరం కోసం ప్రయత్నించాలి. ప్రయత్నం చేయాలి.
*

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669